కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేను దేవునితో ఎలా స్నేహం చేయవచ్చు?

నేను దేవునితో ఎలా స్నేహం చేయవచ్చు?

35వ అధ్యాయం

నేను దేవునితో ఎలా స్నేహం చేయవచ్చు?

జీవితంలో ఎదురైన ఒక విషాద అనుభవం వల్ల జెరమీ యెహోవాతో సన్నిహిత బంధం ఉండడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాడు. అతను ఇలా చెప్తున్నాడు: “నాకు 12 ఏళ్లు ఉన్నప్పుడు మా నాన్న మమ్మల్ని విడిచి వెళ్లిపోయాడు. ఒకరోజు రాత్రి నేను మంచం మీద పడుకొని, మా నాన్నను తిరిగొచ్చేలా చేయమని బ్రతిమాలుతూ యెహోవాకు ప్రార్థన చేశాను.”

ఆ బాధలో ఉన్నప్పుడు జెరమీ బైబిలు చదవడం మొదలుపెట్టాడు. కీర్తన 10:14 చదివినప్పుడు అతను చాలా భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వచనం యెహోవా గురించి ఇలా చెప్తుంది: “నిస్సహాయుడు నీ వైపుకు తిరుగుతాడు; తండ్రిలేని పిల్లవాడికి సహాయం చేసేది నువ్వే.” జెరమీ ఇలా అంటున్నాడు: “యెహోవా నాతో మాట్లాడుతూ, ఆయన నాకు సహాయం చేస్తాడనీ, ఆయన నా తండ్రి అనీ నాకు చెప్తున్నట్లు నాకనిపించింది. ఆయనకన్నా మంచి తండ్రి నాకు ఎక్కడ దొరుకుతాడు?”

మీ పరిస్థితి జెరమీ లాంటిదైనా కాకపోయినా, మీరు తన స్నేహితులు అవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడని బైబిలు చెప్తుంది. నిజానికి బైబిలు ఇలా చెప్తుంది: “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.” (యాకోబు 4:8) ఆ మాటల గురించి ఒకసారి ఆలోచించండి: మీరు యెహోవా దేవున్ని చూడలేరు, ఏ రకంగానూ ఆయన మీలాంటి వ్యక్తి కాదు, అయినాసరే మిమ్మల్ని తనతో స్నేహం చేయమని ఆయన ఆహ్వానిస్తున్నాడు!

అయితే దేవునితో స్నేహం చేయాలంటే మీరు కొన్ని పనులు చేయాలి. ఉదాహరణకు, మీ ఇంట్లో ఒక మొక్క ఉందనుకోండి, అది దానంతటదే పెరగదని మీకు తెలుసు. అది చక్కగా పెరగాలంటే, మీరు దానికి నీళ్లు పోయాలి, అది పెరగడానికి అనువైన పరిస్థితులు కల్పించాలి. దేవునితో స్నేహం చేయాలన్నా కూడా అంతే. ఆయనతో మీ స్నేహం ఎదగాలంటే మీరు ఏం చేయాలి?

బైబిలు అధ్యయనం చాలా ముఖ్యం

స్నేహంలో సంభాషణ, అంటే మాట్లాడడం అలాగే వినడం ఉంటాయి. దేవునితో స్నేహం విషయంలో కూడా అది నిజం. బైబిలును చదవడం, పరిశీలించడం ద్వారా మనం దేవుడు చెప్పేది వింటాం.—కీర్తన 1:2, 3.

నిజమే, చదవడం అంటే మీకు అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. చాలామంది యౌవనులకు టీవీ చూడడం, ఆడుకోవడం లేదా స్నేహితులతో గడపడం అంటేనే ఇష్టం. కానీ మీరు దేవునితో స్నేహం చేయాలంటే వేరే దారి లేదు. మీరు ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా ఆయన చెప్పేది వినాలి.

అయితే కంగారుపడకండి. బైబిలు చదవడం భారంగా ఉండాల్సిన పని లేదు. మీకు చదవడం అంతగా ఇష్టం లేకపోయినా, బైబిలు చదవడంలో ఆనందించడం మీరు నేర్చుకోవచ్చు. దానికోసం మీరు ముందు చేయాల్సిన పని, బైబిలు చదవడానికి సమయాన్ని పక్కన పెట్టడం. లైయీస్‌ అనే ఒక అమ్మాయి ఇలా చెప్తుంది, “నేను ఒక షెడ్యూల్‌ వేసుకున్నాను, నేను రోజూ ఉదయం లేవగానే ముందుగా బైబిల్లో ఒక అధ్యాయం చదువుతాను.” 15 ఏళ్ల మరీయ వేరే సమయంలో బైబిలు చదువుతుంది, “నేను రోజూ రాత్రి నిద్రపోయే ముందు బైబిల్లో కొన్ని వచనాలు చదువుతాను” అని ఆమె అంటుంది.

