ఎజ్రా 7:1-28

  • ఎజ్రా యెరూషలేముకు వచ్చాడు (1-10)

  • ఎజ్రాకు అర్తహషస్త ఉత్తరం (11-26)

  • ఎజ్రా యెహోవాను స్తుతించడం (27, 28)

7  ఈ సంగతులు జరిగిన తర్వాత, పారసీక రాజైన అర్తహషస్త పరిపాలనలో+ ఎజ్రా*+ తిరిగొచ్చాడు; అతను శెరాయా+ కుమారుడు, శెరాయా అజర్యా కుమారుడు, అజర్యా హిల్కీయా+ కుమారుడు,  హిల్కీయా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహీటూబు కుమారుడు,  అహీటూబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్యా కుమారుడు, అజర్యా+ మెరాయోతు కుమారుడు,  మెరాయోతు జెరహ్యా కుమారుడు, జెరహ్యా ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు,  బుక్కీ అబీషూవ కుమారుడు, అబీషూవ ఫీనెహాసు+ కుమారుడు, ఫీనెహాసు ఎలియాజరు+ కుమారుడు, ఎలియాజరు ముఖ్య యాజకుడైన అహరోను+ కుమారుడు.  ఈ ఎజ్రా బబులోను నుండి వచ్చాడు. ఇతను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇచ్చిన మోషే ధర్మశాస్త్రంలో ఆరితేరిన శాస్త్రి.*+ అతని దేవుడైన యెహోవా* అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతను కోరిన ప్రతీదాన్ని రాజు ఇచ్చాడు.  అర్తహషస్త పరిపాలన ఏడో సంవత్సరంలో కొంతమంది ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు,+ గాయకులు,+ ద్వారపాలకులు,+ ఆలయ సేవకులు*+ యెరూషలేముకు వెళ్లారు.  రాజు పరిపాలన ఏడో సంవత్సరం, ఐదో నెలలో ఎజ్రా యెరూషలేముకు వచ్చాడు.  అతని దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు+ కాబట్టి అతను మొదటి నెల మొదటి రోజున బబులోను నుండి ప్రయాణం మొదలుపెట్టి, ఐదో నెల మొదటి రోజున యెరూషలేముకు చేరుకున్నాడు. 10  ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించడానికి, దాన్ని పాటించడానికి,+ అందులోని నియమాల్ని, తీర్పుల్ని ఇశ్రాయేలీయులకు బోధించడానికి+ తన హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు.* 11  యాజకుడూ, శాస్త్రీ,* అలాగే యెహోవా ఆజ్ఞల్ని, ఇశ్రాయేలీయులకు ఆయన ఇచ్చిన నియమాల్ని అధ్యయనం చేయడంలో ప్రవీణుడూ* అయిన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన లేఖ నకలు ఇది: 12  * “రాజాధిరాజైన అర్తహషస్త,+ యాజకుడూ పరలోక దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రీ* అయిన ఎజ్రాకు రాసేదేమిటంటే: నీకు పరిపూర్ణ శాంతి కలగాలి! ఇప్పుడు 13  నా రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్లో, వాళ్ల యాజకుల్లో, లేవీయుల్లో ఎవరైనా నీతో కలిసి యెరూషలేముకు వెళ్లాలనుకుంటే, వాళ్లు వెళ్లొచ్చని నేను ఒక ఆజ్ఞ జారీ చేశాను.+ 14  నీ దగ్గరున్న* మీ దేవుని ధర్మశాస్త్రాన్ని యూదా, యెరూషలేము ప్రజలు పాటిస్తున్నారో లేదో చూడడానికి రాజు, అతని ఏడుగురు సలహాదారులు నిన్ను పంపిస్తున్నారు; 15  అలాగే రాజు, అతని సలహాదారులు యెరూషలేములో నివాసముంటున్న ఇశ్రాయేలు దేవునికి స్వచ్ఛందంగా ఇచ్చిన వెండిబంగారాల్ని తీసుకెళ్లు; 16  బబులోను సంస్థానం అంతటా నీకు దొరికే వెండి, బంగారం అంతటితో పాటు, యెరూషలేములోని తమ దేవుని మందిరానికి ప్రజలు, యాజకులు స్వచ్ఛందంగా ఇచ్చే కానుక+ కూడా తీసుకెళ్లు. 17  నువ్వు ఆ డబ్బుతో ఎద్దుల్ని,+ పొట్టేళ్లను,+ గొర్రెపిల్లల్ని+ వాటితోపాటు అర్పించే ధాన్యార్పణల్ని,+ పానీయార్పణల్ని+ వెంటనే కొనాలి. నువ్వు వాటిని యెరూషలేములోని మీ దేవుని మందిర బలిపీఠం మీద అర్పించాలి. 