కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయనం—ప్రతిఫలదాయకం, ఆనందదాయకం

అధ్యయనం—ప్రతిఫలదాయకం, ఆనందదాయకం

అధ్యయనం​—⁠ప్రతిఫలదాయకం, ఆనందదాయకం

“దాని వెదకినయెడల . . . దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.”​—సామెతలు 2:4, 5.

1. తీరిక వేళల్లో చదవడం మనకు ఎలా ఆహ్లాదాన్నివ్వగలదు?

చాలామంది ప్రజలు కేవలం ఆహ్లాదం కోసం చదువుతారు. చదివే సమాచారం మంచిదైతే, చదవడం సేదదీర్పునిస్తుంది. కొంతమంది క్రైస్తవులు బైబిలును మొదటి నుండి వరుసగా చదవడమే గాక, అప్పుడప్పుడూ కీర్తనలు, సామెతలు, సువార్తలు, లేదా బైబిల్లోని ఇతర భాగాలు చదివి ఎంతో ఆనందాన్ని పొందుతుంటారు. వాటిలో ఉన్న భాషా సౌందర్యమూ, తలంపుల రమ్యతా వారికి ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. మరితరులు తాము తీరికవేళల్లో చదవడానికి యెహోవాసాక్షుల వార్షిక పుస్తకాన్ని, తేజరిల్లు! పత్రికను, ఈ పత్రికలో ప్రచురించబడే జీవిత వృత్తాంతాల్ని, లేదా చరిత్ర, భూగోళశాస్త్రం, ప్రకృతి అధ్యయనాలు వంటి ఇతర విషయాల గురించి ముద్రించబడే శీర్షికలను ఎంపిక చేసుకుంటారు.

2, 3. (ఎ) లోతైన ఆధ్యాత్మిక సమాచారాన్ని బలమైన ఆహారంతో ఏవిధంగా పోల్చవచ్చు? (బి) అధ్యయనంలో ఏమి ఇమిడివుంది?

2 అప్పుడప్పుడూ ఏదైనా చదవడం సేదదీర్పునిస్తుందన్నది నిజమే, కానీ అధ్యయనం చేయడానికి మాత్రం మానసికంగా ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. ఫ్రాన్సిస్‌ బేకన్‌ అనే ఆంగ్ల తత్త్వవేత్త ఇలా వ్రాశాడు: “కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నింటిని మ్రింగేయాలి, మరి కొన్నింటిని బాగా నమిలి జీర్ణం చేసుకోవాలి.” బైబిలు నిస్సంశయంగా ఈ చివరి కోవకే చెందుతుంది. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఇతనిగూర్చి [క్రీస్తునుగూర్చి, రాజు-యాజకుడు అయిన మెల్కీసెదెకు క్రీస్తుకు ప్రాతినిధ్యం వహించాడు] మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.” (హెబ్రీయులు 5:​11, 14) బలమైన ఆహారాన్ని చక్కగా నమిలిన తర్వాతే దాన్ని మ్రింగి, జీర్ణం చేసుకోవాలి. అలాగే, లోతైన ఆధ్యాత్మిక సమాచారాన్ని లోనికి తీసుకుని దాన్నలాగే పదిలపర్చుకోవాలంటే ముందు ఎంతగానో మననం చేయడం అవసరం.

3 “అధ్యయనం” అనే పదాన్ని ఒక నిఘంటువు ఇలా అనువదిస్తుంది: “చదవడం ద్వారా, పరిశోధించడం ద్వారా విషయాలను తెలుసుకునేందుకు లేక అర్థం చేసుకునేందుకు మనస్సును కేంద్రీకరించే ప్రక్రియ లేక చర్య.” ఏదో హడావిడిగా చదివేస్తూ, పదాల క్రింద గబగబా గీతలు గీసేయడం కంటే ఎక్కువే దానిలో ఇమిడివుందని అర్థమౌతుంది. అధ్యయనం చేయడం అనేది ఒక పని, అదొక మానసిక కృషి, దానికి జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం అవసరమౌతుంది. అధ్యయనం చేయడానికి కృషి ఎంతో అవసరమే అయినప్పటికీ దానివల్ల ఆనందం కూడా లభిస్తుంది.

