కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనాటి జ్ఞాపకాలు

పోర్చుగల్‌లో మొదటి రాజ్య విత్తనాల్ని నాటడం

పోర్చుగల్‌లో మొదటి రాజ్య విత్తనాల్ని నాటడం

అట్లాంటిక్‌ సముద్రంపై యూరప్‌కు వెళ్తున్న ఓడలో, సహోదరుడు జార్జ్‌ యంగ్‌ ప్రయాణిస్తున్నాడు. ఆయన బ్రెజిల్‌లో పరిచర్య చేసినప్పుడు వచ్చిన చక్కని ఫలితాల గురించి ఆలోచిస్తూ చాలా సంతోషపడుతున్నాడు. * తర్వాత ఆయన తన కొత్త నియామకం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. స్పెయిన్‌లో, పోర్చుగల్‌లో ఇంతవరకు ఎవ్వరూ ప్రకటించని క్షేత్రాల్లో సేవచేయడానికి ఆయన వెళ్తున్నాడు. అక్కడికి వెళ్లాక సహోదరుడు జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌తో బైబిలు ప్రసంగాలు ఇప్పించాలనీ, మూడు లక్షల కరపత్రాలు పంచిపెట్టాలనీ సహోదరుడు యంగ్‌ అనుకున్నాడు.

ప్రకటనా పనిలో భాగంగా జార్జ్‌ యంగ్‌ ఎన్నో సముద్రాలు దాటాడు

1925లో సహోదరుడు యంగ్‌ లిస్బన్‌కు వచ్చినప్పుడు అక్కడి పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. 1910లో జరిగిన రిపబ్లికన్‌ విప్లవం వల్ల రాజరిక పరిపాలన ముగిసింది. దాంతో క్యాథలిక్‌ చర్చి దాని పట్టు కోల్పోయింది. ప్రజలకు చాలా విషయాల్లో స్వేచ్ఛ లభించింది గానీ దేశంలో అంతర్గత పోరాటాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

ఒకవైపు, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌తో ప్రసంగం ఇప్పించడానికి యంగ్‌ ఏర్పాట్లు చేస్తున్నాడు. మరోవైపు, కొంతమంది ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేయడంతో, ప్రభుత్వం ఆ దేశాన్ని సైనికులకు అప్పగించింది. ఇలాంటి పరిస్థితిలో వ్యతిరేకత వస్తుందని, బ్రిటీష్‌ అండ్‌ ఫారిన్‌ బైబిల్‌ సొసైటీ సహోదరుడు యంగ్‌ని హెచ్చరించింది. అయినప్పటికీ, ఆయన కామోయిష్‌ సెకండరీ స్కూల్‌లోని జిమ్‌ను ఉపయోగించుకోవడానికి అనుమతి కోరాడు. అనుమతి కూడా దొరికింది!

మే 13న సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ప్రసంగం ఇవ్వాల్సిన సమయం రానేవచ్చింది. దానికోసం చాలామంది ఆతురతతో ఎదురుచూశారు. బిల్డింగ్‌ల మీద వేలాడదీసిన ప్లకార్డుల ద్వారా, వార్తాపత్రికల ద్వారా “భూమ్మీద శాశ్వతకాలం ఎలా జీవించవచ్చు?” అనే బహిరంగ ప్రసంగ అంశాన్ని ప్రకటన చేశారు. వెంటనే మతనాయకులు తమ వార్తాపత్రికల్లో ఒక ఆర్టికల్‌ని ప్రచురించి, కొత్తగా వచ్చిన “అబద్ధ ప్రవక్తల” విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటూ పాఠకుల్ని హెచ్చరించారు. అంతేకాదు, వాళ్లు జిమ్‌ ప్రవేశ మార్గం దగ్గర నిలబడి, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ బోధలు తప్పని చెప్పే బ్రోషుర్లను వేలకొలది పంచిపెట్టారు.

అయినప్పటికీ, దాదాపు 2,000 మందితో ఆ జిమ్‌ కిక్కిరిసిపోయింది. దాంతో మరో 2,000 మందికి లోపలికి వెళ్లే అవకాశం దొరకలేదు. లోపలికి వెళ్లిన వాళ్లలో కొంతమంది కుతూహలంతో జిమ్‌ రెండువైపులా తాళ్లతో చేసిన నిచ్చెనలపై వేలాడారు. ఇంకొంతమంది అక్కడున్న వ్యాయామ పరికరాల పైకి ఎక్కారు.

అయితే అంతా సాఫీగా సాగలేదు. వ్యతిరేకులు గట్టిగట్టిగా అరుస్తూ కుర్చీలు విరగ్గొట్టారు. కానీ సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ మాత్రం ఏమాత్రం భయపడకుండా, ఆయన చెప్పేది అందరికీ వినిపించేలా ఒక టేబుల్‌ ఎక్కి నిలబడ్డాడు. ఆయన దాదాపు అర్ధరాత్రి వరకు ప్రసంగించాడు. 1,200 కన్నా ఎక్కువమంది ఆసక్తిపరులు బైబిలు ప్రచురణలు కావాలని తమ పేర్లను, అడ్రస్‌లను ఇచ్చి వెళ్లారు. మరుసటి రోజే, ఊ సెకూలూ అనే వార్తాపత్రిక సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ప్రసంగం గురించి ప్రచురించింది.

1925 సెప్టెంబరు కల్లా, పోర్చుగీస్‌ భాషలో వచ్చే కావలికోట పత్రికను పోర్చుగల్‌లోనే ప్రచురించడం మొదలుపెట్టారు. (అంతకుముందు దాన్ని బ్రెజిల్‌లో ప్రచురించేవాళ్లు.) ఆ సమయంలోనే, బ్రెజిల్‌కి చెందిన వెర్జీలీయో ఫెర్గసన్‌ అనే సహోదరుడు పోర్చుగల్‌కి వెళ్లి సేవచేయాలని ప్రణాళికలు వేసుకుంటున్నాడు. అంతకుముందు ఆయన బ్రెజిల్‌లోని చిన్న బ్రాంచి కార్యాలయంలో సహోదరుడు యంగ్‌తో కలిసి పనిచేశాడు. తర్వాత, ఆయన పోర్చుగల్‌లో ఉన్న సహోదరుడు యంగ్‌తో కలిసి మళ్లీ పనిచేయడానికి తన భార్య లిజీతోపాటు ప్రయాణమై వచ్చాడు. సహోదరుడు ఫెర్గసన్‌ సరైన సమయంలో వచ్చాడని చెప్పవచ్చు. ఎందుకంటే సహోదరుడు యంగ్‌ త్వరలోనే సోవియట్‌ యూనియన్‌లో, మరితర ప్రాంతాల్లో సేవచేయడానికి వెళ్లబోతున్నాడు.

1928లో లిజీకి, వెర్జీలీయో ఫెర్గసన్‌కు తమ ఇంట్లో కూటాలు జరుపుకోవడానికి ఇచ్చిన అనుమతి

పోర్చుగల్‌లోని సైనికులు నిరంకుశ పాలన మొదలుపెట్టడంతో మన పనికి వ్యతిరేకత పెరిగిపోయింది. సహోదరుడు ఫెర్గసన్‌ మాత్రం ధైర్యంగా అక్కడే ఉండి, బైబిలు విద్యార్థుల చిన్న గుంపును చూసుకుంటూ, వాళ్లు చేస్తున్న పనికి మద్దతిచ్చాడు. అంతేకాదు, ఆయన తన ఇంట్లో క్రమంగా కూటాలు జరుపుకోవడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరాడు. 1927, అక్టోబరులో దానికి అనుమతి దొరికింది.

ఆ నిరంకుశ పాలన మొదటి సంవత్సరంలో సుమారు 450 మంది కావలికోట కోసం చందా కట్టారు. అంతేకాదు కరపత్రాలు, చిన్న పుస్తకాల ద్వారా కూడా పోర్చుగల్‌ సామ్రాజ్యంలోని అంగోలా, ది అజోరస్‌, కేప్‌ వర్డ్‌, ఈస్ట్‌ టైమర్‌, గోవా, మడీరా, మొజాంబిక్‌ వంటి దూర ప్రాంతాలకు సత్యం చేరింది.

