కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎవరి ప్రమాణాలను మీరు నమ్మగలరు?

ఎవరి ప్రమాణాలను మీరు నమ్మగలరు?

ఎవరి ప్రమాణాలను మీరు నమ్మగలరు?

మొట్టమొదటిసారి ఆఫ్రికాకు వచ్చిన ఒక సందర్శకుడికి, రోడ్డు పక్కన ఒక మనిషి నిటారుగా నిలబడి ఉండడం కుతూహలాన్ని కలిగించింది. ఆ మనిషి అలా నిటారుగా నిలబడే ప్రతి కొన్ని నిమిషాలకు కొద్ది కొద్దిగా ఒక పక్కకు కదలడం ఆయన గమనించాడు. ఆ మనిషి ఎందుకలా కదిలాడో సందర్శకునికి తర్వాత అర్థమైంది. వాస్తవానికి, ఆ మనిషి పక్కనే ఉన్న టెలిగ్రాఫ్‌ స్తంభం నీడలో నిలబడడానికి ప్రయత్నిస్తున్నాడు. మధ్యాహ్నపు సూర్యుని గమనంతోపాటు నీడకూడా నెమ్మదిగా కదిలింది.

ఎండలోని ఆ నీడలాగే మానవుల కార్యకలాపాలు ప్రమాణాలు ఎప్పుడూ మారుతూనే ఉన్నాయి. దానికి భిన్నంగా, “జ్యోతిర్మయుడగు తండ్రి” అయిన యెహోవా దేవుడు మార్పులేనివాడు. “ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు” అని శిష్యుడైన యాకోబు వ్రాశాడు. (యాకోబు 1:​17) దేవుడు స్వయంగా ప్రకటించిదాన్ని హీబ్రూ ప్రవక్తయైన మలాకీ నమోదు చేశాడు: “యెహోవానైన నేను మార్పులేనివాడను.” (మలాకీ 3:⁠6) యెషయా రోజుల్లో ఇశ్రాయేలు దేశస్థులతో యెహోవా అన్నాడు: “ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే, తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే. నేనే చేసియున్నాను.” (యెషయా 46:​3-4) అందుకే, కాల గమనం సర్వోన్నతుని వాగ్దానాలపై మనకుండగల ప్రగాఢవిశ్వాసాన్ని ఏ మాత్రం మార్చదు.

ధర్మశాస్త్రంనుంచి ఒక గుణపాఠం

యెహోవా వాగ్దానాలలాగే మంచి చెడ్డలను తెలిపే ఆయన ప్రమాణాలు కూడా నమ్మదగినవి మారలేనివి. ఒకటి సరైన బరువును చూపించేది మరొకటి తక్కువ బరువును చూపించేదైన రెండు తూకపురాళ్ళ సెట్లను ఉపయోగిస్తున్న దుకాణదారుడ్ని మీరు నమ్ముతారా? అస్సలు నమ్మరు. అదే విధంగా “దొంగత్రాసు యెహోవాకు హేయము, సరియైన గుండు ఆయనకిష్టము.” (సామెతలు 11:1; 20:​10) యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞను కూడా చేర్చాడు: “తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.”​—⁠లేవీయకాండము 19:​35, 36.

ఆ ఆజ్ఞకు విధేయులవడం వలన ఇశ్రాయేలీయులకు దేవుని అనుగ్రహంతోపాటు అనేక వస్తుసంపదలూ చేకూరాయి. అదే విధంగా, కొలతల్లో తూనికెల్లో మాత్రమే కాకుండా జీవితంలోని అన్ని రంగాల్లోను మార్పులేని యెహోవా ప్రమాణాలను అంటిపెట్టుకొని ఉంటూ ఆయనను నమ్మే ఆరాధకుడు ఆశీర్వాదాలను పొందుతాడు. దేవుడిలా ప్రకటిస్తున్నాడు: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.”​—⁠యెషయా 48:​17.

నేడు ప్రమాణాలెందుకు దిగజారిపోతున్నాయి?

నేడు ప్రమాణాలు దిగజారిపోవడానికి కారణం బైబిలు సూచిస్తోంది. నేటి వరకు మానవులందర్నీ ప్రభావితం చేస్తున్న, పరలోకంలో జరిగిన ఒక యుద్ధం గురించి బైబిల్లోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో వర్ణించబడింది. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.”​—⁠ప్రకటన 12:​7-9.

ఆ యుద్ధపు తక్షణ ఫలితమేమిటి? యోహాను ఇంకా చెబుతున్నాడు: “అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నా[డు].”​—⁠ప్రకటన 12:​12.

