మీకు దేవుని మీద నమ్మకం ఉందా?

మీకు దేవుని మీద నమ్మకం ఉందా?

మీరు ఎంతగానో అభిమానించే ఓ స్నేహితుడు ఉన్నాడనుకోండి. అతను ఫలాని పని ఎందుకు చేశాడో మీకు అర్థం కావడం లేదు. మీ చుట్టూ ఉన్నవాళ్లు మీ స్నేహితుడు చేసినదాన్ని, అతని ఉద్దేశాల్ని తప్పుపడుతూ అతణ్ణి క్రూరుడని నిందిస్తున్నారు. మీరు తొందరపడి వాళ్లు చెప్పేది నమ్ముతారా, మీ స్నేహితుడు చెప్పేది కూడా వినాలనుకుంటారా? వాస్తవాల్ని వివరించడానికి మీ స్నేహితుడు దగ్గర్లో లేకపోతే, అతను సదుద్దేశంతోనే ఆ పని చేసివుంటాడనే నమ్మకంతో మీరు వేచి చూస్తారా?

ఆ ప్రశ్నలకు జవాబు చెప్పేముందు మరికొన్ని వివరాల గురించి ఆలోచించడం మంచిదని మీకు అనిపించవచ్చు. మీరు కాసేపు ఆగి, ‘ఈ స్నేహితుడి గురించి నాకు ఎంత బాగా తెలుసు? అసలు నేను అతణ్ణి అభిమానించడానికి కారణాలేంటి?’ అని ఆలోచించవచ్చు. అలా ఆలోచించడం మంచిదే. అలాంటప్పుడు, దేవుడు క్రూరుడనే అభిప్రాయం ఎంత వరకు వాస్తవమో నిర్ధారించుకునే ముందు కూడా ఇవన్నీ ఆలోచించవద్దా?

దేవుడు కొన్ని పనులు ఎందుకు చేశాడో, కొన్నిటిని ఎందుకు అడ్డుకోవడం లేదో అర్థం చేసుకోవడం మీకు కష్టంగా అనిపించవచ్చు. చాలామంది దేవుడు క్రూరుడని, ఆయన ఉద్దేశాలు తప్పని చెబుతూ మీరు కూడా అలాగే ఆలోచించేలా తమ అభిప్రాయాల్ని మీ మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు. మరిన్ని వివరాలు తెలిసేవరకు, దేవుడు సదుద్దేశంతోనే ఆ పనులు చేసుంటాడని నమ్మడం సమంజసం కాదా? మీకు దేవుని గురించి ఎంత బాగా తెలుసనేదానిబట్టే మీ సమాధానం ఉంటుంది. అందుకే, ‘దేవుడు నాకు ఎలాంటి స్నేహితుడు?’ అని ఆలోచించండి.

మీరు జీవితంలో చాలా కష్టాలు అనుభవించివుంటే, దేవుడు అసలు మీకు స్నేహితుడే కాడని మీరు అనొచ్చు. ఒక్క క్షణం ఆలోచించండి. దేవుని వల్ల మీకు కష్టాలు వచ్చాయా, దీవెనలు వచ్చాయా? ఇంతకు ముందు చూసినట్లు “ఈ లోకాధికారి” యెహోవా కాదు, సాతాను. (యోహాను 12:31) కాబట్టి ఈ లోకంలోని ఎన్నో అన్యాయాలకు, బాధలకు సాతానే కారణం. అంతేకాదు, మనలోని లోపాలు, అనుకోకుండా జరిగే సంఘటనలు కూడా చాలా సమస్యలకు కారణాలని మీకు అనిపించడం లేదా?

దేవుని వల్ల మీకు కష్టాలు వచ్చాయా, దీవెనలు వచ్చాయా?

మరైతే, దేవుడు వేటికి కారకుడు? దేవుడు ‘భూమ్యాకాశములను సృజించాడని’ బైబిలు చెబుతోంది; “ఆశ్చర్యమును” పుట్టించే మన శరీరాల్ని కూడా ఆయనే చేశాడు, యెహోవా ‘మీ ప్రాణాన్ని తన చేతిలో ఉంచుకొన్న దేవుడు’ అని బైబిలు చెబుతోంది. (కీర్తన 124:8; 139:14; దానియేలు 5:23, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) అంటే దానర్థం ఏమిటి?

మన సృష్టికర్త దయవల్లే మనం ప్రాణాలతో ఉన్నామని, ఇంకా చెప్పాలంటే మనుగడ సాగిస్తున్నామని అర్థం. (అపొస్తలుల కార్యములు 17:28) జీవితమనే బహుమానం; చూట్టూవున్న అందమైన ప్రపంచం; ప్రేమాస్నేహాల మాధుర్యం; రంగు, రుచి, వాసన, శబ్దం, స్పర్శ వంటివాటిని గ్రహించినప్పుడు పొందే ఆనందం ఇవన్నీ దేవుని నుండి వచ్చిన బహుమతులేనని దానర్థం. (యాకోబు 1:17) అంతటి గొప్ప దీవెనలు ఇచ్చిన దేవుడు మన గౌరవాన్ని, నమ్మకాన్ని పొందడానికి అన్నివిధాల అర్హుడైన స్నేహితుడని మీకు అనిపించడం లేదా?

నిజమే, దేవుని మీద నమ్మకం ఉంచడం మీకు కొన్నిసార్లు కష్టం అనిపించవచ్చు. ఆయన మీద నమ్మకం పెట్టుకునేంత బాగా ఆయన గురించి మీకింకా తెలియదని మీకు అనిపించవచ్చు. అదేమీ తప్పుకాదు. దేవుడు క్రూరుడని కొంతమంది అనుకోవడానికి గల ప్రతీ కారణాన్ని ఈ కొన్ని పేజీల్లో చర్చించడం వీలుకాదు. అయితే, దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిదని మీకు అనిపించడం లేదా? a అలా చేస్తే మీరు దేవుని గురించిన సత్యాన్ని తప్పకుండా తెలుసుకుంటారనే నమ్మకం మాకుంది. ఆయన క్రూరుడా? కానేకాదు, నిజానికి “దేవుడు ప్రేమాస్వరూపి.”—1 యోహాను 4:8. (w13-E 05/01)

a ఉదాహరణకు, దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదనే విషయం గురించి మరింత సమాచారం కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 11వ అధ్యాయం చూడండి.