కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముందు, తర్వాత బైబిలు సూత్రాలు ఆయన మారడానికి సహాయం చేశాయి

ముందు, తర్వాత బైబిలు సూత్రాలు ఆయన మారడానికి సహాయం చేశాయి

“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును”

ముందు, తర్వాత బైబిలు సూత్రాలు ఆయన మారడానికి సహాయం చేశాయి

ఏడ్రీయన్‌ యువకుడిగా ఉన్నప్పుడు, ఎప్పుడూ కోపంగా విసుగ్గా ఉండేవాడు. ఆయనకు ఇట్టే కోపం వచ్చేది, ఆ కోపాన్ని దౌర్జన్యపూరితంగా ఇతరులపై వెళ్ళగ్రక్కేవాడు. ఆయన మద్యం సేవించేవాడు, పొగ త్రాగేవాడు, అనైతిక జీవితం జీవించేవాడు. ఏడ్రీయన్‌ అప్పట్లో ఒక పంక్‌గా పేరు గాంచాడు, తాను అరాచకత్వాన్ని సమర్థిస్తున్నానని చూపించే పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఆ సంవత్సరాలను వర్ణిస్తూ ఆయన ఇలా చెబుతున్నాడు: “నేను నా జుట్టును సాంప్రదాయ పంక్‌ పద్ధతిలో కత్తిరించుకున్నాను, జుట్టు నిటారుగా నిలబడేలా చేయడానికి శక్తివంతమైన జిగురును ఉపయోగించేవాడిని, కొన్నిసార్లు జుట్టుకు ఎరుపు రంగు లేదా మరో రంగు వేసుకునేవాడిని.” ఏడ్రీయన్‌ తన ముక్కు కూడా కుట్టించుకున్నాడు.

మరికొందరు తిరుగుబాటుదారులైన యువకులతో కలిసి ఏడ్రీయన్‌ శిథిలావస్థలోవున్న ఒక ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. అక్కడ వాళ్ళు మద్యం త్రాగేవారు, మాదకద్రవ్యాలు ఉపయోగించేవారు. “నేను స్పీడ్‌ అనే మాదకద్రవ్యాన్ని వాలియమ్‌తో లేకపోతే నాకు ఏది దొరికితే దానితో కలిపి సూదితో ఎక్కించుకునేవాడిని” అని ఏడ్రీయన్‌ గుర్తుచేసుకుంటున్నాడు. “మాదకద్రవ్యాలు, జిగురు అందుబాటులో లేనప్పుడు నేను ప్రజల కార్లలోనుండి పెట్రోలు దొంగిలించి దాని వాసన పీల్చుకొని మత్తులో మునిగితేలేవాడిని” అని ఆయన చెబుతున్నాడు. వీధి నేరస్థుడిగా జీవితం గడుపుతూ ఏడ్రీయన్‌ ప్రమాదకరంగా, ఎంతో దౌర్జన్యపూరితంగా తయారయ్యాడు. సాధారణ ప్రజలు అతనికి దూరంగా ఉండేవారు. అదే సమయంలో అతనికున్న చెడ్డ పేరు, చెడు సహవాసులను ఆకర్షించింది.

క్రమంగా, తన “స్నేహితులు” కేవలం స్వార్థపూరిత లాభం కోసమే తనతో సహవసిస్తున్నారని ఏడ్రీయన్‌ గ్రహించాడు. “కోపోద్రేకం, దౌర్జన్యం ఇప్పటివరకూ ఏమీ సాధించలేదు” అని ఆయన గ్రహించాడు. తన జీవితానికి సంకల్పం లేదనే ఆశాభంగంతో ఆయన తన సహవాసులను విడిచిపెట్టాడు. నిర్మాణ పని జరుగుతున్న ఒక స్థలంలో కావలికోట పత్రిక లభించినప్పుడు ఆయన దానిలోని బైబిలు సందేశానికి ఆకర్షితుడయ్యాడు, ఆయన యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడానికి అది నడిపించింది. “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అనే ఆహ్వానానికి ఏడ్రీయన్‌ ఆత్రుతతో ప్రతిస్పందించాడు. (యాకోబు 4:⁠8) దాని ఫలితంగా, పరిశుద్ధ లేఖనాల్లోని సూత్రాలను అన్వయించుకోవలసిన అవసరాన్ని ఏడ్రీయన్‌ గ్రహించాడు.

ఏడ్రీయన్‌ పొందుతున్న బైబిలు జ్ఞానం ఆయన మనస్సాక్షిపై మంచి ప్రభావం చూపించి ఆయన జీవిత గమనాన్ని మార్చివేసింది. తన కోపోద్రేకాన్ని అదుపు చేసుకోవడానికి, ఆశానిగ్రహం పెంపొందించుకోవడానికి ఆయనకు సహాయం లభించింది. దేవుని వాక్యానికున్న శక్తితో ఏడ్రీయన్‌ వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయింది.​—⁠హెబ్రీయులు 4:12.

అయితే బైబిలు ఇంత శక్తివంతమైన ప్రభావం ఎలా చూపించగలదు? లేఖనాల నుండి వచ్చే జ్ఞానం, ‘నవీన స్వభావమును ధరించుకోవడానికి’ మనకు సహాయం చేస్తుంది. (ఎఫెసీయులు 4:​24) అవును బైబిలులోని ఖచ్చితమైన జ్ఞానాన్ని అన్వయించుకోవడం ద్వారా మన వ్యక్తిత్వం మారుతుంది. కానీ ఇలాంటి జ్ఞానం ప్రజలను ఎలా మారుస్తుంది?