మీరు కూడా బైబిలు చదవడం మొదలుపెట్టడానికి, “ మీ బైబిలును తెలుసుకోండి” అనే బాక్సు చూడండి. తర్వాత, మీరు ఏ సమయంలో దేవుని వాక్యాన్ని సుమారు 30 నిమిషాలు చదవగలరో కింద రాసుకోండి.

․․․․․

సమయం కేటాయించడం మొదటి అడుగు మాత్రమే. మీరు బైబిలు చదవడం మొదలుపెట్టాక, అది అన్నిసార్లూ అంత తేలికగా లేదని బహుశా గ్రహిస్తారు. 11 ఏళ్ల జెజ్రీల్‌ నిజాయితీగా ఇలా చెప్తున్నాడు, “బైబిల్లోని కొన్ని భాగాలను అర్థం చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి, అవి అంత ఆసక్తిగా ఉండవు.” కొన్నిసార్లు మీకు కూడా అలా అనిపించవచ్చు. అయినా చదవడం ఆపకండి. మీరు బైబిలు చదువుతున్న ప్రతీసారి మీ స్నేహితుడైన యెహోవా దేవుని మాటలు వినడానికి సమయం వెచ్చిస్తున్నారని గుర్తుంచుకోండి. నిజానికి, మీరెంత ఎక్కువగా ప్రయత్నం చేస్తే బైబిలు అధ్యయనం అంత ఆసక్తిగా అనిపిస్తుంది, అంత ఎక్కువ ప్రయోజనం పొందుతారు!

ప్రార్థన చాలా ముఖ్యం

ప్రార్థన మనం దేవునితో మాట్లాడే మార్గం. అది ఎంత అద్భుతమైన బహుమానమో ఒక్కసారి ఆలోచించండి! పగలైనా రాత్రైనా ఎప్పుడైనా మీరు యెహోవా దేవునితో మాట్లాడవచ్చు. ఆయన ఎప్పుడూ వినడానికి సిద్ధంగా ఉంటాడు. మరిముఖ్యంగా మీరు ఏం చెప్తారో వినాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే బైబిలు మిమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తుంది: “ప్రతీ విషయంలో ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, అలాగే కృతజ్ఞతలు చెప్పండి.”—ఫిలిప్పీయులు 4:6.

ఆ లేఖనం చెప్తున్నట్లు, మీరు చాలా విషయాల గురించి యెహోవాతో మాట్లాడవచ్చు. అందులో మీ సమస్యలు, ఆందోళనలు ఉండవచ్చు. అలాగే మీరు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్న విషయాలు ఉండవచ్చు. ఎంతైనా, మీ స్నేహితులు మీకు మంచి చేస్తే మీరు వాళ్లకు థాంక్స్‌ చెప్తారు కదా? యెహోవాకు కూడా అలాగే చెప్పవచ్చు, ఆయన ఏ స్నేహితుడూ ఎప్పటికీ చేయలేని మంచి మీకు చేశాడు.—కీర్తన 106:1.

యెహోవాకు మీరు వేటిగురించి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారో కింద రాయండి.

․․․․․

నిజమే అప్పుడప్పుడూ మీరు భయాలతో, ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవ్వవచ్చు. కీర్తన 55:22 ఇలా చెప్తుంది: “నీ భారం యెహోవా మీద వేయి, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ పడిపోనివ్వడు.”

మీరు ఆందోళన పడుతున్న ఏ విషయాల గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నారో కింద రాయండి.

․․․․․

సొంత అనుభవం

దేవునితో మీ స్నేహానికి సంబంధించిన ఇంకో అంశం మీద కూడా మీరు దృష్టిపెట్టాలి. కీర్తనకర్త దావీదు ఇలా రాశాడు: “యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి.” (కీర్తన 34:8) దావీదు 34వ కీర్తన రాస్తున్నప్పుడు, ఎంతో ఆందోళనలో ఉన్నాడు. తనను చంపాలని చూస్తున్న సౌలు రాజు దగ్గర నుండి ఆయన పారిపోతున్నాడు. అదే చాలా పెద్ద కష్టం అనుకుంటే, ఆయన ఆ తర్వాత తన శత్రువులైన ఫిలిష్తీయుల మధ్య తల దాచుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా చనిపోతాడని అనిపించే ఆ పరిస్థితిలో దావీదు తెలివితో పిచ్చివాడిలా నటించి తప్పించుకున్నాడు.—1 సమూయేలు 21:10-15.

