కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విదేశాల్లో పిల్లలను పెంచడంలో సవాళ్ళు, ప్రతిఫలాలు

విదేశాల్లో పిల్లలను పెంచడంలో సవాళ్ళు, ప్రతిఫలాలు

విదేశాల్లో పిల్లలను పెంచడంలో సవాళ్ళు, ప్రతిఫలాలు

క్రొత్త దేశంలో క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఎన్నో ఆశలతో కోట్ల మంది వేరే దేశాలకు వలసవెళతారు. ప్రస్తుతం యూరప్‌ రెండు కోట్ల కంటే ఎక్కువమంది వలసదారులకు ఆశ్రయం కల్పిస్తుంది, ఇతర దేశాలలో జన్మించిన 2.6 కోట్లకంటే ఎక్కువమంది అమెరికాలో నివసిస్తున్నారు, ఆస్ట్రేలియా పూర్తి జనాభాలో 21 శాతం కంటే ఎక్కువమంది ఇతర దేశాలలో జన్మించిన వారే. వలసవచ్చిన ఈ కుటుంబాలు సాధారణంగా ఒక క్రొత్త భాషను నేర్చుకోవడానికి, ఒక క్రొత్త సంస్కృతితో సర్దుకుపోవడానికి కృషిచేయాలి.

పిల్లలు తమ క్రొత్త దేశానికి సంబంధించిన భాషను త్వరగా నేర్చుకుని, ఆ క్రొత్త భాషలో ఆలోచించడం ప్రారంభిస్తారు. వారి తల్లిదండ్రులకు ఆ భాష నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. తల్లిదండ్రులకు అపరిచితమైన దేశంలో వారి పిల్లలు పెరుగుతున్నప్పుడు, భాషాపరమైన ఇబ్బందులు వారిమధ్య సంభాషణా సమస్యలను లేవదీయవచ్చు, ఈ సమస్యను సులభంగా పరిష్కరించలేము.

ఆ క్రొత్త భాష పిల్లలు ఆలోచించే విధానాన్ని ప్రభావితం చేయడమే కాకుండా క్రొత్త దేశానికి సంబంధించిన సంస్కృతి, వారు భావించే విధానాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. తమ పిల్లల ప్రతిస్పందనలు అర్థంచేసుకోవడం తల్లిదండ్రులకు కష్టంగా ఉండవచ్చు. కాబట్టి తమ పిల్లలను “యెహోవా శిక్షలోను బోధలోను” పెంచడానికి ప్రయత్నిస్తున్న వలసవచ్చిన తల్లిదండ్రులు ప్రత్యేకమైన సవాళ్ళను ఎదుర్కొంటారు.​—⁠ఎఫెసీయులు 6:⁠4NW.

హృదయాన్ని, మనస్సును చేరుకోవడమనే సవాలు

తమ పిల్లలకు బైబిలు సత్యానికి సంబంధించిన “స్వచ్ఛమైన భాషను” నేర్పించాలని క్రైస్తవ తల్లిదండ్రులు కోరుకుంటారు, అది వారి బాధ్యత. (జెఫన్యా 3:​9NW) అయితే, పిల్లలు తమ తల్లిదండ్రుల భాషకు సంబంధించి కేవలం పరిమిత జ్ఞానాన్ని మాత్రమే సంపాదించుకుంటే లేదా తమ పిల్లలు బాగా నేర్చుకున్న భాషలో తల్లిదండ్రులు తమనుతాము సరిగ్గా వ్యక్తపర్చుకోలేకపోతుంటే, వారు తమ పిల్లల మనస్సులకు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎలా ఉపదేశిస్తారు? (ద్వితీయోపదేశకాండము 6:⁠7) తమ తల్లిదండ్రులు మాట్లాడే మాటలను పిల్లలు అర్థం చేసుకోవచ్చు, కానీ ఆ మాటలు వారి హృదయానికి చేరకపోతే, పిల్లలు తమ సొంత ఇంటిలోనే అపరిచితులుగా మారిపోవచ్చు.

