కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వృద్ధాప్య దుర్బలతలున్నా ఆనందంగా సేవచేయడం

వృద్ధాప్య దుర్బలతలున్నా ఆనందంగా సేవచేయడం

జీవిత కథ

వృద్ధాప్య దుర్బలతలున్నా ఆనందంగా సేవచేయడం

వార్నావస్‌ స్పెట్సియోటీస్‌ చెప్పినది

పంతొమ్మిదివందల తొంభైలో, నాకు 68 ఏళ్లప్పుడు పూర్తిగా పక్షవాతం వచ్చింది. అయినప్పటికీ, నేను దాదాపు గత 15 సంవత్సరాలుగా సైప్రస్‌ దీవిలో పూర్తికాల పరిచారకునిగా ఆనందంగా సేవ చేస్తున్నాను. వృద్ధాప్య దుర్బలతలున్నప్పటికీ, యెహోవా సేవలో చురుకుగా కొనసాగేందుకు నాకేది బలాన్నిచ్చింది?

నేను 1922, అక్టోబరు 11న, తొమ్మిదిమంది పిల్లలున్న కుటుంబంలో అంటే నలుగురు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు ఉన్న కుటుంబంలో జన్మించాను. మేము సైప్రస్‌లోని క్సెలోఫాగూ గ్రామంలో నివసించాం. మా తల్లిదండ్రులు ఏదోకాస్త ఉన్నవాళ్లే అయినా, అంత పెద్ద కుటుంబాన్ని పోషించడానికి పొలాల్లో చాలా కష్టపడి పనిచేయవలసి వచ్చేది.

మా నాన్న ఆండొనీస్‌ సహజంగానే మంచి చదువరి, కుతూహలంగల వ్యక్తి. నేను పుట్టిన కొద్దికాలం తర్వాత, నాన్న గ్రామంలోని ఓ పాఠశాల ఉపాధ్యాయుణ్ణి కలిసేందుకు వెళ్లినప్పుడు, బైబిలు విద్యార్థులు (యెహోవాసాక్షులు అప్పట్లో అలా పిలవబడేవారు) ప్రచురించిన పీపుల్స్‌ పుల్‌పిట్‌ అనే ఒక కరపత్రం చూశాడు. ఆయన దాన్ని చదవడం ఆరంభించి, దానిలోని అంశాలపట్ల ఆకర్షితుడయ్యాడు. ఫలితంగా మా నాన్న, ఆయన స్నేహితుల్లో ఒకరైన ఆంత్రియాస్‌ క్రీస్టూ ఆ ద్వీపంలో యెహోవాసాక్షులతో సహవసించినవారిలో మొదటివారయ్యారు.

వ్యతిరేకతవున్నా అభివృద్ధి

అనతికాలంలోనే వారిద్దరూ యెహోవాసాక్షుల నుండి మరిన్ని బైబిలు ఆధారిత సాహిత్యాలు పొందారు. ఎన్నోరోజులు గడవకముందే, నాన్న, ఆంత్రియాస్‌ తాము బైబిలు నుండి నేర్చుకుంటున్న సత్యాలను తోటి గ్రామస్థులతో పంచుకునేందుకు పురికొల్పబడ్డారు. వారి ప్రకటనా కార్యక్రమానికి గ్రీకు ఆర్థోడాక్స్‌ మతనాయకుల నుండి, యెహోవాసాక్షులు హానికరమైన ప్రభావం చూపిస్తారని భావించినవారి నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

అయితే స్థానికుల్లో చాలామంది ఆ ఇద్దరు బైబిలు బోధకులను గౌరవించేవారు. మా నాన్నకు దయాపరుడనే, ఉదారుడనే మంచి పేరుంది. ఆయన బీద కుటుంబాలకు తరచుగా సహాయం చేస్తుండేవాడు. కొన్నిసార్లు ఆయన గుట్టు చప్పుడు కాకుండా రాత్రిపూట బీదవారి ఇంటికివెళ్లి వారి గుమ్మం దగ్గర గోధుమలు లేదా రొట్టెలు పెట్టి వచ్చేవాడు. అలాంటి నిస్వార్థ క్రైస్తవ ప్రవర్తన ఈ ఇద్దరు పరిచారకుల సందేశాన్ని మరింత ఆకర్షణీయం చేసింది.​—⁠మత్తయి 5:​16.

