కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

యోహాను 14:6—“నేనే మార్గమును, సత్యమును, జీవమును”

యోహాను 14:6—“నేనే మార్గమును, సత్యమును, జీవమును”

 “యేసు ఇలా అన్నాడు: ‘నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు.’ ”—యోహాను 14:6, కొత్త లోక అనువాదం.

 “యేసు—నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు ... అని చెప్పెను.”—యోహాను 14:6, 7, పరిశుద్ధ గ్రంథము.

యోహాను 14:6 అర్థమేంటి?

 తండ్రి అయిన యెహోవా a దేవున్ని ఆరాధించాలనుకునే వాళ్లు యేసు ముఖ్యపాత్రను తప్పకుండా గుర్తించాలి.

 “నేనే మార్గం.” దేవుడు ఆమోదించేలా ఆయన్ని సమీపించాలంటే యేసే “మార్గం.” ఉదాహరణకు, దేవునికి ప్రార్థించేవాళ్లు యేసు పేరున ప్రార్థించాలి. (యోహాను 16:23, 24) యేసు మరణం ద్వారానే మనుషులు దేవునితో తిరిగి శాంతియుత సంబంధం కలిగివుండడం లేదా ఆయన అనుగ్రహం పొందడం సాధ్యమైంది. (రోమీయులు 5:8-11) అలాగే, దేవున్ని సంతోషపెట్టాలి అనుకునేవాళ్లు ఎలా జీవించాలో యేసు తన ప్రవర్తన ద్వారా చూపించాడు.—యోహాను 13:15.

 “నేనే … సత్యం.” యేసు ఎప్పుడూ సత్యమే మాట్లాడాడు, దానికి తగ్గట్లు జీవించాడు. (1 పేతురు 2:22) యేసు చెప్పింది వినడం ద్వారా ఒక వ్యక్తి దేవుని గురించి సత్యాన్ని నేర్చుకోవచ్చు. (యోహాను 8:31, 32) యేసు బైబిలు ప్రవచనాల్ని నెరవేర్చాడు, ఆ విధంగా కూడా యేసు “సత్యం.” అలా ఆయన దేవుని వాగ్దానాల్ని నిజం చేశాడు.—యోహాను 1:17; 2 కొరింథీయులు 1:19, 20; కొలొస్సయులు 2:16, 17.

 “నేనే … జీవం.” తన మీద విశ్వాసం చూపించేవాళ్లు శాశ్వత జీవితం పొందగలిగేలా యేసు తన ప్రాణాన్ని అర్పించాడు. (యోహాను 3:16, 36) చనిపోయిన వాళ్లకు కూడ ఆయన “జీవం,” ఎందుకంటే ఆయన వాళ్లను తిరిగి బ్రతికిస్తాడు.—యోహాను 5:28, 29; 11:25.

 “నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు.” దేవుని ఆమోదం పొందాలని కోరుకునేవాళ్లు తప్పకుండా యేసు ప్రత్యేక పాత్రను అంగీకరించాలి. వాళ్లు అలా చేసే ఒక మార్గం, యేసు పేరున దేవునికి ప్రార్థించడం. అలా వాళ్లు యేసుక్రీస్తు అధికారాన్ని గుర్తిస్తున్నామని చూపిస్తారు. (యోహాను 15:16) అలాగే యేసు ద్వారానే రక్షణ సాధ్యం అవుతుందని వాళ్లు గుర్తిస్తారు.—అపొస్తలుల కార్యాలు 4:12; ఫిలిప్పీయులు 2:8-11.

యోహాను 14:6 సందర్భం

 యోహాను 13 నుండి 17 అధ్యాయాల్లో, యేసు తన 11 మంది నమ్మకమైన అపొస్తలులతో చివరిగా మాట్లాడిన మాటలున్నాయి. 14వ అధ్యాయంలో యేసు తన మీద, తన తండ్రి మీద విశ్వాసం ఉంచమని, తమను ప్రేమించమని, తమకు లోబడమని శిష్యుల్ని ప్రోత్సహించాడు. (యోహాను 14:1, 12, 15-17, 21, 23, 24) గతంలో అలాగే ఇప్పుడు తన తండ్రితో తనకున్న దగ్గరి స్నేహం గురించి వాళ్లకు తెలియజేశాడు. (యోహాను 14:10, 20, 28, 31) తాను త్వరలోనే పరలోకానికి తిరిగి వెళ్లిపోతున్నా, తన శిష్యుల్ని వదిలేయనని యేసు వాళ్లు ధైర్యం చెప్పాడు. (యోహాను 14:18) అలాగే వాళ్ల కోసం “సహాయకుడు” వస్తాడని కూడా యేసు మాటిచ్చాడు. అది, “తండ్రి నా పేరున పంపించే … పవిత్రశక్తి” అని యేసు వివరించాడు. (యోహాను 14:25-27) ఇలా, ఇంకా చాలా విధాలుగా యేసు తన శిష్యుల్ని రాబోతున్న సవాళ్ల కోసం సిద్ధం చేశాడు.