అధ్యయనాన్ని ఆహ్లాదభరితమైనదిగా చేసుకోవడం

4. కీర్తన గ్రంథకర్త చెప్పినదాని ప్రకారం, దేవుని వాక్య అధ్యయనం సేదదీర్పునిచ్చేదై ఎలా ఉండగలదు, ప్రతిఫలదాయకమైనదై ఎలా ఉండగలదు?

4 దేవుని వాక్యాన్ని చదవడం, అధ్యయనం చేయడం సేదదీర్పునిస్తుంది, అంతేగాక మనల్ని ఉత్తేజభరితుల్ని కూడా చేస్తుంది. కీర్తన గ్రంథకర్త ఇలా ప్రకటించాడు: “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును; యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును.” (కీర్తన 19:​7, 8) యెహోవా చట్టాలు, జ్ఞాపికలు మన ప్రాణానికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి, మన ఆధ్యాత్మిక సంక్షేమాన్ని అధికం చేస్తాయి, మనకు అంతర్గత ఆనందాన్నిస్తాయి, యెహోవా అద్భుతమైన సంకల్పాలు మనకు స్పష్టంగా కనిపించేలా మన కళ్లకు ప్రకాశాన్నిస్తాయి. ఎంత ఆనందకరమైన విషయం!

5. అధ్యయనం మనకు ఏయే విధాలుగా ఆహ్లాదాన్నివ్వగలదు?

5 మనం మన పనికి మంచి ఫలితాలు రావడాన్ని చూసినప్పుడు, మనం ఆ పని చేయడం నుండి ఎంతో ఆనందాన్ని పొందుతాము. అందుకే, అధ్యయనాన్ని ఆహ్లాదకరమైనదిగా చేసుకునేందుకు, మనం క్రొత్తగా తెలుసుకున్న విషయాలను త్వరగా ఆచరణలో పెట్టాలి. యాకోబు ఇలా వ్రాశాడు: “స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.” (యాకోబు 1:​25) నేర్చుకున్న విషయాలను వెంటనే ఆచరణలో పెట్టడం గొప్ప సంతృప్తినిస్తుంది. ప్రకటించేటప్పుడు లేక బోధించేటప్పుడు మనకు వేయబడిన ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వాలనే నిర్దిష్టమైన ఉద్దేశంతో పరిశోధన చేయడం కూడా మనకు గొప్ప సంతోషాన్నిస్తుంది.

దేవుని వాక్యాన్నిబట్టి హర్షించడాన్ని నేర్చుకోవడం

6. యెహోవా వాక్యాన్ని బట్టి తనకు కలిగే హర్షాన్ని, 119వ కీర్తనను వ్రాసిన రచయిత ఎలా వ్యక్తపరిచాడు?

6 “నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును. నీ శాసనములు నాకు సంతోషకరములు. . . . నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము; నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక. యెహోవా, నీ రక్షణకొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము” అని కావ్యభాషలో వ్రాస్తూ, 119వ కీర్తనను వ్రాసిన రచయిత యెహోవా వాక్యాన్నిబట్టి హర్షించాడు, బహుశా ఆ కీర్తనను వ్రాసింది రాకుమారుడైన హిజ్కియా కావచ్చు.​—⁠కీర్తన 119:16, 24, 47, 77, 174.

7, 8. (ఎ) ఒక పరిశోధన గ్రంథం తెలియజేస్తున్నట్లుగా, దేవుని వాక్యాన్నిబట్టి ‘హర్షించడం’ అంటే ఏమిటి? (బి) యెహోవా వాక్యంపట్ల మనకున్న ప్రేమను మనమెలా చూపించవచ్చు? (సి) యెహోవా ధర్మశాస్త్రాన్ని చదవడానికి ముందు ఎజ్రా తనను తాను ఎలా సిద్ధం చేసుకున్నాడు?

