కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనాటి జ్ఞాపకాలు

100 ఏళ్ల విశ్వాస గాథ

100 ఏళ్ల విశ్వాస గాథ

“బ్రదర్‌ రస్సెల్‌బయటకన్నా తెరమీదే బ్రదర్‌ రస్సెల్‌లా ఉన్నారు!”​—1914⁠లో “ఫోటో డ్రామా” చూసిన ఓ ప్రేక్షకుని మాట.

ఈ సంవత్సరంతో “ఫోటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” ప్రదర్శనకు వందేళ్లు! బైబిలు దేవుని వాక్యమని ప్రజల్లో విశ్వాసం కలిగించే ఉద్దేశంతో ఆ చలన చిత్రాన్ని రూపొందించారు. పరిణామ సిద్ధాంతం వల్ల, బైబిలు విమర్శకుల వల్ల, సందేహాల వల్ల చాలామంది విశ్వాసం సన్నగిల్లుతున్న ఆ కాలంలో “ఫోటో డ్రామా,” యెహోవాయే సృష్టికర్తని తిరుగులేని విధంగా చూపించింది.

బైబిలు విద్యార్థులను అప్పట్లో ముందుండి నడిపించిన ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌, బైబిలు సత్యాన్ని సాధ్యమైనంత వేగంగా, సమర్థవంతంగా ప్రజలకు చేరవేసే మార్గాల కోసం నిర్విరామంగా అన్వేషించాడు. బైబిలు విద్యార్థులు అప్పటికే మూడు దశాబ్దాలకు పైగా ముద్రిత సాహిత్యాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఓ సరికొత్త మార్గం వాళ్ల దృష్టిని ఆకర్షించింది, అదే చలన చిత్రం.

చలన చిత్రాల ద్వారా సువార్తను వ్యాప్తిచేయడం

మూకీ చిత్రాలు 1890 దశకంలో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. 1903⁠లోనే ఓ మతసంబంధ సినిమాను న్యూయార్క్‌ నగరంలోని ఓ చర్చీలో ప్రదర్శించారు. అలా చలన చిత్ర పరిశ్రమ తొలి అడుగులు వేస్తున్న ఆ కాలంలోనే, రస్సెల్‌ 1912⁠లో “ఫోటో డ్రామా” చలన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ధైర్యంగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ముద్రిత పత్రికల కన్నా ఈ మాధ్యమం బైబిలు సత్యాన్ని మరింత వేగంగా ఎక్కువమంది ప్రజలకు చేరవేయగలదని రస్సెల్‌ గుర్తించాడు.

ఎనిమిది గంటలపాటు సాగే “ఫోటో డ్రామా” ప్రదర్శనను సాధారణంగా నాలుగు భాగాలుగా చూపించేవాళ్లు, అందులో చక్కని కంఠస్వరం ఉన్న ఓ ప్రఖ్యాత ప్రసంగీకునితో చెప్పించి రికార్డు చేసిన 96 చిన్నచిన్న బైబిలు ప్రసంగాలు కూడా ఉండేవి. చాలా సన్నివేశాలకు శాస్త్రీయ సంగీతాన్ని జతచేశారు. ప్రదర్శనలో రంగురంగుల స్లైడ్లు, సుప్రసిద్ధ బైబిలు కథల సన్నివేశాలు వచ్చినప్పుడు వాటికి సరిగ్గా సరిపోయే స్వరాన్ని, సంగీతాన్ని నైపుణ్యంగల ఆపరేటర్లు ఫోనోగ్రాఫ్‌ సహాయంతో వినిపించేవాళ్లు.

“నక్షత్రాల సృష్టి నుండి క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన మహిమాన్విత ముగింపు వరకు ఆ ప్రదర్శనలో చూపించారు”​—1914⁠లో, 14 ఏళ్ల ఎఫ్‌. స్టువర్ట్‌ బార్న్స్‌

ప్రదర్శనలో ఉపయోగించిన ఫిల్మ్‌ను, గాజు స్లైడ్లను చాలావరకు బయటి స్టూడియోల్లో కొన్నారు. ఫిలదెల్ఫియ, న్యూయార్క్‌, పారిస్‌, లండన్‌ వంటి నగరాల్లోని నైపుణ్యంగల కళాకారులు గాజు స్లైడ్ల మీద, ఫిల్మ్‌లోని ప్రతీ ఫ్రేమ్‌ మీద చేతితో చిత్రాలు గీశారు. బెతెల్‌లో కళావిభాగంలోని సహోదరులుకూడా ఎన్నో పెయింటింగ్‌లు వేశారు, ముఖ్యంగా వాళ్లు విరిగిన స్లైడ్ల స్థానంలో కొత్తవాటిని చిత్రించేవాళ్లు. బయటివాళ్ల దగ్గర కొన్న ఫిల్మ్‌తో పాటు, న్యూయార్క్‌లో యాంగర్స్‌ పరిసరాల్లో బెతెల్‌ కుటుంబ సభ్యులతో బైబిల్లోని పాత్రలు వేయించి వాటిని కూడా చిత్రీకరించి ఉపయోగించారు. అబ్రాహాము, ఇస్సాకు, ఇస్సాకును బలి ఇవ్వకుండా ఆపిన దూత వంటి పాత్రలు వాటిలో కొన్ని.—ఆది. 22:9-12.

నైపుణ్యంగల ఆపరేటర్లు సమన్వయంతో పనిచేసి, రెండు మైళ్ల పొడవుగల ఫిల్మ్‌లు, 26 ఫోనోగ్రాఫ్‌ రికార్డులు, దాదాపు 500 స్లైడ్లను ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగకుండా ప్రదర్శించారు.

