కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిల్లో రాయబడినవాటిని మీరు పూర్ణహృదయంతో పాటిస్తారా?

బైబిల్లో రాయబడినవాటిని మీరు పూర్ణహృదయంతో పాటిస్తారా?

“వాళ్లకు జరిగినవన్నీ . . . ఈ వ్యవస్థ అంతం కాబోయే సమయంలో జీవిస్తున్న మనకు హెచ్చరికగా ఉండడానికి ఆ విషయాలు లేఖనాల్లో రాయబడ్డాయి.”1 కొరిం. 10:11.

పాటలు: 11, 29

1, 2. నలుగురు యూదా రాజుల ఉదాహరణల్ని మనమెందుకు పరిశీలిస్తాం?

 ఎవరైనా ఒక దారిలో వెళ్తూ జారి పడిపోవడం మీరు చూస్తే, అదే దారిలో మీరు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా నడుస్తారు కదా! అదేవిధంగా ఇతరులు తమ జీవితాల్లో చేసిన తప్పుల్ని పరిశీలించడం వల్ల, అలాంటి తప్పుల్ని మనం చేయకుండా జాగ్రత్తపడవచ్చు. ఉదాహరణకు బైబిల్లో ప్రస్తావించబడిన కొంతమంది చేసిన తప్పుల నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు.

2 ముందటి ఆర్టికల్‌లో మనం పరిశీలించిన నలుగురు యూదా రాజులు యెహోవాను పూర్ణహృదయంతో ఆరాధించారు. అయితే వాళ్లు గంభీరమైన తప్పులు కూడా చేశారు. వాళ్లు చేసిన తప్పుల గురించి మనం లోతుగా ఆలోచిస్తూ, విలువైన పాఠాలు నేర్చుకోవాలని యెహోవా వాటిని బైబిల్లో రాయించాడు. ఇంతకీ ఆ నలుగురు రాజులకు జరిగిన దాన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు? వాళ్లు చేసినలాంటి తప్పుల్ని మనం చేయకూడదంటే ఏమి చేయాలి?—రోమీయులు 15:4 చదవండి.

మనుషుల జ్ఞానం మీద ఆధారపడితే ఘోరమైన పర్యవసానాలు అనుభవిస్తాం

3-5. (ఎ) ఆసా యెహోవాను పూర్ణహృదయంతో ఆరాధించినప్పటికీ ఏ తప్పు చేశాడు? (బి) బయెషా యూదా మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు ఆసా మనుషుల మీద ఎందుకు ఆధారపడివుంటాడు?

3 ముందు ఆసా అనుభవాన్ని పరిశీలిద్దాం. పది లక్షలమంది కూషీయులు యూదా మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు ఆసా యెహోవాపై ఆధారపడ్డాడు. కానీ ఇశ్రాయేలు రాజైన బయెషాతో యుద్ధం చేసినప్పుడు మాత్రం అతను యెహోవాపై ఆధారపడలేదు. ఇశ్రాయేలు ముఖ్య పట్టణమైన రామా యూదా రాజ్యపు సరిహద్దుల్లో ఉంది. దానికి ప్రాకారాలు కట్టనివ్వకుండా బయెషాను ఆపాలని ఆసా అనుకున్నాడు. (2 దిన. 16:1-3) అందుకోసం సిరియా రాజుకు కానుకలు ఇచ్చి సహాయం కోరాలని ఆసా నిర్ణయించుకున్నాడు. సిరియన్లు ఇశ్రాయేలు పట్టణాలపై దాడిచేయగానే బయెషా “రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను.” (2 దిన. 16:5) నిజానికి ఆసా సరైన నిర్ణయమే తీసుకున్నానని మొదట్లో అనుకుని ఉండవచ్చు.

4 మరి ఆసా చేసిన పని యెహోవాకు నచ్చిందా? తనపై ఆధారపడని ఆసాను చూసి యెహోవా సంతోషించలేదు, అందుకే అతన్ని సరిదిద్దమని యెహోవా హనానీ ప్రవక్తను పంపించాడు. (2 దినవృత్తాంతములు 16:7-9 చదవండి.) హనానీ ఆసాతో ఇలా అన్నాడు, “ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.” అవును, రామా పట్టణాన్నైతే ఆసా చేజిక్కించుకోగలిగాడు గానీ మిగిలిన జీవితమంతా ఆసా, అతని ప్రజలు ఎన్నో యుద్ధాలు చేయాల్సివచ్చింది.

