కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

ఆదికాండం 1:26—“మన స్వరూపమందు . . . నరులను చేయుదము”

ఆదికాండం 1:26—“మన స్వరూపమందు . . . నరులను చేయుదము”

 “తర్వాత దేవుడు ఇలా అన్నాడు: ‘మన స్వరూపంలో, మనలా మనిషిని తయారుచేద్దాం. వాళ్లు సముద్రంలోని చేపల్ని, ఆకాశంలో ఎగిరే ప్రాణుల్ని, సాధు జంతువుల్ని, భూమినంతటినీ, అలాగే భూమ్మీద కదిలే ప్రతీ పాకే జంతువును ఏలాలి.’”—ఆదికాండం 1:26, కొత్త లోక అనువాదం.

 “దేవుడు—మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.”—ఆదికాండం 1:26, పరిశుద్ధ గ్రంథము.

ఆదికాండం 1:26 అర్థమేంటి?

 దేవుడు తన స్వరూపంలో మనుషుల్ని సృష్టించాడంటే దానర్థం దేవునికి ఉండే ప్రేమ, సహానుభూతి, న్యాయం వంటి లక్షణాలను మనుషులు అలవర్చుకోగలరు, చూపించగలరు. అవును, మనుషులు దేవుని వ్యక్తిత్వాన్ని చూపించడం సాధ్యమౌతుంది.

 “దేవుడు ఇలా అన్నాడు: ‘మన స్వరూపంలో, మనలా మనిషిని తయారుచేద్దాం. యెహోవా దేవుడు a ఎవ్వర్నీ, దేన్నీ సృష్టించక ముందే ఓ శక్తివంతుడైన దేవదూతను సృష్టించాడు. ఆయనే తర్వాత యేసు అనే పేరుతో ఈ భూమ్మీదికి వచ్చాడు. సృష్టి ఆరంభంలో యేసు ద్వారానే “మిగతా వాటన్నిటినీ, అంటే అటు పరలోకంలో ఇటు భూమ్మీద” ఉన్నవాటన్నిటినీ దేవుడు సృష్టించాడు. (కొలొస్సయులు 1:16) యేసు, “కనిపించని దేవుని ప్రతిబింబం.” అందుకే ఆయనకు యెహోవా లాంటి వ్యక్తిత్వం ఉంది. (కొలొస్సయులు 1:15) అలా ఉండడం వల్లనే దేవుడు యేసుతో, “మన స్వరూపంలో, మనలా మనిషిని తయారుచేద్దాం” అనగలిగాడు.

 “వాళ్లు ... సాధు జంతువుల్ని, భూమినంతటినీ ... ఏలాలి.” దేవుడు జంతువుల్ని తన స్వరూపంలో సృష్టించలేదు. మనుషులకు ఉన్నట్టు మనస్సాక్షి గానీ, ప్రేమలాంటి లక్షణాలు గానీ జంతువులకు లేవు. అయినా, దేవుడు జంతువుల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నాడు. అందుకనే జంతువుల్ని మనుషులు “ఏలాలి” అని ఆయన అన్నాడు. ఆ మాటకు “అధికారము కలిగి యుండు” (పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము), “ఏలుబడి చేయు” (పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అనే అర్థాలు కూడా ఉన్నాయి. అంటే యెహోవా, జంతువుల్ని చూసుకునే బాధ్యతను మనుషులకు అప్పగించాడు. (కీర్తన 8:6-8; సామెతలు 12:10) భూమిని, దాని మీదున్న జీవరాశుల్ని మనుషులు చక్కగా చూసుకోవాలన్నదే యెహోవా ఉద్దేశం.

ఆదికాండం 1:26 సందర్భం

 ఆదికాండంలోని మొదటి రెండు అధ్యాయాలు విశ్వాన్ని, మన భూగ్రహాన్ని, భూమ్మీద జీవాన్ని దేవుడు ఎలా సృష్టించాడో క్లుప్తంగా చెప్తున్నాయి. యెహోవా సృష్టించిన ప్రతీది అమోఘంగా ఉంది, అయితే భూమ్మీద ఆయన చేసిన వాటిలో అన్నిటికన్నా ప్రత్యేకమైనది మనుషుల సృష్టే. దేవుడు సృష్టించే పనిని పూర్తి చేసిన తర్వాత, “తాను చేసిన ప్రతీదాన్ని చూసినప్పుడు, ఇదిగో! అది చాలా బాగుంది” అన్నాడు.—ఆదికాండం 1:31.

 సృష్టి విషయంలో ఆదికాండం పుస్తకం ఇస్తున్న వివరాల గురించి ఎక్కువ తెలుసుకోవడానికి దయచేసి ఈ చిన్న వీడియో చూడండి.

ఆదికాండం 1:26 గురించి అపోహలు

 అపోహ: దేవుని లక్షణాల్ని చూపించే సామర్థ్యం మగవాళ్లకు మాత్రమే ఉంది కానీ ఆడవాళ్లకు లేదు.

 వాస్తవం: కొన్ని అనువాదాల్లో ఇక్కడ “పురుషుడు” అనే పదాన్ని వాడడం వల్ల మూల భాష పదం మగవాళ్లకు మాత్రమే వర్తిస్తుందని కొందరు అనుకోవచ్చు. అయితే, ఈ లేఖనంలో వాడిన హెబ్రీ భాషా పదం పురుషులు-స్త్రీలు అనే తేడా లేకుండా మనుషులందర్నీ సూచిస్తుంది. కాబట్టి స్త్రీపురుషులిద్దరూ దేవుని లక్షణాలను చూపించగలరు. దేవుని దగ్గర మంచిపేరు సంపాదించుకుని శాశ్వత జీవితాన్ని అందుకునే అవకాశం మగవాళ్లకు, ఆడవాళ్లకు సమానంగా ఉంది.—యోహాను 3:16.

 అపోహ: దేవునికి మనలాంటి రూపురేఖలే ఉంటాయి.

 వాస్తవం: “దేవుడు అదృశ్య వ్యక్తి”—అంటే ఆయన, ఈ విశ్వంలో మన కంటికి కనిపించే వాటిలా ఉండడు. (యోహాను 4:24) కొన్నిసార్లు బైబిలు ఆయన ముఖం, చేతులు, హృదయం వంటి వాటి గురించి మాట్లాడుతున్నా అవన్నీ మనుషులకు అర్థమయ్యేలా దేవుని గురించి బోధించడానికి ఉపయోగించిన పోలికలు మాత్రమే.—నిర్గమకాండం 15:6; 1 పేతురు 3:12.

 అపోహ: ఆదికాండం 1:26 యేసు దేవుడని నిరూపిస్తుంది.

 వాస్తవం: దేవునికి, యేసుకు తండ్రి కొడుకులకు ఉన్నంత దగ్గరి సంబంధం ఉందిగానీ, వాళ్లిద్దరూ ఒక్కరు కాదు, ఇద్దరు వేర్వేరు వ్యక్తులు. దేవుడు తనకంటే గొప్పవాడని యేసు నేర్పించాడు. (యోహాను 14:28) మరింత సమాచారం కోసం, యేసుక్రీస్తు దేవుడా? వీడియో చూడండి లేదా “యేసును దేవుని కుమారుడు అని బైబిలు ఎందుకు పిలుస్తుంది?” ఆర్టికల్‌ చదవండి.

 ఆదికాండం పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

a యెహోవా అనేది దేవుడే స్వయంగా ఎంచుకున్న పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” ఆర్టికల్‌ చదవండి.