కంటెంట్‌కు వెళ్లు

యేసు బలి, “అనేకుల కోసం విమోచన క్రయధనం” ఎలా అయ్యింది?

యేసు బలి, “అనేకుల కోసం విమోచన క్రయధనం” ఎలా అయ్యింది?

బైబిలు ఇచ్చే జవాబు

యేసు బలి ద్వారానే దేవుడు మానవజాతిని పాపం, మరణం నుండి విడిపిస్తాడు. యేసు చిందించిన రక్తాన్ని విమోచన మూల్యం అని బైబిలు చెప్తోంది. (ఎఫెసీయులు 1:7; 1 పేతురు 1:18, 19) అందుకే, తాను “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు” వచ్చానని యేసు చెప్పాడు.—మత్తయి 20:28.

‘అనేకుల కోసం విమోచన క్రయధనం’ ఎందుకు అవసరమైంది?

దేవుడు మొదటి మనిషి ఆదామును పరిపూర్ణుడిగా లేదా ఏ పాపం లేనివాడిగా సృష్టించాడు. అతనికి నిరంతరం జీవించే గొప్ప అవకాశం ఉంది, కానీ దేవునికి అవిధేయత చూపించి, ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. (ఆదికాండము 3:17-19) అతను పిల్లల్ని కనడంతో, పాపం అనే అతని లోపం వాళ్లకూ సంక్రమించింది. (రోమీయులు 5:12) అందుకే, ఆదాము తనను, తన పిల్లల్ని పాపానికి, మరణానికి బానిసలుగా ‘అమ్మేసుకున్నాడని’ బైబిలు తెలియజేస్తోంది. (రోమీయులు 7:14) వాళ్లందరూ అపరిపూర్ణులే కాబట్టి, ఆదాము పోగొట్టుకున్నదాన్ని వాళ్లలో ఎవరూ తిరిగి కొనలేరు.—కీర్తన 49:7, 8.

భవిష్యత్తు మీద ఏ ఆశా లేని ఆదాము సంతానం పట్ల దేవునికి కనికరం కలిగింది. (యోహాను 3:16) అయినా, దేవుని న్యాయ ప్రమాణాల్ని బట్టి, వాళ్ల పాపాల్ని చూసీచూడనట్లు వదిలేయడం లేదా సరైన ఆధారం లేకుండా క్షమించేయడం కుదరదు. (కీర్తన 89:14; రోమీయులు 3:23-26) దేవుడు మనుషుల్ని ప్రేమిస్తున్నాడు, కాబట్టి వాళ్లు తమ పాపాలకు క్షమాపణ పొందడమే కాదు, వాటిని పూర్తిగా తీసేసుకోవడానికి కావాల్సిన న్యాయబద్ధమైన ఆధారాన్ని వాళ్లకోసం ఏర్పాటుచేశాడు. (రోమీయులు 5:6-8) న్యాయబద్ధమైన ఆ ఆధారమే విమోచన క్రయధనం.

విమోచన క్రయధనం ఎలా పనిచేస్తుంది?

బైబిల్లో ఉన్న “విమోచన క్రయధనం” అనే పదంలో ఈ కింది మూడు అంశాలు ఉన్నాయి:

  1. అది ఒక చెల్లింపు.సంఖ్యాకాండము 3:46, 47.

  2. అది విడుదలను లేదా విముక్తిని తెస్తుంది.—నిర్గమకాండము 21:30.

  3. అది ఇచ్చిన విలువకు సరిసమానంగా ఉంటుంది, లేదా దాన్ని కప్పుతుంది. *

యేసుక్రీస్తు విమోచన క్రయధనానికి ఈ అంశాలు ఎలా వర్తిస్తాయో చూద్దాం.

  1. చెల్లింపు. క్రైస్తవులు “విలువపెట్టి కొనబడినవారు” అని బైబిలు చెప్తోంది. (1 కొరింథీయులు 6:20; 7:23) యేసు రక్తమే ఆ విలువ. దానితోనే యేసు, “ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను” కొన్నాడు.—ప్రకటన 5:8-10.

  2. విడుదల. యేసు బలి, మనుషుల్ని విమోచన క్రయధనం ద్వారా పాపాల నుండి విడుదల చేస్తుంది.—1 కొరింథీయులు 1:30; కొలొస్సయులు 1:14; హెబ్రీయులు 9:15.

  3. సరిసమానం. ఆదాము పోగొట్టుకున్న పరిపూర్ణ మానవ జీవానికి సరిగ్గా సమానమైనదాన్ని యేసు బలి చెల్లించింది. (1 కొరింథీయులు 15:21, 22, 45, 46) బైబిలు ఇలా చెప్తోంది: “ఏలయనగా ఒక మనుష్యుని [ఆదాము] అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని [యేసుక్రీస్తు] విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.” (రోమీయులు 5:19) ఒక మనిషి మరణం, అనేకమంది పాపుల కోసం విమోచన క్రయధనాన్ని ఎలా చెల్లిస్తుందో ఈ వచనం వివరిస్తోంది. నిజానికి యేసు బలి, దాని నుండి ప్రయోజనం పొందడానికి చర్యలు తీసుకునే ‘అందరి కోసం సరిసమానమైన విమోచన క్రయధనం.’—1 తిమోతి 2:5, 6, NW.

^ పేరా 7 బైబిల్లో, “విమోచన క్రయధనం” అని అనువాదమైన అసలు పదాలు, చెల్లించిన వెల లేదా విలువ అనే అర్థాన్నిస్తాయి. ఉదాహరణకు, కాఫార్‌ అనే హీబ్రూ క్రియాపదానికి ప్రాథమికంగా “కప్పడం” అని అర్థం. (ఆదికాండము 6:14) అది సాధారణంగా, పాపాలను కప్పడాన్ని సూచిస్తుంది. (కీర్తన 65:3, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) దీనికి సంబంధించిన కోఫర్‌ అనే నామవాచకం, అలా కప్పడానికి లేదా విమోచించడానికి చెల్లించే వెలను సూచిస్తుంది. (నిర్గమకాండము 21:30) అలాగే, “విమోచన క్రయధనం” అని అనువాదమైన గ్రీకు పదం, లీట్రన్‌ కూడా “విమోచనకు వెల” అనే అర్థాన్నిస్తుంది. (మత్తయి 20:28; పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఒక యుద్ధ ఖైదీని విమోచించడం కోసం లేదా ఒక బానిసను విడిపించడం కోసం చెల్లించే మొత్తాన్ని సూచించడానికి గ్రీకు రచయితలు ఈ పదాన్ని ఉపయోగించారు.