5 ఆసాను చూసి యెహోవా సంతోషించాడని మనం ముందటి ఆర్టికల్‌లో తెలుసుకున్నాం. ఆసా అపరిపూర్ణుడైనా, అతను పూర్ణహృదయంతో తనను ఆరాధించాడని యెహోవా గమనించాడు. (1 రాజు. 15:14) అయినప్పటికీ అతను తీసుకున్న చెడ్డ నిర్ణయం వల్ల వచ్చిన పర్యావసానాల్ని మాత్రం ఆసా అనుభవించక తప్పలేదు. ఇంతకీ ఆసా యెహోవాపై కాకుండా తనమీద, ఇతరుల మీద ఎందుకు ఆధారపడ్డాడు? సైనిక వ్యూహాలను తెలివిగా వాడి యుద్ధం గెలవచ్చని బహుశా ఆసా అనుకునివుంటాడు. లేదా ఇతరులు ఇచ్చిన చెడు సలహాల్ని విని అలా చేసివుంటాడు.

6. ఆసా నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ఉదాహరణ చెప్పండి.

6 ఆసా చేసిన తప్పు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? పరిస్థితులు ఎలాంటివైనా మనం యెహోవాపైనే ఆధారపడాలి గానీ మన సొంత జ్ఞానం మీద కాదు. మన సమస్యలు పెద్దవైనా, చిన్నవైనా మనం ఆయన్ను సహాయం అడగాలి. మనం ఇలా పరిశీలించుకోవడం మంచిది: ఏదైనా సమస్యను మనకు నచ్చిన పద్ధతిలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ మన సొంత జ్ఞానంపై ఆధారపడుతున్నామా? లేదా ఆ సమస్య గురించి బైబిలు ఏమి చెప్తుందో మొదట పరిశీలించి ఆ తర్వాత సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? ఉదాహరణకు కుటుంబసభ్యుల వ్యతిరేకత వల్ల మీటింగ్‌కి గానీ, సమావేశానికి గానీ వెళ్లడం కష్టమౌతుంటే మీరేమి చేస్తారు? సహాయం చేయమని యెహోవాను అడుగుతారా? మరొక ఉదాహరణ పరిశీలించండి. చాలాకాలంగా ఉద్యోగం లేనందువల్ల మీరు ఇబ్బందిపడుతున్నారు. అనుకోకుండా మీకో ఉద్యోగం దొరికింది. మీరేమి చేస్తారు? వారం మధ్యలో జరిగే మీటింగ్‌కి మీరు ప్రతీవారం వెళ్లాల్సివుంటుందని ఉద్యోగంలో చేరకముందు యజమానికి చెప్తారా? సమస్య ఏదైనా కీర్తనకర్త చెప్పిన ఈ సలహాను మనం గుర్తుంచుకోవాలి: “నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.”—కీర్త. 37:5.

యెహోవాను ఆరాధించని వాళ్లతో స్నేహం చేస్తే ఏమి జరగవచ్చు?

7, 8. యెహోషాపాతు ఎలాంటి తప్పులు చేశాడు? ఫలితం ఏమిటి? (ప్రారంభ చిత్రం చూడండి.)

7 ఆసా కొడుకైన యెహోషాపాతు అనుభవాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. అతనిలో ఉన్న ఎన్నో మంచి లక్షణాల్ని చూసి యెహోవా సంతోషించాడు. యెహోవాపై ఆధారపడడం వల్ల అతను ఎన్నో మంచి పనులు చేశాడు. కానీ అతను కూడా కొన్ని చెడ్డ నిర్ణయాలు తీసుకున్నాడు. ఉదాహరణకు, అతను తన కొడుకుకు దుష్టరాజైన అహాబు కూతుర్ని ఇచ్చి పెళ్లిచేశాడు. తర్వాత మీకాయా ప్రవక్త వద్దని హెచ్చరించినా వినకుండా అతను అహాబుతో చేతులు కలిపి సిరియా మీదికి యుద్ధానికి వెళ్లాడు. ఆ యుద్ధంలో సిరియన్లు యెహోషాపాతు మీద దాడిచేసి అతన్ని చంపడానికి ప్రయత్నించారు, కానీ తృటిలో తప్పించుకుని బయటపడ్డాడు. (2 దిన. 18:1-32) యెహోషాపాతు యెరూషలేముకు తిరిగొచ్చాక ప్రవక్త అయిన యెహూ అతన్ని ఇలా అడిగాడు, “నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా?”—2 దినవృత్తాంతములు 19:1-3 చదవండి.