పేత్రో, సాండ్రాలు ఆస్ట్రేలియా నుండి దక్షిణ అమెరికాకు వలసవెళ్ళారు. యౌవనస్థులైన తమ ఇద్దరు కుమారులను పెంచడంలో వారు ఈ సవాలును ఎదుర్కొంటున్నారు. * పేత్రో ఇలా అంటున్నాడు: “ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడేటప్పుడు, హృదయం, భావోద్రేకాలు చేరివుంటాయి. మీరు లోతైన, మరింత అర్థవంతమైన తలంపులను వ్యక్తం చేయవలసి ఉంటుంది కాబట్టి ఇంకా విస్తృతమైన పదజాలం అవసరం.” సాండ్రా ఇలా అంటుంది: “మా మాతృభాషను పిల్లలు సంపూర్ణంగా అర్థంచేసుకోకపోతే, వారి ఆధ్యాత్మిక జీవితంమీద హానికరమైన ప్రభావం పడుతుంది. వారు నేర్చుకుంటున్న విషయాల వెనకున్న సూత్రాల్ని వారు గ్రహించకపోతే, వారు సత్యం పట్ల కలిగివుండవలసిన లోతైన, ప్రశంసాపూర్వకమైన అవగాహనను కోల్పోవచ్చు. వారి ఆధ్యాత్మిక వివేచన కుంటుపడిపోయి, యెహోవాతో వారికున్న సంబంధం పాడైపోవచ్చు.”

జ్ఞానప్రకాశం, హెలెన్‌లు శ్రీలంక నుండి జర్మనీకి వలసవెళ్ళారు, వారికి ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారు. వారిద్దరూ ఇలా అంగీకరిస్తున్నారు: “మా పిల్లలు జర్మన్‌ భాష నేర్చుకుంటూ మా మాతృభాష కూడా మాట్లాడడం చాలా ప్రాముఖ్యమని మేము అనుకుంటున్నాము. వారు తమ భావోద్రేకాల గురించి మాకు చెప్పి, అరమరికలు లేకుండా సన్నిహితంగా మాట్లాడడానికి అది వారికి చాలా అవసరం.”

ఉరుగ్వే నుండి ఆస్ట్రేలియాకు వలసవెళ్ళిన మీగెల్‌, కార్మెన్‌లు ఇలా అంటున్నారు: “మాలాంటి పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు మరింత తీవ్రంగా కృషి చేయాలి. వారు క్రొత్త భాషను అర్థం చేసుకుని, ఆ భాషలో ఆధ్యాత్మిక విషయాలను వివరించేంత చక్కగా ఆ భాషను నేర్చుకోవాలి లేదా తమ పిల్లలకు తమ భాషను చక్కగా నేర్పించాలి.”

ఒక కుటుంబ నిర్ణయం

వలసవెళ్ళిన కుటుంబం ‘యెహోవాచేత ఉపదేశించబడడానికి’ ఏ భాషను ఉపయోగిస్తామన్నది నిర్ణయించుకోవడం ఆ కుటుంబ ఆధ్యాత్మిక ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యం. (యెషయా 54:​13) ఆ కుటుంబపు మాతృభాష మాట్లాడే సంఘం దగ్గర్లో ఉంటే, అప్పుడు ఆ కుటుంబం ఆ సంఘానికి మద్దతునివ్వాలని నిర్ణయించుకోవచ్చు. మరోవైపు, తాము వలసవెళ్ళిన దేశంలో ఉపయోగించబడే ప్రధానమైన భాష మాట్లాడే సంఘానికి హాజరవ్వాలని వారు నిర్ణయించుకోవచ్చు. ఈ నిర్ణయాన్ని ఏ కారకాలు ప్రభావితం చేస్తాయి?

సైప్రస్‌ నుండి ఇంగ్లండ్‌కు వలసవెళ్ళిన దిమిత్రియోస్‌, పాట్రూలాలు అక్కడ ఐదుగురు పిల్లలను పెంచారు. తమ నిర్ణయాన్ని ఏది ప్రభావితం చేసిందో వారు ఇలా వివరిస్తున్నారు: “మొదట్లో మా కుటుంబం గ్రీక్‌ మాట్లాడే సంఘానికి హాజరయ్యేది. తల్లిదండ్రులమైన మాకు ఇది చాలా సహాయకరంగా ఉండేది, కానీ మా పిల్లల ఆధ్యాత్మిక పెరుగుదలకు అది ఒక ఆటంకంగా పరిణమించింది. వారికి గ్రీక్‌ భాషకు సంబంధించి ప్రాథమిక అవగాహన ఉన్నప్పటికీ, లోతైన ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవడం వారికి కష్టంగా ఉండేది. వారి ఆధ్యాత్మిక పెరుగుదల చాలా మందగించడం వల్ల ఆ విషయం స్పష్టమైంది. ఒక కుటుంబంగా మేము ఇంగ్లీషు మాట్లాడే సంఘానికి మారాము, మా పిల్లల్లో తక్షణమే మంచి ఫలితాలు కనిపించాయి. వారు ఆధ్యాత్మికంగా బలపర్చబడ్డారు. మేము అలా సంఘం మారాలి అనే నిర్ణయం తీసుకోవడం అంత సులభమేమీ కాలేదు, కానీ మా విషయంలో అది జ్ఞానవంతమైన నిర్ణయం అని నిరూపించబడింది.”

