కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు శోధనను ఎదిరించవచ్చు!

మీరు శోధనను ఎదిరించవచ్చు!

“నేను ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నప్పుడు, ఉన్నట్టుండి ఓ ప్రకటన కనిపించింది. అశ్లీల చిత్రాలు చూడాలనే ఆలోచన నాకు లేకపోయినా, స్క్రీన్‌ మీద ఏదో కనిపించేసరికి దానిమీద క్లిక్‌ చేశాను.”—కార్తీక్‌. a

“నేను పనిచేసే చోట, ఒక అందమైన అమ్మాయి నాతో చనువుగా మెలగడం మొదలుపెట్టింది. ఓ రోజు ఆమె, మనం హోటల్‌కు వెళ్లి ‘సరదాగా గడుపుదాం’ అంది. ఆమె ఉద్దేశమేంటో నాకు బాగా తెలుసు.”—దిలీప్‌.

శోధనను కొంతమంది లోలోపల ఇష్టపడుతుంటారు. ఇంకొందరు, దాన్నొక మొండి శత్రువులా చూస్తారు, దాన్ని జయించాలని ఎంతో కోరుకుంటారు. మరి మీ విషయమేమిటి? శోధన ఎదురైనప్పుడు మనం రాజీపడాలా లేక ఎదిరించాలా?

శోధనలన్నీ ప్రమాదకరం కావనేది నిజమే. ఉదాహరణకు, డైటింగ్‌ చేస్తున్నప్పుడు మీరు చిన్న కేకు ముక్క తిన్నంతమాత్రాన మీ ఆరోగ్యమేమీ పాడవ్వకపోవచ్చు. కానీ ఇతర ప్రలోభాలకు ముఖ్యంగా, తప్పు చేయడానికి నడిపించే వాటికి లొంగిపోతే విషాదకర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే.”—సామెతలు 6:32, 33.

అనుకోకుండా శోధన ఎదురైతే, మీరు ఏమి చేయాలి? బైబిలు ఇలా చెబుతుంది: ‘మీరు పరిశుద్ధులగుటయే, అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును పరిశుద్ధతయందును, ఘనతయందును తన తన ఘటమును (శరీరాన్ని) ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండవలెను.’ (1 థెస్సలొనీకయులు 4:3, 4) ఈ విషయంలో మీ కృతనిశ్చయాన్ని ఎలా బలపర్చుకోవచ్చు? మనకు సహాయం చేసే మూడు చర్యలను పరిశీలించండి.

మొదటి చర్య: మీ కళ్లను కాపాడుకోండి

అశ్లీల చిత్రాలు చూడడంవల్ల చెడు కోరికలు పెరుగుతాయే కానీ తగ్గవు. మనం చూసేవాటికీ, మన కోరికలకూ మధ్య ఉన్న సంబంధం గురించి తెలియజేస్తూ యేసు ఇలా హెచ్చరించాడు: “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” అతిశయోక్తిగా యేసు ఇలా చెప్పాడు: “నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము.” (మత్తయి 5:28, 29) ఇంతకీ యేసు ఏమి చెప్పాలనుకున్నాడు? శోధనలు ఎదిరించడానికి మనం దృఢ నిశ్చయంతో చర్య తీసుకోవాలి, రెచ్చగొట్టే చిత్రాలు చూడడం మానేయాలి.

అశ్లీల చిత్రాలు కంటపడితే, మీ కళ్లను పక్కకు తిప్పేసుకోండి

ఉదాహరణకు, ఎవరైనా వెల్డింగ్‌ చేస్తున్నప్పుడు ఆ కాంతి మీ కంట్లో పడితే వెంటనే మీ ముఖం తిప్పేసుకుంటారా లేక అలాగే దానికేసి చూస్తుంటారా? మీరు తప్పకుండా కళ్లను పక్కకు తిప్పేసుకుంటారు లేదా ఏదైనా అడ్డుపెట్టుకుంటారు. లేకపోతే మీ కళ్లు పాడౌతాయి. అదేవిధంగా, పుస్తకంలో గానీ, పేపర్లో గానీ, టీవీలో గానీ, కంప్యూటర్‌లో గానీ, నేరుగా గానీ అశ్లీలమైనది ఏదైనా మీ కంటపడితే వెంటనే చూపు పక్కకు తిప్పుకోండి. మీ మనసు పాడవకుండా చూసుకోండి. ఒకప్పుడు అశ్లీల చిత్రాలు చూసే అలవాటుకు బానిసగావున్న కోమల్‌ ఇలా అంటున్నాడు: “అందమైన అమ్మాయి కంటబడినప్పుడు ఆమెను మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది. అప్పుడు వెంటనే కళ్లను బలవంతంగా పక్కకు తిప్పుకొని, మనసులో ఇలా అనుకుంటాను: ‘యెహోవాకు ప్రార్థించు! ఇప్పుడు ప్రార్థించడం చాలా అవసరం!’ ప్రార్థన చేశాక, అలా చూడాలనే కోరిక మెల్లమెల్లగా తగ్గిపోతుంది.”—మత్తయి 6:9, 10, 13; 1 కొరింథీయులు 10:13.

