కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముఖపత్ర అంశం | పొగతాగడం తప్పా?

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి

పొగతాగే అలవాటు లెక్కలేనంత మందిని బలి తీసుకుంటోంది.

  • గడిచిన వందేళ్లలో 10 కోట్లమందిని అది పొట్టనబెట్టుకుంది.

  • దానివల్ల, ప్రతీ సంవత్సరం దాదాపు 60 లక్షలమంది చనిపోతున్నారు.

  • చెప్పాలంటే, ప్రతీ 6 సెకన్లకు ఒకరు దానివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.

ముందుముందైనా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించడానికి ఎలాంటి ఆధారాలూ కనిపించడం లేదు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2030 కల్లా పొగతాగే అలవాటువల్ల చనిపోయేవాళ్ల సంఖ్య ఏడాదికి 80 లక్షలకు పైనే ఉంటుందని అధికారుల అంచనా. 21వ శతాబ్దం ముగిసేసరికి, ఈ అలవాటువల్ల ప్రాణాలు కోల్పోయే వాళ్ల సంఖ్య 100 కోట్లకు చేరుకుంటుందని కూడా వాళ్లు ఊహిస్తున్నారు.

పొగాకు బాధితులు పొగతాగే వాళ్లు మాత్రమే కాదు. పొగతాగే అలవాటు వల్ల ఎవరైనా చనిపోతే, వాళ్ల కుటుంబ సభ్యులకు ఎంతో వేదన కలుగుతుంది, ఆర్థికంగా కూడా వాళ్లు ఎన్నో కష్టాలు పడాల్సివస్తుంది. ఇక, పొగతాగే వాళ్ల పక్కన ఉండడం వల్ల ప్రతీ సంవత్సరం 6 లక్షలమంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. అంతేకాదు, ఆరోగ్య పరిరక్షణ వ్యయం అంతకంతకూ పెరగడం వల్ల ఆ భారం ప్రతీ ఒక్కరి మీద పడుతోంది.

ఏదైనా అంటురోగం పుట్టుకొచ్చినప్పుడు, పరిష్కారం కనుక్కోవడానికి డాక్టర్లు పరిశోధనలు ముమ్మరం చేస్తారు. అయితే, ఈ మహమ్మారి విషయం వేరు. దీన్ని నయం చేయడం సాధ్యమే, పరిష్కారం కూడా అందరికీ తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మార్గరెట్‌ ఛాన్‌ ఇలా అంది: “పొగాకు మహమ్మారిని సృష్టించింది ముమ్మాటికీ మానవులే. ప్రభుత్వం-సమాజం కలిసికట్టుగా పనిచేస్తే దాన్ని తరిమికొట్టడం సాధ్యమే.”

మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు చాలా దేశాలు ఆ సమస్యతో పోరాడడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఆగస్టు 2012 నాటికి పొగాకు వాడకాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని సుమారు 175 దేశాలు అంగీకరించాయి. a అయినప్పటికీ, కొన్ని బలమైన కారణాలు ఈ మహమ్మారిని అడ్డుకోవడాన్ని కష్టతరం చేస్తున్నాయి. పొగతాగే అలవాటులేని వాళ్లను ముఖ్యంగా వర్ధమాన దేశాల్లోని స్త్రీలను, యువతను ఆకర్షించేలా ప్రకటనలు వేయడానికి పొగాకు పరిశ్రమ ప్రతీ సంవత్సరం వేలకోట్లు వెచ్చిస్తుంది. పొగతాగడం ఒక్కసారి అలవాటైతే దాన్ని మానుకోవడం చాలా కష్టం. కాబట్టి, ఇప్పటికే పొగాకుకు బానిసలైన వంద కోట్ల మందిలో చనిపోయే లేదా తీవ్ర అనారోగ్యం పాలయ్యే వాళ్ల సంఖ్య తగ్గుతుందని ఆశించలేం. ఇప్పుడు ఆ అలవాటు ఉన్నవాళ్లు దాన్ని మానుకోకపోతే, రాబోయే నాలుగు దశాబ్దాల్లో పొగాకు మరణాలు గణనీయంగా పెరుగుతాయి.

పొగతాగే వాళ్లు ఆ అలవాటుకు త్వరగా బానిసలైపోతారు. దానివల్ల, ప్రకటనల వల్ల చాలామంది ఆ అలవాటును మానుకోవాలనుకున్నా మానుకోలేకపోతున్నారు. నావోకో విషయంలో అదే జరిగింది. టీనేజీలో ఉన్నప్పుడే ఆమెకు పొగతాగడం అలవాటైంది. ప్రసార మాధ్యమాలు చూపించిన విధంగా పొగ తాగినప్పుడు, తాను అధునాతన మహిళలా నడుచుకుంటున్నట్లు ఆమెకు అనిపించేది. తన తల్లిదండ్రులిద్దరూ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోవడం ఆమె చూసింది, పైగా ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయినాసరే ఆమె పొగతాగడం మాత్రం మానుకోలేదు. ఆమె ఇలా ఒప్పుకుంటోంది: “ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వస్తుందేమోనన్న భయం, పిల్లల ఆరోగ్యం పాడౌతుందేమోననే ఆందోళన ఉన్నా నేను పొగతాగడం మానుకోలేకపోయాను. ఇక ఎప్పటికీ ఆ అలవాటు నుండి బయటపడలేనని నాకనిపించేది.”

కానీ, నావోకో ఆ అలవాటునుండి బయటపడింది. ఎలా? లక్షలమందికి ఏది సహాయం చేసిందో అదే ఆమెకూ సహాయం చేసింది. ఇంతకీ ఏమిటది? దయచేసి తర్వాతి ఆర్టికల్‌ చదవండి. (w14-E 06/01)

a పొగతాగడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, పొగాకు అమ్మకాలను నియంత్రించడం, వాటిపై ఎక్కువ పన్ను విధించడం, పొగ తాగే అలవాటు మానుకోవడానికి సహాయపడే కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి ఈ నియంత్రణ చర్యల్లో ఉన్నాయి.