తన సొంత తెలివితేటల వల్లే చావును తప్పించుకున్నానని దావీదు అనుకోలేదు. బదులుగా, దానికి కారణం యెహోవాయే అని ఆయన అన్నాడు. మనం పైన చూసిన కీర్తనలో ముందు దావీదు ఇలా రాశాడు: “నేను యెహోవా దగ్గర విచారణ చేశాను, ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను రక్షించాడు.” (కీర్తన 34:4) అలా దావీదు తన సొంత అనుభవాన్ని మనసులో ఉంచుకుని, “యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి” అని ఇతరులను ప్రోత్సహించాడు. *

యెహోవా మీ గురించి శ్రద్ధ తీసుకున్న అనుభవం ఏదైనా మీకు గుర్తొస్తుందా? వస్తే దాన్ని కింద రాయండి. సలహా: ఆ అనుభవం మరీ అద్భుతమైనదిగా ఉండక్కర్లేదు. అంతగా పట్టించుకోని రోజువారీ జీవితంలోని ఆశీర్వాదాల గురించి ఆలోచించండి.

․․․․․

బహుశా మీ అమ్మానాన్నలు మీకు బైబిలు గురించి నేర్పించి ఉండవచ్చు. అది నిజంగా ఒక ఆశీర్వాదం. కానీ మీరు దేవునితో సొంతగా స్నేహాన్ని వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇంకా అలా చేయడం మొదలుపెట్టకపోతే, ఈ ఆర్టికల్‌లో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టవచ్చు. యెహోవా మీ ప్రయత్నాలు సఫలం అయ్యేలా చేస్తాడు. బైబిలు ఇలా చెప్తుంది: “అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది; వెతుకుతూ ఉండండి, మీకు దొరుకుతుంది.”—మత్తయి 7:7.

[అధస్సూచి]

^ వేరే బైబిలు అనువాదాలు “రుచిచూసి తెలుసుకోండి” అనే మాటల్ని “మీ అంతట మీరే కనిపెట్టండి,” “మీ అంతట మీరే తెలుసుకోండి,” “అనుభవం ద్వారా మీరు తెలుసుకుంటారు” అని అనువదించాయి.—కంటెంపరరీ ఇంగ్లీష్‌ వర్షన్‌, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌, ద బైబిల్‌ ఇన్‌ బేసిక్‌ ఇంగ్లీష్‌.

మూల లేఖనం

దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.మత్తయి 5:3.

ఇలా చేయండి

రోజూ కేవలం ఐదు పేజీలు చదివితే, దాదాపు ఒక సంవత్సరంలోనే బైబిల్ని పూర్తిగా చదివేస్తారు.

మీకు తెలుసా . . .?

మీరు బైబిల్ని పరిశీలిస్తున్నారు, అందులోని సలహాలకు స్పందిస్తున్నారు అంటే యెహోవా వ్యక్తిగతంగా మీ మీద శ్రద్ధ చూపిస్తున్నాడని అర్థం.—యోహాను 6:44.

నేనిలా చేస్తాను!

బైబిలు చదువుతున్నప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందడానికి నేను ․․․․․

ఇంకా క్రమంగా ప్రార్థించడం కోసం నేను ․․․․․

ఈ విషయం గురించి మా అమ్మానాన్నల్ని ఏమి అడగాలని అనుకుంటున్నాను? ․․․․․

మీకు ఏమనిపిస్తుంది?

● బైబిలు చదవడాన్ని ఎక్కువగా ఆనందించాలంటే మీరేం చేయవచ్చు?

● అపరిపూర్ణ మనుషులు చేసే ప్రార్థనల్ని వినాలని యెహోవా ఎందుకు కోరుకుంటాడు?

● మీ ప్రార్థనల నాణ్యతను ఎలా పెంచుకోవచ్చు?

[చిత్రం]

“నా చిన్నప్పుడు నేను ఎప్పుడూ ఒకేలా ప్రార్థించేదాన్ని. ఇప్పుడు మాత్రం ప్రతీరోజు జరిగే మంచి అలాగే చెడు విషయాల గురించి ప్రార్థించడానికి ప్రయత్నిస్తున్నాను. ఏ రెండు రోజులూ ఒకేలా ఉండవు కాబట్టి, దానివల్ల రోజూ ఒకేలా ప్రార్థించకుండా ఉండగలుగుతున్నాను.”—ఈవ్‌

[బాక్సు/చిత్రం]

 మీ బైబిలును తెలుసుకోండి

1. బైబిల్లో మీరు చదవాలి అనుకుంటున్న భాగాన్ని ఎంచుకోండి. చదివే సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి తెలివి కోసం ప్రార్థించండి.

2. సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. సమయం తీసుకోండి. చదువుతున్నప్పుడు మీ ఊహాశక్తిని ఉపయోగించండి. మీరు అక్కడ ఉన్నట్టు ఊహించుకోండి. అక్కడ జరుగుతున్న విషయాల్ని చూడండి, పాత్రల మాటల్ని వినండి, వాసనలు పీల్చండి, ఆహారాన్ని రుచి చూడండి. సంఘటనను మీ మనసులో వీలైనంత స్పష్టంగా ఊహించుకోండి!

3. చదివిన దాని గురించి ఆలోచించండి. ఇలాంటి ప్రశ్నలు వేసుకోండి:

● యెహోవా ఎందుకు ఈ సమాచారాన్ని బైబిల్లో చేర్చాడు?

● ఇందులో ఎవర్ని ఆదర్శంగా తీసుకోవచ్చు? ఎవరు హెచ్చరికగా ఉన్నారు?

● ఈ భాగం నుండి నేను ఎలాంటి ఉపయోగపడే పాఠాలు నేర్చుకోవచ్చు?

● యెహోవా గురించి, ఆయన పనులు చేసే తీరు గురించి ఈ భాగం ఏం నేర్పిస్తుంది?

4. యెహోవాకు చిన్న ప్రార్థన చేయండి. బైబిల్లోని ఈ భాగం చదవడం వల్ల మీరు ఏమేం నేర్చుకున్నారో, వాటిని మీ జీవితంలో ఎలా పాటించాలని అనుకుంటున్నారో ఆయనకు చెప్పండి. ఆయన మీకిచ్చిన తన వాక్యం కోసం, అంటే పవిత్ర బైబిలు కోసం ఎప్పుడూ యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి!

[చిత్రం]

“నీ వాక్యం నా పాదానికి దీపం, నా త్రోవకు వెలుగు.”—కీర్తన 119:105.

[బాక్సు/చిత్రం]

ముఖ్యమైన పనులు ముందు చేయండి

మీరు చాలా బిజీగా ఉన్నారని, ప్రార్థించడానికి గానీ బైబిలు చదవడానికి గానీ సమయం దొరకట్లేదని మీకనిపిస్తుందా? అది తరచూ, మీరు వేటిని ముందు చేయాలని నిర్ణయించుకుంటారు అనేదాన్ని బట్టే ఉంటుంది.

ఇలా చేసి చూడండి: ఒక పాత్రను తీసుకొని అందులో పెద్దపెద్ద రాళ్లు వేయండి. తర్వాత దాన్ని ఇసుకతో నింపండి. ఇప్పుడు మీ పాత్ర రాళ్లతో, అలాగే ఇసుకతో నిండివుంది.

ఇప్పుడు పాత్రను ఖాళీ చేయండి. ఇసుకను, రాళ్లను దగ్గర పెట్టుకొని ముందు చేసినదానికి భిన్నంగా చేయండి. అంటే, ముందు పాత్రలో ఇసుక వేసి తర్వాత రాళ్లు వేయడానికి ప్రయత్నించండి. రాళ్లకు చోటు సరిపోవట్లేదా? ఎందుకంటే, ఈసారి మీరు పాత్రలో ముందుగా ఇసుక వేశారు.

దీన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోమని’ బైబిలు చెప్తుంది. (ఫిలిప్పీయులు 1:10) మీరు సరదా కార్యకలాపాల లాంటి చిన్నచిన్న విషయాలకు మొదటి స్థానం ఇస్తే, ముఖ్యమైన విషయాలకు అంటే దేవుని సేవకు సంబంధించిన విషయాలకు మీ జీవితంలో ఎప్పటికీ సరిపడా సమయం ఉండదు. కానీ బైబిలు చెప్పినట్టు చేస్తే, దేవుని సేవకు సంబంధించిన విషయాల కోసం అలాగే కొన్ని సరదా కార్యకలాపాల కోసం కూడా మీ దగ్గర సమయం ఉందని మీరే గుర్తిస్తారు. అంతా, మీరు పాత్రలో ముందు వేటిని వేస్తారనే దాన్ని బట్టే ఉంటుంది!

[చిత్రం]

ఇంట్లో పెరిగే మొక్కలాగే, దేవునితో మన స్నేహం ఎదగాలంటే కృషి చేయాలి