ఆనాటి జ్ఞాపకాలు
“మళ్లీ సమావేశం ఎప్పుడు ఉంటుంది?”
అది నవంబరు నెలాఖరు, 1932వ సంవత్సరం, పది లక్షలకన్నా ఎక్కువ జనాభాతో కిటకిటలాడే మెక్సికో నగరం. వారం క్రితమే మొదటిసారిగా ఆ నగరంలో ట్రాఫిక్ లైట్లను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ వార్త పాతదైపోయింది, ఎందుకంటే మరో వార్త ప్రజలందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రైల్వేస్టేషన్‌లో రిపోర్టర్లు కెమెరాలతో సిద్ధంగా ఉన్నారు. వాళ్లు ఒక ప్రత్యేక అతిథి కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరు ఆ అతిథి? వాచ్ టవర్ సొసైటీకి ప్రెసిడెంట్ అయిన జోసెఫ్. ఎఫ్. రూథర్‌ఫర్డ్. అక్కడ జరుగుతున్న మూడు రోజుల సమావేశానికి వస్తున్న సహోదరుడు రూథర్‌ఫర్డ్‌కు స్వాగతం పలకాలని స్థానిక యెహోవాసాక్షులు కూడా ఎదురుచూస్తున్నారు.
మెక్సికో నగరంలో సత్యాన్ని వ్యాప్తిచేయడానికి జరుగుతున్న కృషి గురించి మాట్లాడుతూ ద గోల్డెన్ ఏజ్ పత్రిక ఇలా రాసింది, “ఈ సమావేశం ఒక ప్రాముఖ్యమైన ఘట్టంగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.” నిజానికి అది చిన్న సమావేశమే, కేవలం 150 మంది హాజరయ్యారు. మరి అది ఎందుకు అంత ప్రాముఖ్యమైన సమావేశం అయ్యింది?
ఆ సమావేశానికి ముందు, మెక్సికోలో సత్యం అంతగా వ్యాప్తి చెందలేదు. ఆ నగరంలో 1919వ సంవత్సరం నుండి చిన్నచిన్న సమావేశాలు జరుగుతుండేవి. కానీ కొన్నేళ్ల తర్వాత సంఘాల సంఖ్య తగ్గుతూ వెళ్లింది. కానీ 1929లో మెక్సికో నగరంలో సంస్థ బ్రాంచి కార్యాలయాన్ని స్థాపించినప్పుడు పరిస్థితి చక్కబడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అధిగమించాల్సిన అవరోధాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ప్రీచింగ్ చేస్తున్నప్పుడు వ్యాపారం చేయవద్దని అప్పట్లో కల్‌పోర్చర్లు అని పిలువబడిన పయినీర్లకు సంస్థ చెప్పింది. అలా చెప్పినందుకు ఒక కల్‌పోర్చర్‌కు ఎంత కోపం వచ్చిందంటే, అతను సత్యాన్ని వదిలేసి సొంతగా ఒక బైబిలు స్టడీ గ్రూపును మొదలుపెట్టుకున్నాడు. ఆ సమయంలోనే, లేఖన విరుద్ధమైన ప్రవర్తన కారణంగా అప్పుడున్న బ్రాంచి పర్యవేక్షకుని స్థానంలో మరొకర్ని నియమించాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనల మూలంగా, మెక్సికోలోని నమ్మకమైన సాక్షులకు ప్రోత్సాహం అవసరమైంది.
మెక్సికోకు వచ్చిన సహోదరుడు రూథర్‌ఫర్డ్ సమావేశంలో ఇచ్చిన రెండు ప్రోత్సాహకరమైన ప్రసంగాల ద్వారా, రేడియో స్టేషన్‌ను ఉపయోగించుకుని ప్రసారం చేసిన ఐదు ప్రసంగాల ద్వారా ఆ నమ్మకమైన సాక్షుల్లో ఉత్సాహాన్ని నింపాడు. సత్యాన్ని వ్యాప్తిచేయడానికి మెక్సికోలోని సహోదరులు రేడియో స్టేషన్‌ను ఉపయోగించడం అదే మొదటిసారి. నగరంలో జరుగుతున్న సేవను పర్యవేక్షించడానికి సమావేశం తర్వాత కొత్త బ్రాంచి పర్యవేక్షకుడిని నియమించారు. ఇప్పుడు సాక్షుల్లో ఉత్సాహం నిండుకుంది, యెహోవా సాయంతో ప్రకటనాపనిని కొనసాగించారు.
తర్వాతి సంవత్సరం అంటే 1933లో మెక్సికోలో రెండు సమావేశాలు జరిగాయి. ఒకటి వెరక్రూజ్‌లో, ఇంకొకటి మెక్సికో నగరంలో. సహోదరులు కష్టపడి చేస్తున్న సేవకు మంచి ఫలితాలు వచ్చాయి. ఉదాహరణకు 1931లో అక్కడ 82 మంది ప్రచారకులు మాత్రమే ఉండేవాళ్లు. 1941 కల్లా వాళ్ల సంఖ్య పదిరెట్లు పెరిగింది. ఆ సంవత్సరంలో జరిగిన సమావేశానికి దాదాపు 1,000 మంది మెక్సికో నగరానికి తరలివచ్చారు.
