కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2

అందంగా కనబడాలని నేనెందుకు వర్రీ అవుతున్నాను?

అందంగా కనబడాలని నేనెందుకు వర్రీ అవుతున్నాను?

అది ఎందుకు ప్రాముఖ్యం?

అద్దంలో చూసుకున్నప్పుడు కనిపించేవాటి కన్నా ముఖ్యమైనవి వేరే ఉన్నాయి.

మీరు ఏం చేస్తారు?

ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: జూలియా అద్దంలో చూసుకుంటూ, లావుగా ఉన్నానని బాధపడుతోంది. ‘చీపురు పుల్లలా సన్నగా ఉన్నావు’ అని అమ్మానాన్నలు, ఫ్రెండ్స్‌ చెప్తున్నా, ఆమె మాత్రం ‘నేనింకా బరువు తగ్గాలి’ అని అనుకుంటుంది.

ఈ మధ్యే, ఆమె బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసింది. కేవలం “రెండున్నర కేజీల” బరువు తగ్గడం కోసం, కొన్నిరోజుల పాటు తిండీతిప్పలు మానేసి కడుపు మాడ్చుకుంది ...

జూలియా స్థానంలో మీరుంటే, ఏం చేస్తారు?

ఒక్కక్షణం ఆగి, ఆలోచించండి!

మీ శరీర ఆకారం గురించి మీకు సరైన అభిప్రాయం లేకపోతే, పాడైపోయిన అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది

అందంగా కనిపించాలనుకోవడంలో తప్పు లేదు. నిజానికి, అందంగా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిల గురించి బైబిలు కూడా మాట్లాడుతుంది. ఉదాహరణకు శారా, రాహేలు, అబీగయీలు, యోసేపు, దావీదు వంటివాళ్లు అందంగా ఉన్నారని బైబిలు చెప్తుంది. అబీషగు అనే అమ్మాయి “చాలా అందగత్తె” అని కూడా బైబిలు చెప్తుంది.—1 రాజులు 1:4, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

చాలామంది యౌవనులు అందంగా కనబడడం గురించి విపరీతంగా ఆలోచిస్తున్నారు. కానీ, దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఈ విషయం పరిశీలించండి:

  • ఒక నివేదిక ప్రకారం, 58 శాతం అమ్మాయిలు అధిక బరువు ఉన్నామని చెప్తున్నారు. కానీ నిజానికి, 17 శాతం మాత్రమే అధిక బరువు ఉన్నారు.

  • మరో నివేదిక ప్రకారం, 45 శాతం స్త్రీలు, నిజానికి ఉండాల్సినదాని కన్నా తక్కువ బరువు ఉన్నారు. కానీ చాలా ఎక్కువ బరువు ఉన్నామని వాళ్లు అనుకుంటున్నారు!

  • కొంతమంది యౌవనులు, బరువు తగ్గడం కోసం కడుపు మాడ్చుకుంటూ, అనొరెక్సియాకు (ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఓ ప్రాణాంతకమైన సమస్య) బలౌతున్నారు.

మీకు అనొరెక్సియా గానీ, ఆహారపు అలవాట్లకు సంబంధించి మరేదైనా సమస్య గానీ ఉందనిపిస్తే, వేరేవాళ్ల సహాయం తీసుకోండి. ముందుగా, ఆ సమస్య గురించి మీ అమ్మానాన్నలకు లేదా ఎవరైనా పెద్దవాళ్లకు చెప్పండి. బైబిలు ఇలా చెప్తుంది: ‘నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో సహోదరుడుగా ఉంటాడు.’ —సామెతలు 17:17.

అందం కన్నా ముఖ్యమైంది, మీరు మార్చుకోగలిగింది ఒకటుంది!

నిజానికి, ఒక వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలే అతనికి నిజమైన అందాన్ని తెస్తాయి. దావీదు కుమారుడైన అబ్షాలోము గురించి ఆలోచించండి. బైబిలు ఇలా చెప్తుంది:

‘అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒక్కడూ లేడు; ... అతనిలో ఏ లోపమూ లేదు.’ —2 సమూయేలు 14:25.

కానీ అతను ఓ గర్విష్ఠి, మోసగాడు, అధికారం కోసం ఏమైనా చేసే వ్యక్తి! అందుకే, బైబిలు అతణ్ణి నమ్మకద్రోహం చేసిన వ్యక్తిగా, చెడ్డ వ్యక్తిగా వర్ణిస్తుంది.

బైబిలు మనకు ఈ సలహా ఇస్తుంది:

‘కొత్త స్వభావాన్ని ధరించుకోండి.’—కొలొస్సయులు 3:9, 10, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

“మీది ... బయటి అలంకారం కాకూడదు. మీకు ఉండవలసిన అలంకారం మీ లోపలి స్వభావం.” —1 పేతురు 3:3, 4, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

అందంగా కనిపించాలనుకోవడంలో తప్పు లేదు. అయితే, అందం కన్నా ప్రాముఖ్యమైనది మీ స్వభావం. కండలు తిరిగిన శరీరం, వంపులు తిరిగిన ఆకృతి కన్నా, మీకున్న చక్కని లక్షణాలే మీకు నిజమైన అందాన్ని తెస్తాయి. ఫిలిసీయా అనే అమ్మాయి ఇలా చెప్తుంది, “మీ అందం ఇతరుల్ని వెంటనే ఆకర్షించవచ్చు. కానీ, వాళ్లకు ఎప్పటికీ గుర్తుండిపోయేవి మాత్రం మీ స్వభావం, మీ మంచి లక్షణాలే.”

అందం గురించి మీరేమనుకుంటున్నారు?

మీ అందం గురించి తరచూ బాధపడుతుంటారా?

అందంగా కనబడడం కోసం ఆపరేషన్‌ చేయించుకోవాలని గానీ, విపరీతంగా డైటింగ్‌ చేయాలని గానీ మీకెప్పుడైనా అనిపించిందా?

మీరు వేటిని మార్చుకోవాలనుకుంటున్నారు? (వేటిని మార్చుకోవాలనుకుంటున్నారో సున్నా చుట్టండి.)

  • ఎత్తు

  • బరువు

  • జుట్టు

  • శరీర ఆకృతి

  • ముఖం

  • రంగు

పై రెండు ప్రశ్నలకు అవును అని సమాధానమిచ్చి, మూడో ప్రశ్న కింద మూడు లేదా అంతకన్నా ఎక్కువ ఆప్షన్స్‌కు సున్నా చుట్టారా? అయితే, ఒక్కమాట: వేరేవాళ్ల కంటికి మీరు బాగానే కనిపించినా, మీ శరీర ఆకారం గురించి మీకై మీరే బాధపడే అవకాశం ఉంది. దాని గురించే ఎక్కువగా వర్రీ అవుతూ, దానికోసం ఏదైనా చేసే ప్రమాదం ఉంది.—1 సమూయేలు 16:7.