7 హెబ్రీ లేఖనాలకు సంబంధించిన ఒక నిఘంటువు 119వ కీర్తనలో “హర్షించెదను” అని అనువదించబడిన పదాన్ని వివరిస్తూ ఇలా అంటుంది: “16వ వచనంలోని పదం ఆనందించడం . . . ధ్యానించడం అనే [క్రియాపదాలకు] సమాంతరమైనది. . . . వాటిని ఒక క్రమంలో పెడితే ఇలా వస్తాయి: ఆనందించడం, ధ్యానించడం, సంతోషించడం. . . . యావే వాక్యంలో ఎవరైనా సంతోషాన్ని పొందాలంటే, సంకల్పంతో కూడిన మననం చేయడం అవసరమని ఈ పదాల కూర్పు సూచించవచ్చు. . . . ఆ పదానికున్న అర్థంలో భావోద్వేగాలు కూడా ఇమిడి ఉన్నాయి.” *

8 అవును, యెహోవా వాక్యం పట్ల మన ప్రేమ, భావోద్వేగాలకు మూలస్థానమైన హృదయపు లోతుల్లో నుండి జనించాలి. మనం కొన్ని వచనాలను చదివిన వెంటనే వాటిని మళ్ళీ మళ్ళీ స్మరణకు తెచ్చుకుంటూ ఆహ్లాదాన్ని అనుభవించాలి. లోతైన ఆధ్యాత్మిక తలంపులను మననం చేసుకుంటూ, వాటిలో పూర్తిగా నిమగ్నమైపోయి వాటిని ధ్యానించాలి. ఇందుకు ప్రశాంతంగా కూర్చుని నెమరు వేసుకోవడం, ప్రార్థన చేయడం అవసరం. ఎజ్రాలా, మనం దేవుని వాక్యాన్ని చదివి, అధ్యయనం చేయడానికి మన హృదయాన్ని సిద్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. ఆయన గురించి ఇలా వ్రాయబడింది: “ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దానిచొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము [“తన హృదయమును సిద్ధము,” NW] చేసికొనెను.” (ఎజ్రా 7:​10) ఎజ్రా తన హృదయాన్ని సిద్ధం చేసుకోవడం వెనుకనున్న ఉద్దేశాన్ని గమనించండి. దానిలో మూడు భాగాలున్నాయి: అధ్యయనం చేయడం, వ్యక్తిగతంగా అన్వయించుకోవడం, బోధించడం. మనం ఆయన మాదిరిని తప్పక అనుసరించాలి.

అధ్యయనం​—⁠ఒక ఆరాధనా క్రియ

9, 10. (ఎ) కీర్తన గ్రంథకర్త యెహోవా వాక్యాన్ని ఏయే విధాలుగా ధ్యానించాడు? (బి) ‘ధ్యానించడం’ అని అనువదించబడిన హెబ్రీ క్రియాపదం భావమేమిటి? (సి) బైబిలు అధ్యయనాన్ని “ఆరాధన”గా దృష్టించడం ఎందుకు ప్రాముఖ్యం?

9 తాను యెహోవా ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను, శాసనములను ధ్యానించానని కీర్తన గ్రంథకర్త పేర్కొంటున్నాడు. ఆయనిలా పాడుతున్నాడు: “నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు.” (కీర్తన 119:15, 48, 97, 99) యెహోవా వాక్యాన్ని ‘ధ్యానించడంలో’ ఏమి ఇమిడి ఉంది?

10 ‘ధ్యానించడం’ అని అనువదించబడిన హెబ్రీ క్రియా పదానికి “మననం చేయు, ఆలోచించు, మనస్సులో తలపోయు” అనే భావాలు కూడా ఉన్నాయి. “అది దేవుని కార్యాల గురించి . . . దేవుని వాక్యం గురించి నిశ్శబ్దంగా నెమరువేసుకోవడానికి సంబంధించి ఉపయోగించబడింది.” (థియోలాజికల్‌ వర్డ్‌బుక్‌ ఆఫ్‌ ది ఓల్డ్‌ టెస్టమెంట్‌) “ధ్యానం” అనే పదం, “తన ఆరాధన”లో భాగంగా “కీర్తనల గ్రంథకర్త చేసే మననాన్నీ” దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన ఎంతో “ప్రియంగా అధ్యయనం” చేయడాన్నీ సూచిస్తుంది. దేవుని వాక్య అధ్యయనాన్ని మన ఆరాధనలో ఒక భాగంగా దృష్టించినప్పుడు అది మన జీవితాల్లో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కాబట్టి ప్రార్థన చేసుకుని, మనస్సాక్షిపూర్వకంగా అధ్యయనం చేయాలి. అధ్యయనం మన ఆరాధనలో ఒక భాగం, అధ్యయనం చేయడం మన ఆరాధనను మెరుగుపరుస్తుంది.

