కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు, పేతురు అత్తను కలిసి ఆమెను బాగుచేశాడు.—మత్తయి 8:14, 15; మార్కు 1:29-31

క్రైస్తవ మతగురువులు పెళ్లికి, లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలా?

క్రైస్తవ మతగురువులు పెళ్లికి, లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలా?

మత నాయకులు, గురువులు పెళ్లికి, లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలనే నియమం ప్రపంచంలో చాలా మతాల్లో ఉంది. రోమన్‌ క్యాథలిక్‌ చర్చీలు, వేర్వేరు ఆర్థోడాక్స్‌ చర్చీలు, బౌద్ధులు ఇంకా వేరే మతస్థులు ఈ నియమాన్ని పాటిస్తున్నారు. కానీ, ఇటీవల కాలంలో వేర్వేరు మతాల్లో ఉన్న మత గురువుల లైంగిక అరాచకాలు ఎక్కువయ్యాయి. అందుకు ముఖ్య కారణం ఈ నియమమే అని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు.

కాబట్టి ముందుగా మనం, క్రైస్తవమత గురువులు పెళ్లి చేసుకోకుండా ఉండాలనే నియమం బైబిల్లో ఉందో లేదో తెలుసుకోవడం మంచిది. అలా తెలుసుకోవడానికి ఈ నియమం ఎలా మొదలైంది? ఎలా వ్యాపించింది? దీని గురించి దేవుని అభిప్రాయం ఏంటి? లాంటి విషయాలు గమనిద్దాం.

బ్రహ్మచర్యం గురించి మత చరిత్ర

ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా బ్రహ్మచర్యం గురించి ఇలా నిర్వచిస్తుంది: పెళ్లి చేసుకోకుండా ఉండి లైంగిక సంబంధాలకు దూరంగా ఉండే స్థితి, సాధారణంగా ఈ పదాన్ని మత అధికారి లేదా భక్తుడికి వాడతారు. “అపొస్తలులు చనిపోయిన కొంతకాలానికి బ్రహ్మచర్యం ఒక ఆచారంగా మొదలైంది” అని 2006లో రోమన్‌ క్యురియా ఎదుట ఇచ్చిన ప్రసంగంలో పోప్‌ బెనడిక్ట్‌ XVI చెప్పాడు.

కానీ అపొస్తలులు ఉన్న మొదటి శతాబ్దంలో క్రైస్తవులు బ్రహ్మచర్యాన్ని ఒక మతాచారంగా పాటించలేదు. అంతేకాదు “దేవుని నుండి వచ్చాయనిపించే మోసపూరిత సందేశాల్ని” చెప్పేవాళ్లు, ‘పెళ్లిని నిషేధించే’ వాళ్లు వస్తారని ఆ కాలంలో జీవించిన అపొస్తలుడైన పౌలు ముందుగానే విశ్వాసులతో చెప్పాడు.—1 తిమోతి 4:1-3.

రెండవ శతాబ్దంలో బ్రహ్మచర్యమనే ఆచారం కొన్ని ప్రాచ్య “క్రైస్తవ” చర్చీల్లో మొదలైంది. ఆ చర్చీలే తర్వాత రోమన్‌ క్యాథలిక్‌ మతంగా ఏర్పడ్డాయి. ఇది “లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలని రోమా సామ్రాజ్యంలో వచ్చిన కొత్త పోకడకు అనుకూలంగా ఉంది” అని సెలిబసి అండ్‌ రిలీజియస్‌ ట్రెడిషన్స్‌, (Celibacy and Religious Traditions) అనే పుస్తకం చెప్తుంది.

తర్వాత శతాబ్దాల్లో చర్చి సమితీలు, చర్చి ఫాదర్లు అని చెప్పుకునేవాళ్లు మతగురువుల బ్రహ్మచర్యాన్ని ప్రోత్సహించారు. లైంగిక సంబంధాలు అశుద్ధమని, చర్చి బాధ్యతలున్న మత గురువులకు తగదని వాళ్లు భావించారు. అయితే, ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా “10వ శతాబ్దం వరకు చాలామంది ప్రీస్టులకు, కొంతమంది బిషప్‌లకు కూడా భార్యలు ఉన్నారని” సూటిగా చెప్తుంది.

చర్చి ఫాదర్లు ఖచ్చితంగా బ్రహ్మచారులుగా ఉండాలనే నియమాన్ని రోములో 1123, 1139 సంవత్సరాల్లో జరిగిన లాటరన్‌ సమితీలు అమలులోకి తెచ్చాయి. నేటి వరకు రోమన్‌ క్యాథలిక్‌ చర్చి అదే నియమం పాటిస్తుంది. ఈ నియమం ద్వారా పెళ్లైన ప్రీస్టులు చర్చి ఆస్తిని వాళ్ల పిల్లలకు రాసి ఇవ్వడంతో కలిగే అధికార నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని ఆపగలిగారు.

బ్రహ్మచర్యం విషయంలో దేవుని అభిప్రాయం

బ్రహ్మచర్యం గురించి దేవుని అభిప్రాయం ఆయన వాక్యమైన బైబిల్లో స్పష్టంగా ఉంది. తనలానే “పరలోక రాజ్యం కోసం” పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ల గురించి యేసు చెప్పిన మాటలను మనం అక్కడ చదవవచ్చు. (మత్తయి 19:12) ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు కూడా “మంచివార్త కోసం” తనలా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్న వాళ్ల గురించి రాశాడు.—1 కొరింథీయులు 7:37, 38; 9:23.

