కంటెంట్‌కు వెళ్లు

బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఏమి కావాలి?

బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఏమి కావాలి?

బైబిలు ఇచ్చే జవాబు

 బైబిల్ని అర్థం చేసుకోవడానికి మీరేమి చేయాలో బైబిలే చెప్తోంది. మీరు ఎవరైనా సరే, బైబిల్లోని సందేశం మీరు అర్థం చేసుకోలేనంత “కఠినమైనది కాదు, దూరమైనది కాదు.”—ద్వితీయోపదేశకాండము 30:11.

బైబిల్ని అర్థం చేసుకోవాలంటే …

  1.   సరైన వైఖరి ఉండాలి. బైబిలు, దేవుని వాక్యమని అంగీకరించండి. గర్విష్ఠులను దేవుడు వ్యతిరేకిస్తాడు, కాబట్టి వినయంగా ఉండండి. (1 థెస్సలొనీకయులు 2:13; యాకోబు 4:6) అలాగని ప్రతీదాన్ని గుడ్డిగా నమ్మేయకండి. మీరు మీ ‘ఆలోచనా సామర్థ్యాల్ని’ ఉపయోగించాలని దేవుడు కోరుకుంటున్నాడు.—రోమీయులు 12:1, 2, NW.

  2.   జ్ఞానం కోసం ప్రార్థించాలి. సామెతలు 3:5 లో “నీ స్వబుద్ధిని ఆధారము” చేసుకోవద్దు అని బైబిలు చెప్తోంది. కానీ, బైబిల్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం కోసం ‘దేవుణ్ణి అడుగుతూ’ ఉండమని అది చెప్తోంది.—యాకోబు 1:5, NW.

  3.   రోజూ చదవాలి. మీరు బైబిల్ని అప్పుడప్పుడూ కాకుండా రోజూ స్టడీ చేస్తే మరింత ప్రయోజనం పొందుతారు.—యెహోషువ 1:8.

  4.   అంశాల వారీగా స్టడీ చేయాలి. ప్రత్యేకించి ఒక అంశాన్ని తీసుకుని, దాని గురించి బైబిలు చెప్తున్న విషయాలను పరిశీలించండి. లేఖనాలు బోధించే విషయాన్ని నేర్చుకోవడానికి అది ఒక చక్కని మార్గం. ముందు, ప్రాథమిక పాఠాలు అంటే సులువైన అంశాలు స్టడీ చేయండి, తర్వాత మెల్లమెల్లగా పెద్ద విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోండి. (హెబ్రీయులు 6:1, 2) ఒక లేఖనాన్ని మరో లేఖనంతో పోల్చవచ్చని మీరు తెలుసుకుంటారు. అంతేగాక బైబిల్లోని కొన్ని భాగాలు, “గ్రహించుటకు కష్టమైన” భాగాలతో సహా, ఇతర భాగాలను కూడా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని మీరు తెలుసుకుంటారు.—2 పేతురు 3:16.

  5.   ఇతరుల సహాయం తీసుకోవాలి. బైబిల్ని అర్థం చేసుకున్నవాళ్ల సహాయం తీసుకోమని బైబిలు ప్రోత్సహిస్తోంది. (అపొస్తలుల కార్యములు 8:30, 31) యెహోవాసాక్షులు బైబిల్లోని విషయాలను ఉచితంగా నేర్పిస్తారు. వాళ్లు మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లా లేఖనాలను ఉపయోగించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోందో అర్థం చేసుకోవడానికి ఇతరులకు సహాయం చేస్తారు.—అపొస్తలుల కార్యములు 17:2, 3.

మీకు అవసరం లేనివి

  1.   గొప్ప తెలివితేటలు, పెద్దపెద్ద చదువులు. యేసు 12 మంది అపొస్తలులను కొంతమంది “విద్యలేని పామరులని” అన్నారు, అయినా వాళ్లు లేఖనాలను అర్థం చేసుకున్నారు, ఇతరులకు బోధించారు.—అపొస్తలుల కార్యములు 4:13.

  2.   డబ్బు. మీరు బైబిల్లోని విషయాలను నేర్చుకోవడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.”—మత్తయి 10:8.