కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని గురించి యేసు ఏమి బోధించాడు?

దేవుని గురించి యేసు ఏమి బోధించాడు?

దేవుని గురించి యేసు ఏమి బోధించాడు?

‘కుమారునికి మాత్రమే తండ్రి ఎవరో తెలుసు. అంతేగాక కుమారుడు తన ఇష్టప్రకారం తండ్రిని వెల్లడిచేసిన వారికి కూడా తండ్రి ఎవరో తెలుసు.’—లూకా 10:22, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

దేవుని అద్వితీయ కుమారుడు మానవునిగా పుట్టకముందు లెక్కలేనన్ని యుగాలు తన తండ్రితో సన్నిహితంగా గడిపాడు. (కొలొస్సయులు 1:15) అందుకే ఆయనకు తన తండ్రి ఆలోచనలు, ఇష్టాయిష్టాలు, వ్యవహరించే తీరు తెలుసు. ఆయన మానవునిగా ఈ భూమ్మీదకు వచ్చినప్పుడు ఉత్సాహంగా తన తండ్రి గురించిన సత్యాన్ని తెలియజేశాడు. దేవుని కుమారుడు చెప్పేది వినడం ద్వారా మనం దేవుని గురించి ఎంతో తెలుసుకోవచ్చు.

దేవుని పేరు: దేవుని పేరుకు, అంటే యెహోవా అనే పేరుకు యేసు ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు. ఇతరులు తన తండ్రి పేరు తెలుసుకోవాలని, దానిని ఉపయోగించాలని ఈ ప్రియ కుమారుడు కోరుకున్నాడు. అసలు యేసు పేరుకే, “యెహోవాయే రక్షణ” అని అర్థం. యేసు, తాను చనిపోయే ముందు రాత్రి యెహోవాకు ప్రార్థన చేస్తూ, “నీ నామమును తెలియజేసితిని” అని అనగలిగాడు. (యోహాను 17:26) దేవుని పేరును యేసు ఉపయోగించాడంటే, ఇతరులకు దాని గురించి చెప్పాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎంతైనా, యేసు బోధను వింటున్నవారు కనీసం యెహోవా పేరు, దానికున్న అర్థం తెలియకుండా ఆయన గురించిన వాస్తవాన్ని ఎలా గ్రహించగలుగుతారు? a

దేవుని గొప్ప ప్రేమ: యేసు ఒకసారి దేవునికి ప్రార్థన చేస్తూ, “తండ్రీ . . . జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి” అన్నాడు. (యోహాను 17:24) యేసు, పరలోకంలో ఉన్నప్పుడు దేవుని ప్రేమను స్వయంగా చవిచూడడం వల్ల, భూమ్మీదకు వచ్చినప్పుడు ఆ ప్రేమను ఎంత రమ్యంగా, ఎన్ని విధాలుగా చూపించవచ్చో తెలియజేయడానికి ప్రయత్నించాడు.

యెహోవా ప్రేమ అవధుల్లేనిది అని యేసు చూపించాడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని ఆయన అన్నాడు. (యోహాను 3:16) దేవుడు లోకప్రజలందరిని ఎంతగా ప్రేమించాడంటే నమ్మకస్థులను పాపం, మరణం అనే బంధనాల నుండి విడిపించి, భవిష్యత్తులో నిత్యం జీవించే అవకాశాన్ని కల్పించడానికి తన ప్రియాతిప్రియమైన కుమారుణ్ణి ఇచ్చేశాడు. అలాంటి గొప్ప ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఎంత విశిష్టమైనదో మన ఊహకు కూడా అందదు.—రోమీయులు 8:38, 39.

యేసు ఎంతో ఓదార్పునిచ్చే ఒక వాస్తవాన్ని నొక్కి చెప్పాడు. అదేమిటంటే, యెహోవా తన ఆరాధకుల్లో ప్రతీ ఒక్కరినీ ఎంతో ప్రేమిస్తాడు. యెహోవా గొఱ్ఱెల కాపరి వంటివాడని యేసు బోధించాడు. ఒక గొఱ్ఱెల కాపరికి తన గొఱ్ఱెలలో ప్రతీ ఒక్కటి ప్రత్యేకమైనది, విలువైనది. (మత్తయి 18:11-14) యెహోవాకు తెలియకుండా ఒక పిచ్చుక కూడా నేలరాలదని యేసు అన్నాడు. ‘మీ తలవెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి’ అని కూడా యేసు చెప్పాడు. (మత్తయి 10:29-31) ఎక్కడో ఓ గూటిలో ఉండాల్సిన పిచ్చుక లేకపోతేనే తెలుసుకోగల సామర్థ్యం యెహోవాకు ఉంటే తన ఆరాధకుల్లో ప్రతీ ఒక్కరినీ గమనిస్తూ, వారి యోగక్షేమాల గురించి ఇంకెంతగా పట్టించుకోవాలి? మన తల వెంట్రుకలలో ప్రతీ ఒక్కదానిని గమనించి, వాటిని లెక్కపెట్టగలిగితే మన జీవితంలోని ఏ విషయమైనా అంటే మన అవసరాలు, మన కష్టాలు, మన బాధలు ఆయనకు తెలియకుండా ఉంటాయా?

