సమూయేలు రెండో గ్రంథం 14:1-33

  • యోవాబు, తెకోవ స్త్రీ (1-17)

  • యోవాబు పథకమని దావీదుకు అర్థమవడం (18-20)

  • తిరిగిరావడానికి అబ్షాలోముకు అనుమతి దొరకడం (21-33)

14  రాజు హృదయం అబ్షాలోము కోసం తపిస్తోందని+ సెరూయా కుమారు​డైన యోవాబుకు+ తెలిసింది.  కాబట్టి యోవాబు తెకోవకు+ మనుషుల్ని పంపించి అక్కడి నుండి ఒక తెలివైన స్త్రీని పిలిపించాడు. ఆమెకు ఇలా చెప్పాడు: “దయచేసి నువ్వు దుఃఖంలో ఉన్నట్టు నటించు. శోక వస్త్రాల్ని వేసుకో, తైలం పూసుకోవద్దు.+ చనిపోయిన వ్యక్తి గురించి చాలాకాలంగా దుఃఖిస్తున్న స్త్రీలా నటించు.  తర్వాత రాజు దగ్గరికి వెళ్లి ఈ విధంగా మాట్లాడు.” అప్పుడు యోవాబు ఆమెకు ఏమి మాట్లాడాలో చెప్పాడు.  తెకోవ స్త్రీ రాజు దగ్గరికి వెళ్లి సాష్టాంగపడి, “రాజా! నాకు సహాయం చేయి” అంది.  రాజు, “ఏమైంది?” అని ఆమెను అడిగాడు. అందుకు ఆమె ఇలా అంది: “నేనొక విధవరాలిని, నా భర్త చనిపోయాడు.  నీ సేవకు​రాలినైన నాకు ఇద్దరు కుమారులు. వాళ్లిద్దరూ పొలంలో కొట్టుకున్నారు. వాళ్లను విడదీసేవాళ్లు ఎవరూ లేకపోవడంతో ఒకడు ఇంకొకడి మీద దాడిచేసి చంపేశాడు.  ఇప్పుడు నా బంధువులందరూ నీ సేవకురాలినైన నా మీదికి లేచారు. వాళ్లు, ‘తన సహోదరుణ్ణి చంపినవాణ్ణి అప్పగించు, అతను తన సహోదరుణ్ణి చంపాడు కాబట్టి మేము అతన్ని చంపుతాం,+ చివరికి వారసుణ్ణి తుడిచేయాల్సి వచ్చినాసరే!’ అంటున్నారు. వాళ్లు నాకు మిగిలివున్న చివరి నిప్పురవ్వను* కూడా ఆర్పేసి నా భర్తకు ఈ భూమ్మీద పేరు గానీ, ​వారసుడు గానీ లేకుండా చేస్తారు.”  అప్పుడు రాజు ఆ స్త్రీతో, “నీ ఇంటికి వెళ్లు, నీ గురించి నేను ఆజ్ఞ జారీ చేస్తాను” అన్నాడు.  దానికి ఆ తెకోవ స్త్రీ రాజుతో ఇలా అంది: “నా ప్రభువైన రాజా, ఆ దోషం నా మీదికి, నా తండ్రి ఇంటివాళ్ల మీదికి రావాలి. కానీ నువ్వూ, నీ రాజవంశం నిర్దోషులుగా ఉండాలి.” 10  అప్పుడు రాజు ఆమెతో, “ఎవరైనా దీని గురించి ఇంకా ఏమైనా మాట్లాడితే, వాళ్లను నా దగ్గరికి తీసుకురా, వాళ్లు మళ్లీ ఎప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టరు” అన్నాడు. 11  అందుకు ఆమె, “రాజా, ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి*+ నాశనం తీసుకొచ్చి నా కుమారుణ్ణి చంపకుండా ఉండేలా దయచేసి నీ దేవుడైన యెహోవాను ​గుర్తుచే​సుకో” అంది. దానికి అతను, “యెహోవా జీవం తోడు,+ నీ కుమారుని వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలమీద పడదు” అన్నాడు. 