కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులకు డేటింగ్‌ విషయంలో నియమాలున్నాయా?

మనం తీసుకునే నిర్ణయాలు దేవున్ని సంతోషపెట్టాలి, మనకు ప్రయోజనకరంగా ఉండాలి. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి బైబిల్లోని సూత్రాలు, నియమాలు సహాయం చేస్తాయని యెహోవాసాక్షులు నమ్ముతారు. (యెషయా 48:17, 18) ఆ సూత్రాలను, నియమాలను మేము తయారు చేయలేదు, కానీ మేము వాటికి అనుగుణంగా జీవిస్తాం. వాటిలోని కొన్ని సూత్రాలు, నియమాలు డేటింగ్‌ విషయంలో కూడా ఉపయోగపడతాయి. అదెలాగో చూద్దాం. *

  • పెళ్లి ఒక శాశ్వత బంధం. (మత్తయి 19:6) యెహోవాసాక్షుల దృష్టిలో డేటింగ్‌ అంటే పెళ్లి చేసుకునే ఉద్దేశంతో చేసేపని. కాబట్టి వాళ్లు దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు.

  • పెళ్లి చేసుకునే వయసు ఉన్నవాళ్లే డేటింగ్‌కు అర్హులు. వాళ్లకు “ఈడు మించిపోయి” ఉంటుంది, ఇంకోమాటలో చెప్పాలంటే, లైంగిక కోరికలు బలంగా ఉండే వయసు దాటిపోయుంటుంది.—1 కొరింథీయులు 7:36.

  • పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేనివాళ్లే డేటింగ్‌కు అర్హులు. చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నా కొంతమంది దేవుని దృష్టిలో పెళ్లికి అర్హులు కాదు, ఎందుకంటే దేవుని ప్రమాణాల ప్రకారం, జీవిత భాగస్వామి లైంగిక పాపం చేస్తేనే విడాకులు ఇవ్వాలి.—మత్తయి 19:9.

  • క్రైస్తవులు తోటి విశ్వాసులనే పెళ్లి చేసుకోవాలని బైబిలు చెప్తోంది. (1 కొరింథీయులు 7:39) అయితే ఈ లేఖనంలోని ఆజ్ఞ మా నమ్మకాలను కేవలం గౌరవించే వ్యక్తి గురించి చెప్పడం లేదుగానీ, యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకుని, మా నమ్మకాలనే కలిగివుండి వాటి ప్రకారం నడుచుకునే వ్యక్తి గురించి చెప్తుందని యెహోవాసాక్షులు నమ్ముతారు. (2 కొరింథీయులు 6:14) దేవుడు ఎప్పుడూ, తన ఆరాధకులు విశ్వాసం విషయంలో వాళ్లతో ఏకీభవించేవాళ్లనే పెళ్లి చేసుకునేలా నిర్దేశించాడు. (ఆదికాండము 24:3; మలాకీ 2:11) ఈ ఆజ్ఞ పాటిస్తే జీవితం బాగుంటుందని ఆధునిక పరిశోధకులు కూడా తెలుసుకున్నారు. *

  • పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. (సామెతలు 1:8; కొలొస్సయులు 3:20) తల్లిదండ్రులతో కలిసి జీవించే పిల్లలు డేటింగ్‌ విషయంలో కూడా తమ తల్లిదండ్రుల నిర్ణయానికి విధేయులై ఉండాలనే విషయం ఈ ఆజ్ఞలో ఉంది. అంటే, తమ కొడుకు లేదా కూతురు ఏ వయసులో డేటింగ్‌ మొదలుపెట్టవచ్చు, డేటింగ్‌లో భాగంగా ఏమేమి చేయవచ్చు వంటివి తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు.

