కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిపాలక సభ ఉత్తరం

పరిపాలక సభ ఉత్తరం

ప్రియమైన తోటి విశ్వాసికి,

బైబిలు మనుషుల గురించే ఎక్కువగా చెప్తుందని మీకు తెలుసు. విశ్వాసం చూపించిన చాలామంది స్త్రీపురుషులు మనలాంటి సమస్యలనే ఎదుర్కొన్నారు. వాళ్లు కూడా “మనవంటి స్వభావముగల” వాళ్లే. (యాకోబు 5:17) కొంతమంది సమస్యలు, ఆందోళనల వల్ల కృంగిపోయారు. ఇంకొంతమంది కుటుంబ సభ్యులు లేదా తోటి విశ్వాసులు చేసిన పనుల వల్ల బాధపడ్డారు. ఇంకా చాలామంది వాళ్లు చేసిన తప్పుల వల్ల అపరాధ భావాల్లో మునిగిపోయారు.

అయితే, వాళ్లు యెహోవాను పూర్తిగా విడిచిపెట్టారా? లేదు. చాలామంది కీర్తనకర్తలాగే ఇలా ప్రార్థించారు: “తప్పిపోయిన గొఱ్ఱెవలె నేను త్రోవవిడిచి తిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను.” (కీర్తన 119:176) మీకూ అలానే అనిపిస్తుందా?

మంద నుండి తప్పిపోయిన తన ఆరాధకులను యెహోవా ఎప్పుడూ మర్చిపోడు. తోటి ఆరాధకుల ద్వారా ఆయన వాళ్లకు తన చేయి అందిస్తాడు. ఉదాహరణకు, ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకున్న యోబుకు యెహోవా ఎలా సహాయం చేశాడో ఆలోచించండి. ఆయన ఆస్తంతా పోయింది, పిల్లలు చనిపోయారు, తీవ్రమైన వ్యాధి సోకింది. అంతేకాక, తోడుగా ఉండాల్సిన వాళ్లే యోబును అనరాని మాటలు అని బాధపెట్టారు. కొంతకాలంపాటు తన ఆలోచనల్లో యెహోవాకు దూరమయ్యాడు గానీ యోబు ఎప్పుడూ యెహోవాను విడిచివెళ్లలేదు. (యోబు 1:22; 2:10) మళ్లీ సరిగ్గా ఆలోచించడానికి యోబుకు యెహోవా ఎలా సహాయం చేశాడు?

తోటి ఆరాధకుడైన ఎలీహును ఉపయోగించి యెహోవా యోబుకు సహాయం చేశాడు. యోబు తన భావాలను చెప్పినప్పుడు ఎలీహు మొదట విని, ఆ తర్వాత మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఆయన యోబును విమర్శించాడా? తప్పు చేశావని నిందించి, తప్పు ఒప్పుకోమన్నాడా? తను యోబు కన్నా గొప్పవాడు అనుకున్నాడా? లేదు. దేవుని ఆత్మ నడిపింపుతో ఎలీహు ఇలా అన్నాడు: “దేవునియెడల నేనును నీవంటివాడను నేనును జిగటమంటితో చేయబడినవాడనే నావలని భయము నిన్ను బెదరించదు నా చెయ్యి నీమీద బరువుగా నుండదు.” (యోబు 33:6, 7) యోబు బాధను పెంచే బదులు ఎలీహు ప్రేమపూర్వకంగా అవసరమైన సలహాను, ప్రోత్సాహాన్ని ఇచ్చాడు.

మేము కూడా అలాంటి ఉద్దేశంతోనే ఈ బ్రోషురు తయారుచేశాం. మొదట మేము కూడా మంద నుండి తప్పిపోయిన చాలామంది పరిస్థితులను, వాళ్ల భావాలను జాగ్రత్తగా పరిశీలించాం. (సామెతలు 18:13) తర్వాత మేము బైబిలు తెరిచి, ఒకప్పుడు అలాంటి పరిస్థితులే ఎదుర్కొన్న తన ఆరాధకులకు యెహోవా ఎలా సహాయం చేశాడో ప్రార్థనాపూర్వకంగా ధ్యానించాం. చివరిగా, బైబిల్లో ఉన్న ఆ ఉదాహరణలకు నేటి అనుభవాలను జతచేసి ఈ బ్రోషురును తయారుచేశాం. ఈ సమాచారాన్ని పరిశీలించమని మిమ్మల్ని ప్రేమతో వేడుకుంటున్నాం. మేము మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నామని గుర్తుంచుకోండి.

యెహోవాసాక్షుల పరిపాలక సభ