కంటెంట్‌కు వెళ్లు

యెహోవా ఎవరు?

యెహోవా ఎవరు?

బైబిలు ఇచ్చే జవాబు

 యెహోవా నిజమైన దేవుడని, సమస్తాన్ని సృష్టించినవాడని బైబిలు చెబుతోంది. (ప్రకటన 4:10, 11) యేసులాగే, ప్రవక్తలైన అబ్రాహాము, మోషే ఆయన్నే ఆరాధించారు. (ఆదికాండము 24:26, 27; నిర్గమకాండము 15:1, 2; యోహాను 20:17) ఆయన కేవలం ఒక దేశానికి కాదు, “సర్వభూమికి” అంటే మొత్తం ప్రపంచానికే దేవుడు.—కీర్తన 47:2.

 యెహోవా అనేది దేవుని విశిష్టమైన పేరని బైబిలు వెల్లడిచేస్తోంది. (నిర్గమకాండము 3:15; కీర్తన 83:18) అది, “అవ్వు” అనే అర్థంగల హీబ్రూ క్రియాపదం నుండి వచ్చింది. కాబట్టి, “తానే కర్త అవుతాడు” అనేది ఆ పేరుకు అర్థమని చాలామంది పండితులు అంటున్నారు. అది యెహోవాకు, సృష్టికర్త, తన సంకల్పాన్ని నెరవేర్చే దేవుడు అనే సరైన నిర్వచనాన్ని ఇస్తోంది. (యెషయా 55:10, 11) అయితే, యెహోవా అనే పేరు గురించే కాదు, దాని వెనుకున్న వ్యక్తి గురించి, ప్రత్యేకించి ఆయన ప్రధాన లక్షణమైన ప్రేమ గురించి కూడా తెలుసుకోవడానికి బైబిలు సహాయం చేస్తోంది.—నిర్గమకాండము 34:5-7; లూకా 6:35; 1 యోహాను 4:8.

 హీబ్రూ భాషలో టెట్రగ్రామటన్‌ అని పిలువబడే יהוה (YHWH) అనే నాలుగు అక్షరాల దేవుని పేరుకు తెలుగు రూపం యెహోవా (ఇంగ్లీషులో “జెహోవా”). దేవుని పేరును హీబ్రూ భాషలో ఖచ్చితంగా ఎలా పలికేవారో తెలియదు. కానీ, ఇంగ్లీషు భాషలో “జెహోవా” అనే పదానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అది మొదటిసారిగా 1530లో విలియమ్‌ టిండేల్‌ అనువదించిన బైబిల్లో కనిపించింది. a

ప్రాచీన హీబ్రూ భాషలో దేవుని పేరుని ఖచ్చితంగా ఎలా పలికేవారో ఎందుకు తెలియదు?

 ప్రాచీన హీబ్రూ భాషను అచ్చులు లేకుండా కేవలం హల్లులతోనే రాసేవారు. హీబ్రూ భాష మాట్లాడే పాఠకులు సులువుగా దానికి అవసరమైన అచ్చులు చేర్చుకుని చదువుకునేవారు. అయితే, హీబ్రూ లేఖనాలు (పాత నిబంధన) పూర్తైన తర్వాత, కొంతమంది యూదులు దేవుని పేరుని పలకడం తప్పు అనే మూఢ నమ్మకాన్ని ఏర్పర్చుకున్నారు. దేవుని పేరు ఉన్న ఏదైనా వచనాన్ని పైకి చదివేటప్పుడు, వాళ్లు ఆ పేరు వచ్చిన చోట “దేవుడు” లేదా “ప్రభువు” అని చదివేవాళ్లు. శతాబ్దాలు గడిచేసరికి ఈ మూఢనమ్మకం అంతటా వ్యాపించి, ఆ పేరు ఉచ్చారణ పూర్తిగా కనుమరుగైపోయింది. b

 దేవుని పేరును “యావే” అని పలికేవారని కొంతమంది అనుకుంటున్నారు. కానీ దాన్ని వేరేలా పలికుంటారని ఇంకొంతమంది అంటున్నారు. గ్రీకు భాషలోకి అనువదించిన లేవీయకాండములోని ఓ భాగం ఉన్న మృత సముద్రపు గ్రంథపు చుట్టలో దేవుని పేరును యావో (Iao) అని లిప్యంతరీకరించారు. అదేకాక, తొలి గ్రీకు రచయితలు సహితం యాయే (Iae), యాబే (I·a·beʹ), యావూవి (I·a·ou·eʹ) అనే ఉచ్చారణలు కూడా ఉండివుంటాయని అన్నారు. కానీ వీటిలో ఏ ఒక్కటీ ప్రాచీన హీబ్రూ భాషలో ఉపయోగించిన ఉచ్చారణ అని రుజువవ్వలేదు. c

బైబిల్లో దేవుని పేరు గురించిన అపోహలు

 అపోహ: కొన్ని అనువాదాల్లో “యెహోవా” అనే పేరును కలిపారు.

 వాస్తవం: టెట్రగ్రామటన్‌ రూపంలో ఉన్న హీబ్రూ పదమైన దేవుని పేరు, బైబిల్లో దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. d చాలామంది అనువాదకులు తమ ఇష్టానుసారంగా, దేవుని పేరును తీసేసి దాని స్థానంలో “ప్రభువు” వంటి బిరుదును పెట్టారు.