  • ప్రతీ యెహోవాసాక్షి తను డేటింగ్‌ చెయ్యాలా వద్దా, చేస్తే ఎవరితో చేయాలి వంటి విషయాలను లేఖన నిర్దేశాలకు అనుగుణంగా తనే నిర్ణయించుకోవాలి. అది ఈ సూత్రానికి అనుగుణంగా ఉంటుంది: “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా?” (గలతీయులు 6:5) అయినా డేటింగ్‌ విషయంలో, మంచిపనులు చేయాలనే హృదయపూర్వక కోరిక ఉన్న, పరిణతి చెందిన యెహోవాసాక్షులను సలహా అడగడం తెలివైన పని.—సామెతలు 1:5.

  • డేటింగ్‌లో ఉన్న చాలామంది సాధారణంగా చేసే పనులు నిజానికి చాలా పెద్ద తప్పులు. ఉదాహరణకు, మనం లైంగిక పాపాలు చేయకూడదని బైబిలు ఆజ్ఞాపిస్తోంది. అయితే లైంగిక సంభోగం మాత్రమే కాదు పెళ్లి చేసుకోని వాళ్లు ఒకరి మర్మావయవాలను ఒకరు నిమరడం, ఓరల్‌ సెక్స్‌ (ముఖరతి) లేదా ఆనల్‌ సెక్స్‌ (ఆసన సంభోగం) చేసుకోవడం వంటి అపవిత్రమైన పనులు కూడా లైంగిక పాపాల కిందకే వస్తాయి. (1 కొరింథీయులు 6:9-11) అంతేకాదు పెళ్లికి ముందు, లైంగిక పాపానికి పాల్పడకపోయినా కోరికల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం దేవునికి బాధ కలిగించే “అపవిత్రత” కిందికి వస్తుంది. (గలతీయులు 5:19-21) అసభ్యకరమైన పదాలు ఉపయోగిస్తూ అనైతిక విషయాలు మాట్లాడుకోవడం కూడా పాపమని బైబిలు చెప్తుంది.—కొలొస్సయులు 3:8.

  • హృదయం లేదా అంతరంగం చాలా మోసకరమైనది. (యిర్మీయా 17:9) అది, మనకు తప్పని తెలిసిన పనినే మనచేత చేయించగలదు. డేటింగ్‌ చేస్తున్న జంట, అలా తమ హృదయం వల్ల మోసపోకుండా ఉండాలంటే, తమను ప్రలోభానికి గురిచేసే పరిస్థితుల్లో వాళ్లిద్దరూ ఏకాంతంగా ఉండకుండా జాగ్రత్తపడాలి. వాళ్లు ఎప్పుడూ మంచి స్నేహితుల మధ్యనో, ఒక శ్రేయోభిలాషి సమక్షంలోనో ఉంటూ తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. (సామెతలు 28:26) జంట కోసం చూస్తున్న ఒంటరి క్రైస్తవులు ఇంటర్నెట్‌లోని డేటింగ్‌ వెబ్‌సైట్ల వల్ల వచ్చే అపాయాలను గుర్తించాలి. ముఖ్యంగా, తమకు అంతగా తెలియని వాళ్లతో సంబంధం పెట్టుకోవడం ఎంత ప్రమాదమో గుర్తించాలి.—కీర్తన 26:4.

^ పేరా 2 డేటింగ్‌ కొన్ని సంస్కృతుల్లో మామూలే, కానీ మిగతావాళ్లకు అలవాటు లేదు. మనం డేటింగ్‌ చెయ్యాలనిగానీ, పెళ్లికి అదొకటే దారని గానీ బైబిలు చెప్పడం లేదు.

^ పేరా 6 ఉదాహరణకు, మ్యారేజ్‌ & ఫ్యామిలీ రివ్యూ అనే పత్రికలోని ఒక ఆర్టికల్‌ ఇలా చెప్తోంది:“మతం విషయంలో భార్యాభర్తలిద్దరి ప్రాధాన్యతలు, విశ్వాసాలు, నమ్మకాలు ఒకేలా ఉండడం వివాహబంధం ఎక్కువ కాలం నిలబడడానికి ముఖ్యమైన కారణాలని, శాశ్వత వివాహబంధం గురించి చేసిన మూడు మంచి అధ్యయనాలు వెల్లడించాయి. (25-50 పైవయసు).”—38వ సంపుటి, 11వ సంచిక, 88వ పేజీ (2005).