కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

ఒక క్రైస్తవుడు లేఖనంలో ఉన్న కారణాన్నిబట్టి కాకుండా వేరే కారణంతో తన భార్యకు విడాకులు ఇచ్చి ఇంకొకర్ని పెళ్లి చేసుకుంటే, సంఘంలోని వాళ్లు మొదటి పెళ్లిని, రెండో పెళ్లిని ఎలా చూస్తారు?

అలాంటి పరిస్థితిలో సంఘంలోనివాళ్లు మొదటి పెళ్లి ముగిసిందని, ఆ వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ కొత్త బంధాన్ని గౌరవించాలని అనుకోవచ్చు. వాళ్లు అలా అనుకోవడానికి కారణాలేంటి? దీన్ని అర్థంచేసుకోవడానికి యేసు విడాకుల గురించి, తిరిగి పెళ్లి చేసుకోవడం గురించి అసలేం చెప్పాడో చూద్దాం.

మత్తయి 19:9 లో విడాకులు తీసుకోవడానికి ఉన్న ఒకేఒక్క కారణాన్ని యేసు చెప్పాడు. ఆయన అక్కడిలా చెప్పాడు: “లైంగిక పాపం అనే కారణాన్ని బట్టి కాకుండా తన భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకునే ప్రతీ వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు.” యేసు మాటల్నిబట్టి మనమేం నేర్చుకోవచ్చంటే: (1) ఒకవ్యక్తి విడాకులు తీసుకోవడానికి లేఖనాల్లో ఉన్న ఒకేఒక్క కారణం లైంగిక పాపం. (2) ఒకవ్యక్తి లేఖనాల్లో ఉన్న ఆ కారణాన్నిబట్టి కాకుండా తన భార్యకు విడాకులు ఇచ్చి, మళ్లీ పెళ్లిచేసుకుంటే అతను వ్యభిచారం చేస్తున్నట్టే. *

యేసు మాటల్నిబట్టి ఒకవ్యక్తి లైంగిక పాపం చేసి తన భార్యకు విడాకులు ఇస్తే, అతను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి లేఖనాధార స్వేచ్ఛ ఉన్నట్లేనా? అలా అని చెప్పలేం. ఒకవేళ భర్త వ్యభిచారం చేస్తే, ఏ తప్పూ చేయని అతని భార్య అతన్ని క్షమించాలా వద్దా అని నిర్ణయిస్తుంది. ఒకవేళ ఆమె అతన్ని క్షమించకూడదని నిర్ణయించుకుని, చట్టబద్ధంగా విడాకులు తీసుకోవాలని అనుకుంటే, విడాకులు మంజూరు అయిన తర్వాత వాళ్లిద్దరికి మళ్లీ పెళ్లి చేసుకునే స్వేచ్ఛ వస్తుంది.

మరోవైపు ఏ తప్పూ చేయని భార్య తన వివాహాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తన భర్తను క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పవచ్చు. అయితే అతను దానికి ఒప్పుకోకుండా తనకైతానే చట్టబద్ధంగా విడాకులు తీసుకుంటే అప్పుడేంటి? ఆమె అతన్ని క్షమించి తన వివాహాన్ని కొనసాగించాలని అనుకుంటుంది కాబట్టి, అతనికి లేఖనాధారంగా మళ్లీ పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉండదు. ఆ స్వేచ్ఛ లేకపోయినా అతను ఇంకొకర్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే, అతను మళ్లీ వ్యభిచారం చేస్తున్నట్టే. అప్పుడు సంఘపెద్దలు అతనిమీద న్యాయనిర్ణయ కమిటీని మళ్లీ ఇంకొకసారి ఏర్పాటు చేయాల్సి వస్తుంది.—1 కొరిం. 5:1, 2; 6:9, 10.