యెహోవాకు నమ్మకంగా ఉన్న యోబు ఏమన్నాడో కూడా చూడండి: “నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?” (యోబు 31:1) అలాంటి నిబంధనే మీరూ చేసుకోవచ్చు.

ఇలా చేసి చూడండి: అశ్లీల చిత్రం కంటపడితే, వెంటనే పక్కకు చూడండి. కీర్తనకర్త చేసినట్లే, “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము” అని ప్రార్థించండి.—కీర్తన 119:37.

రెండవ చర్య: మీ ఆలోచనలను కాపాడుకోండి

మనమందరం అపరిపూర్ణులం కాబట్టి, అప్పుడప్పుడు చెడు కోరికలతో పోరాడాల్సి రావచ్చు. బైబిలు ఇలా చెబుతుంది: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.” (యాకోబు 1:14, 15) అంతకంతకూ ఘోరంగా తయారౌతూ, బయటపడడం కష్టంగా మారే అలాంటి పరిస్థితిలో చిక్కుకోకుండా ఎలా తప్పించుకోవచ్చు?

మీ మనసులో తప్పుడు ఆలోచనలు మొదలైతే, ఒక్క క్షణం ఆగి ప్రార్థించండి

మీ మనసులో చెడు కోరికలు పుట్టినప్పుడు, వాటికి లొంగిపోవాలా లేక వాటిని ఎదిరించాలా అనేది మీ చేతుల్లోనే ఉంటుందని గుర్తుంచుకోండి. వాటితో పోరాడండి. మీ మనసులో నుండి వాటిని తీసిపారేయండి. తప్పుడు ఆలోచనలతో ఊహల్లో తేలిపోవడం లాంటివి చేయకండి. ఒకప్పుడు, ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలు చూసే ఉరిలో చిక్కుకున్న తేజ ఇలా అంటున్నాడు: “మంచి విషయాల గురించి ఆలోచిస్తూ చెడు ఆలోచనలను తొలగించుకోవడానికి గట్టిగా కృషిచేశాను. అందుకు చాలా కష్టపడ్డాను. చాలాసార్లు తప్పిపోయాను. ఎలాగైతేనేం నా ఆలోచనలను అదుపు చేసుకోవడం నేర్చుకున్నాను.” టీనేజీలో ఉన్నప్పుడు పల్లవి అనే ఆమెకు, తప్పుచేయాలనే కోరిక బలంగా ఉండేది. ఆమె ఇలా గుర్తుచేసుకుంటుంది: “నేను ఏదోక పనిలో బిజీగా ఉంటూ, యెహోవాకు ప్రార్థిస్తూ చెడు కోరికలను అదుపు చేసుకోగలిగాను.”

ఇలా చేసి చూడండి: చెడు ఆలోచనలతో మీరు సతమతమౌతుంటే, వెంటనే ఒక్క క్షణం ఆగి, ప్రార్థించండి. “సత్యమైనవాటిని, మంచివాటిని, ధర్మమైనవాటిని, పవిత్రమైనవాటిని, ఆనందమైనవాటిని, మెచ్చుకోతగ్గవాటిని, అంటే ఉత్తమంగా ఉన్న వాటిని గురించి, ప్రశాంతమైన వాటిని గురించి” ఆలోచిస్తూ చెడు కోరికలను తరిమేయండి.—ఫిలిప్పీయులు 4:8, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

మూడవ చర్య: మీ అడుగులను కాపాడుకోండి

కోరిక, శోధన, అవకాశం మూడూ కలిసి వస్తే సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. (సామెతలు 7:6-23) అలా చిక్కుకోకూడదంటే మీరేం చేయాలి?

