కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

మొదటి శతాబ్దంలోని యూదులు మెస్సీయ కోసం ‘కనిపెట్టుకొని’ ఉండడానికి ఏ ఆధారం ఉంది?

బాప్తిస్మమిచ్చు యోహాను కాలంలో, “ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరును యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచు” ఉన్నారు. (లూకా 3:15) మెస్సీయ వస్తాడని ఆ సమయంలో యూదులు ఎందుకు ఎదురుచూశారు? దానికి ఎన్నో కారణాలున్నాయి.

యేసు పుట్టిన తర్వాత, బేత్లెహేము దగ్గర పొలాల్లో గొర్రెలను కాస్తున్న కాపరులకు యెహోవా దూత కనబడ్డాడు. ఆ దూత ఇలా ప్రకటించాడు: “దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు.” (లూకా 2:8-11) ఆ తర్వాత, “పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి —సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.” aలూకా 2:13, 14.

ఆ ప్రకటన వినయస్థులైన గొర్రెల కాపరులపై శక్తిమంతమైన ప్రభావాన్ని చూపించింది. అందుకే వాళ్లు వెంటనే బేత్లెహేముకు వెళ్లారు. వాళ్లు యోసేపును, మరియను, శిశువైన యేసును చూసినప్పుడు, ఆ “శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి.” దాని ఫలితంగా, “గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్న వారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.” (లూకా 2:17, 18) “విన్న వారందరు” అనే మాటను బట్టి ఆ కాపరులు జరిగిన విషయాన్ని యోసేపు, మరియలతో పాటు ఇతరులకు కూడా చెప్పారని తెలుస్తుంది. తర్వాత వాళ్లు, “తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రముచేయుచు” తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. (లూకా 2:20) ఆ కాపరులు క్రీస్తు గురించి విన్న మంచి సంగతులను తమలోనే దాచుకోలేదు.

మోషే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞకు లోబడి, మరియ తనకు పుట్టిన మొదటి కుమారుణ్ణి యెహోవాకు ప్రతిష్ఠించడానికి యెరూషలేముకు తీసుకొచ్చినప్పుడు, ప్రవక్త్రియైన అన్న “దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను.” (లూకా 2:36-38; నిర్గ. 13:12) అలా మెస్సీయ గురించిన వార్త వ్యాప్తి చెందుతూనే ఉంది.

తర్వాత, తూర్పు నుండి జ్యోతిష్కులు “యెరూషలేమునకు వచ్చి—యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి.” (మత్త. 2:1, 2) “హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితోకూడ యెరూషలేము వారందరును కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధానయాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి—క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.” (మత్త. 2:3, 4) అలా, మెస్సీయ పుట్టాడన్న విషయం చాలామందికి తెలిసింది. b

బాప్తిస్మమిచ్చు యోహానే క్రీస్తు అయివుంటాడని కొందరు యూదులు అనుకున్నట్లు పైనున్న లూకా 3:15 బట్టి తెలుస్తుంది. అయితే, యోహాను వాళ్ల ఆలోచనను ఈ మాటలతో సరిచేశాడు: “నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.” (మత్త. 3:11) యోహాను వినయంతో చెప్పిన ఆ మాటలు ప్రజలు మెస్సీయ కోసం ఇంకా ఎక్కువగా ఎదురుచూసేలా చేశాయి.

మొదటి శతాబ్దపు యూదులు మెస్సీయ వచ్చే సమయాన్ని, దానియేలు 9:24-27⁠లో ఉన్న 70 వారాల ప్రవచనం ఆధారంగా లెక్కించివుంటారా? వాళ్లు అలా చేశారని గాని చేయలేదని గాని ఖచ్చితంగా చెప్పలేము. అయితే వాస్తవం ఏమిటంటే యేసు కాలంలోని ప్రజలు, 70 వారాల సమయం గురించి రకరకాల అర్థాలు చెప్పారు, కానీ వాటిల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పుడు మనకున్న అవగాహనకు సాటిరావు. c

