దినవృత్తాంతాలు రెండో గ్రంథం 22:1-12

  • అహజ్యా, యూదా రాజు (1-9)

  • అతల్యా సింహాసనాన్ని చేజిక్కించుకోవడం (10-12)

22  తర్వాత, యెరూషలేము నివాసులు యెహోరాము స్థానంలో అతని చిన్న* కుమారుడైన అహజ్యాను రాజును చేశారు. ఎందుకంటే అరబీయులతో పాటు యూదా శిబిరం మీదికి వచ్చిన దోపిడీ ముఠా అతని మిగతా పెద్ద కుమారులందర్నీ చంపింది.+ కాబట్టి యెహోరాము కుమారుడైన అహజ్యా యూదా రాజుగా పరిపాలించడం మొదలుపెట్టాడు.+  రాజైనప్పుడు అహజ్యా వయసు 22 ఏళ్లు, అతను యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలించాడు. అతని తల్లి పేరు అతల్యా.+ ఆమె ఒమ్రీ+ మనవరాలు.  అహజ్యా తన తల్లి సలహాలు విని చాలా చెడుగా ప్రవర్తించాడు, అతను కూడా అహాబు ఇంటివాళ్ల మార్గాల్లో నడిచాడు.+  అతను అహాబు ఇంటివాళ్లలా యెహోవా దృష్టికి చెడు చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే అతని తండ్రి చనిపోయిన తర్వాత వాళ్లే అతని సలహాదారులు అయ్యారు. అది అతని నాశనానికే దారి తీసింది.  అతను వాళ్ల సలహా విని, సిరియా రాజైన హజాయేలుతో+ యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు రాజూ అహాబు కుమారుడూ అయిన యెహోరాముతో పాటు రామోత్గిలాదుకు+ వెళ్లాడు. అక్కడ విలుకాండ్రు యెహోరామును గాయపర్చారు.  సిరియా రాజైన హజాయేలుతో రామా దగ్గర యుద్ధం చేసినప్పుడు, సిరియన్లు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి అతను యెజ్రెయేలుకు+ తిరిగొచ్చాడు.+ అహాబు కుమారుడైన యెహోరాము+ గాయపడ్డాడు*+ కాబట్టి అతన్ని చూడడానికి యూదా రాజూ యెహోరాము+ కుమారుడూ అయిన అహజ్యా* యెజ్రెయేలుకు వెళ్లాడు.  అయితే యెహోరామును చూడడానికి వెళ్లినప్పుడు దేవుడు అహజ్యా మీదికి విపత్తు తీసుకొచ్చాడు; అతను అక్కడికి వెళ్లాక, నింషీ మనవడైన* యెహూను కలవడానికి యెహోరాముతో పాటు వెళ్లాడు.+ యెహోవా అహాబు ఇంటివాళ్లను నాశనం చేయడానికి యెహూను అభిషేకించాడు.+  యెహూ అహాబు ఇంటివాళ్లమీద తీర్పును అమలు చేయడం మొదలుపెట్టినప్పుడు అతనికి యూదా అధిపతులు, అహజ్యా పరిచారకులైన అతని సహోదరుల కుమారులు కనిపించారు; యెహూ వాళ్లను చంపాడు.+  తర్వాత యెహూ అహజ్యాను వెదకడానికి మనుషుల్ని పంపించాడు; వాళ్లు సమరయలో దాక్కున్న అహజ్యాను పట్టుకొని యెహూ దగ్గరికి తీసుకొచ్చారు. తర్వాత వాళ్లు అతన్ని చంపారు; అయితే, “ఇతను యెహోవాను నిండు హృదయంతో వెదికిన యెహోషాపాతు మనవడు”+ అని చెప్పి అతన్ని పాతిపెట్టారు.+ రాజ్యాన్ని పరిపాలించ గలవాళ్లు అహజ్యా కుటుంబంలో ఇంకెవ్వరూ లేరు. 10  అహజ్యా తల్లియైన అతల్యా+ తన కుమారుడు చనిపోవడం చూసినప్పుడు, ఆమె యూదా రాజవంశం* మొత్తాన్ని నాశనం చేసింది.+ 11  అయితే, రాజు కూతురైన యెహోషబతు అహజ్యా కుమారుడైన యెహోయాషును+ దాచిపెట్టింది. ఆమె చంపబడబోయే రాకుమారుల్లో నుండి అతన్ని రహస్యంగా తీసుకెళ్లి అతన్ని, అతని దాదిని లోపలి పడకగదిలో ఉంచింది. యెహోరాము+ రాజు కూతురైన యెహోషబతు (ఆమె యాజకుడైన యెహోయాదా+ భార్య, అహజ్యా సహోదరి) అతల్యాకు కనబడకుండా అతన్ని ఏదో విధంగా దాచిపెట్టింది. దాంతో అతల్యా అతన్ని చంపలేదు.+ 12  అతను ఆరు సంవత్సరాలు సత్యదేవుని మందిరంలో దాచబడి, వాళ్ల దగ్గర ఉన్నాడు. ఆ సమయంలో అతల్యా దేశాన్ని పరిపాలిస్తూ ఉంది.

అధస్సూచీలు

లేదా “అందరికన్నా చిన్న.”
లేదా “అనారోగ్యం పాలయ్యాడు.”
కొన్ని హీబ్రూ రాతప్రతుల్లో “అజర్యా.”
అక్ష., “కుమారుడైన.”
అక్ష., “రాజ్య విత్తనం.”