18  “మిగిలిన వెండిబంగారాలతో మీ దేవుని ఇష్టప్రకారం నీకు, నీ సహోదరులకు ఏది మంచిదనిపిస్తే అది చేయవచ్చు. 19  నీ దేవుని మందిర సేవ కోసం నీకు ఇచ్చిన పాత్రలన్నిటినీ నువ్వు యెరూషలేములోని దేవుని ముందు ఉంచాలి.+ 20  నీ దేవుని మందిరానికి కావాల్సినవి ఇంకేవైనా నువ్వు ఇవ్వాల్సివస్తే వాటిని రాజు ఖజానాలో నుండి తీసుకో.+ 21  “అర్తహషస్త రాజు అనే నేను నది అవతలి ప్రాంతంలో* ఉన్న కోశాధికారులందరికీ ఆజ్ఞాపించేదేమిటంటే, యాజకుడూ పరలోక దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రీ* అయిన ఎజ్రా+ మిమ్మల్ని అడిగేవన్నీ వెంటనే ఇవ్వాలి, 22  100 తలాంతుల* వరకు వెండిని, 100 కొర్‌ కొలతల* వరకు గోధుమల్ని, 100 బాత్‌ కొలతల* వరకు ద్రాక్షారసాన్ని,+ 100 బాత్‌ కొలతల వరకు నూనెను,+ విస్తారంగా ఉప్పును+ ఇవ్వాలి. 23  పరలోక దేవుడు ఆజ్ఞాపించిన ప్రతీది ఆయన మందిరం కోసం ఉత్సాహంగా చేయాలి.+ అప్పుడు రాజు రాజ్యం మీదికి, అతని కుమారుల మీదికి పరలోక దేవుని కోపం రాకుండా ఉంటుంది.+ 24  అంతేకాదు యాజకుల్లో, లేవీయుల్లో, సంగీతకారుల్లో,+ ద్వారపాలకుల్లో, ఆలయ సేవకుల్లో,*+ ఈ దేవుని మందిర పని చేసేవాళ్లలో ఎవ్వరి మీదా ఎలాంటి పన్ను గానీ కప్పం గానీ+ సుంకం గానీ విధించకూడదని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. 25  “ఎజ్రా, నువ్వు నీ దేవుని నుండి పొందిన తెలివి ప్రకారం, నది అవతలి ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ, అంటే నీ దేవుని నియమాలు తెలిసిన వాళ్లందరికీ తీర్పు తీర్చడానికి వాళ్ల మీద నగర అధికారుల్ని,* న్యాయమూర్తుల్ని నియమించు; ఎవరికైనా ఆ నియమాలు తెలియకపోతే నువ్వు వాళ్లకు బోధించాలి.+ 26  నీ దేవుని ధర్మశాస్త్రాన్ని, రాజు చేసిన చట్టాన్ని పాటించని వాళ్లెవరికైనా వెంటనే తీర్పుతీర్చాలి; అంటే మరణశిక్ష గానీ దేశ బహిష్కరణ గానీ జరిమానా గానీ ఖైదు గానీ విధించాలి.” 27  యెరూషలేములోని యెహోవా మందిరాన్ని అందంగా తీర్చిదిద్దాలనే ఆలోచనను రాజు హృదయంలో పెట్టిన మన పూర్వీకుల దేవుడైన యెహోవా స్తుతించబడాలి!+ 28  ఆయన రాజు ఎదుట, అతని సలహాదారుల+ ఎదుట, అతని గొప్పగొప్ప అధిపతులందరి ఎదుట నా మీద విశ్వసనీయ ప్రేమ చూపించాడు.+ నా దేవుడైన యెహోవా నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను, నాతో పాటు రావడానికి ఇశ్రాయేలులోని నాయకుల్ని* సమకూర్చాను.

అధస్సూచీలు

“సహాయం” అని అర్థం.
లేదా “నకలు రాసే వ్యక్తి.”
అక్ష., “యెహోవా చెయ్యి.”
లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”
లేదా “తన హృదయంలో తీర్మానించుకున్నాడు.”
లేదా “నకలు రాసే వ్యక్తీ.”
లేదా “నకలు రాసే వ్యక్తీ.”
ఎజ్రా 7:12 నుండి 7:26 వరకు మొదట్లో అరామిక్‌​లో రాయబడింది.
లేదా “నకలు రాసే వ్యక్తీ.”
అక్ష., “నీ చేతిలో ఉన్న.”
ఇది యూఫ్రటీసు నదికి పడమటి వైపున్న ప్రాంతాల్ని సూచిస్తుంది.
లేదా “నకలు రాసే వ్యక్తీ.”
అప్పట్లో ఒక కొర్‌ 220 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక బాత్‌ 22 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “నెతీనీయుల్లో.” అక్ష., “ఇవ్వబడినవాళ్లలో.”
పదకోశం చూడండి.
అక్ష., “పెద్దల్ని.”