కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసే ప్రధానదూత అయిన మిఖాయేలా?

యేసే ప్రధానదూత అయిన మిఖాయేలా?

మా పాఠకుల ప్రశ్న

యేసే ప్రధానదూత అయిన మిఖాయేలా?

▪ ఈ ప్రశ్నకు ఒక్క మాటలో జవాబు చెప్పాలంటే, అవును. ఒకే వ్యక్తిని ఒకటికన్నా ఎక్కువ పేర్లతో పిలిచే పద్ధతి చాలా సంస్కృతుల్లో ఉంది. బైబిల్లో ప్రస్తావించబడిన వ్యక్తులకు కూడా అలా వేర్వేరు పేర్లు ఉండేవి. ఉదాహరణకు, పూర్వీకుడైన యాకోబుకు ఇశ్రాయేలు అనే పేరు కూడా పెట్టబడింది. (ఆదికాండము 35:10) అపొస్తలుడైన పేతురును సుమెయోను, సీమోను, పేతురు, కేఫా, సీమోను పేతురు అని 5 రకాలుగా పిలిచేవారు. (మత్తయి 10:2; 16:16; యోహాను 1:42; అపొస్తలుల కార్యములు 15:6, 14) మిఖాయేలు అన్నది యేసుకున్న మరో పేరని ఖచ్చితంగా ఎలా చెప్పగలం? బైబిల్లో ఎలాంటి రుజువులు ఉన్నాయో చూడండి.

బైబిల్లో శక్తివంతమైన ఆత్మప్రాణి అయిన మిఖాయేలు గురించి ఐదు సందర్భాల్లో ఉంది. దానియేలు పుస్తకంలో మూడుసార్లు ఆ పదం కనిపిస్తుంది. దానియేలు 10:13, 21 వచనాల్లో, దేవుడు పంపించిన ఒక దేవదూతను “ప్రధానాధిపతులలో . . . ఒకడు,” “మీ [ప్రజల] యధిపతి” అని పిలువబడిన మిఖాయేలు వచ్చి కాపాడాడని ఉంది. తర్వాత దానియేలు 12:1 వ వచనం, “జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు” అంత్యకాలంలో వస్తాడని చెబుతోంది.

ప్రకటన 12:7లో మిఖాయేలు గురించి మరోసారి ఉంది. ‘మిఖాయేలు, అతని దూతలు’ ఒక ప్రాముఖ్యమైన యుద్ధం చేసి, అపవాదినీ అతని దుష్టదూతలనూ ఓడించి పరలోకం నుండి వెళ్లగొట్టినట్లు అక్కడ వివరిస్తుంది.

పైన మనం చూసిన సందర్భాలన్నిటిలో మిఖాయేలు దేవుని ప్రజల తరఫున యుద్ధం చేస్తూ వారిని కాపాడే యోధుడైన దేవదూతలా వర్ణించబడ్డాడు. ఆయన యెహోవా బద్ధ శత్రువైన సాతానుతో తలపడుతున్నట్లు కూడా వర్ణించబడ్డాడు.

యూదా 9వ వచనం మిఖాయేలును “ప్రధానదూత” అని పిలుస్తుంది. “ప్రధానదూత” అనే పదం బైబిల్లో ఎప్పుడూ బహువచనంలో ఉపయోగించబడలేదు. ప్రధానదూత గురించి చెబుతున్న లేఖనం ఇంకా ఒక్కటి మాత్రమే మిగిలింది, అది 1 థెస్సలొనీకయులు 4:16 వ వచనం. అక్కడ పౌలు పునరుత్థానం చేయబడిన యేసు గురించి చెబుతూ ఇలా అన్నాడు, “ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను [‘స్వరంతోను,’ NW], దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు [యేసు] దిగివచ్చును.” కాబట్టి యేసుక్రీస్తే ప్రధానదూతని దీన్నిబట్టి తెలుస్తుంది.

ఇప్పటివరకు మనం పరిశీలించిన వాటినిబట్టి ఏమి చెప్పవచ్చు? యేసుక్రీస్తే ప్రధానదూత అయిన మిఖాయేలు అని చెప్పవచ్చు. ఈ రెండు పేర్లు, అంటే మిఖాయేలు (“దేవుని వంటివాడు ఎవడు?” అని అర్థం), యేసు (“యెహోవాయే రక్షణ” అని అర్థం) అనే పేర్లు యెహోవా సర్వాధిపత్యం పక్షాన వాదించే ముఖ్యన్యాయవాదిగా ఆయనకు ఎలాంటి స్థానం ఉందో చూపిస్తున్నాయి. “దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను” అని ఫిలిప్పీయులు 2:11 చెబుతోంది.

యేసు మానవునిగా పుట్టకముందే ఉనికిలో ఉన్నాడని అర్థంచేసుకోవడం ప్రాముఖ్యం. యేసు పరిచర్య చేస్తున్నప్పుడు, తాను మానవునిగా పుట్టకముందే ఉనికిలో ఉన్నట్లు చాలాసార్లు అన్నాడు.—యోహాను 3:13; 8:23, 58.

కాబట్టి యేసే మానవునిగా పుట్టకముందు ప్రధానదూత అయిన మిఖాయేలు. పునరుత్థానం చేయబడి, పరలోకానికి తిరిగి వెళ్లిన తర్వాత యేసు మళ్లీ “తండ్రియైన దేవుని మహిమార్థమై” ప్రధానదూత అయిన మిఖాయేలుగా సేవ చేయడం మొదలుపెట్టాడు.—ఫిలిప్పీయులు 2:11. (w10-E 04/01)