ఒకవ్యక్తికి లేఖనాధారంగా స్వేచ్ఛ లేకపోయినా మళ్లీ పెళ్లిచేసుకుంటే సంఘంలోనివాళ్లు అతని మొదటి పెళ్లిని, రెండో పెళ్లిని ఎలా చూస్తారు? బైబిలు ప్రకారం అతని మొదటి పెళ్లి ఇంకా చెల్లుతుందా? ఏ తప్పుచేయని భార్య తన మాజీ భర్తను క్షమించాలా, వద్దా అనే నిర్ణయాన్ని ఇంకా తీసుకోగలదా? అతను రెండో పెళ్లి చేసుకుంటే, సంఘంలోనివాళ్లు ఆ పెళ్లిని వ్యభిచార వివాహంగా చూస్తారా?

ఏ తప్పూ చేయని భార్య బ్రతికున్నంత వరకూ, మళ్లీ పెళ్లి చేసుకోనంత వరకూ అలాగే ఎవ్వరితో లైంగిక పాపం చేయనంత వరకూ సంఘంలోనివాళ్లు ఆ రెండో పెళ్లిని వ్యభిచార వివాహంగా గతంలో పరిగణించేవారు. అయితే విడాకులు, తిరిగి పెళ్లిచేసుకోవడం గురించి యేసు మాట్లాడుతున్నప్పుడు ఏ తప్పూ చేయని భార్య గురించి మాట్లాడలేదు. బదులుగా, లేఖనాల్లో ఉన్న కారణాన్నిబట్టి కాకుండా ఒకవ్యక్తి విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లిచేసుకుంటే, అతను వ్యభిచారం చేస్తున్నట్టే అని యేసు వివరించాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి చేసుకున్న మొదటి పెళ్లి రద్దౌతుంది.

“లైంగిక పాపం అనే కారణాన్నిబట్టి కాకుండా తన భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకునే ప్రతీ వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు.”—మత్త. 19:9

విడాకులు తీసుకోవడం, మళ్లీ పెళ్లి చేసుకోవడంవల్ల మొదటి పెళ్లి ముగిసినప్పుడు ఏ తప్పూ చేయని భార్య, తన మాజీ భర్తను క్షమించడం లేదా క్షమించకపోవడం ఇక సాధ్యంకాదు. కాబట్టి ఆ కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఆమెకు ఇక ఉండదు. అంతేకాదు, సంఘంలోనివాళ్లు రెండో పెళ్లిని ఎలా పరిగణిస్తారో అన్నది ఏ తప్పూ చేయని భార్య చనిపోయిందా, మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా లైంగిక పాపం చేసిందా అనే వాటిమీద ఆధారపడివుండదు. *

పైన చెప్పిన ఉదాహరణలో, భర్త వ్యభిచారం చేశాడు కాబట్టి అది విడాకులకు దారితీసింది. కానీ ఒకవేళ భర్త వ్యభిచారం చేయకుండా తన భార్యకు విడాకులు ఇచ్చి, మళ్లీ పెళ్లి చేసుకుంటే అప్పుడేంటి? లేదా ఒక భర్త విడాకులు తీసుకోకముందు లైంగిక పాపం చేయలేదు, కానీ విడాకులు తీసుకున్న తర్వాత ఆ పాపం చేసి, అతని భార్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నా దానికి ఒప్పుకోకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటే అప్పుడేంటి? ఈ రెండు సందర్భాల్లో కూడా విడాకులు తీసుకోవడం, మళ్లీ పెళ్లిచేసుకోవడం వ్యభిచారం చేసినట్లు అవుతుంది కాబట్టి మొదటి పెళ్లి రద్దౌతుంది. అతను చేసుకున్న రెండో పెళ్లి చట్టబద్ధం అవుతుంది. దానిగురించి 1979, నవంబరు 15 (ఇంగ్లీషు) కావలికోటలోని 32వ పేజీలో చెప్పినట్టు, “అతను కొత్త వివాహబంధంలోకి ప్రవేశించాడు కాబట్టి దాన్ని ఊరికే ముగించేసి తిరిగి మొదటి భార్య దగ్గరికి వెళ్లలేడు. ఎందుకంటే విడాకులు తీసుకోవడం, వ్యభిచారం చేయడం అలాగే మళ్లీ పెళ్లి చేసుకోవడంవల్ల మొదటి వివాహబంధం ముగిసింది.”