8 జరిగిన దాన్నిబట్టి, ప్రవక్తలు ఇచ్చిన హెచ్చరికల్ని బట్టి యెహోషాపాతు గుణపాఠాలు నేర్చుకున్నాడా? లేదు. నిజానికి అతనికి యెహోవా మీద ప్రేమ, ఆయన్ను సంతోషపెట్టాలనే కోరిక ఉన్నప్పటికీ, యెహోవాను ఆరాధించని వ్యక్తితో మళ్లీ స్నేహం చేశాడు. ఆ వ్యక్తి అహాబు కొడుకైన అహజ్యా రాజు. వాళ్లిద్దరూ కలిసి ఓడలను నిర్మించే వ్యాపారం చేశారు. అయితే అవి వాళ్లనుకున్న పనికి ఉపయోగించకముందే బద్దలైపోయేవి.—2 దిన. 20:35-37.

9. యెహోవాను ఆరాధించని వాళ్లతో స్నేహం చేస్తే ఏమౌతుంది?

9 యెహోషాపాతు నుండి మనమేమి నేర్చుకోవచ్చు? యెహోషాపాతు సరైనదాన్ని చేస్తూ ‘యెహోవాను హృదయపూర్వకంగా వెదికాడు.’ (2 దిన. 22:9) కానీ యెహోవాను ప్రేమించని వాళ్లతో స్నేహం చేయడం వల్ల అతని జీవితంలో ఘోరమైన సమస్యలు తలెత్తాయి. ఒకసారైతే దాదాపు చనిపోయేంత పరిస్థితి వచ్చింది. అందుకే, “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును” అని బైబిలు చెప్తోంది. (సామె. 13:20) యెహోవాను ఆరాధించని వాళ్లకు మనం యెహోవా గురించిన సత్యం చెప్పాలనుకుంటాం. కానీ అలాంటి వాళ్లతో స్నేహం చేయడం వల్ల చాలా ప్రమాదంలో పడతాం.

10. (ఎ) పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్లు యెహోషాపాతు నుండి ఏమి నేర్చుకోవచ్చు? (బి) మనం ఏమి గుర్తుంచుకోవాలి?

10 పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్లు యెహోషాపాతు ఉదాహరణ నుండి ఏమి నేర్చుకోవచ్చు? యెహోవాసాక్షుల్లో సరైన జత దొరకరనే ఉద్దేశంతో యెహోవాను ఆరాధించని వ్యక్తిని మనం ప్రేమిస్తుండవచ్చు. లేదా వయసు అయిపోక ముందే పెళ్లిచేసుకోమని మన బంధువులు మనపై ఒత్తిడి తీసుకొస్తుండవచ్చు. ప్రేమించబడాలనే, ప్రేమించాలనే కోరికను యెహోవా మనలో ఉంచాడన్న మాట నిజమే. కానీ మనకు సరైన జత దొరకకపోతే ఏమి చేయాలి? యెహోషాపాతుకు జరిగిన దానిగురించి ధ్యానించడం ఈ విషయంలో మనకు సహాయం చేస్తుంది. అతను సాధారణంగా సహాయం కోసం యెహోవాను వేడుకునేవాడు. (2 దిన. 18:4-6) కానీ యెహోవాను ఆరాధించని అహాబుతో స్నేహం చేశాక యెహోవా హెచ్చరికల్ని పట్టించుకోవడం మానేశాడు. “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది” అనే విషయాన్ని యెహోషాపాతు గుర్తుంచుకొని ఉండాల్సింది. (2 దిన. 16:9) యెహోవా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మనం కూడా గుర్తుంచుకోవాలి. ఆయన మన పరిస్థితిని అర్థం చేసుకుంటాడు, మనల్ని ప్రేమిస్తాడు. ప్రేమ, స్నేహం పొందాలనే మీ కోరికను యెహోవా ఏదో ఒక రూపంలో తీరుస్తాడనే నమ్మకం మీకు ఉందా? యెహోవా భవిష్యత్తులో ఖచ్చితంగా అలా తీరుస్తాడనే నమ్మకంతో ఉండండి.