మొదటిగా, మనం మన వ్యక్తిత్వం నుండి తొలగించుకోవలసిన అవాంఛితమైన లక్షణాల గురించి బైబిలు స్పష్టంగా తెలియజేస్తోంది. (సామెతలు 6:​16-19) రెండవదిగా, దేవుని పరిశుద్ధాత్మ ఉత్పన్నం చేసే కోరుకోదగిన లక్షణాలను ప్రదర్శించమని లేఖనాలు మనకు ఉద్బోధిస్తున్నాయి. ఆ లక్షణాల్లో “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” ఉన్నాయి.​—⁠గలతీయులు 5:22.

దేవుడు మన నుండి కోరే విషయాల గురించి లోతుగా అర్థం చేసుకోవడం, ఏడ్రీయన్‌ తనను తాను పరిశీలించుకొని, తన వ్యక్తిత్వంలో తాను అలవరచుకోవలసిన లక్షణాలను, తొలగించుకోవలసిన లక్షణాలను గుర్తించడానికి ఆయనకు సహాయం చేసింది. (యాకోబు 1:​22-25) కానీ అది కేవలం ప్రారంభం మాత్రమే. జ్ఞానంతోపాటు ప్రేరణ కూడా అంటే ఏడ్రీయన్‌ ఆ మార్పులను చేసుకోవడానికి ఆయనను ప్రేరేపించేది కూడా అవసరమయ్యింది.

కోరుకోదగిన ఆ నవీన స్వభావం “దానిని సృష్టించినవాని పోలిక చొప్పున” మలచబడుతుందని ఏడ్రీయన్‌ తెలుసుకున్నాడు. (కొలొస్సయులు 3:​9-10) క్రైస్తవుని వ్యక్తిత్వం దేవుని వ్యక్తిత్వాన్ని పోలివుండాలని ఆయన గ్రహించాడు. (ఎఫెసీయులు 5:⁠1) బైబిలు అధ్యయనం ద్వారా ఏడ్రీయన్‌, యెహోవా మానవజాతితో వ్యవహరించిన విధానం గురించి తెలుసుకొని దేవుని లక్షణాలైన ప్రేమ, దయ, మంచితనం, కృప, నీతి వంటివాటిని గ్రహించాడు. ఆ జ్ఞానం, ఏడ్రీయన్‌ దేవుణ్ణి ప్రేమించడానికి, యెహోవా ఆమోదించే వ్యక్తిగా ఉండేందుకు కృషి చేయడానికి ఆయనను ప్రేరేపించింది.​—⁠మత్తయి 22:37.

చివరికి దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో ఏడ్రీయన్‌ తన కోపోద్రేకాన్ని అదుపు చేసుకోగలిగాడు. ఆయనా, ఆయన భార్యా ఇప్పుడు బైబిలు జ్ఞానం సహాయంతో తమ జీవితాలను మార్చుకోవడానికి ఇతరులకు సహాయం చేయడంలో బిజీగా ఉన్నారు. “నా మాజీ స్నేహితుల్లో అనేకులు మరణించారు, వారిలా కాక నేను ఇప్పటికీ బ్రతికే ఉన్నాను, సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని అనుభవిస్తున్నాను” అని ఏడ్రీయన్‌ చెబుతున్నాడు. జీవితాలను మార్చగల శక్తి బైబిలుకు ఉంది అని చెప్పేందుకు ఆయన ఒక సజీవ సాక్ష్యం.

[25వ పేజీలోని బ్లర్బ్‌]

“కోపోద్రేకం, దౌర్జన్యం ఇప్పటివరకూ ఏమీ సాధించలేదు”

సహాయం చేసిన బైబిలు సూత్రాలు

కోపోద్రేకులైన, దౌర్జన్యపూరితులైన అనేకులు శాంతియుతంగా మారేందుకు సహాయం చేసిన కొన్ని బైబిలు సూత్రాలు క్రింద ఇవ్వబడ్డాయి:

“సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి.” (రోమీయులు 12:​18, 19) ఉగ్రత ఎవరిపైకి తీసుకురావాలో, ఎప్పుడు తీసుకురావాలో దేవుణ్ణి నిర్ణయించుకోనివ్వండి. ఆయన వాస్తవాల గురించిన పూర్తి జ్ఞానంతో అలా చేయగలడు, ఆయన నుండి వచ్చే ఎలాంటి దండన అయినప్పటికీ అది ఆయన పరిపూర్ణమైన న్యాయమును ప్రతిబింబిస్తుంది.

“కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి.” (ఎఫెసీయులు 4:​26, 27) ఒక వ్యక్తి అప్పుడప్పుడు న్యాయంగానే కోపం తెచ్చుకోవచ్చు. అలా జరిగితే ఆయన తన ‘కోపము నిలిచివుండకుండా’ చూసుకోవాలి. ఎందుకు? ఎందుకంటే ఆయన కోపం నిలిచివుంటే అది ఆయనను చెడు చేయడానికి ప్రేరేపించి ఆయన ‘అపవాదికి చోటిచ్చేలా’ చేస్తుంది, అలా ఆయన యెహోవా దేవుని అనంగీకారానికి గురవుతాడు.

“కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము; వ్యసనపడకుము అది కీడుకే కారణము.” (కీర్తన 37:⁠8) అదుపు తప్పిన భావోద్రేకాలు, అదుపు తప్పిన చర్యలకు దారితీస్తాయి. ఒక వ్యక్తి తన కోపానికి లొంగిపోతే, ఆయన లేక ఆమె ఆ విషయంలో ఇమిడివున్న వారందరికీ బాధకలిగించేలా మాట్లాడే లేదా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.