దేవుని వాక్యంలోకి లోతుగా త్రవ్వడం

11. యెహోవా తన ప్రజలకు నిగూఢమైన ఆధ్యాత్మిక తలంపులను ఎలా బయల్పరుస్తాడు?

11 భక్తితో కూడిన మెప్పుదలతో కీర్తన గ్రంథకర్త ఇలా అన్నాడు: “యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతిగంభీరములు.” (కీర్తన 92:⁠5) నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిపై పనిచేస్తున్న “తన ఆత్మ” ద్వారా యెహోవా తన ప్రజలకు బయల్పరుస్తున్న నిగూఢమైన తలంపులను గురించి, అంటే “దేవుని మర్మములను” గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు. (1 కొరింథీయులు 2:10; మత్తయి 24:​45) దాసుని తరగతి శ్రద్ధతో ఆధ్యాత్మిక పోషకాహారాన్ని అందరికీ, అటు క్రొత్తవారి కోసం “పాలు,” ఇటు “వయస్సు వచ్చిన” వారి కోసం “బలమైన ఆహారము” అందజేస్తుంది.​—⁠హెబ్రీయులు 5:11-14.

12. దాసుని తరగతి వివరించిన “దేవుని మర్మముల”లో ఒక ఉదాహరణను ఇవ్వండి.

12 అలాంటి “దేవుని మర్మములను” గ్రహించాలంటే ప్రార్థనాపూర్వకంగా అధ్యయనం చేసి, ఆయన వాక్యాన్ని మననం చేసుకోవడం అవసరం. ఉదాహరణకు, యెహోవా ఒకే సమయంలో అటు న్యాయంగానూ ఇటు కనికరంతోనూ ఎలా వ్యవహరించగలడో చూపించే చక్కని సమాచారం మన ప్రచురణల్లో ముద్రించబడింది. ఆయన కనికరం ప్రదర్శించాడంటే దానర్థం తన న్యాయాన్ని నీరుగార్చాడని కాదు; బదులుగా దేవుని కనికరం ఆయన న్యాయానికీ ప్రేమకూ ఒక నిదర్శనం. యెహోవా ఒక పాపికి న్యాయం తీర్చేటప్పుడు, తన కుమారుని విమోచన క్రయధన బలి ఆధారంగా కనికరం చూపించడం సాధ్యమేనా అన్నది మొదట నిశ్చయించుకుంటాడు. ఆ పాపి పశ్చాత్తాపపడకుండా ఉంటే లేక తిరుగుబాటు చేస్తుంటే, అప్పుడు దేవుడు కనికరం చూపించకుండా, న్యాయం తన విధిని నిర్వర్తించేందుకు అనుమతిస్తాడు. ఏ విధంగానైనప్పటికీ, ఆయన తన ఉన్నతమైన సూత్రాలకు నమ్మకంగా కట్టుబడి ఉంటాడు. * (రోమీయులు 3:​21-26) ‘ఆహా, దేవుని బుద్ధి బాహుళ్యము ఎంత గంభీరము!’​—⁠రోమీయులు 11:⁠33.

13. ఇంతవరకు బయల్పర్చబడిన ఆధ్యాత్మిక సత్యాల ‘మొత్తము’ను విలువైనదిగా ఎంచుతున్నామని మనమెలా చూపించాలి?

13 యెహోవా తన అనేకానేక తలంపులను మనతో పంచుకుంటున్నందుకు కీర్తనల గ్రంథకర్తలా మనం కూడా ఎంతో పులకరించిపోతాము. దావీదు ఇలా వ్రాశాడు: “దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది. వాటిని లెక్కించెద ననుకొంటినా అవి యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి, నేను మేల్కొంటినా యింకను నీయొద్దనే యుందును.” (కీర్తన 139:​17, 18) నేడు మనకు తెలిసిన విషయాలు, యెహోవా నిత్యభవిష్యత్తులో బయల్పరుస్తూ ఉండబోయే అసంఖ్యాకమైన తలంపుల్లో కేవలం కొన్ని మాత్రమే అయినప్పటికీ, ఇంతవరకూ బయల్పర్చబడిన అమూల్యమైన ఆధ్యాత్మిక సత్యాల ‘మొత్తము’ను మనం ఎంతో విలువైనదిగా ఎంచుతాము. దేవుని వాక్య మొత్తములోకి, అంటే సారాంశములోకి ఇంకా లోతుగా త్రవ్వుతూనే ఉంటాము.​—⁠కీర్తన 119:160.

