కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ భవిష్యత్తు, మీ నిర్ణయం!

మీ భవిష్యత్తు, మీ నిర్ణయం!

మీ భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకునే అవకాశం మీకు నిజంగా ఉంటుందా? కొంతమంది మన జీవితం అదృష్టం లేదా విధిని బట్టి ఉంటుంది గానీ, మన నిర్ణయాల్ని బట్టి కాదు అని అంటారు. వాళ్లు కొన్ని లక్ష్యాలను చేరుకోలేనప్పుడు మనం చేయగలిగేది ఏమి లేదు అని ఊరుకుంటారు. “నాకు అలా రాసిపెట్టిలేదు” అని అంటారు.

మరికొంతమంది మనం నివసిస్తున్న ఈ ఘోరమైన, అన్యాయంతో నిండిన ప్రపంచం నుండి బయట పడడం సాధ్యం కాదని విసుగు చెందారు. వాళ్లు వాళ్ల జీవితాలను మెరుగుపర్చుకోవాలని ప్రయత్నించి ఉంటారు. కానీ యుద్ధం, నేరం, ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్యం, వాళ్ల ప్రణాళికలను మళ్లీమళ్లీ పాడుచేసి ఉండవచ్చు. ‘ఇంక చేసేది ఏమి ఉంది?’ అని వాళ్లు అనుకుంటారు.

అవును జీవితంలో పరిస్థితులు మీ ప్రణాళికలను బాగా పాడుచేయవచ్చు. (ప్రసంగి 9:11) అయితే, మీ శాశ్వత భవిష్యత్తు విషయంలో మాత్రం, మీకు నిర్ణయించుకునే అవకాశం ఉంది. నిజానికి మీ భవిష్యత్తు మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని బైబిలు చెప్తుంది. అక్కడ ఏముందో చూడండి.

ప్రాచీన ఇశ్రాయేలు నాయకుడైన మోషే, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించబోయే ముందు ఇలా చెప్పాడు: జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచాను. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.ద్వితీయోపదేశకాండము 30:15, 19, 20.

జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచాను.ద్వితీయోపదేశకాండము 30:19

అవును! యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశంలో స్వేచ్ఛగా, సంతోషంగా ఉండే ఒక ఏర్పాటు చేశాడు. కానీ ఇదంతా వాళ్లకు దానికదే జరిగిపోదు. ఆ ఆశీర్వాదాలు పొందాలంటే వాళ్లు “జీవాన్ని కోరుకోవాలి.” ఎలా? ఎలాగంటే వాళ్లు దేవున్ని ప్రేమించాలి, ఆయన మాట వినాలి, ఆయనను అంటిపెట్టుకుని ఉండాలి.

ఈ రోజు కూడా మీ ముందు అలాంటి ఒక నిర్ణయమే ఉంది, మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు దేవున్ని ప్రేమించి, ఆయన మాట విని, ఆయనను అంటిపెట్టుకుని ఉంటే పరదైసు భూమ్మీద నిరంతరం జీవించే అవకాశాన్ని పొందుతారు. వీటిని చేయడం వెనకున్న అర్థం ఏమిటి?

దేవున్ని ప్రేమించాలని నిర్ణయించుకోండి

ప్రేమ దేవుని ప్రధాన లక్షణం. “దేవుడు ప్రేమ” అని రాసేలా అపొస్తలుడైన యోహాను ప్రేరేపించబడ్డాడు. (1 యోహాను 4:8) ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని అడిగినప్పుడు, యేసు ఇలా చెప్పాడు: “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి.” (మత్తయి 22:37) యెహోవా దేవునితో నిజమైన స్నేహం, భయం మీద, గుడ్డిగా లోబడడం మీద కాదుగానీ ప్రేమ మీద ఆధారపడి ఉండాలి. కానీ మనం ఆయనను ప్రేమించాలని ఎందుకు నిర్ణయించుకోవాలి?

మనుషుల మీద యెహోవాకున్న ప్రేమ తల్లిదండ్రులకు పిల్లల మీద ఉన్న ప్రేమ లాంటిది. అపరిపూర్ణులైనప్పటికీ ప్రేమగల తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తారు, ప్రోత్సహిస్తారు, మద్దతు ఇస్తారు, క్రమశిక్షణ ఇస్తారు. ఎందుకంటే వాళ్లు సంతోషంగా ఉండాలని, అభివృద్ధి పొందాలని అలా చేస్తారు. దానికి బదులుగా తల్లిదండ్రులు ఏమి కోరుకుంటారు? పిల్లలు వాళ్లను ప్రేమించాలని, వాళ్ల మంచి కోసం తల్లిదండ్రులు నేర్పించిన విషయాలను పిల్లలు మనసుకు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మన పరిపూర్ణ పరలోక తండ్రి మనకోసం ఆయన చేసిన వాటన్నిటికి మనం కృతజ్ఞత చూపించాలని కోరుకోవడం సరైనది కాదా?

