నిర్గమకాండం 2:1-25

  • మోషే పుట్టడం (1-4)

  • ఫరో కూతురు మోషేను దత్తత తీసుకుంటుంది (5-10)

  • మోషే మిద్యానుకు పారిపోయి సిప్పోరాను పెళ్లి చేసుకుంటాడు (11-22)

  • ఇశ్రాయేలీయుల మూల్గుల్ని దేవుడు వింటాడు (23-25)

2  దాదాపు ఆ సమయంలోనే, లేవి వంశస్థుడైన ఒకతను లేవి గోత్రానికి చెందిన ఒకామెను పెళ్లి చేసుకున్నాడు.+ 2  ఆమె గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కన్నది. ఆ బిడ్డ చాలా అందంగా ఉండడం చూసి, ఆమె అతన్ని మూడు నెలలపాటు దాచివుంచింది.+ 3  తర్వాత ఇక ఆ బిడ్డను దాచివుంచడం వీలుకాక,+ ఒక జమ్ము పెట్టె* తీసుకొని దానికి తారు, కీలు పూసి బిడ్డను అందులో పెట్టింది; తర్వాత ఆ పెట్టెను నైలు నది ఒడ్డున ఉన్న జమ్ముగడ్డి మధ్యలో ఉంచింది. 4  ఆ పిల్లవాడి అక్క,+ అతనికి ఏం జరుగుతుందో చూద్దామని కాస్త దూరంలో నిలబడింది. 5  కాసేపటికి ఫరో కూతురు నైలు నదిలో స్నానం చేయడానికి వచ్చింది, ఆమె చెలికత్తెలు నైలు నది ఒడ్డున నడుస్తున్నారు. అప్పుడు ఆమెకు జమ్ముగడ్డి మధ్యలో ఒక పెట్టె కనిపించింది. వెంటనే ఆమె తన దాసురాలిని పంపి ఆ పెట్టెను తెప్పించింది.+ 6  ఆమె ఆ పెట్టెను తెరిచి ఆ బిడ్డను చూసింది, వాడు ఏడుస్తున్నాడు. అప్పుడు ఆమెకు ఆ బిడ్డ మీద కనికరం కలిగింది. ఆమె, “ఇతను హెబ్రీయుల పిల్లల్లో ఒకడు” అంది. 7  తర్వాత, ఆ పిల్లవాడి అక్క ఫరో కూతురును ఇలా అడిగింది: “నీ కోసం ఆ పిల్లవాడికి పాలిచ్చి పెంచడానికి నేను వెళ్లి ఒక హెబ్రీ స్త్రీని తీసుకురానా?” 8  అప్పుడు ఫరో కూతురు, “వెళ్లు!” అంది. వెంటనే ఆ అమ్మాయి వెళ్లి, ఆ పిల్లవాడి తల్లిని+ తీసుకొచ్చింది. 9  ఫరో కూతురు ఆ స్త్రీతో, “ఈ బిడ్డను నీతోపాటు తీసుకెళ్లి నా కోసం వాడికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను” అంది. కాబట్టి ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకెళ్లి, పాలిచ్చి పెంచింది. 10  ఆ పిల్లవాడు కాస్త పెద్దయ్యాక, ఆ స్త్రీ అతన్ని ఫరో కూతురు దగ్గరికి తీసుకొచ్చింది, అతను ఆమె కుమారుడు అయ్యాడు.+ ఆమె అతనికి మోషే* అని పేరు పెట్టింది. “ఎందుకంటే ఇతన్ని నేను నీళ్లలో నుండి బయటికి తీశాను”+ అని ఆమె అంది. 11  మోషే పెద్దవాడైన తర్వాత* ఒకరోజు అతను తన సహోదరులైన హెబ్రీయులు మోస్తున్న భారాల్ని చూడడానికి బయటికి వెళ్లాడు.+ అప్పుడొక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుణ్ణి కొడుతుండడం అతను చూశాడు. 12  కాబట్టి అతను అటూఇటూ చూసి, ఎవరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుణ్ణి చంపి ఇసుకలో కప్పిపెట్టేశాడు.+ 13  అయితే తర్వాతి రోజు అతను మళ్లీ బయటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకుంటున్నారు. అప్పుడతను తప్పు చేసిన వ్యక్తిని, “నీ సహోదరుణ్ణి ఎందుకు కొడుతున్నావు?” అని అడిగాడు.