కృషి, ప్రభావవంతమైన పరికరాలు అవసరం

14. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసేందుకు అవసరమయ్యే కృషిని సామెతలు 2:1-6 వచనాలు ఎలా నొక్కి చెప్తున్నాయి?

14 లోతుగా బైబిలు అధ్యయనం చేయాలంటే ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. సామెతలు 2:1-6 వచనాలను జాగ్రత్తగా చదవడం ద్వారా ఈ విషయం స్పష్టమౌతుంది. దైవిక తెలివి జ్ఞాన వివేచనలను సంపాదించుకోవడానికి అవసరమైన కృషిని నొక్కిచెప్పడానికి జ్ఞానియైన సొలొమోను రాజు ఉపయోగించిన శక్తివంతమైన క్రియాపదాలను గమనించండి. ఆయనిలా వ్రాశాడు: “నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల, తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసిన యెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు, దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.” (ఇటాలిక్కులు మావి.) అవును, అధ్యయనం ప్రతిఫలదాయకమైనదిగా ఉండాలంటే, దాచబడిన ధనం కోసం వెదుకుతూ త్రవ్వినట్లు పరిశోధన చేయాలి.

15. మంచి అధ్యయన పద్ధతులు కల్గివుండవలసిన అవసరాన్ని బైబిలులోని ఏ ఉపమానం ఉన్నతపరుస్తుంది?

15 మనం ఆధ్యాత్మికంగా సుసంపన్నులమయ్యే విధంగా అధ్యయనం చేయాలంటే, మంచి అధ్యయన పద్ధతులు కూడా అవసరం. సొలొమోను ఇలా వ్రాశాడు: “ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయనియెడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను.” (ప్రసంగి 10:​10) ఒక పనివాడు మొద్దుగా ఉన్న పరికరాన్ని ఉపయోగిస్తే లేదా అతడు దాన్ని నైపుణ్యవంతంగా ఉపయోగించకపోతే, అతడు తన శక్తిని వ్యర్థం చేసుకుంటాడు, అతని పని నాణ్యమైనదిగా ఉండదు. అలాగే, మనం అధ్యయనం చేసే పద్ధతులను బట్టి, అధ్యయనం కోసం మనం వెచ్చించే సమయం నుండి లభించే ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. మనం అధ్యయనం చేసే పద్ధతులను మెరుగుపర్చుకునేందుకు అతి చక్కని ఆచరణాత్మకమైన సలహాలు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకములోగల (ఆంగ్లం) 7వ పాఠంలో ఉన్నాయి. *

16. లోతుగా అధ్యయనం చేయడానికి సహాయం చేసే ఏ ఆచరణాత్మకమైన సలహాలు మనకు ఇవ్వబడ్డాయి?

16 ఒక పనివాడు తన పనిని ప్రారంభించే ముందు తనకు అవసరమయ్యే ఉపకరణాలన్నిటినీ తీసిపెట్టుకుంటాడు. అలాగే మనం అధ్యయనాన్ని ప్రారంభించేటప్పుడు, మనకు అవసరమయ్యే అధ్యయన ఉపకరణాలను మనం మన వ్యక్తిగత గ్రంథాలయం నుండి ఎంపిక చేసుకోవాలి. అధ్యయనమంటే ఒక పని అనీ, దానికి మానసిక కృషి అవసరమనీ గుర్తుంచుకుని దానికి తగిన విధంగా కూర్చోవడం కూడా మంచిది. మనం మానసికంగా చురుగ్గా ఉండాలనుకుంటే, పరుపు మీద పడుకోవడం కన్నా లేదా సుఖంగా వాలు కుర్చీలో కూర్చోవడం కన్నా బల్ల ముందు కుర్చీలో కూర్చోవడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కొద్దిసేపు ఏకాగ్రత నిలిపి అధ్యయనం చేసిన తర్వాత, ఒకసారి కాళ్లు చేతులు చాచుకోవడం లేదా తాజాగాలి కోసం కాసేపలా బయటికి వెళ్లిరావడం ప్రయోజనకరంగా ఉంటుందని మీరు కనుగొనవచ్చు.

17, 18. మీకు అందుబాటులో ఉన్న చక్కని అధ్యయన ఉపకరణాలను ఎలా ఉపయోగించుకోవాలో ఉదాహరణలు ఇవ్వండి.

17 అనేకానేకమైన సాటిలేని అధ్యయన ఉపకరణాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనది న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ బైబిలు, ఇప్పుడిది 37 భాషల్లో పూర్తిగాగానీ, భాగాలుగా గానీ అందుబాటులో ఉంది. న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ యొక్క స్టాండర్డ్‌ ఎడిషన్‌లో క్రాస్‌ రెఫరెన్సులు ఉన్నాయి, అలాగే రచయిత పేరును, వ్రాసిన స్థలాన్ని, వ్రాయటానికి పట్టిన సమయాన్ని తెలియజేసే “బైబిలు పుస్తకాల పట్టిక” అనేది కూడా ఉంది. అంతేగాక బైబిలు పదాల అకారాది పట్టిక, ఒక అనుబంధము, కొన్ని పటాలు కూడా దానిలో ఉన్నాయి. కొన్ని భాషల్లో, ఈ బైబిలు పెద్ద సైజులో కూడా లభ్యమౌతుంది, దాన్ని రెఫరెన్స్‌ బైబిల్‌ అంటారు. దానిలో పైన పేర్కొన్న అన్ని అంశాలు ఉండడమే గాక ఇంకా అనేకానేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి, వాటితోపాటు అధస్సూచికలు కూడా ఉన్నాయి, వాటికి కూడా ఒక అకారాది పట్టిక ఇవ్వబడింది. దేవుని వాక్యంలోకి లోతుగా త్రవ్వటానికి సహాయం చేసే, మీ భాషలో అందుబాటులో ఉన్న వాటన్నిటి నుండి మీరు ప్రయోజనం పొందుతున్నారా?

18 అధ్యయనానికి తోడ్పడే మరో అమూల్యమైన ఉపకరణం, ఇన్‌సైట్‌ ఆన్‌ ద స్క్రిప్చర్స్‌ అనే రెండు సంపుటిల సర్వసంగ్రహ బైబిలు నిఘంటువు. మీరు అర్థం చేసుకోగల భాషలో గనుక ఈ సర్వసంగ్రహ నిఘంటువు ఉంటే, మీరు అధ్యయనం చేసేటప్పుడు అది ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉండాలి. అనేక బైబిలు అంశాలకు సంబంధించిన పూర్వాపర వివరాలను అది మీకు అందజేస్తుంది. అలాంటిదే మరో సహాయకరమైన ఉపకరణం, “ఆల్‌ స్క్రిప్చర్‌ ఈజ్‌ ఇన్‌స్పైర్డ్‌ ఆఫ్‌ గాడ్‌ అండ్‌ బెనిఫీషియల్‌.” బైబిలులో నుండి ఏదైనా ఒక పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టేటప్పుడు, “ఆల్‌ స్క్రిప్చర్‌” అనే పుస్తకంలో ఆ బైబిలు పుస్తకాన్ని గురించిన పాఠాన్ని పరిశీలించడం మంచిది, అలా చేయడం ద్వారా దానికి సంబంధించిన భౌగోళిక చారిత్రక పూర్వరంగాన్నే గాక ఆ బైబిలు పుస్తకంలోని విషయాల సారాంశం కూడా మనకు లభిస్తుంది, అంతేగాక అవి మనకు ఎలా ప్రయోజనం చేకూర్చగలవో తెలుస్తుంది. ముద్రితమైన అనేక అధ్యయన ఉపకరణాలకు తోడు, ఇటీవల కంప్యూటరీకరణ చేయబడిన వాచ్‌టవర్‌ లైబ్రరీ కూడా అందుబాటులోకి వచ్చింది, అదిప్పుడు తొమ్మిది భాషల్లో లభిస్తుంది.

