కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రకృతి విపత్తులు దేవుడు క్రూరుడని చెప్పడానికి నిదర్శనాలా?

ప్రకృతి విపత్తులు దేవుడు క్రూరుడని చెప్పడానికి నిదర్శనాలా?

కొంతమంది ఇలా అంటారు: “లోకాన్ని పరిపాలించేది దేవుడే కాబట్టి, ప్రకృతి విపత్తులకు ఆయనే కారణం. అంటే ఆయన తప్పకుండా క్రూరుడే!”

బైబిలు ఇలా చెబుతోంది: “లోకమంతయు దుష్టుని యందున్నది.” (1 యోహాను 5:19) ఎవరు ఈ “దుష్టుడు”? బైబిలు అతనిని సాతాను అంటోంది. (మత్తయి 13:19; మార్కు 4:15) ఆ విషయం నమ్మలేకపోతున్నారా? అయితే ఒకసారి ఆలోచించండి. ఈ లోకం సాతాను గుప్పిట్లో ఉంది కాబట్టి, మనుష్యులు తనలాగే స్వార్థంతో, దురాశతో, ముందుచూపు లేకుండా జీవించేలా వాళ్లను నడిపిస్తున్నాడు. మనిషి తన పర్యావరణాన్ని ఎందుకు పాడుచే సుకుంటున్నాడో దీన్నిబట్టి స్పష్టంగా అర్థమవుతుంది కదా? ప్రకృతి విపత్తులు, వాటి తీవ్రత, వాటివల్ల మనుష్యులకు జరిగే నష్టం పెరిగిపోవడానికి పర్యావరణాన్ని అస్తవ్యస్తం చేసుకోవడమే కారణమని ఎందరో నిపుణులు చెబుతున్నారు.

సాతాను వల్ల ఇంత చెడు జరుగుతుంటే దేవుడు ఎందుకు అడ్డుకోవడం లేదు? దానికి జవాబు కోసం, మొట్టమొదటి మనుషులు దేవుని మీద తిరుగుబాటు చేసిన సందర్భం గురించి తెలుసుకోవాలి. అప్పటి నుండి చాలామంది అదే బాటలో నడుస్తూ దేవుని పరిపాలనకు ఎదురుతిరిగారు. అలా మనుషులు దేవుని శత్రువైన సాతాను చెప్పుచేతల్లోకి వెళ్లారు. అందుకే యేసుక్రీస్తు, సాతానును “లోకాధికారి” అన్నాడు. (యోహాను 14:30) మరైతే, ఎప్పటికీ సాతానే పరిపాలిస్తూ ఉంటాడా? లేదు!

యెహోవా a దేవుడు, సాతానువల్ల కలుగుతున్న బాధలు పట్టించుకోనంత కఠినుడు కాడు. ఇంకా చెప్పాలంటే, మనుషులు కష్టాలు పడుతుంటే దేవుడు ఎంతో బాధపడతాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు పడిన కష్టాలు చూసినప్పుడు దేవునికి ఇలా అనిపించిందని బైబిలు చెబుతోంది: “వారి బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు.” (యెషయా 63:9, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) సాతాను పరిపాలనకు త్వరలోనే ముగింపు పలకడానికి దేవుడు ఎంతో దయగా అన్ని ఏర్పాట్లు చేశాడు! నీతిన్యాయాలతో కలకాలం పరిపాలించే రాజుగా తన కుమారుడైన యేసుక్రీస్తును నియమించాడు.

ఇది మీరెందుకు తెలుసుకోవాలి? సాతాను పాలన మనుషులను ప్రకృతి విపత్తుల నుండి కాపాడలేకపోయింది, కానీ యేసు పరిపాలన తప్పక కాపాడుతుంది. ఒక సందర్భంలో యేసు తన శిష్యులను భయంకరమైన తుఫాను నుండి కాపాడాడు. అప్పుడు ఆయన “గాలిని గద్దించి, నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను” అని బైబిలు చెబుతోంది. అది చూసిన శిష్యులు, ‘ఈయన ఎవరో, గాలి, సముద్రం ఈయనకు లోబడుతున్నాయని ఒకనితో ఒకడు చెప్పు కున్నారు.’ (మార్కు 4:37-41) యేసు తన పరిపాలనలో, విధే యులైన మనుషులందరినీ తప్పకుండా కాపాడతాడని ఈ సంఘటన చూపించడం లేదా?—దానియేలు 7:13, 14. (w13-E 05/01)

a దేవుని పేరు యెహోవా అని బైబిలు చెబుతోంది.