కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముఖపత్ర అంశం

దేవుడు క్రూరుడని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు?

దేవుడు క్రూరుడని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు?

ఈ పత్రిక మీదున్న ప్రశ్న చూసి మీరు అవాక్కయ్యారా? కొంతమందికి అలాగే అనిపిస్తుంది. చాలామందైతే దేవుడు క్రూరుడా కాదా అనే సందిగ్ధంలో ఉంటారు లేదా క్రూరుడనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఎందుకు?

ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రాణాలతో బయటపడిన కొంతమంది ఇలా అడుగుతారు: “ఇలాంటి వాటిని దేవుడు ఎందుకు అడ్డుకోవడం లేదు? ఆయన ఇవేమి పట్టించుకోడా? ఆయన క్రూరుడా?”

బైబిలు చదువుతున్నప్పుడు కొంతమందికి ఇలాంటి ప్రశ్నలే తలెత్తాయి. నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం వంటి వాటిగురించి చదివినప్పుడు, ‘దేవుడు ప్రేమగలవాడైతే వాళ్లందరినీ ఎందుకు నాశనం చేశాడు? ఆయన క్రూరుడా?’ అని వాళ్లు అనుకుంటారు.

మీకు కూడా అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంటుందా? దేవుడు క్రూరుడని అనుకునేవాళ్లకు ఏమి చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అలాగైతే, ముందు ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం మంచిది.

క్రూరత్వాన్ని మనం ఎందుకు ఇష్టపడం?

ఒక్కమాటలో చెప్పాలంటే, మంచిచెడుల విచక్షణ మనకుంది కాబట్టే మనం క్రూరత్వాన్ని ఇష్టపడం. ఈ విషయంలో మనకూ జంతువులకూ చాలా తేడా ఉంది. దేవుడు మనల్ని ‘తన స్వరూపంలో’ సృష్టించాడు. (ఆదికాండము 1:27) దానర్థం ఏమిటి? ఆయనకున్న లక్షణాలు, నైతిక విలువలు, మంచిచెడుల విచక్షణ వంటివి చూపించగలిగే సామర్థ్యాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి, దేవుడిచ్చిన సామర్థ్యం వల్ల మంచేదో చెడేదో గుర్తించగలుగుతున్న మనమే క్రూరత్వాన్ని అసహ్యించుకుంటుంటే దేవుడు కూడా దాన్ని అసహ్యించుకుంటాడని అర్థమవుతుంది కదా!

బైబిలు కూడా అదే విషయాన్ని చెబుతోంది. ‘మీ మార్గాల కంటె నా మార్గాలు, మీ తలంపులకంటె నా తలంపులు ఎత్తుగా ఉన్నవి’ అని దేవుడు భరోసా ఇస్తున్నాడు. (యెషయా 55:9) దేవుడు క్రూరుడని మనం అంటుంటే యెహోవా చెప్పినదానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు కాదా? ఆయన మార్గాలకంటే మన మార్గాలే ఎత్తుగా ఉన్నాయని ఆలోచిస్తునట్లు కాదా? అలాంటి అభిప్రాయానికి వచ్చే ముందు వాస్తవాలను పరిశీలించడం మంచిది. నిజానికి, మనం తెలుసుకోవాల్సింది ‘దేవుడు క్రూరుడా, కాదా?’ అని కాదుగానీ, ‘కొన్నిసార్లు ఆయన పనులు క్రూరమైనవిగా ఎందుకు అనిపిస్తాయి?’ అన్నదే. దానికోసం ముందుగా, “క్రూరత్వం” అంటే ఏమిటో అర్థం చేసుకుందాం.

మనం ఒకరిని “క్రూరుడు” అంటున్నామంటే అతని ఉద్దేశాల్లోనే తప్పుందని అంటున్నాం. ఇతరుల బాధల్ని పట్టించుకోనివాళ్లు, వాళ్ల కష్టాలు చూసి ఆనందపడేవాళ్లే క్రూరులు. ఉదాహరణకు, తన కొడుకు బాధపడుతుంటే చూసి ఆనందించాలనే ఉద్దేశంతోనే అతనిని శిక్షించే తండ్రిని క్రూరుడు అనవచ్చు. అయితే, కొడుకును సరైన దారిలో పెట్టాలని, కాపాడాలని అతనిని శిక్షించే తండ్రిని క్రూరుడు అంటామా? ఎదుటివాళ్లు ఫలాని విధంగా ఎందుకు ప్రవర్తించారో మనకు అన్నిసార్లు తెలీదు కాబట్టి, వాళ్ల ఉద్దేశాల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది.

ఈ రోజుల్లో జరుగుతున్న ప్రకృతి విపత్తులు చూసినప్పుడు, దేవుడు ప్రజల్ని శిక్షించిన సందర్భాల గురించి బైబిల్లో చదివినప్పుడు దేవుడు క్రూరుడని కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు మనం ఆ రెండు విషయాలు పరిశీలించి, వాస్తవాలు దేన్ని నిరూపిస్తున్నాయో చూద్దాం. (w13-E 05/01)