రస్సెల్‌ సహచరుడైన మరో సహోదరుడు విలేఖరులతో మాట్లాడుతూ, ‘గతంలో మత సంబంధమైన పురోగతికి తోడ్పడిన మరే ఇతర మాధ్యమాలకన్నా ఈ మాధ్యమం ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను చేరుకుని, లేఖనాలపట్ల వాళ్ల ఆసక్తిని పెంచుతుంది’ అన్నాడు. ఆధ్యాత్మిక ఆకలిదప్పులుగల ఎంతోమంది ప్రజల్ని చేరుకోవడానికి చేసిన అలాంటి వినూత్న ప్రయత్నాన్ని క్రైస్తవమత నాయకులు మెచ్చుకున్నారా? లేదు. దానికి బదులుగా వాళ్లు “ఫోటో డ్రామా”ను తప్పుబట్టారు, కొంతమందైతే, ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూడకుండా కుయుక్తితో ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ల మద్దతుదారులు ఒక ప్రదర్శనశాలలో విద్యుత్తు సరఫరా కూడా ఆపేశారు.

స్థానిక సంఘాల్లోని కొంతమంది సహోదరీలు, “ఫోటో డ్రామా” చిత్రాలు ఉన్న లక్షలాది కాపీలను ఉచితంగా పంచిపెట్టారు

బాలుడైన యేసు బొమ్మ ఉన్న “బ్యాడ్జీలు” కూడా ప్రేక్షకులు అందుకున్నారు. అవి ‘సమాధాన కుమారుడిగా’ ఉండాలని వాటిని పెట్టుకునేవాళ్లకు గుర్తుచేసేవి

అయినప్పటికీ, ఉచితంగా ప్రదర్శించిన “ఫోటో డ్రామా” చూడడానికి వచ్చిన ప్రేక్షకులతో హాళ్లు కిక్కిరిసిపోయేవి. అమెరికాలో రోజూ దాదాపు 80 నగరాల్లో “ఫోటో డ్రామా” ప్రదర్శించేవాళ్లు. చాలామంది ప్రేక్షకులు మొట్టమొదటిసారిగా ‘మాట్లాడే సినిమా’ తిలకించి ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. ఓ ప్రత్యేకమైన ఫోటోగ్రఫీ విధానం ద్వారా ఆ చిత్రంలో, కోడిపిల్ల గుడ్డును పగలగొట్టుకుని బయటికి రావడం, పువ్వు అందంగా వికసించడం చూపించారు. విజ్ఞానశాస్త్రానికి సంబంధించి అందులో చూపించిన సన్నివేశాలు యెహోవాకు అద్భుతమైన జ్ఞానం ఉందని ప్రేక్షకులు గుర్తించేలా చేశాయి. ప్రారంభంలో ప్రస్తావించినట్లు, “ఫోటో డ్రామా” ప్రదర్శనను పరిచయం చేయడానికి తెరమీద కనిపించిన సహోదరుడైన రస్సెల్‌ను చూసి ఓ వ్యక్తి, “బ్రదర్‌ రస్సెల్‌బయటకన్నా తెరమీదే బ్రదర్‌ రస్సెల్‌లా ఉన్నారు!” అనుకున్నాడు.

బైబిలు విద్యలో ఓ మైలురాయి

న్యూయార్క్‌లో, బైబిలు విద్యార్థులు అప్పట్లో సొంతగా నిర్వహించుకున్న ఈ సుందరమైన హాలులో 1914, జనవరి 11న “ఫోటో డ్రామా” చలనచిత్రాన్ని మొట్టమొదటిసారి ప్రదర్శించారు

రచయిత, చలనచిత్ర చరిత్రకారుడైన టిమ్‌ డర్క్స్‌ “ఫోటో డ్రామా” గురించి ఇలా అన్నాడు: “సన్నివేశాలకు తగ్గట్లుగా మాటలు, కదిలే ఫిల్మ్‌లు, రంగురంగుల స్లైడ్లు కలగలిసిన మొట్టమొదటి చిత్రం ఇది!” అంతకుముందు వచ్చిన సినిమాల్లో కూడా ఇలాంటి కొన్ని హంగులు ఉన్నప్పటికీ అన్నీ ఒకే చిత్రంలో ఉండడం అదే మొదటిసారి, ముఖ్యంగా బైబిలు ఆధారంగా తీసిన చిత్రాల్లో! ఎక్కువమంది ప్రేక్షకులు చూసిన చిత్రం కూడా ఇదే. ఈ చిత్రం విడుదలైన మొదటి సంవత్సరంలోనే ఉత్తర అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ప్రాంతాల్లో దాదాపు 90 లక్షలమంది ప్రేక్షకులు దీన్ని చూశారు.

“ఫోటో డ్రామా” 1914, జనవరి 11న న్యూయార్క్‌ నగరంలో మొదటిసారి ప్రదర్శించారు. ఆ తర్వాత ఏడు నెలలకు మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. అయినా ప్రపంచమంతటా ప్రజలు “ఫోటో డ్రామా” చూడడానికి వస్తూ, రాజ్యం తీసుకురాబోయే ఆశీర్వాదాలను చూపించే సన్నివేశాలను చూసి ఉపశమనం పొందారు. ఏ రకంగా చూసినా 1914కు సంబంధించి, “ఫోటో డ్రామా” ఓ అద్భుతమైన దృశ్య కావ్యం!

ఉత్తర అమెరికా ఖండం అంతటా 20 “ఫోటో డ్రామా” సెట్లను ఉపయోగించారు