19. (ఎ) బైబిలు అధ్యయనం కోసం యెహోవా మనకు చక్కని ఉపకరణాలను ఎందుకు ఇచ్చాడు? (బి) సరైన విధంగా బైబిలు చదవడానికీ, అధ్యయనం చేయడానికీ ఏమి అవసరం?

19 యెహోవా భూవ్యాప్తంగా ఉన్న తన సేవకులు ‘దేవునిగూర్చిన విజ్ఞానమును వెదకి గ్రహించేలా’ ఈ ఉపకరణాలన్నిటినీ ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా అందజేస్తున్నాడు. (సామెతలు 2:​4, 5) మంచి అధ్యయన అలవాట్లు యెహోవా గురించి మరింతగా తెలుసుకోవడానికి, ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కల్గివుండడానికి సహాయం చేస్తాయి. (కీర్తన 63:​1-8) అవును అధ్యయనమంటే శ్రమతో కూడినదే, అయితే అది ఆనందదాయకమైన, ప్రతిఫలదాయకమైన పని. నిజమే దానికి సమయం అవసరం, ‘అయితే నేను ఉన్న సమయాన్నే సరైన విధంగా బైబిలు చదవడానికీ, అధ్యయనం చేయడానికీ ఎలా సద్వినియోగం చేసుకోగలను?’ అని మీరు అలోచిస్తుండవచ్చు. ఈ పరంపరలోని చివరి శీర్షికలో ఆ విషయం పరిశీలించబడుతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 7 న్యూ ఇంటర్నేషనల్‌ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ థియాలజి అండ్‌ ఎక్సెజెసీస్‌, సంపుటి 4, పేజీలు 205-7.

^ పేరా 12 కావలికోట, ఆగస్టు 1, 1998, పేజీ 13, పేరా 7 చూడండి. బైబిలు అధ్యయన కార్యక్రమంగా మీరు ఆ సంచికలోని రెండు పఠన శీర్షికలను, అలాగే వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) అనే బైబిలు సర్వసంగ్రహ నిఘంటువులోని “న్యాయం,” “కనికరం,” “నీతి,” వంటి శీర్షికలను పరిశీలించవచ్చు.

^ పేరా 15 వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది. ఈ పుస్తకం గనుక మీ భాషలో లేకపోతే, కావలికోట పత్రిక యొక్క ఈ సంచికల్లో, అధ్యయనం చేసే పద్ధతులపై చక్కని ఉపదేశాన్ని కనుగొనవచ్చు. అవి: ఆగస్టు 15, 1993, పేజీలు 13-17; మే 15, 1986, పేజీలు 19-20, (ఆంగ్లం).

పునఃసమీక్ష ప్రశ్నలు

• మన వ్యక్తిగత అధ్యయనాన్ని సేదదీర్పునిచ్చేదిగా, ప్రతిఫలదాయకమైనదిగా ఎలా చేసుకోగలము?

• కీర్తన గ్రంథకర్తలా, మనం యెహోవా వాక్యాన్నిబట్టి మనకు కలిగే ‘హర్షాన్ని’ ఎలా చూపించవచ్చు, దాన్ని మనం ‘ధ్యానిస్తున్నామని’ ఎలా చూపించవచ్చు?

• దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి కృషి అవసరమని సామెతలు 2:1-6 వచనాలు ఎలా చూపిస్తున్నాయి?

• యెహోవా ఏ చక్కని అధ్యయన ఉపకరణాలను అందజేస్తున్నాడు?

[అధ్యయన ప్రశ్నలు]

[14వ పేజీలోని చిత్రం]

ప్రశాంతంగా మననం చేయడం, ప్రార్థించడం దేవుని వాక్యంపట్ల ప్రేమను పెంచుకోవడానికి మనకు సహాయం చేస్తాయి

[17వ పేజీలోని చిత్రాలు]

దేవుని వాక్యంలోకి లోతుగా త్రవ్వడానికి అందుబాటులో ఉన్న అధ్యయన ఉపకరణాలన్నిటినీ మీరు పూర్తిగా ఉపయోగించుకుంటున్నారా?