ఆ కుటుంబం సంఘం మారినప్పటికీ తల్లిదండ్రుల మాతృభాషను కూడా వాడుతూ ఎన్నో ప్రతిఫలాలను అనుభవించారు. వారి పిల్లలు ఇలా అంటున్నారు: “ఒకటి కంటే ఎక్కువ భాషలు తెలిసివుండడం ఒక వరం. ఇంగ్లీషు మా మొదటి భాష అయినప్పటికీ, గ్రీక్‌ భాష తెలిసివుండడం వల్ల మేము బలమైన, సన్నిహితమైన కుటుంబ సంబంధాలను, ప్రత్యేకించి మా తాతామామ్మలతో మంచి సంబంధాలను పెంచుకోవడం సాధ్యమైంది. వలసవచ్చినవారిపట్ల మరింత సహానుభూతి కలిగివుండడానికి అది మాకు సహాయపడింది, మేము వేరే భాష నేర్చుకోగలమన్న నమ్మకాన్ని మాకు ఇచ్చింది. అందుకే మేము పెద్దయ్యాక మా కుటుంబమంతా అల్బేనియన్‌ భాష మాట్లాడే ఒక సంఘానికి మద్దతునివ్వడానికి అక్కడకు మారాము.”

క్రిస్టొఫర్‌, మార్గరీటాలు కూడా సైప్రస్‌ నుండి ఇంగ్లండ్‌కు వలసవెళ్ళి అక్కడ ముగ్గురు పిల్లలను పెంచారు. వారు గ్రీక్‌ మాట్లాడే సంఘానికి మద్దతునివ్వాలని నిర్ణయించుకున్నారు. గ్రీక్‌ మాట్లాడే సంఘంలో ఇప్పుడు పెద్దగా సేవచేస్తున్న వారి కుమారుడు నికోస్‌ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “క్రొత్తగా ప్రారంభించబడిన గ్రీక్‌ భాషా సంఘానికి హాజరవ్వమని మేము ప్రోత్సహించబడ్డాము. మా కుటుంబం దాన్ని ఒక దైవపరిపాలనా నియామకంగా దృష్టించింది.”

మార్గరీటా ఇలా చెబుతోంది: “మా ఇద్దరు అబ్బాయిలకు ఏడు, ఎనిమిది సంవత్సరాల వయస్సున్నప్పుడు, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరారు. గ్రీక్‌ భాషలో వారికున్న పరిమితమైన అవగాహన గురించి తల్లిదండ్రులుగా మేము కొంచెం చింతించేవాళ్ళం. అయితే, వారికి వచ్చే ప్రతి నియామకం ఒక కుటుంబపరమైన ప్రాజెక్టుగా ఉండేది, వారు తమ ప్రసంగాలు సిద్ధపడడానికి మేము వారితో గంటల తరబడి సమయం గడిపేవాళ్ళం.”

వారి కుమార్తె జోయాన్నా ఇలా అంటుంది: “ఇంటిదగ్గర బ్లాక్‌బోర్డు మీద అక్షరాలు వ్రాస్తూ నాన్నగారు మాకు గ్రీక్‌ నేర్పించడం నాకు ఇంకా గుర్తుంది, మేము దాన్ని బాగా నేర్చుకోవలసి వచ్చింది. చాలామంది ఒక భాషను అధ్యయనం చేస్తూ సంవత్సరాలు గడుపుతారు, కానీ అమ్మ నాన్నలు మాకు సహాయం చేయడం వల్ల మేము ఎక్కువ సమయం వెచ్చించకుండానే గ్రీక్‌ నేర్చుకున్నాము.”

