పాఠకుల ప్రశ్న
మెసేజ్ యాప్‌లను ఉపయోగించే విషయంలో క్రైస్తవులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
కుటుంబ సభ్యులతో, తోటి సహోదర సహోదరీలతో మాట్లాడడానికి కొంతమంది క్రైస్తవులు టెక్నాలజీని ఉపయోగిస్తారు. అయితే పరిణతిగల క్రైస్తవులు ఈ సలహాను మనసులో ఉంచుకుంటారు: “వివేకం గలవాడు అపాయాన్ని చూసి దాక్కుంటాడు, అనుభవం లేనివాడు నేరుగా ముందుకెళ్లి పర్యవసానాలు అనుభవిస్తాడు.”—సామె. 27:12.
మనల్ని కాపాడాలనే కోరిక యెహోవాకు ఉందని మనకు తెలుసు. అందుకే విభజనలు సృష్టించే వాళ్లతో, బహిష్కరించబడిన వాళ్లతో, తప్పుడు ఆలోచనల్ని చెప్పే వాళ్లతో మనం సహవాసం చేయం. (రోమా. 16:17; 1 కొరిం. 5:11; 2 యోహా. 10, 11) సంఘంతో సహవసించే వాళ్లలో కూడా కొంతమంది బైబిలు నియమాలకు లోబడకపోవచ్చు. (2 తిమో. 2:20, 21) కాబట్టి, స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం. అయితే, మెసేజ్ యాప్‌లు ఉపయోగించి మంచి స్నేహితుల్ని ఎంచుకోవడం కష్టంగా ఉండవచ్చు.
ఎక్కువమంది ఉన్న మెసేజ్ గ్రూపులో జాయిన్ అవ్వాలో వద్దో నిర్ణయించుకునేటప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొందరు క్రైస్తవులు అలాంటి మెసేజ్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి సమస్యల్ని కొని తెచ్చుకున్నారు. వందలమంది లేదా వేలమంది ఉండే గ్రూపుల విషయంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండవచ్చు? అసలు ఆ గ్రూపులో ఉన్నవాళ్లు ఎవరో, వాళ్లందరి ఆధ్యాత్మిక స్థితి ఏంటో మనకు తెలీదు. కీర్తన 26:4 ఇలా చెప్తుంది: “మోసగాళ్లతో నేను సహవసించను, తమ నిజ స్వరూపాన్ని దాచిపెట్టేవాళ్లకు నేను దూరంగా ఉంటాను.” కాబట్టి మనకు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్లతో మాట్లాడడానికి మాత్రమే మెసేజ్ యాప్‌లను ఉపయోగించడం సరైనది.
ఒకవేళ మెసేజ్ గ్రూపులో కొంతమందే ఉన్నా, ఒక క్రైస్తవుడు దానికోసం ఎంత సమయం వెచ్చిస్తున్నాడో, ఆ గ్రూపులో ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. గ్రూపులో వాళ్లు మాట్లాడే ప్రతీదానికి మనం జవాబు ఇవ్వాల్సిన అవసరంలేదు. అలాగే చాలాసేపటి నుండి మాట్లాడుతున్నారు కాబట్టి మనం కూడా ఏదోక మెసేజ్ పెట్టాలని అనుకోకూడదు. ‘ఊసుపోని కబుర్లు చెప్పే, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునే’ వాళ్లతో జాగ్రత్తగా ఉండమని పౌలు తిమోతిని హెచ్చరించాడు. (1 తిమో. 5:13) నేడు మెసేజ్ యాప్‌లను వాడే విషయంలో కూడా ఆ సలహా ఉపయోగపడుతుంది.
పరిణతిగల క్రైస్తవుడు తోటి విశ్వాసుల గురించిన విమర్శల్ని, రహస్యాల్ని వేరేవాళ్లకు చెప్పడు లేదా వినడు. (కీర్త. 15:3; సామె. 20:19) అలాగే సంచలన వార్తలకు, నిజమో కాదో తెలియని వార్తలకు దూరంగా ఉంటాడు. (ఎఫె. 4:25) నిజానికి మనం పుష్కలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని, నమ్మదగిన వార్తల్ని jw.org వెబ్‌సైట్ ద్వారా, నెలనెల వచ్చే JW బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా అందుకుంటున్నాం.
కొంతమంది సాక్షులు వేటినైనా అమ్మడానికి, కొనడానికి, వ్యాపార ప్రకటనలు చేయడానికి, లేదా ఉద్యోగ అవకాశాల గురించి చెప్పడానికి మెసేజ్ యాప్‌లు ఉపయోగిస్తారు. అయితే అవి వ్యాపార సంబంధమైన విషయాలు, మన ఆరాధనకు వాటితో ఎలాంటి సంబంధం లేదు. క్రైస్తవులు ‘డబ్బును ప్రేమించరు’ కాబట్టి వ్యాపార సంబంధమైన విషయాల కోసం సహోదరుల్ని వాడుకోరు.—హెబ్రీ. 13:5.
అవసరంలో ఉన్న సహోదరులకు సహాయం చేయడం కోసం, లేదా విపత్తు సహాయక పనుల కోసం డబ్బులు సేకరించడానికి మెసేజ్ యాప్‌లను ఉపయోగించవచ్చా? మనం ప్రేమతో తోటి సహోదరులకు సహాయం చేయాలనుకుంటాం, వాళ్లను ప్రోత్సహించాలనుకుంటాం. (యాకో. 2:15, 16) అయితే ఎక్కువమంది ఉన్న మెసేజ్ గ్రూపుల ద్వారా మనం అలా చేయడానికి ప్రయత్నిస్తే, బ్రాంచి కార్యాలయం లేదా సంఘ పెద్దలు చేసిన చక్కని ఏర్పాట్లకు ఆటంకం కలగవచ్చు. (1 తిమో. 5:3, 4, 9, 10, 16) సహోదరుల్ని చూసుకోవడానికి మనం ప్రత్యేకంగా ఎంచుకోబడ్డాం అన్నట్టుగా ప్రవర్తించాలని మనలో ఎవ్వరం కోరుకోం.
దేవునికి మహిమ తీసుకొచ్చే పనులు చేయాలని మనం కోరుకుంటాం. (1 కొరిం. 10:31) కాబట్టి, ఏదైనా మెసేజ్ యాప్‌ని లేదా టెక్నాలజీని ఉపయోగించాలో వద్దో నిర్ణయించుకునేటప్పుడు అందులో ఉండే ప్రమాదాల గురించి ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి.