కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సారెపతులోని విధవరాలు తన విశ్వాసానికి ప్రతిఫలం పొందింది

సారెపతులోని విధవరాలు తన విశ్వాసానికి ప్రతిఫలం పొందింది

ఓ బీద విధవరాలు తన ఒక్కగానొక్క కొడుకును గుండెలకు హత్తుకుంది. ఆమెకు అంతా ఓ కలలా ఉంది, ప్రాణంలేని కొడుకు శరీరాన్ని కాసేపటి క్రితమే తన చేతుల్లో ఎత్తుకుంది! ఇప్పుడు ఆ బిడ్డ మళ్లీ బ్రతికి, చిరునవ్వు చిందించడం చూసి ఆనందం పట్టలేకపోతోంది. ఆమె ఇంట్లో ఉన్న అతిథి ఇలా అన్నాడు: ‘ఇదిగో, నీ కుమారుడు బ్రతికాడు.’

ఆ పునరుత్థానం దాదాపు 3,000 సంవత్సరాల క్రితం జరిగింది. మీరు దాని గురించి 1 రాజులు 17వ అధ్యాయంలో చదవవచ్చు. ఇంట్లో ఉన్న ఆ అతిథి, దేవుని ప్రవక్తయైన ఏలీయా. మరి ఆ తల్లి ఎవరు? ఆమె సారెపతు అనే ఊరిలో నివసిస్తున్న ఓ విధవరాలు, ఆమె పేరును బైబిలు ప్రస్తావించలేదు. ఆమె విశ్వాసాన్ని ఎంతగానో బలపర్చిన సంఘటనల్లో, ఆమె కొడుకు పునరుత్థానం ఒకటి. ఇప్పుడు ఆమె జీవితాన్ని పరిశీలిస్తూ, మనం కొన్ని విలువైన పాఠాలను నేర్చుకుందాం.

విశ్వాసంగల ఓ విధవరాలిని ఏలీయా కనుగొన్నాడు

దుష్టరాజైన ఆహాబు ఏలుతున్న ఇశ్రాయేలు రాజ్యంలో చాలాకాలం పాటు వర్షం పడదని యెహోవా చెప్పాడు. ఆ విషయాన్ని ఏలీయా ప్రకటించాక యెహోవా ఆయనను ఆహాబు కంటపడకుండా దాచి, కాకోలముల ద్వారా రొట్టెను, మాంసాన్ని అందించి అద్భుతరీతిలో పోషించాడు. ఆ తర్వాత యెహోవా ఏలీయాకు ఇలా చెప్పాడు: “నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము; నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెలవిచ్చితిని.”—1 రాజు. 17:1-9.

ఏలీయా సారెపతుకు వచ్చినప్పుడు, కట్టెలు ఏరుకుంటున్న ఓ బీద విధవరాల్ని చూశాడు. ఆ ప్రవక్తను పోషించే స్త్రీ ఆమేనా? ఒకవేళ ఆమె అయితే, కటిక బీదరికంలో ఉన్న ఆమె ఏలీయాను ఎలా పోషించగలదు? ఒకవేళ ఏలీయాకు అలాంటి సందేహాలు ఉన్నా, వాటిని పక్కనబెట్టి ఆ స్త్రీతో మాట్లాడడం మొదలుపెట్టాడు. “త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని” ఏలీయా ఆ స్త్రీని వేడుకొన్నాడు. ఆమె నీళ్లు తేవడానికి వెళ్తున్నప్పుడు ఆయన, “నాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను.” (1 రాజు. 17:10, 11) ఏలీయాకు నీళ్లు ఇవ్వడం ఆ విధవరాలికి ఇబ్బంది కాదు కానీ, ఆయనకు రొట్టె ఇవ్వడమే ఆమెకు పెద్ద సమస్య.

“అందుకామె—నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.” (1 రాజు. 17:12) ఆ మాటలను బట్టి మనం ఏమి తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

ఏలీయా దైవభక్తిగల ఇశ్రాయేలీయుడని ఆ విధవరాలు గుర్తించింది. “నీ దేవుడైన యెహోవా జీవముతోడు” అని ఆమె చెప్పిన మాటను బట్టి ఆ విషయం స్పష్టమౌతుంది. ఆమెకు ఇశ్రాయేలీయుల దేవుని గురించి కొంత తెలిసినప్పటికీ, యెహోవాను “నా దేవుడు” అని సంబోధించేంతగా ఆయనను తెలుసుకోలేదని అర్థమౌతుంది. ఫేనీకే పట్టణమైన సీదోనుకు ‘చెందిన’ లేదా దాని సమీపంలో ఉన్న సారెపతులో ఆమె నివసించేది. సారెపతు నివాసులందరూ దాదాపు బయలు ఆరాధకులే. అయినా, ఆ విధవరాలిలో యెహోవా అసాధారణమైనదేదో చూశాడు.

సారెపతులోని బీద విధవరాలు విగ్రహారాధకుల మధ్య నివసిస్తున్నప్పటికీ, ఆమె విశ్వాసం చూపించింది. ఆ స్త్రీతోపాటు, ప్రవక్తకు కూడా ప్రయోజనం చేకూర్చేందుకే యెహోవా ఏలీయాను ఆమె దగ్గరికి పంపించాడు. దీని నుండి మనం ఓ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు.

బయలు ఆరాధనతో నిండిపోయిన సారెపతులో ఉన్న వాళ్లందరూ పూర్తిగా చెడ్డవాళ్లేమీ కారు. తనను సేవించకపోయినా మంచి మనస్తత్వం ఉన్నవాళ్లను తాను పట్టించుకుంటానని, యెహోవా ఏలీయాను ఆ విధవరాలి దగ్గరకు పంపించడం ద్వారా తెలియజేశాడు. నిజానికి, “ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”—అపొ. 10:35.

మీ క్షేత్రంలో ఉన్న ఎంతమంది సారెపతులోని విధవరాలిలా ఉన్నారు? అబద్ధారాధన చేసే ప్రజల మధ్య జీవిస్తున్నప్పటికీ అలాంటివాళ్లు మరింత మెరుగైనదాని కోసం ఎదురుచూస్తుండవచ్చు. వాళ్లకు యెహోవా గురించి కాస్తోకూస్తో తెలిసుండవచ్చు లేదా అస్సలు తెలిసుండకపోవచ్చు, కాబట్టి వాళ్లు స్వచ్ఛారాధకులు అవ్వాలంటే మన సహాయం అవసరం. అలాంటివాళ్లను వెదికి, సహాయం చేస్తున్నారా?

‘మొదట నాకొక చిన్న అప్పము చేయుము’

ఏలీయా ఆ విధవరాలిని ఏమి చేయమన్నాడో జాగ్రత్తగా పరిశీలించండి. ఆ విధవరాలు అంతకుముందే, ‘మేము చావకముందు నాకోసం, నా బిడ్డకోసం భోజనం సిద్ధం చేసుకోవాలి’ అని చెప్పింది. “అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను—భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి యున్నాడు.”—1 రాజు. 17:11-15.

వేరొకరైతే, ‘మా చివరి భోజనం ఇచ్చేయాలా? మీరు తమాషా చేయడం లేదు కదా?’ అని అనేవారేమో, కాని ఆ విధవరాలు అలా అనలేదు. యెహోవా గురించి తెలిసింది కొంచెమే అయినా ఆమె ఏలీయాను నమ్మి, ఆయన చెప్పిన పని చేసింది. విశ్వాసానికి సంబంధించిన ఆ ప్రాముఖ్యమైన పరీక్షలో ఆమె ఎంతటి జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకుందో కదా!

ఏలీయాకు దేవుడైన యెహోవామీద ఆ విధవరాలు చూపించిన విశ్వాసం ఆమె ప్రాణాన్ని, ఆమె కొడుకు ప్రాణాన్ని కాపాడింది

ఆ బీద విధవరాలిని దేవుడు విడిచిపెట్టలేదు. ఏలీయా మాటిచ్చినట్లే, ఆమె దగ్గరున్న కొంచెం ఆహారం అయిపోకుండా యెహోవా చూశాడు. దానివల్ల ఆ కరువు ముగిసేవరకు ఏలీయా, ఆ విధవరాలు, ఆమె బిడ్డ ప్రాణాలు నిలుపుకున్నారు. అవును, “యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.” (1 రాజు. 17:16; 18:1) ఒకవేళ ఆ స్త్రీ ఏలీయా చెప్పిన పని చేసివుండకపోతే, ఆమె దగ్గర మిగిలిన ఆ కాస్త పిండి, నూనెతో చేసిన రొట్టె బహుశా వాళ్ల చివరి భోజనం అయ్యి ఉండేది. కానీ ఆమె విశ్వాసంతో ప్రవర్తించింది, యెహోవాను నమ్మి, ముందు ఏలీయాకు భోజనం పెట్టింది.

దీనినుండి మనం నేర్చుకోగల పాఠం ఏమిటంటే, విశ్వాసం చూపించే వాళ్లను దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థతకు సంబంధించిన పరీక్ష ఎదురైనప్పుడు, మీరు విశ్వాసం చూపిస్తే యెహోవా మీకు సహాయం చేస్తాడు. మీ కష్టాల్ని సహించేందుకు ఆయన ఓ పోషకుడిగా, కాపరిగా, స్నేహితునిగా మీకు తోడుంటాడు.—నిర్గ. 3:13-15.

విధవరాలి కథ నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చో 1898, జాయన్స్‌ వాచ్‌ టవర్‌ ఇలా చెప్పింది: “లోబడడానికి అవసరమైనంత విశ్వాసం ఆ స్త్రీకి ఒకవేళ ఉంటే, ఆ ప్రవక్త ద్వారా ప్రభువు సహాయం పొందడానికి ఆమె యోగ్యురాలు అవుతుంది; ఒకవేళ ఆమె విశ్వాసం చూపించకపోతే, విశ్వాసంగల మరో విధవరాలికి ఆ అవకాశం దక్కుతుంది. మన విషయంలో కూడా అంతే, మన విశ్వాసాన్ని పరీక్షించే వివిధ సందర్భాలు మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యేలా ప్రభువు చేస్తాడు. మనం విశ్వాసం చూపిస్తే ఆశీర్వాదం పొందుతాం; విశ్వాసం చూపించకపోతే, దాన్ని పోగొట్టుకుంటాం.”

మనకు ఒకానొక శోధన ఎదురైనప్పుడు, దానికి సంబంధించి లేఖనాల్లో, బైబిలు ఆధారిత ప్రచురణల్లో ఉన్న దేవుని నిర్దేశం కోసం వెదకాలి. తర్వాత, ఆ నిర్దేశం ఎంత కష్టంగా అనిపించినా దాన్ని పాటించడానికి కృషి చేయాలి. “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అని చెబుతున్న సామెతల్లోని మాటలకు అనుగుణంగా ప్రవర్తిస్తే మనం తప్పకుండా దీవెనలు పొందుతాం.—సామె. 3:5, 6.

‘నా కుమారుణ్ణి చంపడానికే వచ్చావా?’

విశ్వాసం విషయంలో ఆ స్త్రీకి తర్వాత మరో పరీక్ష ఎదురైంది. బైబిలు వృత్తాంతం ఇలా చెబుతుంది: “అటుతరువాత ఆ యింటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగియై ప్రాణము నిలువజాలనంత వ్యాధిగలవాడాయెను.” ఈ విషాదానికి కారణమేమిటో ఆలోచిస్తూ, దుఃఖిస్తున్న ఆ తల్లి ఏలీయాతో, “దైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నాయొద్దకు వచ్చితివా?” అని అన్నది. (1 రాజు. 17:17, 18) కోపంతో అన్న ఆ మాటల అర్థమేమిటి?