12  అప్పుడు ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజుతో నీ సేవకురాలిని దయచేసి ఒక మాట చెప్పనివ్వు” అని అంది. దానికి అతను, “చెప్పు” అన్నాడు. 13  ఆ స్త్రీ ఇలా అంది: “మరి దేవుని ప్రజలకు+ వ్యతిరేకంగా నువ్వు ఈ పని ఎందుకు చేయాలనుకున్నావు? రాజు ఇలా ​మాట్లాడితే తనను తానే దోషిగా చేసుకుంటాడు. ఎందుకంటే రాజు, బహిష్కరించబడిన తన సొంత కుమా​రుణ్ణి వెనక్కి తీసుకురావట్లేదు.+ 14  మనం ఖచ్చితంగా చనిపోతాం, నేలమీద పోసిన తర్వాత మళ్లీ వెనక్కి తెచ్చుకోలేని నీళ్లలా అవుతాం. కానీ దేవుడు ప్రాణం తీయడు, బహిష్కరించబడిన వ్యక్తి ఎప్పటికీ అదే స్థితిలో ఎందుకు ఉండకూ​డదో ఆయన కారణాలు ఆలోచిస్తాడు. 15  ప్రజలు నన్ను భయపెట్టారు కాబట్టి నేను నా ప్రభువైన రాజుతో ఈ మాట చెప్పడానికి వచ్చాను. నీ సేవకురాలినైన నేను ఇలా అనుకున్నాను, ‘నేను రాజుతో మాట్లాడతాను. బహుశా రాజు తన సేవకురాలినైన నా విన్నపం ప్రకారం చేస్తాడేమో. 16  రాజు నా మాట విని, నన్నూ నా ఒక్కగానొక్క కుమారుణ్ణీ దేవుడు మాకు ఇచ్చిన స్వాస్థ్యం నుండి నిర్మూలించాలని చూస్తున్న వ్యక్తి చేతి నుండి తన ​దాసురాలిని రక్షిస్తాడేమో.’+ 17  మంచి​చెడులు ​వివేచించడంలో నా ప్రభు​వైన రాజు సత్యదేవుని దూత లాంటివాడు కాబట్టి నీ సేవకురాలినైన నేను, ‘నా ప్రభువైన రాజు మాట నాకు ఊరటనివ్వాలి’ అని అనుకు​న్నాను. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండాలి.” 18  అప్పుడు రాజు ఆ స్త్రీతో, “దయచేసి నేను నిన్ను అడిగేది ఏదీ నా దగ్గర దాచొద్దు” అన్నాడు. దానికి ఆమె, “నా ప్రభువైన రాజా, దయచేసి అడుగు” అంది. 19  అప్పుడు రాజు, “నీతో ఈ మాటలన్నీ చెప్పించింది యోవాబే కదా?”+ అని అడిగాడు. దానికి ఆ స్త్రీ ఇలా అంది: “నా ప్రభు​వైన రాజా, నీ జీవం తోడు, నా ప్రభువైన రాజు సరిగ్గా చెప్పాడు. నీ సేవకుడైన యోవాబే నన్ను ఆదేశించాడు, నీ సేవకురాలినైన నేను నీతో అన్న మాటలన్నిటినీ అతనే నాకు చెప్పాడు. 20  నువ్వు విషయాన్ని వేరే కోణంలో చూసేలా నీ సేవకుడైన యోవాబే ఇది చేశాడు, కానీ నా ప్రభువైన నీకు సత్యదేవుని ​దూతలాంటి తెలివి ఉంది, దేశంలో జరుగుతున్నవన్నీ నీకు తెలుసు.” 21  తర్వాత రాజు యోవాబుతో, “సరే, నేను ఆ పని చేస్తాను.+ వెళ్లి, యువకుడైన అబ్షాలోమును వెనక్కి తీసుకురా”+ అన్నాడు. 22  అప్పుడు యోవాబు సాష్టాంగపడి రాజును స్తుతిస్తూ ఇలా అన్నాడు: “నా ప్రభువైన రాజా, నేను నీ దయ పొందానని నీ సేవకుడినైన నాకు ఈ రోజు తెలిసింది, ఎందుకంటే రాజా, నువ్వు నీ సేవకుని విన్నపం ప్రకారం చేశావు.” 