దినవృత్తాంతాలు రెండో గ్రంథం 18:1-34

  • యెహోషాపాతు అహాబుతో పొత్తు పెట్టుకోవడం (1-11)

  • ఓడిపోతారని మీకాయా ప్రవచించడం (12-27)

  • రామోత్గిలాదు దగ్గర అహాబు చంపబడడం (28-34)

18  యెహోషాపాతుకు ఎంతో ఐశ్వర్యం, ఘనత కలిగాయి;+ అయితే, అతను అహాబుతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు.+  కొన్ని సంవత్సరాల తర్వాత, అతను సమరయలో ఉన్న అహాబు దగ్గరికి వెళ్లాడు.+ అహాబు అతని కోసం, అతనితో ఉన్న మనుషుల కోసం ఎన్నో గొర్రెల్ని, పశువుల్ని వధించాడు.* రామోత్గిలాదు+ మీద దాడిచేయడానికి తనతోపాటు రమ్మని అతన్ని బలవంతపెట్టాడు.*  ఇశ్రాయేలు రాజైన అహాబు యూదా రాజైన యెహోషాపాతును, “నాతోపాటు రామోత్గిలాదుకు వస్తావా?” అని అడిగాడు. దానికి యెహోషాపాతు, “నువ్వూ నేనూ ఒక్కటే, నా ప్రజలు నీ ప్రజలే. యుద్ధంలో నేను నీకు సహాయం చేస్తాను” అన్నాడు.  అయితే యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, “దయచేసి ముందు యెహోవా మాట కోసం విచారణ చేయి” అన్నాడు.+  దాంతో ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తల్ని సమకూర్చి, “నేను రామోత్గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా? వద్దా?” అని వాళ్లను అడిగాడు. వాళ్లు, “వెళ్లు, సత్యదేవుడు దాన్ని రాజు చేతికి అప్పగిస్తాడు” అని చెప్పారు.  అప్పుడు యెహోషాపాతు, “ఇక్కడ యెహోవా ప్రవక్త ఒక్కరు కూడా లేరా?+ ఉంటే, మనం అతని ద్వారా కూడా దేవుని దగ్గర విచారణ చేద్దాం” అన్నాడు.+  దానికి ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “ఒకతను ఉన్నాడు,+ మనం అతని ద్వారా యెహోవా దగ్గర విచారణ చేయవచ్చు. కానీ అతనంటే నాకు అసహ్యం, ఎందుకంటే అతను నా విషయంలో చెడునే తప్ప మంచిని ప్రవచించడు.+ అతను ఇమ్లా కుమారుడైన మీకాయా” అని అన్నాడు. అయితే యెహోషాపాతు, “రాజా, నువ్వు అలా మాట్లాడకూడదు” అన్నాడు.  కాబట్టి ఇశ్రాయేలు రాజు ఒక ఆస్థాన అధికారిని పిలిచి, “ఇమ్లా కుమారుడైన మీకాయాను వెంటనే తీసుకురా” అని చెప్పాడు.+  ఆ సమయంలో ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకొని, సమరయ ప్రవేశ ద్వారం దగ్గరున్న ఖాళీ స్థలంలో తమ సింహాసనాల మీద కూర్చొనివున్నారు; ప్రవక్తలందరూ వాళ్ల ముందు ప్రవచిస్తూ ఉన్నారు. 10  అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని ఇలా అన్నాడు: “యెహోవా ఏం చెప్తున్నాడంటే, ‘నువ్వు సిరియన్లను పూర్తిగా నిర్మూలించే వరకు వీటితో వాళ్లను పొడుస్తావు.’ ”* 11  మిగతా ప్రవక్తలందరూ అదేవిధంగా ప్రవచిస్తూ, “నువ్వు రామోత్గిలాదుకు వెళ్లు, నువ్వు విజయం సాధిస్తావు;+ యెహోవా దాన్ని రాజు చేతికి అప్పగిస్తాడు” అని అంటూ ఉన్నారు. 12  కాబట్టి మీకాయాను పిలవడానికి వెళ్లిన వ్యక్తి మీకాయాతో, “ప్రవక్తలందరూ ఒక్కటిగా రాజుకు అనుకూలమైన మాటే చెప్పారు. దయచేసి నువ్వు కూడా వాళ్లలా+ అనుకూలంగా మాట్లాడు” అని చెప్పాడు.+ 13  కానీ మీకాయా, “యెహోవా జీవం తోడు, నా దేవుడు నాకు ఏది చెప్తే అదే చెప్తాను” అన్నాడు.+ 14  మీకాయా రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు అతన్ని, “మీకాయా, మేము రామోత్గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా? వద్దా?” అని అడిగాడు. మీకాయా వెంటనే, “వెళ్లు, నువ్వు విజయం సాధిస్తావు; వాళ్లు నీ చేతికి అప్పగించబడతారు” అని చెప్పాడు. 15  అప్పుడు రాజు అతనితో, “నాతో నిజం మాత్రమే మాట్లాడాలని నేను యెహోవా పేరున నీతో ఎన్నిసార్లు ఒట్టు వేయించాలి?” అన్నాడు. 16  కాబట్టి మీకాయా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయులందరూ కాపరిలేని గొర్రెల్లా పర్వతాల మీద చెదిరిపోయి ఉండడం నేను చూస్తున్నాను.+ ‘వీళ్లకు యజమాని లేడు. ప్రతీ ఒక్కర్ని తమ ఇళ్లకు ప్రశాంతంగా తిరిగెళ్లనీ’ అని యెహోవా అన్నాడు.” 17  అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “ఇతను నా విషయంలో చెడునే తప్ప మంచిని ప్రవచించడని నీకు చెప్పానుగా?” అన్నాడు.+ 18  అప్పుడు మీకాయా ఇలా అన్నాడు: “యెహోవా చెప్పే మాట వినండి: యెహోవా తన సింహాసనం మీద కూర్చొనివుండడం,+ పరలోక సైన్యమంతా+ ఆయన కుడిపక్కన, ఎడమపక్కన నిలబడివుండడం నేను చూశాను.+ 19  అప్పుడు యెహోవా, ‘ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్గిలాదు మీదికి వెళ్లి అక్కడ చనిపోయేలా అతన్ని ఎవరు వెర్రివాణ్ణి చేస్తారు?’ అని అడిగాడు. ఒక దేవదూత ఒక మాట చెప్తుంటే, ఇంకో దేవదూత ఇంకో మాట చెప్తున్నాడు. 20  తర్వాత ఒక దేవదూత*+ యెహోవా ముందుకు వచ్చి నిలబడి, “నేను అతన్ని వెర్రివాణ్ణి చేస్తాను” అన్నాడు. ‘నువ్వు ఆ పని ఎలా చేస్తావు?’ అని యెహోవా అడిగాడు. 21  దానికి ఆ దేవదూత, ‘నేను వెళ్లి అతని ప్రవక్తలందరూ అబద్ధం చెప్పేలా చేస్తాను’ అన్నాడు. అప్పుడు ఆయన, ‘నువ్వు అతన్ని వెర్రివాణ్ణి చేస్తావు, తప్పకుండా విజయం సాధిస్తావు. వెళ్లి ఆ పని చేయి’ అన్నాడు. 22  ఈ ప్రవక్తల చేత నీకు అబద్ధం చెప్పించేలా యెహోవా ఒక దేవదూతను అనుమతించాడు,+ కానీ యెహోవా నీ మీదికి విపత్తు వస్తుందని ప్రకటించాడు.” 23  అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా+ వచ్చి మీకాయాను+ చెంపమీద కొట్టి,+ “నీతో మాట్లాడడానికి యెహోవా పవిత్రశక్తి నా దగ్గర నుండి ఏ దారిలో వెళ్లింది?” అన్నాడు.