కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

‘నేను శాంతిని తీసుకురావడానికి వచ్చానని అనుకోకండి’ అని యేసు చెప్పిన మాటలకు అర్థమేంటి?

యేసు ప్రజలకు శాంతి సందేశాన్ని ప్రకటించాడు. అయితే, ఆయన ఒక సందర్భంలో తన అపొస్తలులతో ఇలా అన్నాడు: “నేను భూమ్మీదికి శాంతిని తీసుకురావడానికి వచ్చానని అనుకోకండి; శాంతిని కాదు, కత్తిని తీసుకురావడానికే వచ్చాను. ఎందుకంటే కుమారుడికి తండ్రికి, కూతురికి తల్లికి, కోడలికి అత్తకి మధ్య విరోధం పెట్టడానికే నేను వచ్చాను.” (మత్త. 10:34, 35) ఆ మాటలకు అర్థమేంటి?

కుటుంబాల్ని విడగొట్టాలన్నది యేసు ఉద్దేశం కాదు. అయితే, తన బోధలు కొన్ని కుటుంబాల్లో విరోధాన్ని తీసుకొస్తాయని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఒకవ్యక్తి క్రీస్తు శిష్యుడై, బాప్తిస్మం తీసుకోవాలని కోరుకున్నప్పుడు, ఆ నిర్ణయాన్ని తన కుటుంబ సభ్యులు ఇష్టపడకపోవచ్చు అని అర్థంచేసుకోవాలి. వివాహజత నుండి లేదా మిగతా కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదురైతే, క్రీస్తు బోధలకు అంటిపెట్టుకుని ఉండడం అతనికి కష్టం అవ్వవచ్చు.

బైబిలు క్రైస్తవుల్ని ఇలా ప్రోత్సహిస్తుంది: “మనుషులందరితో శాంతిగా మెలగండి.” (రోమా. 12:18) కానీ, యేసు బోధలు కొన్ని కుటుంబాల్లో “కత్తిని” తీసుకురావచ్చు. అదెలా? కుటుంబంలో ఒకరు యేసు బోధల్ని అంగీకరించవచ్చు, కానీ మిగతావాళ్లు వాటిని ఇష్టపడకపోవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు. అలాంటి సందర్భాల్లో, సత్యం నేర్చుకుంటున్న వ్యక్తికి తన ఇంట్లోవాళ్లే “శత్రువులు అవుతారు.”—మత్త. 10:36.

కొన్నిసార్లు అతనికి, సత్యంలోలేని కుటుంబ సభ్యుల్ని సంతోషపెట్టాలా లేక యెహోవాను, యేసును సంతోషపెట్టాలా అనే పరిస్థితి రావచ్చు. ఉదాహరణకు, సత్యంలోలేని కుటుంబ సభ్యులు ఏదైనా ఒక పండుగలో పాల్గొనమని అతన్ని ఒత్తిడి చేయవచ్చు. అలాంటప్పుడు, అతను ఎవర్ని సంతోషపెడతాడు? యేసు ఇలా అన్నాడు: “తండ్రిని గానీ, తల్లిని గానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి నా శిష్యుడిగా ఉండే అర్హత లేదు.” (మత్త. 10:37) తన శిష్యులుగా ఉండాలంటే తల్లిని, తండ్రిని తక్కువ ప్రేమించాలని యేసు చెప్పట్లేదు. బదులుగా, తమ జీవితంలో ఎవరికి ముఖ్యమైన స్థానం ఇవ్వాలో నొక్కి చెప్తున్నాడు. ఒకవేళ సత్యంలోలేని కుటుంబ సభ్యులు మనల్ని వ్యతిరేకించినా, మనం వాళ్లను ప్రేమిస్తూనే ఉంటాం. అయితే, వాళ్లకంటే ఎక్కువగా యెహోవాను ప్రేమించాలని గుర్తుంచుకుంటాం.

కుటుంబ సభ్యుల నుండి ఎదురయ్యే వ్యతిరేకత చాలా బాధ కలిగిస్తుంది, అందులో సందేహం లేదు. అయినా, క్రీస్తు శిష్యులు ఈ మాటల్ని మనసులో ఉంచుకుంటారు: “తన హింసాకొయ్యను మోసుకుంటూ నన్ను అనుసరించని వ్యక్తికి నా శిష్యుడిగా ఉండే అర్హత లేదు.” (మత్త. 10:38) మరో మాటలో చెప్పాలంటే, క్రీస్తు శిష్యులు ఇష్టపూర్వకంగా సహించాల్సిన బాధల్లో, కుటుంబ సభ్యుల నుండి వచ్చే వ్యతిరేకత కూడా ఒకటని క్రైస్తవులు గుర్తిస్తారు. అదే సమయంలో, తమ మంచి ప్రవర్తన వల్ల తమ కుటుంబ సభ్యులు మనసు మార్చుకుని, ఏదోకరోజు సత్యం నేర్చుకుంటారనే ఆశతో ఉంటారు.—1 పేతు. 3:1, 2.