“వీధులను ఆక్రమించారు”
1943లో, మెక్సికోలోని 12 నగరాల్లో జరగనున్న “స్వేచ్ఛా జనాంగములు” అనే సమావేశం గురించి సాక్షులు ప్రకటించడం మొదలుపెట్టారు. a దానికోసం వాళ్లు ప్లకార్డులను (sandwich signs) తమ శరీరానికి తగిలించుకునేవాళ్లు. అంటే పెద్ద సైజులో ఉండే రెండు అట్టముక్కలకు తాళ్లను జతచేసి భుజాలమీదుగా వాటిని వేసుకునేవాళ్లు. అప్పుడు అవి తమ శరీరానికి ముందు, వెనుక వేలాడుతుండేవి. సమావేశాల గురించి ప్రకటించడానికి 1936 నుండి సాక్షులు ఇలాంటి ప్లకార్డులు ఉపయోగించారు.
ఆ విధంగా ప్లకార్డులను ధరించి ప్రకటించడంవల్ల మెక్సికో నగరంలో ఎంత చక్కని ఫలితాలు వచ్చాయంటే, సమావేశానికి హాజరైన సాక్షుల గురించి లా నేసియన్ అనే పత్రిక ఇలా రాసింది, “[సమావేశం] మొదటి రోజున, ఎక్కువమందిని ఆహ్వానించమనే పిలుపు [సాక్షులు] పొందారు. రెండవ రోజున హాలు పట్టనంత మంది హాజరయ్యారు.” ఆ ఫలితాలు చూసిన క్యాథలిక్ చర్చివాళ్లకు కోపం వచ్చింది, దాంతో సాక్షుల్ని వ్యతిరేకించారు. కానీ సహోదరసహోదరీలు వాళ్ల బెదిరింపులకు ఏమాత్రం జంకలేదు. సమావేశం గురించి ప్రకటిస్తూనే వచ్చారు. లా నేసియన్ పత్రికలో వచ్చిన మరో ఆర్టికల్‌లో ఇలా ఉంది, “నగరమంతా వాళ్లను చూసింది . . . ఆడవాళ్లు, మగవాళ్లు ప్రకటనా ప్లకార్డుల్లా మారిపోయారు.” అంతేకాదు మెక్సికో నగరంలో ప్రకటిస్తున్న సహోదరుల ఫొటో ముద్రించి “వీధులను ఆక్రమించారు” అనే క్యాప్షన్ పెట్టారు.
“సిమెంటు నేలకన్నా మెత్తగా, వెచ్చగా” ఉన్న పడకలు
అప్పట్లో మెక్సికోలో ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరవ్వడానికి చాలామంది సాక్షులు పెద్దపెద్ద త్యాగాలు చేయాల్సివచ్చింది. చాలామంది సహోదరసహోదరీలు మారుమూల పల్లెటూర్ల నుండి వచ్చేవాళ్లు, అక్కడికి కనీసం రైలు సదుపాయం గానీ, రోడ్లు గానీ ఉండేవి కావు. కాబట్టి సమావేశానికి హాజరవ్వాలనుకునేవాళ్లు గాడిదల మీదగానీ, కాలినడకన గానీ ఎన్నోరోజులపాటు ప్రయాణించిన తర్వాతే సమావేశం జరుగుతున్న నగరానికి వెళ్లే ట్రైన్ దొరికేది.
చాలామంది సాక్షులు పేదవాళ్లు, సమావేశానికి హాజరయ్యేందుకు అయ్యే ఖర్చుల్ని భరించే స్తోమత కూడా వాళ్లకు ఉండేది కాదు. చాలామంది సమావేశ నగరానికి వచ్చాక స్థానిక సాక్షుల ఇళ్లలో ఉండేవాళ్లు. ఆతిథ్యమిచ్చిన కుటుంబాలు వాళ్లను ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్లు. ఇంకొంతమంది రాజ్యమందిరాల్లో పడుకునేవాళ్లు. ఒకసారైతే దాదాపు 90 మంది సహోదరులు బ్రాంచి కార్యాలయంలో ఉన్నారు, రాత్రులు వాళ్లు పుస్తకాలున్న అట్టపెట్టెలపై పడుకునేవాళ్లు. “సిమెంటు నేలకన్నా మెత్తగా, వెచ్చగా” ఉన్న అట్టపెట్టెలపై పడుకునే సౌకర్యం కల్పించినందుకు ఆ సహోదరులు కృతజ్ఞతలు చెప్పారని వార్షిక పుస్తకం చెప్పింది.
ఎన్నో త్యాగాలు చేసి అక్కడికి వచ్చిన సహోదరసహోదరీల కష్టానికి ప్రతిఫలం దక్కింది, వాళ్లు తమ తోటి విశ్వాసులతో కలిసి సంతోషంగా గడిపారు. ప్రస్తుతం మెక్సికో నగరంలో ఉన్న దాదాపు పదిలక్షల కన్నా ఎక్కువమంది సాక్షుల హృదయాల్లో కూడా అలాంటి కృతజ్ఞతా భావమే ఉంది. b 1949 వార్షిక పుస్తకం ప్రకారం, త్యాగాలు చేయాల్సి రావడంవల్ల సహోదరులకు యెహోవా ఆరాధన పట్ల ఉన్న ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ప్రతీ సమావేశం అయిపోయిన తర్వాత, సహోదరులు ఎన్నో రోజులపాటు దానిగురించే మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. అక్కడి సహోదరులు మళ్లీమళ్లీ అడిగే ప్రశ్నేమిటంటే, “మళ్లీ సమావేశం ఎప్పుడు ఉంటుంది?”—సెంట్రల్ అమెరికా నుండి సేకరించినవి.