+ 24  అందుకు మీకాయా, “నువ్వు దాక్కోవడానికి లోపలి గదిలోకి వెళ్లే రోజున, అది ఏ దారిలో వెళ్లిందో నీకే తెలుస్తుంది” అని చెప్పాడు. 25  అప్పుడు ఇశ్రాయేలు రాజు ఇలా ఆజ్ఞాపించాడు: “మీకాయాను తీసుకెళ్లి, నగర అధిపతైన ఆమోనుకు, రాజు కుమారుడైన యోవాషుకు అప్పగించండి. 26  ‘ “ఇతన్ని చెరసాలలో పెట్టి,+ నేను క్షేమంగా తిరిగొచ్చేవరకు కొంచెం ఆహారం, నీళ్లు మాత్రమే ఇవ్వండి” అని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు’ అని వాళ్లకు చెప్పండి.” 27  అయితే మీకాయా, “నువ్వు ఒకవేళ నిజంగా క్షేమంగా తిరిగొస్తే యెహోవా నాతో మాట్లాడనట్టే”+ అన్నాడు. అతను ఇంకా ఇలా అన్నాడు: “ప్రజలారా, మీరందరూ దీన్ని గుర్తుంచుకోండి.” 28  తర్వాత ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్గిలాదు దగ్గరికి వెళ్లారు.+ 29  ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో ఇలా చెప్పాడు: “నేను మారువేషం వేసుకుని యుద్ధంలోకి వెళ్తాను, కానీ నువ్వు నీ రాజవస్త్రాలు వేసుకోవాలి.” కాబట్టి ఇశ్రాయేలు రాజు మారువేషం వేసుకున్నాడు, వాళ్లు యుద్ధంలోకి వెళ్లారు. 30  అయితే సిరియా రాజు తన రథాధిపతులకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు: “మీరు ఇశ్రాయేలు రాజుతోనే తప్ప చిన్నవాళ్లతో గానీ గొప్పవాళ్లతో గానీ ఎవ్వరితో పోరాడకండి.” 31  ఆ రథాధిపతులు యెహోషాపాతును చూడగానే, “ఇశ్రాయేలు రాజు ఇతనే” అని అనుకున్నారు. కాబట్టి వాళ్లు అతనితో యుద్ధం చేయడానికి అతని వైపు వెళ్లారు; దాంతో యెహోషాపాతు సహాయం కోసం కేకలు వేయడం మొదలుపెట్టాడు.+ యెహోవా అతనికి సహాయం చేశాడు, దేవుడు వెంటనే అతని దగ్గర నుండి వాళ్లు పక్కకు వెళ్లిపోయేలా చేశాడు. 32  అతను ఇశ్రాయేలు రాజు కాదని రథాధిపతులు గమనించినప్పుడు వాళ్లు వెంటనే అతన్ని తరమడం ఆపేశారు. 33  అయితే ఒకతను ఊరికే గురిచూడకుండా ఒక బాణం వేసినప్పుడు, అది ఇశ్రాయేలు రాజు కవచంలోని భాగాల మధ్యలోకి దిగింది. దాంతో రాజు తన రథసారథితో, “నాకు తీవ్రంగా గాయమైంది, రథం వెనక్కి తిప్పి యుద్ధంలో నుండి నన్ను బయటికి తీసుకెళ్లు” అని చెప్పాడు.+ 34  ఆ రోజంతా తీవ్రంగా యుద్ధం జరిగింది; సాయంత్రం వరకు ఇశ్రాయేలు రాజును సిరియన్లకు ఎదురుగా రథంలో నిలబెట్టాల్సి వచ్చింది. అతను సూర్యాస్తమయ సమయంలో చనిపోయాడు.+

అధస్సూచీలు

లేదా “బలి అర్పించాడు.”
లేదా “ఒప్పించాడు.”
లేదా “నెడతావు.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.