పరలోక తండ్రి: మనం దీనికి ముందు ఆర్టికల్‌లో చూసినట్లు, దేవుని అద్వితీయ కుమారుడు యేసు. అందుకే ఈ ప్రియ కుమారుడు, యెహోవాను ఎంతో తరచుగా “తండ్రి” అని సంబోధించాడు, ఆయన గురించి చెబుతున్నప్పుడు కూడా అలానే అన్నాడు. ఆయన దేవాలయంలో ఉన్నప్పుడు, 12 ఏళ్ల వయసులోనే యెహోవా గురించి మాట్లాడుతూ “నా తండ్రి” అన్నాడు. యేసు పలికినట్లు బైబిల్లో రాయబడ్డ మొట్టమొదటి మాటలు ఇవే. (లూకా 2:49) “తండ్రి” అనే పదం బైబిల్లోని నాలుగు సువార్తల్లో దాదాపు 190 సార్లు కనిపిస్తుంది. యెహోవా గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు “మీ తండ్రి,” “మా తండ్రి,” “నా తండ్రి” అని వివిధ రకాలుగా అన్నాడు. (మత్తయి 5:16; 6:9; 7:21) దేవుణ్ణి అలా పిలవడం ద్వారా, పాపులూ అపరిపూర్ణులూ అయిన మానవులు ప్రేమ, నమ్మకం ఆధారంగా యెహోవాకు దగ్గరవ్వడం సాధ్యమేనని యేసు చూపించాడు.

కనికరంగలవాడు, క్షమించడానికి ఇష్టపడేవాడు: అపరిపూర్ణ మానవులకు యెహోవా చూపించే అపారమైన కనికరం అవసరమని యేసుకు తెలుసు. యేసు తప్పిపోయిన కుమారుని గురించి చెప్పిన కథలో, యెహోవా పశ్చాత్తాపం చూపించిన కుమారుణ్ణి వాత్సల్యంతో మనస్ఫూర్తిగా చేరదీసే ఒక తండ్రిలాంటి వాడని చెప్పాడు. (లూకా 15:11-32) అలా చెప్పడం ద్వారా, పాపం చేసిన వ్యక్తి హృదయంలో ఏ కొంచెం మార్పు వచ్చినా దాన్నిబట్టి ఆయన మీద కనికరం చూపించడానికి యెహోవా చూస్తాడని యేసు మాటలు హామీనిస్తున్నాయి. యెహోవా పశ్చాత్తాపపడుతున్న పాపిని క్షమించడానికి ఎంతో ఇష్టపడతాడు. ‘మారుమనస్సు అక్కరలేని తొంభై తొమ్మిదిమంది నీతిమంతుల విషయంలో కలిగే సంతోషంకంటే మారుమనస్సుపొందే ఒక్క పాపి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది’ అని యేసు వివరించాడు. (లూకా 15:7) అలాంటి కనికరంగల దేవునికి ఎవరు మాత్రం దగ్గరవ్వకుండా ఉంటారు?

ప్రార్థనలు ఆలకించేవాడు: యేసు భూమ్మీదకు రాకముందు అంటే పరలోకంలో ఉన్నప్పుడు, యెహోవా “ప్రార్థన ఆలకించువాడు” అని, తన నమ్మకమైన ఆరాధకుల ప్రార్థనలు వినడానికి ఇష్టపడతాడని స్వయంగా చూశాడు. (కీర్తన 65:2) అందుకే, యేసు పరిచర్య చేసిన కాలంలో ఎలా ప్రార్థించాలో, దేనికోసం ప్రార్థించాలో తన బోధ వింటున్న వారికి నేర్పించాడు. “వృథా మాటలు పదే పదే పలకకండి” అని ఆయన సలహా ఇచ్చాడు. దేవుని చిత్తం “పరలోకంలోలాగే భూమిమీద కూడా నెరవేరాలి” అని ప్రార్థించమని తన బోధ వింటున్నవారికి ఆయన చెప్పాడు. రోజువారీ అవసరాలు తీర్చమని, పాపాల్ని క్షమించమని, తప్పు చేయాలనే కోరిక నుండి బయటపడడానికి సహాయం చేయమని కూడా ప్రార్థన చేయవచ్చు. (మత్తయి 6:5-13, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) యెహోవా, తన సేవకులు ప్రార్థన చేసినప్పుడు తండ్రిలా స్పందిస్తాడని, వాళ్లు నిజాయితీగా, విశ్వాసంతో అడిగిన వాటిని ఇస్తాడని యేసు బోధించాడు.—మత్తయి 7:7-11.

ఒక్క మాటలో చెప్పాలంటే యెహోవా గురించి సత్యమేమిటో, ఆయన ఎలాంటి దేవుడో తెలియజేయడానికి యేసు కృషి చేశాడు. అంతేకాదు, యెహోవా స్థాపించబోయే రాజ్యం గురించి చెప్పడానికి కూడా యేసు ఇష్టపడ్డాడు. దాని ద్వారా యెహోవా భూమి విషయంలో, దాని మీదున్న మానవుల విషయంలో తాను అనుకున్నది చేయడానికి ప్రపంచవ్యాప్తంగా మార్పులు తీసుకొస్తాడు. నిజానికి, ఆ రాజ్యమే యేసు ప్రకటించిన సందేశంలోని ముఖ్యవిషయం. (w10-E 04/01)

[అధస్సూచి]

a బైబిలు మూలప్రతిలో యెహోవా పేరు దాదాపు 7,000 సార్లు ఉంది. ఆ పేరుకు, “నేను ఎలా కావాలంటే అలా అవుతాను” అనే అర్థం వస్తుంది. (నిర్గమకాండము 3:14, NW) దేవుడు తాను చేయాలనుకున్నది చేయడానికి ఎలా అవసరమనుకుంటే అలా అవుతాడు. దేవుడు ఎప్పుడూ మాట తప్పడనే, ఏదైనా చెప్తే దాన్ని తప్పకుండా చేస్తాడనే హామీ ఆయన పేరులోనే ఉంది.