యెహోవాను ఆరాధించని వాళ్లతో స్నేహం చేయకండి (10వ పేరా చూడండి)

మీలో గర్వాన్ని మొలకెత్తనివ్వకండి

11, 12. (ఎ) హిజ్కియా హృదయంలో ఏముందో ఏవిధంగా బయటపడింది? (బి) యెహోవా హిజ్కియాను ఎందుకు క్షమించాడు?

11 హిజ్కియా నుండి మనమేమి నేర్చుకోవచ్చు? తన హృదయంలో ఏముందో పరిశీలించుకోవడానికి హిజ్కియాకు యెహోవా ఒక సందర్భంలో సహాయం చేశాడు. (2 దినవృత్తాంతములు 32:31 చదవండి.) ఒకసారి హిజ్కియా ఆరోగ్యం బాగా పాడైంది. అయితే అతను తిరిగి బాగవుతాడని తెలిపే ఒక సూచనను యెహోవా అతనికి ఇచ్చాడు. ఆ సూచన ఏమిటంటే, మెట్ల మీదున్న నీడ పది అడుగులు వెనక్కి వెళ్లడం. ఆ తర్వాత, బహుశా ఆ సూచన గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనే కుతూహలంతో బబులోను రాజు తన మనుషులను హిజ్కియా దగ్గరకు పంపించాడు. (2 రాజు. 20:8-13; 2 దిన. 32:24) అసలు హిజ్కియా హృదయంలో ఏముందో బయటపెట్టడానికి ‘దేవుడు అతనిని విడిచిపెట్టాడు’ అని బైబిలు చెప్తోంది. బబులోను నుండి వచ్చిన మనుషులకు హిజ్కియా తన దగ్గరున్న సంపదంతా చూపించాడు. దాంతో అతని హృదయంలో ఏముందో బయటపడింది. అలాగని ఎలా చెప్పవచ్చు?

12 విచారకరంగా హిజ్కియాలో గర్వం మొలకెత్తింది. దానివల్ల, “తనకు చేయబడిన మేలు” గురించి ఇతరులకు చెప్పలేదు. అతనిలో ఆ లక్షణం ఎందుకు మొదలైందో బైబిలు చెప్పట్లేదు. బహుశా అది అష్షూరీయులపై విజయం సాధించినందుకో, లేదా యెహోవా అతన్ని స్వస్థపర్చినందుకో లేదా ఎంతో డబ్బు-పేరు సంపాదించినందుకో అయ్యుండవచ్చు. హిజ్కియా యెహోవాను పూర్ణహృదయంతో ఆరాధించినప్పటికీ, ఒకానొక సమయంలో అతనిలో గర్వం మొదలైంది. అది చూసి యెహోవా సంతోషించలేదు. కానీ కొంతకాలానికి అతను తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి యెహోవా అతన్ని క్షమించాడు.—2 దిన. 32:25-27; కీర్త. 138:6.

13, 14. (ఎ) మన హృదయంలో ఏముందో ఎలాంటి పరిస్థితుల్లో బయటపడుతుంది? (బి) ఇతరులు మనల్ని పొగిడినప్పుడు మనమెలా ప్రవర్తించాలి?