కొన్ని కుటుంబాలు తమ సొంత భాష మాట్లాడే సంఘానికి మద్దతునిస్తారు ఎందుకంటే, “ఆధ్యాత్మిక వివేచనను” పెంపొందించుకోవడానికి, అభివృద్ధి సాధించడానికి తాము తమ మాతృభాషలోనే బోధించబడడం అవసరమని తల్లిదండ్రులు భావిస్తారు. (కొలొస్సయులు 1:​9-12NW; 1 తిమోతి 4:​13, 15) లేదా తమకున్న భాషా నైపుణ్యాలు, అదే భాష మాట్లాడే వలసవచ్చిన ఇతర ప్రజలు సత్యాన్ని నేర్చుకోవడానికి సహాయపడతాయని వారు భావించవచ్చు.

మరోవైపు, తాము వలసవెళ్ళిన దేశంలో ఉపయోగించబడే ప్రధానమైన భాషను మాట్లాడే సంఘానికి హాజరవ్వడం తమకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని ఒక కుటుంబం భావించవచ్చు. (ఫిలిప్పీయులు 2:4; 1 తిమోతి 3:⁠5) పరిస్థితిని కుటుంబంతో చర్చించిన తర్వాత, ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత కుటుంబ శిరస్సుదే. (రోమీయులు 14:4; 1 కొరింథీయులు 11:3; ఫిలిప్పీయులు 4:​6, 7) ఈ కుటుంబాలకు ఏ సలహాలు సహాయపడగలవు?

కొన్ని ఆచరణాత్మకమైన సలహాలు

ముందు ప్రస్తావించబడిన పేత్రో, సాండ్రాలు ఇలా అంటున్నారు: “మా మాతృభాషను మర్చిపోకుండా ఉండడానికి, ఇంటివద్ద కేవలం స్పానిష్‌ మాత్రమే మాట్లాడాలి అన్న నియమాన్ని పెట్టుకున్నాము. ఆ నియమాన్ని పాటించడం కష్టం ఎందుకంటే మాకు ఇంగ్లీషు అర్థం అవుతుందని మా అబ్బాయిలకు తెలుసు. కానీ మేము ఈ నియమాన్ని పాటించకపోతే త్వరలోనే వారు స్పానిష్‌ భాషను అర్థంచేసుకోలేకపోయే అవకాశం ఉంది.”

ముందు ప్రస్తావించబడిన మీగెల్‌, కార్మెన్‌లు ఇలా సలహా ఇస్తున్నారు: “తల్లిదండ్రులు తమ మాతృభాషలో క్రమంగా కుటుంబ అధ్యయనాన్ని నిర్వహించి, ప్రతిరోజు దినవచనం చర్చిస్తే, పిల్లలు ఆ భాషలోని ప్రాథమిక అంశాలకంటే ఎక్కువే నేర్చుకుంటారు​—⁠వారు ఆ భాషలో ఆధ్యాత్మిక తలంపులను వ్యక్తం చేయడం నేర్చుకుంటారు.”

మీగెల్‌ ఇలా కూడా సలహా ఇస్తున్నాడు: “సాక్ష్యమిచ్చే పనిని మరింత ఆహ్లాదకరమైనదిగా చేయడానికి ప్రయత్నించండి. మా క్షేత్రం ఒక పట్టణంలోని అధికభాగంలో విస్తరించి ఉంది, కారులో వెళ్ళి మా భాష మాట్లాడే ప్రజలను వెదికిపట్టుకోవడానికి చాలా సమయం వెచ్చించవలసి వస్తుంది. ఆ సమయాన్ని మేము బైబిలు గేమ్స్‌ ఆడడానికి, ప్రాముఖ్యమైన విషయాలను మాట్లాడడానికి ఉపయోగిస్తాము. మేము ఫలవంతమైన అనేక పునర్దర్శనాలు చేయడానికి వీలయ్యేలా నేను మా ప్రయాణాలను ప్రణాళిక వేయడానికి ప్రయత్నిస్తాను. అలా అయితే, సాయంత్రానికి, పిల్లలు కనీసం ఒక్క అర్థవంతమైన సంభాషణలోనైనా పాల్గొనివుంటారు.”