ఒక యూదామత సన్యాసుల గుంపని చాలామంది అభిప్రాయపడే ఎస్సెన్స్‌ తెగవాళ్లు, 490 సంవత్సరాల చివర్లో ఇద్దరు మెస్సీయలు వస్తారని బోధించారు. అయితే వాళ్లు దానియేలు ప్రవచనం ఆధారంగానే లెక్కించారని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ వాళ్లు ఆ ప్రవచన ఆధారంగానే లెక్కించినా, సమాజానికి దూరంగా నివసించే వీళ్లు కట్టిన లెక్కలు మిగతా యూదులపై ఎలాంటి ప్రభావం చూపించి ఉంటాయో ఊహించడం కష్టమే.

సా.శ. రెండవ శతాబ్దంలో కొంతమంది యూదులు 70 వారాలంటే, మొదటి దేవాలయం నాశనమైన సా.శ.పూ. 607 నుండి రెండవ దేవాలయం నాశనమైన సా.శ. 70 వరకు ఉన్న కాలమని నమ్మారు. మరికొందరైతే, సా.శ.పూ. 2వ శతాబ్దంలోని మక్కబీయుల కాలంలో ఆ ప్రవచనం నెరవేరిందని చెబుతారు. కాబట్టి 70 వారాలను ఎలా లెక్కించాలనే విషయంలో వాళ్లెవ్వరికీ స్పష్టమైన అభిప్రాయం లేదు.

ఒకవేళ 70 వారాల సమయం సా.శ. మొదటి శతాబ్దంలోనే సరిగ్గా అర్థమైవుంటే, అపొస్తలులతోపాటు మొదటి శతాబ్దంలోని ఇతర క్రైస్తవులు వాగ్దానం చేయబడిన మెస్సీయ సరిగ్గా సమయానికే యేసుక్రీస్తుగా వచ్చాడని నిరూపించేందుకు, దాన్ని రుజువుగా ఉపయోగించేవాళ్లని కొందరు అనుకోవచ్చు. కానీ తొలి క్రైస్తవులు అలా చేశారని చెప్పడానికి ఎలాంటి రుజువూ లేదు.

మనం గమనించాల్సిన మరో విషయం ఉంది. హెబ్రీ లేఖనాల్లోని కొన్ని నిర్దిష్ట ప్రవచనాలు యేసుక్రీస్తు విషయంలో నెరవేరాయని సువార్త వృత్తాంతాలు రాసిన వాళ్లు తరచూ నొక్కిచెప్పారు. (మత్త. 1:22, 23; 2:13-15; 4:12-16) కానీ, వాళ్లలో ఏ ఒక్కరూ యేసు భూమ్మీదకు వచ్చిన సమయాన్ని 70 వారాల ప్రవచనంతో ముడిపెట్టలేదు.

క్లుప్తంగా చెప్పాలంటే, యేసు కాలంలోని ప్రజలు 70 వారాల ప్రవచనాన్ని సరిగ్గా అర్థంచేసుకున్నారని ఖచ్చితంగా చెప్పలేం. అయితే, మెస్సీయ కోసం ప్రజలు ‘కనిపెట్టుకొని’ ఉండడానికి గల ఇతర కారణాలను సువార్త వృత్తాంతాలు ఇస్తున్నాయి.

a బైబిలు చెబుతున్నట్లు, యేసు పుట్టినప్పుడు దూతలు స్తోత్రం చేశారుగాని “పాడలేదు.”

b తూర్పు దిక్కున కనిపించిన ‘నక్షత్రాన్ని’ చూసి ఆ జ్యోతిష్కులు ‘యూదుల రాజు’ పుట్టాడని ఎలా తెలుసుకోగలిగారనే ప్రశ్న మనకు రావచ్చు. బహుశా వాళ్లు ఇశ్రాయేలు దేశం మీదుగా ప్రయాణించినప్పుడు యేసు పుట్టాడనే వార్త వినివుంటారా?

c డెబ్భై వారాల ప్రవచనానికి సంబంధించిన మన ప్రస్తుత అవగాహన కోసం, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 198-199 పేజీలు చూడండి.