13 హిజ్కియా నుండి, అతను చేసిన తప్పు నుండి మనమేమి నేర్చుకోవచ్చు? అష్షూరీయుల్ని ఓడించడానికి, అనారోగ్యం నుండి కోలుకోవడానికి యెహోవా అతనికి సహాయం చేశాకే హిజ్కియాలో గర్వం మొలకెత్తిందని గుర్తుంచుకోండి. కాబట్టి మనకు ఏదైనా మంచి జరిగినప్పుడు లేదా ఇతరులు మనల్ని పొగిడినప్పుడు మనమెలా ప్రవర్తిస్తాం? అలాంటి సమయాల్లో మనమెలా ప్రవర్తిస్తామనే దానిబట్టే మన హృదయంలో ఏముందో తెలుస్తుంది. ఉదాహరణకు, ఒక సహోదరుడు చాలా కృషిచేసి సిద్ధపడి ఎంతోమంది ప్రేక్షకుల ముందు ప్రసంగం ఇచ్చాడనుకోండి. ప్రసంగం అయిపోయాక చాలామంది ఆయన్ను మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ సహోదరుడు ఎలా ప్రవర్తిస్తాడు?

14 యేసు చెప్పిన ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి: “మీకు ఇచ్చిన పనులన్నీ చేసిన తర్వాత ఇలా అనండి: ‘మేము ఎందుకూ పనికిరాని దాసులం. మేము చేయాల్సిన వాటినే చేశాం.’” (లూకా 17:10) హిజ్కియాలో గర్వం మొలకెత్తాక, యెహోవా చేసిన సహాయాన్ని అతను మర్చిపోయాడు. మరి మనమేదైనా ప్రసంగం ఇచ్చాక ఇతరులు మనల్ని పొగిడినప్పుడు మనమెలా వినయంగా ఉండవచ్చు? యెహోవా మనకు చేసిన సహాయం గురించి మనం లోతుగా ఆలోచించవచ్చు. ఆయన గురించి, ఆయన మనకు సహాయం చేసిన విధానం గురించి ఇతరులకు చెప్పవచ్చు. మనకు బైబిల్ని, పవిత్రశక్తిని ఇచ్చి ప్రసంగం ఇవ్వడానికి సహాయం చేసింది నిజానికి యెహోవాయే.

నిర్ణయాల్ని జాగ్రత్తగా తీసుకోండి

15, 16. యోషీయా చేసిన ఏ పనివల్ల అతను ప్రాణాలు కోల్పోయాడు?

15 చివరిగా యోషీయా నుండి మనమేమి నేర్చుకోవచ్చు? అతను మంచి రాజే అయినప్పటికీ, అతను చేసిన పొరపాటు వల్ల ప్రాణాల్ని కోల్పోయాడు. (2 దినవృత్తాంతములు 35:20-22 చదవండి.) ఇంతకీ ఏమి జరిగింది? ఎలాంటి కారణం లేకుండానే ఐగుప్తు రాజైన నెకోతో యోషీయా యుద్ధం చేయాలనుకున్నాడు. తనకు యుద్ధం చేసే ఆలోచన లేదని నెకో కూడా స్వయంగా చెప్పాడు. నిజానికి నెకో చెప్పిన మాటలు “యెహోవా నోటి మాటలు” అని బైబిలు చెప్తోంది. అయినాసరే వినకుండా యుద్ధానికి వెళ్లడం వల్ల యోషీయా చనిపోయాడు. అయితే అతను నెకో రాజుతో ఎందుకు యుద్ధం చేయాలనుకున్నాడో మాత్రం బైబిలు చెప్పట్లేదు.

16 నెకో రాజు చెప్పినవి నిజంగా యెహోవా మాటలేనా అని యిర్మీయా ప్రవక్తను యోషీయా అడిగి ఉండాల్సింది. (2 దిన. 35:23, 25) అంతేకాదు నిజానిజాలేంటో యోషీయా తెలుసుకోవాల్సింది. నెకో కర్కెమీషు అనే మరో దేశం మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడేగానీ, యెరూషలేము మీదకు రావడంలేదు. పైగా యెహోవాను గానీ, ఆయన ప్రజల్ని గానీ అవమానించడానికి నెకో ప్రయత్నించలేదు. నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాల గురించి యోషీయా జాగ్రత్తగా ఆలోచించలేదు. దీన్నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? మనకు ఏదైనా సమస్య వచ్చి, నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనమేమి చేయాలని యెహోవా కోరుకుంటున్నాడో ముందు తెలుసుకోవాలి.