సాంస్కృతిక తేడాలతో వ్యవహరించడం

దేవుని వాక్యం యువతను ఇలా ప్రోత్సహిస్తుంది: “నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.” (సామెతలు 1:⁠8) అయితే, తండ్రి క్రమశిక్షణా ప్రమాణాలు, తల్లి చేసే “బోధ,” ప్రస్తుతం పిల్లలు ఉంటున్న సంస్కృతికి వేరుగా ఉండే సంస్కృతిచే ప్రభావితం చేయబడితే కష్టాలు తలెత్తే అవకాశం ఉంది.

అయితే, ఒక కుటుంబ శిరస్సు తన కుటుంబాన్ని ఎలా పర్యవేక్షించాలలో నిర్ణయించుకునే బాధ్యత ఆయనకే వుంది, ఆయన ఇతర కుటుంబాల ద్వారా అనవసరంగా ప్రభావితం కాకూడదు. (గలతీయులు 6:4, 5) అయినప్పటికీ, తల్లిదండ్రులు పిల్లలు కలిసి చక్కగా సంభాషించుకుంటే, తల్లిదండ్రులు క్రొత్త పద్ధతులను అంగీకరించడం మరింత సులభమవుతుంది.

అభివృద్ధి చెందిన దేశాలలో ప్రబలంగా ఉన్న అనేక అలవాట్లు, ఆచారాలు, క్రైస్తవుల ఆధ్యాత్మిక ఆరోగ్యానికి హానికరమైనవి. తరచూ ప్రఖ్యాతిగాంచిన సంగీతం ద్వారా, వినోద కార్యక్రమాల ద్వారా లైంగిక అనైతికత, దురాశ, తిరుగుబాటు ధోరణి వంటివి ఎంతగానో ప్రోత్సహించబడతాయి. (రోమీయులు 1:​26-32) తల్లిదండ్రులు తమకు భాష అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది కాబట్టి తమ పిల్లలు ఎంపిక చేసుకునే సంగీతాన్ని, వినోదాన్ని అదుపు చేసే విషయంలో తమకున్న బాధ్యత నుండి ప్రక్కకు తప్పుకోకూడదు. వారు స్థిరమైన మార్గనిర్దేశకాలను ఏర్పాటుచేయాలి. అయితే, ఇది కూడా ఒక సవాలుగా ఉండవచ్చు.

కార్మెన్‌ ఇలా అంటుంది: “మా పిల్లలు వినే పాటలలోని పదాలు మాకు తరచూ అర్థం కావు. సంగీతం అంగీకారయోగ్యమైనదిగానే వినిపించవచ్చు కానీ పదాలకు ద్వంద్వార్థాలు ఉంటే లేదా బూతుమాటలు ఉంటే మాకు తెలిసేది కాదు.” ఈ పరిస్థితితో వారు ఎలా వ్యవహరించారు? మీగెల్‌ ఇలా చెబుతున్నాడు: “అనైతికమైన సంగీతంలోని ప్రమాదాల గురించి నేర్పిస్తూ మేము మా పిల్లలతో ఎంతో సమయం గడుపుతాము, యెహోవాకు అంగీకారయోగ్యంగా ఉండే సంగీతాన్ని ఎంపిక చేసుకోవడానికి వారికి సహాయం చేసేందుకు మేము ప్రయత్నిస్తాం.” అవును, సాంస్కృతిక తేడాలతో వ్యవహరించడానికి జాగురూకతా సహేతుకతా అవసరం.​—⁠ద్వితీయోపదేశకాండము 11:18, 19; ఫిలిప్పీయులు 4:5.

ప్రతిఫలాలను పొందడం

విదేశాల్లో పిల్లలను పెంచడానికి అదనపు సమయం, కృషి అవసరం. అందులో సందేహమే లేదు. అయితే తల్లిదండ్రులు, పిల్లలు ఆ కృషికి అదనపు ప్రతిఫలాలను అనుభవిస్తారు.

అజ్జామ్‌, అతని భార్య సారా టర్కీ నుండి జర్మనీకి వలసవెళ్ళి, అక్కడ తమ ముగ్గురు పిల్లలను పెంచారు. వారి పెద్ద కుమారుడు ప్రస్తుతం జర్మనీలోని జెల్టార్స్‌లో యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవ చేస్తున్నాడు. అజ్జామ్‌ ఇలా అంటున్నాడు: “పిల్లలకు ఉన్న ఒక గొప్ప సదవకాశం ఏమిటంటే వారు రెండు సంస్కృతులకు చెందిన మంచి గుణాలను పెంపొందించుకోగలుగుతారు.”

