కంటెంట్‌కు వెళ్లు

స్వేచ్ఛాచిత్తం గురించి బైబిలు ఏం చెప్తుంది? మన జీవితం దేవుని చేతుల్లో ఉందా?

స్వేచ్ఛాచిత్తం గురించి బైబిలు ఏం చెప్తుంది? మన జీవితం దేవుని చేతుల్లో ఉందా?

బైబిలు ఇచ్చే జవాబు

 స్వేచ్ఛాచిత్తాన్ని ఇచ్చి దేవుడు మనల్ని గౌరవించాడు. అంటే మనం ఏమి చేస్తామనేది ముందుగానే దేవుడు లేదా విధి నిర్ణయించే బదులు మనమే సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మనకు ఉంది. దీని గురించి బైబిలు ఏం చెప్తుందో చూడండి.

  •   దేవుడు మనుషులను తన పోలికలో సృష్టించాడు. (ఆదికాండము 1:26) జంతువులు వాటి సహజమైన ప్రవృత్తికి తగ్గట్లుగా ప్రవర్తిస్తాయి. కానీ మనం మాత్రం మన సృష్టికర్తలా ప్రేమ, న్యాయం వంటి లక్షణాలను మనకు సాధ్యమైనంత వరకు చూపించగలుగుతాం. మన సృష్టికర్తలాగే మనకు కూడా స్వేచ్ఛాచిత్తం ఉంది.

  •   చాలావరకు మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోగలం. “ఆయన [దేవుని] వాక్యము విని జీవాన్ని కోరుకోండి” అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలకు మనం లోబడాలి. (ద్వితీయోపదేశకాండము 30:19, 20) ఒకవేళ మనకు స్వేచ్ఛ ఇవ్వకపోతే ఈ మాటలకు అర్థం లేదు. నిజానికి అది చాలా దారుణం కూడా. తాను చెప్పింది చేయమని మనల్ని బలవంతపెట్టే బదులు దేవుడు ప్రేమతో ఇలా చెప్తున్నాడు, “నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలె” ఉంటుంది.—యెషయా 48:18.

  •   మన గెలుపు, ఓటములు విధి మీద ఆధారపడి ఉండవు. మన ప్రయత్నాల్లో విజయం సాధించాలనుకుంటే దానికోసం కష్టపడాలి. “చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము” అని బైబిలు చెప్తోంది. (ప్రసంగి 9:10) అంతేకాదు “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు” అని కూడా బైబిలు చెప్తోంది.—సామెతలు 21:5.

 స్వేచ్ఛాచిత్తం దేవుడు ఇచ్చిన అమూల్యమైన బహుమానం. ఎందుకంటే ఆయన్ను “పూర్ణహృదయముతో” ప్రేమించడానికి అది మనకు సహాయం చేస్తుంది. మనం కూడా అదే కోరుకుంటాం కదా!—మత్తయి 22:37.

దేవునికి అన్నిటిపై అధికారం ఉందా?

 దేవుడు సర్వశక్తుడు అని బైబిలు బోధిస్తోంది, ఆయన శక్తి పూర్తిగా ఆయన అధీనంలోనే ఉంటుంది. (యోబు 37:23; యెషయా 40:26) కానీ అన్నిటిని తన అదుపులో పెట్టుకోవడానికి ఆయన తన శక్తిని ఉపయోగించడు. ఉదాహరణకు, తన ప్రజల శత్రువైన ప్రాచీన బబులోను విషయంలో దేవుడు తన కోపాన్ని ‘అణచుకున్నాడని’ బైబిలు చెప్తుంది. (యెషయా 42:14) అదేవిధంగా ఇప్పుడు కూడా, తమ స్వేచ్ఛాచిత్తాన్ని ఇతరులకు హాని చేయడానికి ఉపయోగించే వాళ్ల విషయంలో దేవుడు తన కోపాన్ని అణచుకుంటున్నాడు. కానీ దేవుడు ఎప్పటికీ అలానే సహిస్తూ ఉండడు.—కీర్తన 37:10, 11.