17. మనం యోషీయా చేసినలాంటి తప్పు చేయకూడదంటే సమస్యలు వచ్చినప్పుడు ఏమి చేయాలి?

17 ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఏ బైబిలు సూత్రాలు మనకు సహాయం చేస్తాయో, వాటిని ఎలా పాటించాలో ముందు ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో, మన ప్రచురణల్లో మరింత పరిశోధన చేయాల్సి రావచ్చు. లేదా సంఘపెద్దను సలహా అడగాల్సి రావచ్చు, ఇతర బైబిలు సూత్రాల గురించి ఆలోచించడానికి అతను మనకు సహాయం చేస్తాడు. ఒకసారి ఈ సందర్భాన్ని ఊహించుకోండి. ఒక సహోదరికి యెహోవాసాక్షికాని భర్త ఉన్నాడు. ఆమె ఒకరోజు ప్రీచింగ్‌కు వెళ్లాలని ప్రణాళిక వేసుకుంది. (అపొ. 4:20) కానీ ఆమె భర్త ఆ రోజు ఇంట్లోనే ఉండమని ఆమెను అడిగాడు. తాము కలిసి సమయం గడిపి చాలా రోజులు అవుతోందని, ఈరోజు ఆమెను బయటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడని అతను ఆ సహోదరికి చెప్పాడు. అయితే సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేసే లేఖనాల్ని ఆమె పరిశీలించి ఉండవచ్చు. బహుశా అవి దేవునికి లోబడమని, శిష్యుల్ని చేయమని చెప్పే లేఖనాలు అయ్యుండవచ్చు. (మత్త. 28:19, 20; అపొ. 5:29) వాటితోపాటు భార్య భర్తకు లోబడాలని, మొండిపట్టు పట్టకూడదని బైబిలు చెప్తున్న విషయాల్ని కూడా గుర్తుతెచ్చుకుని ఉండవచ్చు. (ఎఫె. 5:22-24; ఫిలి. 4:5) ఇంతకీ ఆమె భర్త అసలు ఎప్పుడూ ప్రీచింగ్‌కు వెళ్లొద్దని చెప్తున్నాడా లేదా కేవలం ఆ ఒక్క రోజు తనతో సమయం గడపమని అడుగుతున్నాడా? యెహోవా సేవకులుగా మనం సరైన నిర్ణయాల్ని, యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాల్ని తీసుకోవాలి.

పూర్ణహృదయంతో ఆరాధించండి, ఆనందంగా ఉండండి

18. ఈ ఆర్టికల్‌లో చర్చించుకున్న నలుగురు యూదా రాజుల గురించి లోతుగా ఆలోచించడం వల్ల మీరేమి నేర్చుకోవచ్చు?

18 మనం అపరిపూర్ణులం కాబట్టి ఆ నలుగురు యూదా రాజులు చేసినలాంటి తప్పుల్నే మనం కూడా కొన్నిసార్లు చేసే అవకాశం ఉంది. మనం (1) సొంత జ్ఞానంపై ఆధారపడడం, (2) యెహోవాను ఆరాధించని వాళ్లతో స్నేహం చేయడం, (3) గర్విష్ఠులుగా మారడం, (4) దేవుని అభిప్రాయమేమిటో ముందు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేసే అవకాశం ఉంది. అంతమాత్రాన మనం ఎప్పటికీ యెహోవాను సంతోషపెట్టలేమని అనుకోకూడదు. యెహోవా ఆ నలుగురు రాజుల్లో మంచిని చూసినట్టే మనలో కూడా మంచిని చూస్తాడు. మనం ఆయన్ను ఎంత ప్రేమిస్తున్నామో, ఆయన్ను హృదయపూర్వకంగా ఆరాధించాలని ఎంత కోరుకుంటున్నామో ఆయన చూస్తాడు. అందుకే ఘోరమైన తప్పులు చేయకుండా ఉండేలా మనకు కొందరి అనుభవాల్ని హెచ్చరికలుగా ఇచ్చాడు. కాబట్టి మనం ఈ ఉదాహరణల గురించి లోతుగా ఆలోచిద్దాం. మనకు వాటిని ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞత చూపిద్దాం.