23  తర్వాత యోవాబు లేచి గెషూరుకు+ వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకొచ్చాడు. 24  అయితే, రాజు ఇలా అన్నాడు: “అతను తన ఇంటికి తిరిగెళ్లవచ్చు, కానీ నా ముఖాన్ని చూడడానికి వీల్లేదు.” దాంతో అబ్షాలోము తన ఇంటికి తిరిగెళ్లాడు, అతను రాజు ముఖాన్ని చూడలేదు. 25  అందం విషయంలో అబ్షాలోములా పొగడ్తలు పొందినవాళ్లు ఇశ్రాయేలు అంతట్లో ఎవ్వరూ లేరు. అరికాలి నుండి నడినెత్తి వరకు అతనిలో ఏ లోపం లేదు. 26  అతను తన తలవెంట్రుకల్ని కత్తిరించినప్పుడు అవి రాజ తూకం రాయి* ప్రకారం 200 షెకెల్‌ల* బరువు ఉండేవి. అతని తలవెంట్రుకలు అతనికి చాలా భారంగా ఉండేవి కాబట్టి ప్రతీ సంవత్సరం చివర్లో వాటిని కత్తిరించేవాడు. 27  అబ్షాలోముకు ముగ్గురు కుమారులు,+ ఒక కూతురు పుట్టారు. కూతురి పేరు తామారు. ఆమె ఎంతో అందంగా ఉండేది. 28  అబ్షాలోము పూర్తిగా రెండు సంవత్సరాలు యెరూషలేములోనే ఉన్నాడు కానీ రాజు ముఖాన్ని చూడలేదు.+ 29  దాంతో అబ్షాలోము, యోవాబును రాజు దగ్గరికి పంపించడానికి అతని కోసం కబురు పంపించాడు కానీ యోవాబు అతని దగ్గరికి రాలేదు. అబ్షాలోము మళ్లీ రెండోసారి అతని కోసం కబురు పంపించాడు కానీ అప్పుడు కూడా అతను రావడానికి ఒప్పుకోలేదు. 30  చివరికి అబ్షాలోము తన సేవకులతో, “యోవాబు పొలం నా పొలం పక్కనే ఉంది, అందులో కొంత బార్లీ ఉంది. మీరు వెళ్లి ఆ పొలాన్ని తగలబెట్టండి” అన్నాడు. దాంతో అబ్షాలోము సేవకులు ఆ పొలాన్ని తగలబెట్టారు. 31  అప్పుడు యోవాబు అబ్షాలోము ఇంటికి వచ్చి, “నీ సేవకులు నా పొలాన్ని ఎందుకు తగలబెట్టారు?” అని అడిగాడు. 32  దానికి అబ్షాలోము యోవాబుతో ఇలా అన్నాడు: “ఇదిగో! నేను నీకు ఈ సందేశం పంపించాను: ‘నువ్వు రా, రాజును ఇలా అడగడానికి నిన్ను అతని దగ్గరికి పంపిస్తాను, “నేను గెషూరు నుండి ఎందుకు వచ్చాను?+ నేను అక్కడే ఉండిపోయుంటే బాగుండేది. నేను నీ ముఖాన్ని చూడాలనుకుంటు​న్నాను. ఒకవేళ నేను ఏదైనా అపరాధం చేసివుంటే, నువ్వు నన్ను చంపాలి.” ’ ” 33  దాంతో యోవాబు రాజు దగ్గరికి వెళ్లి ఆ విషయం అతనికి చెప్పాడు. అప్పుడు రాజు అబ్షాలోమును పిలిచాడు; అతను రాజు దగ్గరికి వచ్చి అతని ఎదుట సాష్టాంగపడ్డాడు. రాజు అబ్షాలోమును ముద్దుపెట్టుకున్నాడు.+

అధస్సూచీలు

అంటే, వంశస్థులు వస్తారనే చివరి ఆశ.
అక్ష., “రక్తం విషయంలో ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి.”
ఇది రాజభవనంలో ఉండే ప్రామాణిక తూకం రాయి అయ్యుండొచ్చు, లేదా సామాన్య షెకెల్‌కు భిన్నమైన “రాజ” షెకెల్‌ అయ్యుండొచ్చు.
దాదాపు 2.3 కిలోలు. అనుబంధం B14 చూడండి.