దాని ఫలితంగా దాదాపు పన్నెండుమంది బైబిలు సందేశానికి స్పందించారు. సత్యంపట్ల వారి అవగాహన అధికమౌతుండగా, తామొక గుంపుగా బైబిలు అధ్యయనం చేసేందుకు వివిధ గృహాల్లో సమకూడాల్సిన అవసరముందని వారు భావించారు. 1934వ సంవత్సరంలో, గ్రీసుకు చెందిన పూర్తికాల పరిచారకుడైన నీకొస్‌ మత్తెయాకీస్‌ సైప్రస్‌కు వచ్చి, క్సెలోఫాగూలో ఉన్న గుంపును కలుసుకున్నాడు. సహోదరుడైన మత్తెయాకీస్‌ సహనంతో, నిశ్చయతతో గుంపును వ్యవస్థీకరించేందుకు తోడ్పడి, లేఖనాల గురించి మరింత అవగాహన పొందేందుకు వారికి సహాయం చేశాడు. ఈ గుంపే సైప్రస్‌లో యెహోవాసాక్షుల మొదటి సంఘానికి కేంద్ర బిందువైంది.

క్రైస్తవ సేవ ముందుకు సాగుతుండగా మరెంతోమంది బైబిలు సత్యాన్ని అంగీకరిస్తుండగా, సహోదరులు తమ కూటాలకు శాశ్వత స్థలం అవసరమని గ్రహించారు. మా పెద్దన్న జార్జ్‌, ఆయన భార్య ఎలినీ, తాము ధాన్యపు గిడ్డంగిగా ఉపయోగిస్తున్న స్థలాన్ని ఇచ్చారు. వారి ఇంటి ప్రక్కనే ఉన్న ఈ స్థలాన్ని బాగుచేసి, కూటాలకు అనువైన స్థలంగా తీర్చిదిద్దారు. అలా ఆ ద్వీపంలో సహోదరులు తమ మొదటి రాజ్య మందిరాన్ని సంపాదించుకున్నారు. అందుకు వారెంత కృతజ్ఞులో కదా! అలాగే మరింత అభివృద్ధికి ఇదెంత ప్రేరణనిచ్చిందో కదా!

సత్యాన్ని నా సొంతం చేసుకోవడం

పంతొమ్మిదివందల ముప్పై ఎనిమిదిలో, నాకు 16 ఏళ్లప్పుడు వడ్రంగం చేయాలని నిర్ణయించుకున్నాను. అందువల్ల, నాన్న నన్ను సైప్రస్‌ రాజధాని నికోసియాకు పంపించాడు. ఆయనెంతో ముందుచూపుతో నేను నీకొస్‌ మత్తెయాకీస్‌తో ఉండే ఏర్పాటు చేశాడు. ఈ నమ్మకమైన సహోదరుడు చూపించిన ఉత్సాహం, ఇచ్చిన ఆతిథ్యం కారణంగా చాలామంది ఆయనను ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటారు. ఆ తొలి రోజుల్లో సైప్రస్‌లో ఏ క్రైస్తవునికైనా ఆయన చూపించిన ఉత్సాహం, స్థిరత్వం, ధైర్యం వంటి లక్షణాలు అవసరం.

నేను బైబిలు జ్ఞానంలో బలపడి ఆధ్యాత్మిక పురోగతి సాధించేందుకు సహోదరుడు మత్తెయాకీస్‌ నాకెంతో సహాయం చేశాడు. ఆయనతో ఉన్నప్పుడు, ఆయన ఇంట్లో జరిగే అన్ని కూటాలకు నేను హాజరయ్యేవాణ్ణి. మొదటిసారిగా నాకు, యెహోవాపట్ల నాకున్న ప్రేమ అధికమవుతున్న అనుభూతి కలిగింది. దేవునితో విలువైన సంబంధం వృద్ధి చేసుకోవాలనే నిశ్చయతను నేను పెంపొందించుకున్నాను. కొన్ని నెలల్లోనే, క్షేత్ర సేవకు తనతోకూడా రావచ్చా అని సహోదరుడు మత్తెయాకీస్‌ను అడిగాను. అది 1939వ సంవత్సరం.