కానీ, దేవుని సేవకులు పెళ్లికి దూరంగా ఉండాలని యేసుగానీ, పౌలుగానీ ఆజ్ఞ ఇవ్వలేదు. ఒంటరిగా ఉండడం ఒక “బహుమానం” అని చెప్తూ అది తన అనుచరులందరికీ ఉండదని యేసు చెప్పాడు. పౌలు “పెళ్లికానివాళ్ల” గురించి రాస్తూ “ప్రభువు నాకు ఏ ఆజ్ఞా ఇవ్వలేదు . . . నేను నా అభిప్రాయం చెప్తున్నాను” అని నిజాయితీగా ఒప్పుకున్నాడు.—మత్తయి 19:11; 1 కొరింథీయులు 7:25.

అంతేకాదు, మొదటి శతాబ్దంలో ఉన్న చాలామంది క్రైస్తవ సేవకులు, అపొస్తలుడైన పేతురు కూడా పెళ్లిచేసుకున్నవాళ్లే అని బైబిల్లో ఉంది. (మత్తయి 8:14; మార్కు 1:29-31; 1 కొరింథీయులు 9:5) నిజానికి ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో లైంగిక అనైతిక ఎక్కువగా ఉంది. అందుకే, పెళ్లైన క్రైస్తవ పర్యవేక్షకుడి గురించి రాస్తూ “అతనికి ఒకే భార్య ఉండాలి” అని, అతని పిల్లలు అతనికి ‘లోబడి’ ఉండేలా చూసుకోవాలని పౌలు అన్నాడు.—1 తిమోతి 3:2, 4.

వీళ్లంతా పెళ్లి చేసుకుని లైంగిక సంబంధాలకు దూరంగా ఉన్న వాళ్లు కాదు. ఎందుకంటే, బైబిలు “భర్త తన భార్య అవసరాన్ని తీర్చాలి,” పెళ్లి చేసుకున్నవాళ్లు లైంగిక సాన్నిహిత్యం లేకుండా “ఒకరికి ఒకరు దూరంగా ఉండకూడదు” అని చెప్తుంది. (1 కొరింథీయులు 7:3-5) సూటిగా చెప్పాలంటే, లైంగిక సంబంధాలను దేవుడు నిషేధించట్లేదు, క్రైస్తవ సేవకులు బ్రహ్మచర్యాన్ని పాటించాలనే ఖచ్చితమైన నియమం ఎక్కడ లేదు.

మంచివార్త కోసం

దేవుని సేవకులు ఖచ్చితంగా బ్రహ్మచారులుగా ఉండాలనే నియమం లేనప్పుడు యేసు, పౌలు పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిదని ఎందుకు చెప్పారు? ఎందుకంటే, పెళ్లికాని వాళ్లకు మంచివార్తను ఇతరులకు చెప్పే అవకాశాలు ఎన్నో ఉంటాయి. పెళ్లి చేసుకున్న వాళ్లకు ఉండే ఆందోళనలు పెళ్లికాని వాళ్లకు ఉండవు కాబట్టి ఎక్కువ సేవ చేయగలుగుతారు.—1 కొరింథీయులు 7:32-35.

డావీడ్‌ ఉదాహరణ పరిశీలించండి, బైబిలు గురించి ప్రజలకు చెప్పడానికి మెక్సికో సిటిలో మంచి జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి కోస్టరికాలో ఉన్న చిన్న గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ పనిని సులువుగా చేయగలిగాడా? “ఖచ్చితంగా,” అని అతను చెప్తున్నాడు. “కొత్త సంస్కృతికి, కొత్త జీవన విధానానికి అలవాటు పడడం కష్టంగానే ఉంది, కాని నేను ఒక్కడినే ఉన్నాను కాబట్టి అలవాటు చేసుకోవడానికి ఎక్కువ కష్టంగా అనిపించలేదు.”

సువార్తికుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లిన క్లౌడియా ఇలా అంటుంది: “దేవుని సేవను నేను ఆనందిస్తున్నాను. ఆయన నా మీద ఎలా శ్రద్ధ చూపిస్తున్నాడో చూసి నా విశ్వాసం, దేవునితో నాకున్న సంబంధం బలపడింది.”

“అది పెద్ద విషయమేమీ కాదు. మీకు పెళ్లైనా కాకపోయినా యెహోవాకు మీ శ్రేష్ఠమైనది ఇస్తే సంతోషంగా ఉంటారు.”—క్లౌడియా

పెళ్లిచేసుకోకుండా ఉండడం భారంగా ఉంటుందని అనుకోవడానికి లేదు. క్లౌడియా ఇంకా ఇలా అంటుంది: “అది పెద్ద విషయమేమీ కాదు. మీకు పెళ్లైనా కాకపోయినా యెహోవాకు మీ శ్రేష్ఠమైనది ఇస్తే సంతోషంగా ఉంటారు.”—కీర్తన 119:1, 2.