కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

కీర్తన 144:12-15 లోని మాటలు దేవుని ప్రజలకు వర్తిస్తాయా, లేక 11వ వచనంలో ప్రస్తావించిన దుష్టులైన అన్యులకు వర్తిస్తాయా?

ఆ హీబ్రూ పదాల్ని రెండు రకాలుగానూ అర్థంచేసుకోవచ్చు. అయినప్పటికీ, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు సహాయం చేస్తాయి:

  1. ఆ కీర్తనలోని మిగతా వచనాల్ని పరిశీలించడం. 12-14 వచనాల్లో ప్రస్తావించిన ఆశీర్వాదాలు నీతిమంతులకు వర్తిస్తాయని అర్థమౌతుంది. అంటే, దుష్టుల నుండి “తప్పింపుము. . . నన్ను విడిపింపుము” (11 వ వచనం) అని మొరపెట్టుకుంటున్న వాళ్లకు వర్తిస్తాయి. 15వ వచనంలో రెండుసార్లు “ధన్యులు” అని ఉపయోగించిన మాటలు కూడా వాళ్లకే, అంటే “యెహోవా తమకు దేవుడుగా​గల” ప్రజలకే వర్తిస్తాయి!

  2. ఈ అవగాహన, దేవుని నమ్మకమైన ప్రజలు పొందే ఆశీర్వాదాల్ని వివరించే మిగతా బైబిలు వృత్తాంతాలకు పొందికగా ఉంది. దేవుడు ఇశ్రాయేలీయుల్ని శత్రువుల నుండి విడిపించిన తర్వాత వాళ్లను సంతోషంతో, సమృద్ధితో దీవిస్తాడని దావీదుకున్న బలమైన నమ్మకం ఈ కీర్తనలో కనిపిస్తుంది. (లేవీ. 26:9, 10; ద్వితీ. 7:13; కీర్త. 128:​1-6) ఉదాహరణకు, ద్వితీయోపదేశకాండము 28:4 లో ఇలా ఉంది, “నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింప​బడును.” దావీదు కొడుకైన సొలొమోను పరిపాలనలో ఇశ్రాయేలు జనాంగం ముందెప్పుడూ లేనంత సమాధానాన్ని, సమృద్ధిని అనుభవించింది. నిజానికి, సొలొమోను పరిపాలన మెస్సీయ పరిపాలనకు ముంగుర్తుగా ఉంది.—1 రాజు. 4:20, 21; కీర్త. 72:1-20.

కాబట్టి, కీర్తన 144 లోని మాటలు ఎవరికి వర్తిస్తాయో తెలుసుకోవడం వల్ల, ఎంతోకాలంగా యెహోవా సేవకులు కలిగివున్న నిరీక్షణ గురించి ఆ కీర్తనంతా స్పష్టంగా తెలియజేస్తుందని అర్థంచేసుకోగలిగాం. ఇంతకీ ఆ నిరీక్షణ ఏమిటి? దేవుడు చెడ్డవాళ్లను నాశనం చేసి నీతిమంతులకు శాశ్వతకాలం సమాధానాన్ని, సమృద్ధిని ఇస్తాడనేదే ఆ నిరీక్షణ.​—కీర్త. 37:10, 11.