కొంతకాలానికి నా కుటుంబాన్ని చూడడానికి నేను మా ఇంటికి తిరిగివచ్చాను. మా నాన్నతో కొంత సమయం గడపడంవల్ల, నేను సత్యాన్ని కనుగొన్నాననే, నా జీవితానికి అర్థం లభించిందనే నమ్మకం మరింత బలపడింది. 1939 సెప్టెంబరులో రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. నా తోటివాళ్లలో చాలామంది స్వచ్ఛందంగా యుద్ధానికి వెళ్లారు, అయితే బైబిలు నిర్దేశాన్ని అనుసరిస్తూ తటస్థంగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. (యెషయా 2:⁠4; యోహాను 15:​19) ఆ సంవత్సరమే, నేను యెహోవాకు సమర్పించుకొని 1940లో బాప్తిస్మం తీసుకున్నాను. మొదటిసారిగా నేను, మనుష్యుల భయంనుండి విడుదలైన అనుభూతి పొందాను!

పంతొమ్మిదివందల నలభై ఎనిమిదిలో నేను ఇఫ్‌ప్రెపీయాను పెళ్లి చేసుకున్నాను. మాకు నలుగురు పిల్లలు పుట్టారు. “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని” పెంచేందుకు చాలా కష్టపడాలని మేము గ్రహించాం. (ఎఫెసీయులు 6:⁠4) యెహోవాపట్ల ప్రగాఢమైన ప్రేమను, ఆయన నియమాలపట్ల, సూత్రాలపట్ల గౌరవాన్ని మా పిల్లల్లో నాటడంపై మా ప్రార్థనలను, ప్రయత్నాలను కేంద్రీకరించాం.

ఆరోగ్య సమస్యలు ఎదురవడం

పంతొమ్మిదివందల అరవై నాలుగులో, నా 42వ ఏట నా కుడి చెయ్యి, కుడి కాలు మొద్దుబారడం ఆరంభమైంది. క్రమేణా అది ఎడమవైపుకు కూడా ప్రాకింది. రోగనిర్ధారణలో నాకు కండరాల క్షీణత అనే వ్యాధి సోకినట్లు తేలింది, చికిత్సలేని ఈ వ్యాధి కారణంగా చివరకు పూర్తిగా పక్షవాతం వచ్చేస్తుంది. ఆ వార్త విని నేను కృంగిపోయాను. పరిస్థితులు క్షణంలో మారిపోయినట్లయింది! ‘నాకే ఇలా ఎందుకు జరగాలి, నాకెందుకీ శిక్ష?’ అని ఆలోచిస్తూ కోపంతో, ఉద్రేకంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. అయితే, ఈ వ్యాధి ఉందని తెలిసిన వెంటనే కలిగిన దిగులును కొంతకాలానికి అధిగమించగలిగాను. ఆ తర్వాత, ఆందోళన, అస్థిరతా భావాలు నన్ను చుట్టుముట్టేశాయి. నా మదిలో ఎన్నో ప్రశ్నలు రావడం మొదలుపెట్టాయి. నాకు పూర్తిగా పక్షవాతమొచ్చి పూర్తిగా ఇతరులపై ఆధారపడతానా? నేనీ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాను? నేను నా కుటుంబాన్ని అంటే నా భార్యను, నలుగురు పిల్లల్ని పోషించగలనా? అలాంటి తలంపులతో నేను నిజంగా తీవ్రమైన బాధ అనుభవించాను.

నా జీవితంలోని ఈ క్లిష్ట సమయంలో, ముందెన్నడూ లేనంత ఎక్కువగా, నేను యెహోవాకు ప్రార్థించి, నా ఆందోళనల్ని, నా చింతను ఆయన ముందుంచాలని భావించాను. రాత్రనక, పగలనక కన్నీళ్లతో యెహోవాకు ప్రార్థించాను. త్వరలోనే నాకు ఆదరణ లభించింది. ఫిలిప్పీయులు 4:​6, 7లోని ఈ ఓదార్పుకరమైన మాటలు నా విషయంలో నిజమని నిరూపించబడ్డాయి: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.”