అవగాహనలో వచ్చిన ఈ మార్పు, వివాహబంధానికి ఉన్న పవిత్రతను తగ్గించట్లేదు. లేదా వ్యభిచారం చేయడం అంత పెద్ద పాపమేమీ కాదని చెప్పట్లేదు. ఒకవ్యక్తి లేఖనాల్లో ఉన్న కారణాన్నిబట్టి కాకుండా తన భార్యకు విడాకులు ఇచ్చి, లేఖనాధార స్వేచ్ఛ లేకుండానే ఇంకొకర్ని పెళ్లిచేసుకుంటే అతను వ్యభిచారం చేస్తున్నాడు. ఆ కారణాన్నిబట్టి పెద్దలు అతనిమీద న్యాయనిర్ణయ కమిటీ ఏర్పాటు చేస్తారు. (ఒకవేళ రెండో భార్య యెహోవాసాక్షి అయితే, ఆ పెళ్లి చేసుకోవడంవల్ల ఆమె లైంగిక పాపం చేసినట్టు అవుతుంది. దాన్నిబట్టి ఆమెమీద కూడా పెద్దలు న్యాయనిర్ణయ కమిటీ ఏర్పాటు చేస్తారు.) రెండో పెళ్లిని వ్యభిచార వివాహంగా చూడకపోయినా, ఆ భర్త చాలా సంవత్సరాలపాటు సంఘంలో ప్రత్యేక సేవావకాశాలకు అర్హుడు అవ్వకపోవచ్చు. ఒకవేళ చాలా సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తికి సంఘంలో ఏదైనా ఒక బాధ్యత ఇవ్వాలని పెద్దలు అనుకుంటే, వాళ్లు ముందుగా ఈ ప్రశ్నల గురించి ఆలోచించాలి. సంఘంలోని వాళ్లతోసహా బయటివాళ్లు ఎవరైనా ఆ వ్యక్తి చేసిన పనికి ఇంకా నొచ్చుకుంటున్నారా? ఆ వ్యక్తికి సంఘంలో గౌరవం ఉందా? ఆ వ్యక్తి ఎవరికైతే కావాలని నమ్మకద్రోహం చేశాడో ఆ మొదటి భార్య ప్రస్తుత పరిస్థితుల్ని, భావాల్ని కూడా పెద్దలు పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ అతను కుటుంబాన్ని విడిచిపెట్టినప్పుడు, పిల్లలు ఉండి వాళ్లు ప్రస్తుతం ఇంకా మైనర్లు అయితే, వాళ్ల భావాల గురించి కూడా పెద్దలు ఆలోచించాలి.—మలా. 2:14-16.

లేఖనాల్లో ఉన్న కారణాన్నిబట్టి కాకుండా ఎవరైనా విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకుంటే, అలాంటివాళ్లు తీవ్రమైన పర్యవసానాల్ని ఎదుర్కొంటారు. కాబట్టి వివాహాన్ని యెహోవా ఎలాగైతే పవిత్రంగా చూస్తాడో, క్రైస్తవులు కూడా అలానే చూడడం తెలివైనపని.—ప్రసం. 5:4, 5; హెబ్రీ. 13:4.

^ ఈ ఆర్టికల్‌లో వ్యభిచారం చేసిన వ్యక్తిని భర్తగా, ఏ తప్పూ చేయని వ్యక్తిని భార్యగా చెప్తున్నాం. కానీ మార్కు 10:11, 12 లో యేసు చెప్పిన మాటల ప్రకారం ఈ సలహా ఆడవాళ్లకు, మగవాళ్లకు సమానంగా వర్తిస్తుంది.

^ ఏ తప్పూ చేయని భార్య బ్రతికున్నంత వరకూ, మళ్లీ పెళ్లి చేసుకోనంత వరకూ లేదా ఎవ్వరితో లైంగిక పాపం చేయనంత వరకూ సంఘంలోనివాళ్లు రెండో పెళ్లిని వ్యభిచార వివాహంగా గతంలో చూసేవాళ్లు. అయితే ఇప్పుడు ఆ అవగాహనలో మార్పు వచ్చింది.