కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి దగ్గరవ్వండి

దేవుడు “పక్షపాతి కాడు”

దేవుడు “పక్షపాతి కాడు”

మీరెప్పుడైనా వివక్షకు గురయ్యారా? మీ రంగును బట్టి, మీ జాతిని బట్టి, మీ ఆర్థికస్థితిని బట్టి ఇతరులు ఎప్పుడైనా మీ అభ్యర్థనను తోసిపుచ్చారా? ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారా? మిమ్మల్ని చిన్నచూపు చూశారా? చాలామందికి అలాగే జరిగింది. అయితే ఓ మంచి వార్త ఏమిటంటే, ఇలాంటి అన్యాయాలు చేయడం మనుషులకు సర్వసాధారణమే అయినా, దేవుడు మాత్రం ముమ్మాటికీ అలా చేయడు. “దేవుడు పక్షపాతి కాడు” అని అపొస్తలుడైన పేతురు పూర్తి నమ్మకంతో చెప్పాడు.—అపొస్తలుల కార్యములు 10:34, 35 చదవండి.

చాలా అసాధారణ పరిస్థితుల్లో, అంటే యూదుడుకాని కొర్నేలీ ఇంట్లో ఉన్నప్పుడు పేతురు ఆ మాటలను ప్రస్తావించాడు. అన్యులు అపవిత్రులని, వాళ్లతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని యూదులు భావించిన కాలంలో పేతురు జీవించాడు. మరైతే, యూదుడైన పేతురు కొర్నేలీ ఇంట్లో ఎందుకు ఉన్నట్టు? ఒక్కమాటలో చెప్పాలంటే, యెహోవా దేవుడే అలా ఏర్పాటు చేశాడు. ఓ దర్శనంలో దేవుడు పేతురుకు ఇలా చెప్పాడు: “దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైనవాటినిగా ఎంచవద్దు.” పేతురుకు తెలియని విషయమేమిటంటే, అంతకుముందు రోజే కొర్నేలీకి ఓ దర్శనంలో దేవదూత కనిపించి పేతురును తన ఇంటికి పిలిపించుకోమని చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 10:1-15) విషయాన్ని యెహోవాయే నడిపించాడని అర్థం చేసుకున్న పేతురు యెహోవా గురించి మాట్లాడకుండా ఉండలేకపోయాడు.

“దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను” అని పేతురు చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 10:34) “పక్షపాతి” అని అనువదించిన గ్రీకు పదానికి “ముఖాలను లక్ష్యపెట్టేవాడు” అని అర్థం. (కింగ్డమ్‌ ఇంటర్లీనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద గ్రీక్‌ స్క్రిప్చర్స్‌) ఓ విద్వాంసుడు ఆ పదం గురించి మాట్లాడుతూ, “కేసులోని నిజానిజాలను బట్టి కాక, ఒక వ్యక్తి ముఖం చూసి తనకు నచ్చితే అతనికి అనుకూలంగా, నచ్చకపోతే వ్యతిరేకంగా తీర్పునిచ్చే ఒక న్యాయమూర్తికి” అది సరిపోతుందని అన్నాడు. జాతి, దేశం, ఆర్థికస్థితి, రంగు, రూపం వంటి ఇతర కారణాల్ని బట్టి దేవుడు, ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడడు.

నిజానికి, దేవుడు మన హృదయంలో ఏముందో చూస్తాడు. (1 సమూయేలు 16:7; సామెతలు 21:2) ఆ తర్వాత పేతురు, “ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును” అని చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 10:35) దేవునికి భయపడడం అంటే ఆయనను గౌరవించడం, ఘనపర్చడం, నమ్మడం, ఆయనకు నచ్చని వాటికి దూరంగా ఉండడం. నీతిగా నడుచుకోవడం అంటే దేవునికి ఇష్టమైన వాటిని మనస్ఫూర్తిగా చేయడం. తనపట్ల ఉన్న భయభక్తుల వల్ల సరైన వాటిని చేసే వ్యక్తిని చూసి యెహోవా ఎంతో సంతోషిస్తాడు.—ద్వితీయోపదేశకాండము 10:12, 13.

యెహోవా పరలోకం నుండి మనుషుల్ని చూసినప్పుడు, ఆయనకు ఒకేఒక్క జాతి కనిపిస్తుంది, అదే మానవజాతి

మీరెప్పుడైనా వివక్ష లేదా పక్షపాతం వల్ల బాధపడివుంటే, దేవుని గురించి పేతురు చెప్పిన మాటల్లో మీకు ప్రోత్సాహం లభిస్తుంది. యెహోవా అన్ని దేశాల ప్రజలను సత్యారాధన వైపు నడిపిస్తున్నాడు. (యోహాను 6:44; అపొస్తలుల కార్యములు 17:26, 27) తన సేవకులు ఏ జాతి వాళ్లైనా, ఏ దేశస్థులైనా, ధనికులైనా, పేదలైనా వాళ్ల విన్నపాలను ఆయన వింటాడు, జవాబిస్తాడు. (1 రాజులు 8:41-43) ఒక విషయం మాత్రం మనం గట్టిగా నమ్మవచ్చు, యెహోవా పరలోకం నుండి మనుషుల్ని చూసినప్పుడు, ఆయనకు ఒకేఒక్క జాతి కనిపిస్తుంది, అదే మానవజాతి. పక్షపాతం ఏ మాత్రం లేని అలాంటి దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనిపిస్తోందా? (w13-E 06/01)

సెప్టెంబరు నెలలో ఈ బైబిలు భాగం చదవండి:

1 కొరింథీయులు 1గలతీయులు 6 అధ్యాయాలు