 అపోహ: సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రత్యేకించి ఒక పేరు అవసరంలేదు.

 వాస్తవం: దేవుడు తానే స్వయంగా తన పేరు వేలాదిసార్లు రాసేలా బైబిలు రచయితలను ప్రేరేపించాడు, అలాగే తనను ఆరాధించేవాళ్లకు తన పేరును ఉపయోగించమని నిర్దేశం ఇచ్చాడు. (యెషయా 42:8; యోవేలు 2:32; మలాకీ 3:16; రోమీయులు 10:13) నిజానికి, ప్రజలు దేవుని పేరును మర్చిపోయేలా చేసిన అబద్ధ ప్రవక్తలను ఆయన ఖండించాడు.—యిర్మీయా 23:27.

 అపోహ: యూదుల ఆచారం ప్రకారం దేవుని పేరును బైబిల్లో నుంచి తీసేయాలి.

 వాస్తవం: కొంతమంది యూదా శాస్త్రులు దేవుని పేరును పలకడానికి ఇష్టపడలేదన్నది నిజమే. అయినా, వాళ్లు తమ బైబిలు ప్రతుల్లో నుండి దాన్ని తీసివేయలేదు. ఏదేమైనా, దేవుని ఆజ్ఞల్ని ఉల్లంఘించేలా చేసే మనుషుల ఆచారాలను మనం పాటించకూడదని దేవుడు కోరుతున్నాడు.—మత్తయి 15:1-3.

 అపోహ: దేవుని పేరును హీబ్రూ భాషలో ఎలా పలికేవారో తెలియదు కాబట్టి దాన్ని బైబిల్లో ఉపయోగించకూడదు.

 వాస్తవం: ఈ వాదన, వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలంతా తన పేరుని ఒకేలా పలకాలని దేవుడు పట్టుబడుతున్నట్లు చూపిస్తుంది. కానీ, పూర్వం వేర్వేరు భాషలు మాట్లాడిన దేవుని ఆరాధకులు కొన్ని పేర్లను వేర్వేరు విధాలుగా పలికారని బైబిలు సూచిస్తోంది.

 ఉదాహరణకు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి యెహోషువ పేరును తీసుకుందాం. హీబ్రూ భాష మాట్లాడే మొదటి శతాబ్ద క్రైస్తవులు అతని పేరుని యెహోషువ (Yehoh·shuʹaʽ) అనీ, గ్రీకు మాట్లాడే వాళ్లు యేసూస్‌ (I·e·sous) అని పలికి ఉండవచ్చు. బైబిలులో నమోదైన యెహోషువ అనే హీబ్రూ పేరుకు గ్రీకు అనువాదాన్ని చూస్తే, క్రైస్తవులు ఆయా పేర్లకు తమ భాషలో సామాన్యంగా వాడే రూపాలను ఉపయోగించే పద్ధతిని పాటించారని తెలుస్తోంది.—అపొస్తలుల కార్యములు 7:45; హెబ్రీయులు 4:8.

 దేవుని పేరును అనువదించడంలో కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ఆ పేరును సరిగ్గా ఎలా పలకాలి అనే విషయం కంటే, బైబిల్లో దానికి సరైన స్థానాన్ని ఇవ్వడమే చాలా ముఖ్యం.

a బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాల్లోనూ టిండేల్‌, “యెహోవా” (Iehouah) అనే రూపాన్ని ఉపయోగించాడు. కాలం గడుస్తుండగా, ఇంగ్లీషు భాషలో మార్పు వచ్చింది, దేవుని పేరు ఆధునిక రూపాన్ని సంతరించుకుంది. ఉదాహరణకు, 1612లో హెన్రీ ఎయిన్స్‌వర్త్‌, తాను అనువదించిన కీర్తనల పుస్తకమంతటా “యెహోవా” (Iehovah) అనే రూపాన్ని ఉపయోగించాడు. అతను, ఆ అనువాదాన్ని 1639లో రివైజ్‌ చేసినప్పుడు, “జెహోవా” (Jehovah) అనే రూపాన్ని వాడాడు. అలాగే, 1901లో ప్రచురించిన అమెరికన్‌ స్టాండర్డ్‌ వర్షన్‌ బైబిలు అనువాదకులు, హీబ్రూలో దేవుని పేరు ఉన్న ప్రతీచోట “జెహోవా” (Jehovah) అనే రూపాన్ని ఉపయోగించారు.

b ద న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా, రెండవ సంచిక, 14వ సంపుటిలోని 883-884 పేజీల్లో ఇలా ఉంది: “చెర ముగిసిన కొంతకాలం తర్వాత, యావే అనే పేరును ప్రత్యేక భక్తితో చూడడం మొదలైంది, ఆ పేరుకు బదులు అదొనాయ్‌ లేదా ఎలోహిమ్‌ అనే పదాలు వాడే అలవాటు మొదలైంది.”

c మరింత సమాచారం కోసం, దేవుని వాక్యం అధ్యయనం చేయడానికి మార్గదర్శి అనే చిన్నపుస్తకంలో “హీబ్రూ లేఖనాల్లో దేవుని పేరు” అనే మొదటి భాగాన్ని చూడండి.

d థియోలాజికల్‌ లెక్సికాన్‌ ఆఫ్‌ ద ఓల్డ్‌ టెస్టమెంట్‌, 2వ సంపుటిలోని 523-524 పేజీలు చూడండి.