1929, తోటపని చేసే మాన్‌వెల్‌ డా సీల్వ జోర్డాన్‌ అనే ఒక పోర్చుగీస్‌ సహోదరుడు లిస్బన్‌కు వచ్చాడు. ఆయన బ్రెజిల్‌లో ఉన్నప్పుడు, సహోదరుడు యంగ్‌ ఇచ్చిన బహిరంగ ప్రసంగాన్ని విన్నాడు. ఆయన వెంటనే సత్యాన్ని గ్రహించి, ప్రకటనా పనిని విస్తృతపర్చడంలో సహోదరుడు ఫెర్గసన్‌కు సహాయం చేయాలని ఉత్సాహం చూపించాడు. దానికోసం ఆయన కల్‌పోర్చర్‌గా సేవచేయడం ప్రారంభించాడు. అప్పట్లో పయినీర్లను అలా పిలిచేవాళ్లు. బైబిలు సాహిత్యాన్ని ముద్రించి పంచిపెట్టే పని క్రమపద్ధతిలో జరగడం వల్ల లిస్బన్‌లో ఉన్న కొత్త సంఘం అభివృద్ధి చెందింది.

1934లో సహోదరుడు ఫెర్గసన్‌, ఆయన భార్య తిరిగి బ్రెజిల్‌కు వెళ్లిపోవాల్సి వచ్చింది. అప్పటికే పోర్చుగల్‌లో సత్యపు విత్తనాలు నాటబడ్డాయి. స్పానిష్‌ అంతర్యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కారణంగా యూరప్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఆ సమయంలో కూడా పోర్చుగల్‌లోని నమ్మకమైన సహోదరుల గుంపు యెహోవాకు యథార్థంగా ఉండగలిగింది. కానీ కొంతకాలంపాటు వాళ్ల ఉత్సాహం సన్నగిల్లింది. 1947లో, గిలియడ్‌ పాఠశాలలో శిక్షణ పొందిన జాన్‌ కుక్‌ అనే సహోదరుడు పోర్చుగల్‌కు మొట్టమొదటి మిషనరీగా వచ్చినప్పుడు, వాళ్ల ఉత్సాహం ఊపందుకుంది. అప్పటినుండి ప్రచారకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. 1962లో ప్రభుత్వం యెహోవాసాక్షుల పనిపై నిషేధం విధించినా, ఆ అభివృద్ధి కొనసాగింది. 1974 డిసెంబరులో, యెహోవాసాక్షులకు ప్రభుత్వ గుర్తింపు దొరికే సమయానికి ఆ దేశంలో 13,000 కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారు.

నేడు 50,000 కన్నా ఎక్కువమంది ప్రచారకులు పోర్చుగల్‌లో, అలాగే పోర్చుగీస్‌ భాష మాట్లాడే అజోరస్‌, మడీరా వంటి ఎన్నో ద్వీపాల్లో మంచివార్త ప్రకటిస్తున్నారు. ఆ ప్రచారకుల్లో, 1925లో సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఇచ్చిన చారిత్రాత్మక ప్రసంగాన్ని విన్నవాళ్ల మూడవ తరంవాళ్లు కూడా ఉన్నారు.

మేం యెహోవాకు, అలాగే పోర్చుగల్‌లో నమ్మకంగా సేవచేసిన ఆ తొలి సహోదరసహోదరీలకు ఎంతో కృతజ్ఞులం. ఎందుకంటే, ఆ సహోదరసహోదరీలు ‘క్రీస్తుయేసుకు సేవకులుగా ఉంటూ అన్యులకు’ ప్రకటించే పనిని ధైర్యంగా ముందుకు నడిపించారు.—రోమా. 15:15, 16.—పోర్చుగల్‌ నుండి సేకరించినవి.

^ పేరా 3 2014, మే 15 కావలికోట సంచికలో 31-32 పేజీల్లో ఉన్న “ఎంతో కోతపని జరగాల్సి ఉంది” అనే ఆర్టికల్‌ చూడండి.