“ఇతరులు పక్కన ఉన్నప్పుడే నేను ఇంటర్నెట్‌ ఉపయోగిస్తాను”

బైబిలు, ఈ తెలివైన సలహా ఇస్తోంది: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.” (సామెతలు 22:3) కాబట్టి మీ అడుగులను కాపాడుకోండి. ఎలాంటి పరిస్థితులు సమస్యలకు దారితీయవచ్చో ముందే ఊహించి, వాటికి దూరంగా ఉండండి. (సామెతలు 7:25) అశ్లీల చిత్రాలు చూసే అలవాటు నుండి బయటపడిన అమిత్‌ ఇలా అంటున్నాడు: “మా ఇంట్లో కంప్యూటర్‌ను అందరూ చూసే చోట పెట్టాను, ఇంటర్నెట్‌ ఫిల్టర్‌ను కూడా ఇన్‌స్టాల్‌ చేశాను. ఇతరులు పక్కన ఉన్నప్పుడే నేను ఇంటర్నెట్‌ ఉపయోగిస్తాను.” ముందు మాట్లాడుకున్న తేజ ఇలా అంటున్నాడు: “రెచ్చగొట్టే సినిమాలను చూడడం, సెక్స్‌ గురించి అసభ్యంగా మాట్లాడేవాళ్లతో కలవడం వంటివి చేయను. కోరి సమస్యలు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు.”

ఇలా చేసి చూడండి: మిమ్మల్ని మీరు నిజాయితీగా పరిశీలించుకొని మీ బలహీనతలను గుర్తించండి; శోధనకు దారితీసే పరిస్థితులను ముందే తెలుసుకుని, వాటికి ఎలా దూరంగా ఉండాలో ఆలోచించండి.—మత్తయి 6:13.

పట్టువిడవకండి!

మీరు ఎంత ప్రయత్నించినా చివరికి శోధనకు లొంగిపోతే అప్పుడేమిటి? నిరుత్సాహపడకుండా ప్రయత్నిస్తూనే ఉండండి. బైబిలు ఇలా చెబుతోంది: “నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును.” (సామెతలు 24:16) అవును, మన పరలోక తండ్రి ‘తిరిగి లేవమని’ మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ప్రేమతో ఆయన చేసే సహాయాన్ని మీరు తీసుకుంటారా? అలాగైతే, ఆయనకు ప్రార్థించడం ఎన్నడూ మానకండి. ఆయన వాక్యాన్ని అధ్యయనం చేస్తూ విశ్వాసాన్ని బలపర్చుకోండి. క్రైస్తవ కూటాలకు వెళ్తూ మీ నిశ్చయాన్ని దృఢపర్చుకోండి. యెహోవా చేసిన ఈ వాగ్దానం నుండి ధైర్యం పొందండి: “నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే.”—యెషయా 41:9, 10.

మొదట్లో మనం మాట్లాడుకున్న కార్తీక్‌ ఇలా అంటున్నాడు: “అశ్లీల చిత్రాలు చూసే అలవాటును జయించడానికి నేనెంతో ప్రయాసపడ్డాను. ఎన్నోసార్లు తప్పిపోయినా, యెహోవా సహాయంతో ఆఖరికి దాన్ని జయించగలిగాను.” మనం ముందు చూసిన దిలీప్‌ కూడా ఇలా చెబుతున్నాడు: “నా సహోద్యోగితో నేను సులువుగా తప్పుచేసి ఉండేవాణ్ణే. కానీ నేను స్థిరంగా నిలబడ్డాను. ఆ తప్పు నేను చేయనని చెప్పేశాను. మంచి మనస్సాక్షి ఉంటే చాలా గర్వంగా ఉంటుంది. ముఖ్యంగా, యెహోవా నన్ను చూసి గర్వపడేలా నడుచుకున్నానని నాకు తెలుసు.”

మీరు స్థిరంగా ఉండి శోధనను ఎదిరిస్తే, మీ విషయంలో కూడా దేవుడు తప్పక గర్వపడతాడని మీరు నమ్మకంతో ఉండవచ్చు!—సామెతలు 27:11. (w14-E 04/01)

a ఈ ఆర్టికల్‌లో ఉన్నవి అసలు పేర్లు కావు.