తన మనస్సాక్షిని నొప్పించిన ఓ పాపాన్ని ఆ స్త్రీ గుర్తుచేసుకుందా? తన కుమారుని మరణం దేవుడు విధించిన శిక్షని, ఏలీయా దాన్ని అమలుచేయడానికి వచ్చిన దేవుని దూతని ఆమె అనుకుందా? బైబిలైతే ఈ విషయంలో ఏమీ చెప్పడం లేదుగానీ ఒక విషయం మాత్రం స్పష్టం, దేవుడు అన్యాయస్థుడని ఆ విధవరాలు నిందించలేదు.

ఆ విధవరాలి కొడుకు చనిపోయినందుకు, తాను అక్కడ ఉండడమే ఆమె గుండెకోతకు కారణమని ఆమె అనుకుంటున్నందుకు ఏలీయా దిగ్భ్రాంతి చెందాడు. జీవంలేని ఆ బిడ్డ శరీరాన్ని పైఅంతస్తు గదిలోనికి తీసుకెళ్లి ఏలీయా ఇలా మొరపెట్టాడు: “యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమెమీదికి కీడు రాజేసితివా?” ఒకవేళ దయ, ఆతిథ్య గుణం ఉన్న ఆ స్త్రీ ఇంకా బాధపడేలా అనుమతించడం వల్ల దేవుని నామానికి నింద వస్తుందన్న ఆలోచననే ఏలీయా భరించలేకపోయాడు. అందుకే, ‘యెహోవా నా దేవా, ఈ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్ము’ అని ఏలీయా ప్రాధేయపడ్డాడు.—1 రాజు. 17:20, 21.

‘ఇదిగో, నీ కుమారుడు బ్రతికాడు’

యెహోవా వింటున్నాడు. ఆ విధవరాలు ఏలీయాను పోషించింది, విశ్వాసాన్ని కూడా చూపించింది. పునరుత్థానం జరగబోతుందని, అది రానున్న తరాలకు నిరీక్షణ ఇస్తుందని దేవునికి తెలిసే ఆ బాబు జబ్బుపడి చనిపోయేందుకు అనుమతించి ఉంటాడు. ఏలీయా వేడుకున్నప్పుడు, యెహోవా ఆ పిల్లవాణ్ణి బ్రతికించాడు. బైబిల్లో నమోదైన మొదటి పునరుత్థానం అదే. ‘ఇదిగో, నీ కుమారుడు బ్రతికాడు’ అని ఏలీయా అన్నప్పుడు ఆ విధవరాలికి కలిగిన ఆనందాన్ని ఒకసారి ఊహించుకోండి. ఆ తర్వాత ఆ విధవరాలు ఏలీయాతో ఇలా అంది: “నీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదును.”—1 రాజు. 17:22-24.

ఈ విధవరాలు గురించి 1 రాజులు 17వ అధ్యాయంలో అంతకు మించిన వివరాలేవీ లేవు. అయితే యేసు ఆమె గురించి సానుకూలంగా చెప్పిన మాటల్ని చూస్తే, ఆమె జీవించినంతకాలం యెహోవాకు నమ్మకంగా సేవించివుండవచ్చు. (లూకా 4:25, 26) తన సేవకులకు సహాయం చేసేవాళ్లను దేవుడు ఆశీర్వదిస్తాడని ఆమె వృత్తాంతం మనకు బోధిస్తుంది. (మత్త. 25:34-40) క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు నమ్మకస్థుల బాగోగులు చూసుకుంటాడని ఈ వృత్తాంతం నిరూపిస్తుంది. (మత్త. 6:25-34) చనిపోయిన వాళ్లను బ్రతికించేందుకు యెహోవాకు కోరిక, సామర్థ్యం ఉన్నాయని కూడా ఈ వృత్తాంతం స్పష్టంగా తెలియజేస్తుంది. (అపొ. 24:14, 15) సారెపతులోని విధవరాలిని గుర్తుచేసుకునేందుకు ఇంతకన్నా మంచి కారణాలు అవసరమంటారా?