ఆంటోనియో, లూటోనాడ్యోలు అంగోలా నుండి జర్మనీకి వలసవెళ్ళి అక్కడ తొమ్మిది మంది పిల్లలను పెంచుతున్నారు. ఆ కుటుంబం లింగాలా, ఫ్రెంచ్‌, జర్మన్‌ భాషలను మాట్లాడుతుంది. ఆంటోనియో ఇలా అంటున్నాడు: “వేర్వేరు భాషలు మాట్లాడగల సామర్థ్యం, అనేక దేశాలనుండి వచ్చిన ప్రజలకు సాక్ష్యమిచ్చేందుకు మా కుటుంబానికి సహాయపడుతుంది. ఇది మాకు నిజంగా ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది.”

ఇంగ్లండ్‌కు వలసవెళ్ళిన జపనీస్‌ దంపతుల ఇద్దరు పిల్లలు, జపనీస్‌, ఇంగ్లీషు భాషలు తెలిసివుండడం నిజంగా ప్రయోజనకరమని భావిస్తున్నారు. ఆ యౌవనస్థులు ఇలా అంటున్నారు: “రెండు భాషలు తెలిసివుండడం వల్ల మాకు ఉద్యోగాలు లభించాయి. పెద్ద పెద్ద ఇంగ్లీషు భాషా సమావేశాలనుండి మేము ప్రయోజనం పొందాము. అదే సమయంలో, ఎంతో అవసరం ఉన్న జపనీస్‌ భాషా సంఘంలో సేవచేసే ఆధిక్యత కూడా మాకు లభించింది.”

మీరు కూడా విజయం సాధించవచ్చు

తమ సాంస్కృతిక విలువలను పంచుకోని ప్రజలమధ్య జీవిస్తూ పిల్లలను పెంచడమనే సవాలును బైబిలు కాలాల్లో దేవుని సేవకులు ఎదుర్కొన్నారు. మోషే ఐగుప్తులో పెంచబడినప్పటికీ అతని తల్లిదండ్రులు విజయం సాధించారు. (నిర్గమకాండము 2:​9, 10) బబులోనుకు చెరగా తీసుకువెళ్ళబడిన యూదులలో చాలామంది, సత్యారాధనను పునఃస్థాపించడానికి యెరూషలేముకు తిరిగిరావడానికి సుముఖత చూపించిన పిల్లలను పెంచారు.​—⁠ఎజ్రా 2:1, 2, 64-70.

అదే విధంగా, నేడు క్రైస్తవ తల్లిదండ్రులు కూడా విజయం సాధించవచ్చు. “అమ్మా నాన్నల ప్రేమపూర్వకమైన శ్రద్ధ కారణంగా మేము చాలా సన్నిహితమైన కుటుంబంగా ఉన్నాము. అమ్మానాన్నలతో మేము ఎల్లప్పుడూ అరమరికలు లేకుండా మాట్లాడుకుంటాము. యెహోవాను సేవించే భూవ్యాప్త కుటుంబంలో ఒక భాగంగా ఉండడం మాకెంతో సంతోషంగా ఉంది” అని తమ పిల్లలు చెప్పడాన్ని వినే ప్రతిఫలం ఒక జంటకు లభించింది, అలాంటి ప్రతిఫలాన్ని క్రైస్తవ తల్లిదండ్రులందరూ పొందవచ్చు.

[అధస్సూచి]

^ పేరా 7 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[24వ పేజీలోని చిత్రం]

ఇంట్లో కేవలం మీ మాతృభాషలో మాట్లాడితే, మీ పిల్లలకు ఆ భాషకు సంబంధించిన ప్రాథమిక జ్ఞానం లభిస్తుంది

[24వ పేజీలోని చిత్రం]

ఒకే భాష మాట్లాడడం, తాతామామ్మలు, మనవలు మనవరాళ్ళ మధ్య అనుబంధాన్ని నిలుపుతుంది

[25వ పేజీలోని చిత్రం]

మీ పిల్లలతో బైబిలును అధ్యయనం చేయడం వారి “ఆధ్యాత్మిక వివేచనను” పెంపొందింపజేస్తుంది