పక్షవాతాన్ని తాళుకోవడం

నా పరిస్థితి అంతకంతకూ విషమించింది. నా క్రొత్త పరిస్థితులకు నేను త్వరగా సర్దుకుపోవాలని గ్రహించాను. నేనిక వడ్రంగం చేయలేను కాబట్టి, నా శారీరక పరిస్థితికి తగినట్లు తేలికగా ఉండడమే కాక, నా కుటుంబాన్ని పోషించడానికి కూడా దోహదపడగల ఉద్యోగం చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. మొదట్లో నేను ఓ చిన్న బండిలో ఐస్‌క్రీమ్‌ అమ్మాను. దాదాపు ఆరు సంవత్సరాలపాటు అంటే ఆ వ్యాధి నన్ను చక్రాల కుర్చీకి పరిమితం చేసేంతవరకు నేనలాగే చేశాను. ఆ తర్వాత నేను చేయగల చిన్నచిన్న పనులు చేయడం ఆరంభించాను.

పంతొమ్మిదివందల తొంభై నుండి నా ఆరోగ్య పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందంటే, నేనిక ఎలాంటి పనీ చేయలేని స్థితి ఏర్పడింది. నేనిప్పుడు, ఒక వ్యక్తి మామూలుగా చేసుకునే పనులకు కూడా పూర్తిగా ఇతరులపై ఆధారపడుతున్నాను. మంచం దగ్గరకు వెళ్లడానికి, స్నానం చేయడానికి, బట్టలు వేసుకోవడానికి నాకు సహాయం అవసరం. క్రైస్తవ కూటాలకు వెళ్లాలంటే ఎవరో ఒకరు నన్ను చక్రాల కుర్చీలో కారు దగ్గరకు తీసుకెళ్లి నన్ను దానిలోకి ఎక్కించాలి. రాజ్య మందిరం దగ్గర, ఎవరో ఒకరు నన్ను కారులోనుండి క్రిందికి దించి చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి లోపలికి తీసుకెళ్లాలి. కూటాలు జరిగేటప్పుడు, నా కాళ్ల దగ్గర వెచ్చగా ఉండేందుకు ఒక విద్యుత్‌ హీటర్‌ దగ్గర్లో ఉంచుతారు.

పక్షవాతం వచ్చినప్పటికీ నేను క్రమంగా అన్ని కూటాలకూ హాజరవుతున్నాను. ఇక్కడ యెహోవా మనకు బోధిస్తాడని, నా ఆధ్యాత్మిక సహోదరసహోదరీలతో ఉండడం నిజమైన ఆదరణే కాక, మద్దతుకు, ప్రోత్సాహానికి మూలాధారమని నాకు తెలుసు. (హెబ్రీయులు 10:​24, 25) ఆధ్యాత్మిక పరిణతిగల తోటి విశ్వాసులు నన్ను క్రమంగా సందర్శించడం నాకెల్లప్పుడూ సహాయకరంగా ఉంటోంది. నేను నిజంగా దావీదులాగే ఇలా భావిస్తాను: “నా గిన్నె నిండి పొర్లుచున్నది.”​—⁠కీర్తన 23:⁠5.

ఈ సంవత్సరాలన్నింటిలో నా ప్రియమైన భార్య నాకు అద్భుతంగా సహాయం చేసింది. మా పిల్లలు కూడా ఎంతో సహాయం చేస్తూ ఎంతో ఉదారతను ప్రదర్శించారు. ఇప్పటికి చాలా సంవత్సరాలుగా వారు నా దైనందిన అవసరాల విషయంలో సహాయం చేస్తున్నారు. వారు చేస్తున్న పని అంత సులభమైనది కాదు, సంవత్సరాలు గడిచేకొద్దీ నా పట్ల శ్రద్ధ చూపించడం అంతకంతకూ కష్టమౌతుంది. ఓపికను పెంపొందించుకోవడంలో, కష్టపడడంలో వారు మంచి మాదిరి చూపిస్తున్నారు, యెహోవా వారినెల్లప్పుడూ ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను.