+ 14  దానికి ఆ వ్యక్తి, “నిన్ను మా మీద అధికారిగా, న్యాయమూర్తిగా ఎవరు నియమించారు? ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టే నన్ను కూడా చంపుదామని అనుకుంటున్నావా?” అన్నాడు.+ దాంతో మోషేకు భయమేసి, “సందేహం లేదు, ఈ విషయం అందరికీ తెలిసిపోయింది!” అనుకున్నాడు. 15  తర్వాత ఫరోకు ఆ విషయం గురించి తెలిసింది, దాంతో అతను మోషేను చంపడానికి ప్రయత్నించాడు. అయితే మోషే ఫరో దగ్గర నుండి పారిపోయి, మిద్యాను దేశంలో+ నివసించడానికి వెళ్లాడు; అక్కడికి వెళ్లాక, ఒక బావి పక్కన కూర్చున్నాడు. 16  మిద్యానులో ఉన్న ఒక పూజారికి+ ఏడుగురు కూతుళ్లు ఉన్నారు. వాళ్లు నీళ్లు చేది, తొట్లను నింపి, తమ తండ్రి మందకు నీళ్లు పెట్టడానికి అక్కడికి వచ్చారు. 17  అయితే ఎప్పటిలాగే గొర్రెల కాపరులు వచ్చి వాళ్లను అక్కడి నుండి వెళ్లగొట్టారు. దాంతో మోషే లేచి, ఆ స్త్రీలకు సహాయం చేసి,* వాళ్ల మందకు నీళ్లు పెట్టాడు. 18  వాళ్లు ఇంట్లో ఉన్న తమ తండ్రి రగూయేలు*+ దగ్గరికి వచ్చినప్పుడు, అతను ఆశ్చర్యంతో “ఈ రోజు ఇంత త్వరగా ఎలా వచ్చారు?” అని అడిగాడు. 19  దానికి వాళ్లు, “ఒక ఐగుప్తీయుడు+ గొర్రెల కాపరుల నుండి మమ్మల్ని కాపాడాడు. అంతేకాదు, అతను మా కోసం నీళ్లు చేది, మందకు నీళ్లు పెట్టాడు” అని చెప్పారు. 20  అప్పుడతను తన కూతుళ్లతో ఇలా అన్నాడు: “ఇంతకీ అతను ఎక్కడున్నాడు? ఎందుకు అతన్ని అక్కడే వదిలేసి వచ్చారు? అతన్ని పిలవండి, అతను కూడా మనతో కలిసి భోంచేస్తాడు.” 21  తర్వాత మోషే అతని దగ్గర ఉండడానికి ఒప్పుకున్నాడు, అతను తన కూతురు సిప్పోరాను+ మోషేకు ఇచ్చి పెళ్లిచేశాడు. 22  తర్వాత ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. అప్పుడు మోషే, “నేను వేరే దేశంలో పరదేశిని అయ్యాను”+ అంటూ ఆ పిల్లవాడికి గెర్షోము*+ అని పేరు పెట్టాడు. 23  చాలాకాలం* తర్వాత, ఆ ఐగుప్తు రాజు చనిపోయాడు.+ అయితే ఇశ్రాయేలీయులు ఇంకా బానిసలుగానే ఉన్నారు. వాళ్లు మూల్గుతూ, ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు. బానిసత్వం కారణంగా సహాయం కోసం వాళ్లు పెడుతున్న మొర సత్యదేవుని దగ్గరికి చేరుతూ ఉంది.+ 24  దేవుడు వాళ్ల మూల్గుల్ని విని,+ తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఒప్పందాన్ని* గుర్తుచేసుకున్నాడు.+ 25  దేవుడు ఇశ్రాయేలీయుల్ని చూశాడు; వాళ్ల మీద దృష్టి పెట్టాడు.

అధస్సూచీలు

లేదా “పపైరస్‌ గంప.”
“తీయబడిన” అని అర్థం. అంటే, నీళ్లలో నుండి రక్షించబడినవాడని భావం.
లేదా “మోషే బలంగా తయారౌతున్నప్పుడు.”
లేదా “ఆ స్త్రీల పక్షాన నిలబడి.”
అంటే, యిత్రో.
“అక్కడ నివసించే ఒక పరదేశి” అని అర్థం.
అక్ష., “చాలా రోజుల.”
లేదా “నిబంధనను.”