ఆయన మాట వినండి

బైబిలు రాసిన అసలు భాషలో, “వినండి” అనే మాటకు “లోబడండి” అనే భావం వస్తుంది. “మీ అమ్మానాన్నల మాట వినండి” అని మనం పిల్లలతో చెప్పినప్పుడు మన ఉద్దేశం కూడా అదే. దేవుని మాట వినడం అంటే ఆయన చెప్పే విషయాలను తెలుసుకుని వాటికి లోబడడం అని అర్థం. దేవుడు మాట్లాడుతుంటే మనం నేరుగా వినలేం. అయితే, ఆయన వాక్యమైన బైబిల్ని చదివి అందులో ఉన్న విషయాలను పాటిస్తే మనం ఆయన మాట విన్నట్లు అవుతుంది.—1 యోహాను 5:3.

దేవుని మాట వినడం ఎంత ముఖ్యమో చూపించడానికి ఒకసారి యేసు ఇలా చెప్పాడు: “మనిషి రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ యెహోవా నోటినుండి వచ్చే ప్రతీ మాట వల్ల జీవిస్తాడు.” (మత్తయి 4:4) మనకు ఆహారం ఎంత ముఖ్యమో, దేవుని గురించి తెలుసుకోవడం అంతకన్నా ముఖ్యం. ఎందుకు? జ్ఞానియైన సొలొమోను ఇలా వివరించాడు: “జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.” (ప్రసంగి 7:12) దేవుని నుండి వచ్చే జ్ఞానం, తెలివి ఇప్పుడు మనల్ని రక్షిస్తాయి, భవిష్యత్తులో నిరంతర జీవితాన్ని పొందేలా మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేస్తాయి.

ఆయనను అంటిపెట్టుకుని ఉండండి

ముందు ఆర్టికల్‌లో మనం పరిశీలించిన యేసు ఉపమానాన్ని గుర్తుచేసుకోండి, ఆయన ఇలా అన్నాడు: “జీవానికి నడిపించే ద్వారం ఇరుకుగా, ఆ దారి కష్టంగా ఉంది; కొంతమందే దాన్ని కనుక్కుంటున్నారు.” (మత్తయి 7:13, 14) అలాంటి రోడ్డులో ప్రయాణించేటప్పుడు మన గమ్యం చేరుకోవాలంటే ఆ రోడ్డు గురించి బాగా తెలిసిన ఒక అతని వెంట మనం ఉంటే బాగుంటుంది. మన గమ్యం నిరంతర జీవితం. కాబట్టి మనం దేవున్ని అంటిపెట్టుకుని ఉండడం మంచిది. (కీర్తన 16:8) అయితే మనం ఆయనను ఎలా అంటిపెట్టుకుని ఉండవచ్చు?

ప్రతిరోజూ మనం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి, వాటితోపాటు మనకు చేయడం ఇష్టమైన పనులు కూడా చాలా ఉంటాయి. అలాంటి వాటితో మన జీవితం నిండిపోయి లేదా మునిగిపోయి దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి లేదా వాటి గురించి ఆలోచించడానికి కూడా మనకు సమయం ఉండదు. అందుకే బైబిలు ఇలా గుర్తు చేస్తుంది: “మీరు ఎలా నడుచుకుంటున్నారో చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. మీరు తెలివితక్కువ వాళ్లలా కాకుండా తెలివిగల వాళ్లలా నడుచుకోండి. మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి, ఎందుకంటే రోజులు చాలా చెడ్డవి.” (ఎఫెసీయులు 5:15, 16) మన జీవితంలో అన్నిటికన్నా దేవునికి ముఖ్యమైన స్థానం ఇవ్వడం ద్వారా మనం దేవునికి దగ్గరగా ఉంటాము.—మత్తయి 6:33.

నిర్ణయం మీదే

మీరు ఏమి చేసిన మీ గతాన్ని మార్చలేరు, కానీ మీ కోసం, మీ ప్రియమైన వాళ్ల కోసం సురక్షితమైన, మంచి భవిష్యత్తును పొందేలా నిర్ణయించుకోవచ్చు. మన పరలోక తండ్రియైన యెహోవా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని బైబిలు చెప్తుంది, మనం ఏమి చేయాలని ఆయన కోరుకుంటున్నాడో కూడా ఆయన చెప్పాడు. ప్రవక్తయైన మీకా చెప్పిన మాటలను గమనించండి:

“మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.”మీకా 6:8.

యెహోవాతో నడవమని ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని మీరు స్వీకరిస్తారా? ఆయనతో నడిచేవాళ్లకు యెహోవా ఇచ్చే శాశ్వత ఆశీర్వాదాలను పొందాలని మీరు అనుకుంటున్నారా? నిర్ణయం మీదే!