యెహోవా తన సేవకులను బలపరిచేందుకు చేసిన మరో అద్భుతమైన ఏర్పాటు ప్రార్థన. (కీర్తన 65:⁠2) నా హృదయపూర్వక విజ్ఞాపనలకు ప్రతిస్పందనగా, యెహోవా ఈ సంవత్సరాలన్నింటిలో విశ్వాసంలో కొనసాగేందుకు నాకు బలాన్ని అనుగ్రహించాడు. ప్రత్యేకంగా నేను నిరుత్సాహపడినప్పుడు ప్రార్థన నాకు సేదదీర్పునిస్తూ నా ఆనందాన్ని కాపాడుకునేందుకు సహాయం చేస్తుంది. యెహోవాతో నిరంతరం సంభాషించడం నాకు నూతనోత్సాహమిస్తూ, ఆయన సేవలో కొనసాగాలనే నా నిర్ణయాన్ని పునర్నూతనం చేస్తుంది. యెహోవా తన సేవకుల ప్రార్థనలు విని, వారికవసరమైన మనశ్శాంతిని అనుగ్రహిస్తాడని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను.​—⁠కీర్తన 51:​17; 1 పేతురు 5:⁠7.

అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, దేవుడు చివరకు తన కుమారుడైన యేసుక్రీస్తు రాజ్య పరిపాలనలో, పరదైసులో జీవించే ఆశీర్వాదాన్ని పొందిన వారందరినీ స్వస్థపరిచే కాలం నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేను తిరిగి బలం పుంజుకుంటాను. ఆ అద్భుతమైన నిరీక్షణ గురించి తలస్తున్నప్పుడు ఎన్నోసార్లు నా కళ్లలో ఆనందబాష్పాలు మెదిలాయి.​—⁠కీర్తన 37:​11, 29; లూకా 23:​43; ప్రకటన 21:3, 4.

పూర్తికాల పరిచారకునిగా సేవచేయడం

దాదాపు 1991 నాటికి, నా పరిస్థితిని విశ్లేషించుకున్న తర్వాత, నా మీద నేనే జాలిపడే బదులు ప్రశస్తమైన రాజ్య సువార్తను ఇతరులతో పంచుకోవడంలో నిమగ్నమై ఉండడమే శ్రేష్ఠమని గ్రహించాను. ఆ సంవత్సరమే నేను పూర్తికాల పరిచారకునిగా సేవ చేయడం ఆరంభించాను.

నేను వికలాంగుణ్ణి కాబట్టి, ఉత్తరాలు వ్రాయడం మూలంగానే ఎక్కువగా సాక్ష్యమిస్తున్నాను. అయితే, నాకు వ్రాయడం అంత సులభమేమీ కాదు; దానికి చాలా ప్రయత్నం అవసరం. కండరాల క్షీణతవల్ల బలహీనమైన చేత్తో పెన్ను గట్టిగా పట్టుకోవడం నాకు చాలా కష్టం. అయినప్పటికీ, ప్రార్థన, పట్టుదలతో నేను గత 15 కంటే ఎక్కువ సంవత్సరాలుగా ఉత్తరాలు వ్రాస్తూ సాక్ష్యమిస్తున్నాను. నేను ఫోన్‌ ద్వారా కూడా ప్రజలకు ప్రకటిస్తాను. నన్ను చూడ్డానికి వచ్చే బంధువులతో, స్నేహితులతో, పొరుగువారితో నూతనలోకం గురించిన నా నిరీక్షణ గురించి, పరదైసు గురించి మాట్లాడే ఏ అవకాశాన్ని నేను జారవిడుచుకోను.

ఫలితంగా, నాకెన్నో ప్రోత్సాహకరమైన అనుభవాలు కలిగాయి. నేను దాదాపు 12 సంవత్సరాల క్రితం అధ్యయనం నిర్వహించిన నా మనవళ్ళలో ఒకరు ఆధ్యాత్మిక ప్రగతి సాధించి, బైబిలు సత్యాన్ని హత్తుకున్నందుకు నాకెంతో సంతోషంగావుంది. తన బైబిలు శిక్షిత మనస్సాక్షిచేత ప్రేరేపించబడి ఆయన క్రైస్తవ తటస్థతా వివాదాంశంలో విశ్వసనీయంగా, స్థిరంగా నిలబడ్డాడు.

