కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

ఆదికాండం 1:1—“మొదట్లో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు.”

ఆదికాండం 1:1—“మొదట్లో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు.”

“మొదట్లో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు.”—ఆదికాండం 1:1, కొత్త లోక అనువాదం.

“ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.”—ఆదికాండం 1:1, పరిశుద్ధ గ్రంథము.

ఆదికాండం 1:1 అర్థమేంటి?

బైబిల్లోని ఈ ప్రారంభ మాటలు రెండు ప్రాముఖ్యమైన సత్యాలను తెలియజేస్తున్నాయి. ఒకటి, ‘ఆకాశానికి, భూమికి’ లేదా భౌతిక విశ్వానికి ఆరంభం ఉంది. రెండు, వాటిని దేవుడు సృష్టించాడు.—ప్రకటన 4:11.

దేవుడు ఎంతకాలం క్రితం విశ్వాన్ని సృష్టించాడో, ఎలా సృష్టించాడో బైబిలు చెప్పడం లేదు. కానీ, ఆయన తన ‘అపారమైన శక్తితో, సంభ్రమాశ్చర్యాలు పుట్టించే బలంతో ’ విశ్వాన్ని సృష్టించాడని అది వివరిస్తుంది.—యెషయా 40:26.

“సృష్టించాడు” అనే మాటను ఓ హీబ్రూ క్రియాపదం నుండి అనువదించారు. హీబ్రూ భాషలో ఆ క్రియాపదాన్ని కేవలం దేవుడు చేసే పనుల్ని వర్ణించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. a బైబిలు సృష్టికర్త అనే మాటను కేవలం యెహోవా b దేవునికే ఆపాదిస్తుంది.—యెషయా 42:5; 45:18.

ఆదికాండం 1:1 సందర్భం

ఆదికాండం పుస్తకంలోని మొదటి వచనం ఆదికాండం 1, 2 అధ్యాయాల్లో ఉన్న సృష్టి వివరాల్ని పరిచయం చేస్తుంది. ఆదికాండం 1:1 నుండి 2:4 వరకున్న భాగం దేవుడు భూమిని, మొదటి పురుషుణ్ణి, స్త్రీని, అలాగే భూమ్మీదున్న వాటన్నిటినీ ఎలా సృష్టించాడనే దాని గురించి కేవలం క్లుప్తమైన వివరాల్నే ఇస్తోంది. ఆ క్లుప్తమైన వివరాలిచ్చిన తర్వాత, దేవుడు మొదటి పురుషుణ్ణి, స్త్రీని సృష్టించిన విధానం గురించి బైబిలు సవివరంగా చెప్తోంది.—ఆదికాండం 2:7-25.

దేవుని సృష్టి పనులు ఆరు “రోజుల” కాలనిడివిలో జరుగుతూ వచ్చాయని ఆదికాండం వివరిస్తోంది. ఇవి 24 గంటలతో కూడిన అక్షరార్థమైన రోజులు కాదు, వాటి నిడివి ఎంతో ఖచ్చితంగా చెప్పలేం. నిజానికి “రోజు” అనే మాటను కేవలం 24 గంటల సమయానికే కాకుండా వేరే కాలనిడివికి కూడా అన్వయించవచ్చు. ఈ విషయాన్ని మనం ఆదికాండం 2:4లో చూడొచ్చు. ఆ వచనం, అంతకుముందు ఆరు రోజులపాటు జరిగిన దేవుని సృష్టి పనులన్నీ ఒక్క “రోజులో” జరిగాయన్నట్టుగా మాట్లాడుతోంది.

ఆదికాండం 1:1 మీద అపోహలు

అపోహ: దేవుడు భౌతిక విశ్వాన్ని కేవలం కొన్ని వేల సంవత్సరాల క్రితమే సృష్టించాడు.

వాస్తవం: విశ్వం ఎప్పుడు సృష్టించబడిందో బైబిలు చెప్పట్లేదు. విశ్వం కోట్ల సంవత్సరాల నాటిదని నేటి శాస్త్రజ్ఞులు వేస్తున్న అంచనాలతో ఆదికాండం 1:1లోని మాట విభేదించట్లేదు. c

అపోహ: దేవుడు త్రిత్వమని ఆదికాండం 1:1 సూచిస్తోంది, ఎందుకంటే ఈ వచనంలో “దేవుడు” అని అనువదించబడిన హీబ్రూ పదం బహు వచనంలో ఉంది.

వాస్తవం: ఇక్కడ “దేవుడు” అని అనువదించబడిన ఎలోహీమ్‌ అనే హీబ్రూ పదం ఒక బహువచనం; ఇది వైభవాన్ని లేదా మహోన్నత్వాన్ని సూచించడానికి వాడారే గానీ చాలామంది వ్యక్తుల్ని సూచించడానికి కాదు. ఆదికాండం 1:1లో ఉపయోగించిన ఎలోహీమ్‌ అనే బహువచనం గురించి మాట్లాడుతూ న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెప్తోంది: “ఇది ఎప్పుడైనా సరే ఏకవచన క్రియాపదంగా పరిగణించబడుతుంది. రాజులు తమ దర్పానికి సూచనగా మేము అని బహువచనంలో సంబోధించుకున్నట్టు అది సంఖ్యను సూచించట్లేదు కానీ గొప్పతనాన్ని సూచిస్తుంది.”—రెండో సంచిక, 6వ సంపుటి, 272వ పేజీ.

ఆదికాండం 1వ అధ్యాయం చదవండి. చదువుతున్నప్పుడు అధస్సూచీల్లో ఉన్న వివరణల్ని, క్రాస్‌ రెఫరెన్సులను కూడా చూడండి.

a ఈ పదం గురించి హెచ్‌సిఎస్‌బి స్టడీ బైబిల్‌ ఇలా చెప్తోంది: “‘సృష్టించడానికి’ అనే అర్థమున్న బరా అనే హీబ్రూ క్రియాపదాన్ని అసలెప్పుడూ మనుషులు చేసే పనులకు వాడరు. అంటే, బరా అనే పదం కేవలం దేవుని పనిని మాత్రమే సూచిస్తుందన్నమాట.”—7వ పేజీ.

b యెహోవా అనేది దేవుని పేరు.—కీర్తన 83:18.

c “మొదట్లో” అని అనువదించబడిన హీబ్రూ పదంలోని కాలనిడివి గురించి మాట్లాడుతూ ఎక్స్‌పోజిటర్స్‌ బైబిల్‌ కమెంట్రీ ఇలా చెప్తోంది: “ఆ పదంలో ఇంత కాలవ్యవధి అని నిర్దిష్టంగా ఏమీ లేదు.”—రివైజ్డ్‌ ఎడిషన్‌, 1వ సంపుటి, 51వ పేజీ.