కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూమి పరదైసుగా మారుతుందని నమ్మడం సహేతుకమేనా?

భూమి పరదైసుగా మారుతుందని నమ్మడం సహేతుకమేనా?

భూమి పరదైసుగా మారుతుందని నమ్మడం సహేతుకమేనా?

ఈ భూమి ఎప్పటికైనా ఒక పరదైసుగా మారుతుందని చాలామంది నమ్మరు. అసలు ఈ భూమి ఉనికిలోనే లేకుండా పోతుందని వారు అనుకుంటారు. బ్రైన్‌ లీ మలీనో వ్రాసిన పవిత్రమైన భూమి (ఆంగ్లం) అనే పుస్తకం ప్రకారం, కోట్ల సంవత్సరాల క్రితం ‘గొప్ప కాస్మిక్‌ విస్ఫోటనం’ జరిగినందువల్ల ఈ భూగోళం ఉనికిలోకి వచ్చింది. ఒకవేళ మానవుడే స్వయంగా ఈ భూమిని నాశనం చేయకపోతే, మొత్తం విశ్వంతోపాటు ఈ భూమి కూడా చివరికి “మళ్ళీ లోలోన బద్దలవుతుండే ఒక జ్వాలామయ అగ్ని గోళంలా తయారయ్యే” అవకాశం ఉందని చాలామంది నమ్ముతారు.

17వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి జాన్‌ మిల్టన్‌కు ఇలాంటి నిరాశాపూరిత తలంపులు ఉండేవి కాదు. తాను రచించిన ప్యారడైస్‌ లాస్ట్‌ అనే ఇతిహాస కావ్యంలో, మానవజాతికి పరదైసు గృహంగా ఉండేందుకే దేవుడు ఈ భూమిని సృష్టించాడని ఆయన వ్రాశాడు. ఆ తొలి పరదైసు చేజారిపోయింది. అయితే ఆ పరదైసు పునఃస్థాపించబడుతుందని, అంటే ఒక రోజున, యేసుక్రీస్తు విమోచనకర్తగా “నమ్మకమైన తన ప్రజలను ఆశీర్వదించి, వారు పరలోకంలో లేదా భూమిపై . . . పరమానందం పొందేలా చేస్తాడు” అని మిల్టన్‌ నమ్మేవాడు. ఆయన దృఢవిశ్వాసంతో ఇలా ప్రకటించాడు: “అప్పుడు భూమంతా పరదైసు అవుతుంది.”

పరదైసు​—⁠పరలోకంలోనా భూమ్మీదా?

చాలామంది మతవిశ్వాసులకు, మిల్టన్‌కు ఉండిన అభిప్రాయమే ఉంటుంది, అంటే తాము ఈ భూమిపై అనుభవించిన కష్టాలు బాధలకు ఏదోక విధమైన నష్టపరిహారం లభిస్తుందని నమ్ముతారు. అయితే వారు ఆ ఆశీర్వాదాలను ఎక్కడ అనుభవిస్తారు? ‘పరలోకంలోనా భూమ్మీదా’? కొంతమందికి తాము ఈ భూమిపైనే ఆశీర్వాదాలను అనుభవించవచ్చన్న తలంపే రాదు. ప్రజలు ఈ భూమిని విడిచివెళ్ళి పరలోకంలో ఆత్మ జగత్తులో నివసించినప్పుడు మాత్రమే “పరమానందం” పొందుతామని వారంటారు.

పునఃస్థాపించబడిన పరదైసులోని జీవితం “ఎక్కడో దూరాన పరలోక జగత్తులో కాదుకాని భూమిపైనే ఉంటుంది” అని రెండవ శతాబ్దానికి చెందిన తత్వవేత్త ఐరేనియస్‌ నమ్మేవాడని హెవెన్‌​—⁠ఎ హిస్టరీ అనే పుస్తకాన్ని రచించిన సి. మాక్‌డాన్నెల్‌ మరియు బి. లాంగ్‌ చెప్పారు. ఆ పుస్తకం ప్రకారం, జాన్‌ కాల్విన్‌, మార్టిన్‌ లూథర్‌ వంటి మత నాయకులు తాము పరలోకానికి వెళ్తామని నిరీక్షించినప్పటికి “దేవుడు భూమిని పునర్నూతనం చేస్తాడు” అని కూడా నమ్మేవారు. ఇతర మతాలకు చెందిన సభ్యులకు కూడా అలాంటి నమ్మకాలే ఉండేవి. దేవుని నియమిత కాలంలో, మానవులు అనుభవించే కష్టాలన్నీ “తీసివేయబడతాయి, భూమిపై జీవితం సంతృప్తికరంగా ఉంటుంది” అని కొంతమంది యూదులు నమ్మేవారని కూడా మాక్‌డాన్నెల్‌ మరియు లాంగ్‌ చెబుతున్నారు. ప్రాచీన పారసీక నమ్మకాల ప్రకారం, “భూమి మొదట్లో ఎలా ఉండేదో మళ్ళీ అదే స్థితికి తీసుకురాబడుతుంది, ప్రజలు మళ్ళీ శాంతితో జీవిస్తారు” అని నమ్మేవారని ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ మిడిల్‌ ఈస్టర్న్‌ మైథాలజీ అండ్‌ రెలిజియన్‌ చెబుతోంది.

మరి ఈ భూమి పరదైసుగా మారుతుందనే నిరీక్షణ ఎందుకు మాయమైపోయింది? ఈ భూమిపై మన ఉనికి కేవలం తాత్కాలికమైనదా? మొదటి శతాబ్దపు యూదా తత్వవేత్త ఫిలో తలంచినట్లు, ఆత్మ జగత్తును చేరుకోవడానికి మనం చేసే ప్రయాణంలో అది కేవలం “స్వల్పకాలికమైన, తరచూ విపత్కరమైన అనుభవం” మాత్రమేనా? లేదా దేవుడు భూమిని సృష్టించి, పరదైసు పరిసరాల్లో మానవులను ఉంచినప్పుడు ఆయనకు మరో సంకల్పం ఉండిందా? మానవజాతి నిజమైన ఆధ్యాత్మిక సంతృప్తిని, పరమానందాన్ని ఈ భూమిపై అనుభవించగలరా? ఈ విషయం గురించి బైబిలు ఏమి చెబుతోందో మనం ఎందుకు పరిశీలించకూడదు? లక్షలాదిమంది ఇప్పటికే విశ్వసిస్తున్నట్లు, మీరు కూడా ఈ భూమిపై పరదైసు పునఃస్థాపించబడుతుందని నిరీక్షించడం నిజంగా సహేతుకమే అనే నిర్ధారణకు రావచ్చు.

[3వ పేజీలోని చిత్రం]

కవి జాన్‌ మిల్టన్‌, పరదైసు పునఃస్థాపించబడుతుందని విశ్వసించాడు

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

ముఖచిత్రం: భూమి: U.S. Fish & Wildlife Service, Washington, D.C./NASA

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

భూమి: U.S. Fish & Wildlife Service, Washington, D.C./NASA; జాన్‌ మిల్టన్‌: Leslie’s