ప్రత్యేకంగా నేను ఉత్తరాలు వ్రాసిన ప్రజలు మాకు మరింత బైబిలు సమాచారం కావాలని అడిగినప్పుడు నాకెంతో సంతోషంగా ఉంటుంది. అప్పుడప్పుడూ కొందరు తమకు మరిన్ని బైబిలు సాహిత్యాలు కావాలని అడుగుతారు. ఉదాహరణకు, ఒకావిడ నాకు ఫోన్‌ చేసి, నేను తన భర్తకు వ్రాసిన ప్రోత్సాహకర ఉత్తరం విషయంలో నాకు కృతజ్ఞతలు చెప్పింది. ఆ ఉత్తరంలోని మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నట్లు ఆమె కనుగొంది. ఇది మా ఇంట్లో ఆమెతో, ఆమె భర్తతో అనేక బైబిలు చర్చలు చేయడానికి నడిపించింది.

అద్భుతమైన నిరీక్షణ

గడిచిన సంవత్సరాల్లో, ఈ ప్రాంతంలో రాజ్య ప్రచారకుల సంఖ్య పెరగడాన్ని నేను చూశాను. మా అన్న జార్జి ఇంటి ప్రక్కనున్న చిన్న రాజ్య మందిరం అనేకమార్లు విస్తరించబడి బాగుచేయబడింది. అది యెహోవాసాక్షుల రెండు సంఘాలు ఉపయోగిస్తున్న సుందరమైన ఆరాధనా స్థలం.

మా నాన్న 1943లో 52 ఏళ్ల వయసులో చనిపోయాడు. అయితే ఆయనెంత గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని విడిచివెళ్లాడో కదా! ఆయన కుమారుల్లో ఎనిమిది మంది సత్యాన్ని హత్తుకొని, ఇంకా యెహోవాను సేవిస్తున్నారు. మా నాన్న పుట్టిన క్సెలోఫాగూ గ్రామంలో, దగ్గర్లోని గ్రామాల్లో ఇప్పుడు మూడు సంఘాలున్నాయి, మొత్తం 230 మంది రాజ్య ప్రచారకులున్నారు!

అలాంటి అద్భుతమైన ఫలితాలు నాకెంతో ఆనందాన్నిచ్చే మూలాధారంగా ఉన్నాయి. ఇప్పుడు 83 ఏళ్ల వయసులో, కీర్తనకర్త పలికిన ఈ మాటల్ని నేనెంతో నమ్మకంగా ప్రతిధ్వనిస్తాను: “సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును; యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయైయుండదు.” (కీర్తన 34:​10) యెషయా 53:6లో వ్రాయబడిన ఈ ప్రవచన నెరవేర్పు కోసం నేను ఆశగా ఎదురుచూస్తున్నాను: “కుంటివాడు దుప్పివలె గంతులువేయును.” నాకు వృద్ధాప్య దుర్బలతలున్నా, ఆ కాలంవరకు ఆనందంగా యెహోవా సేవలో కొనసాగేందుకే నిర్ణయించుకున్నాను.

[17వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

టర్కీ

సిరియా

లెబనాన్‌

సైప్రస్‌

నికోసియా

క్సెలోఫాగూ

మధ్యధరా సముద్రం

[17వ పేజీలోని చిత్రం]

నేటికీ ఉపయోగించబడుతున్న క్సెలోఫాగూలోని మొదటి రాజ్య మందిరం

[18వ పేజీలోని చిత్రాలు]

ఇఫ్‌ప్రెపీయాతో 1946లో, ఇప్పుడు

[20వ పేజీలోని చిత్రం]

ఫోన్‌లో, ఉత్తరాలు వ్రాయడం ద్వారా సాక్ష్యమివ్వడంలో నేను ఆనందిస్తున్నాను