1914 లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ‘భూమికి శ్రమ’ వచ్చింది, మన కాలపు ప్రమాణాలకు పూర్తి భిన్నమైన ప్రమాణాల శకానికది ముగింపునూ తెచ్చింది. “1914 నుంచి 1918 వరకు జరిగిన ఆ మహాసంగ్రామం, మనకాలమును ఆ కాలమును వేరుచేస్తూ దహన భూమిలో కనబడే మార్గంలా ఉంది. అప్పుడు బలైన అనేక ప్రాణాలు, దాని తర్వాతి సంవత్సరాల్లో నమ్మకాలను వమ్ముచేయుటలో, తలంపులను మార్చుటలో, నిరాశానిస్పృహల మాన్పలేని గాయాలను మిగుల్చుటలో కారణమై అది రెండు శకాలమధ్య భౌతిక, మానసిక అగాధాన్ని సృష్టించింది” అని చరిత్రకారిణియైన బార్బర టచ్‌మన్‌ వ్యాఖ్యానించింది. మరొక చరిత్రకారుడు ఎరిక్‌ హోబ్స్‌బామ్‌ అలాంటి అభిప్రాయాన్నే తెలిపాడు: “అభివృద్ధి చెందిన దేశాల్లో అప్పటి వరకు సహజమైనవని పరిగణించబడిన ప్రమాణాలు, 1914 నుండి గమనార్హమైన రీతిలో దిగజారిపోయాయి. . . . విచారకరంగా, అవి వెనక్కి అంటే పందొమ్మిదవ శతాబ్దంలోని పూర్వీకులు ఆటవిక ప్రమాణాలు అని పిలిచిన వాటివైపు ఎంత ఘోరంగా దిగజారిపోతున్నాయో గ్రహించడం అంత సులభమేమీ కాదు.”

మానవత్వం​—⁠ఇరవయ్యవ శతాబ్దపు నైతిక చరిత్ర (ఆంగ్లం) అనే తన పుస్తకంలో రచయిత జానతన్‌ గ్లోవర్‌ పేర్కొన్నాడు: “మన కాలంలోని విశిష్టమైనవాటిలో అంతరించిపోతున్న నైతిక సూత్రాలు ఒకటి.” పాశ్చాత్య దేశాల్లో నైతికంగా దిగజారిపోయిన మతం కారణంగా ఆయనకు బయటివారు చెప్పే నైతిక సూత్రాలపై సందేహమున్నప్పటికీ, ఆయన హెచ్చరించాడు: “మత నైతిక సూత్రాలను నమ్మనివారైనా సరే వాటి పతనం విషయంలో వారు కలవరపడాలి.”

మన కాలంలో, వాణిజ్యంలో రాజకీయంలో లేదా మత వ్యవస్థల్లో లేదా చివరికి వ్యక్తిగత కుటుంబ బంధుత్వాల్లో కనబడే నమ్మక ద్రోహమూ, దాని భయంకరమైన పర్యవసానాలూ భూనివాసులను శ్రమకు గురి చేయాలనే సాతాను యొక్క దుష్టమైన కుట్రలో భాగమే. సాతాను తన యుద్ధాన్ని చివరికంటా చేయాలని, దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవించాలని ప్రయత్నించేవారినికూడా తనతోపాటు నాశనానికి గురిచెయ్యాలని దృఢ సంకల్పంతో ఉన్నాడు.​—⁠ప్రకటన 12:​17.

శక్తివంతమైన ఈ నమ్మకద్రోహంనుంచి బయటపడే పరిష్కారమేదైనా ఉందా? అపొస్తలుడైన పేతురు ఇలా జవాబిస్తున్నాడు: “[దేవుని] వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:​13) ఆ వాగ్దానము మనం నమ్మగలం ఎందుకంటే, దేవునికి దాన్ని నెరవేర్చే శక్తి ఉండడం మాత్రమే కాదుగానీ ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తానని ఆయన హామీ ఇస్తున్నాడు. ‘తన నోటనుండి వచ్చే మాట’ గురించి యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలముచేయును.” నిజంగా అది నమ్మదగిన వాగ్దానమే!​—⁠యెషయా 55:11; ప్రకటన 21:4, 5.

దేవుని ప్రమాణాలతో జీవించడం

చంచలమైన, దిగజారిపోతున్న ప్రమాణాలుగల లోకంలో యెహోవాసాక్షులు బైబిలు అందించే ప్రవర్తన గురించిన ప్రమాణాల ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తారు. దాని ఫలితంగా, వాళ్ళు చాలామందికి భిన్నంగా ఉంటూ తరచుగా ఇతరులను ఆకర్షిస్తారు. తృణీకరించబడతారు కూడా.

లండన్‌లో జరిగిన యెహోవాసాక్షుల ఒక సమావేశం దగ్గర ఒక ప్రతినిధిని, యెహోవాసాక్షులు నిజమైన క్రైస్తవులేనా అని ఒక టీవీ రిపోర్టర్‌ అడిగాడు. అప్పుడు ఆ ప్రతినిధిలా జవాబిచ్చాడు: “అవును, మాకు మాదిరి యేసుక్రీస్తు కాబట్టి మేము నిజ క్రైస్తవులమే, లోకమంతా స్వార్థంతో నిండివుంది, మాకు మార్గంగా, సత్యంగా, జీవముగా యేసుక్రీస్తుపైనే మా మనస్సులను నిలుపుతాము. ఆయన త్రిత్వంలో భాగం కాదు దేవుని కుమారుడు అని మేము నమ్ముతాం, అందుకే బైబిలు గురించిన మా అవగాహన మీకు బాగా తెలిసిన మతానికంటే భిన్నంగా ఉంటుంది.”

ఆ ఇంటర్‌వ్యూ టీవీలో బిబిసి ప్రసారం చేసినప్పుడు, ఆ రిపోర్టర్‌ ఇలా అంటూ ప్రోగ్రాం ముగించాడు: “యెహోవాసాక్షులు మన తలుపులను ఎందుకు తట్టుతారో నేను చాలా బాగా తెలుసుకున్నాను. 25,000 మంది చక్కని దుస్తులతో చక్కని ప్రవర్తనతో అదీ అంతా కలిసి ఒకేచోట, ఇదివరకు నేనెక్కడా చూసినట్టు గుర్తులేదు.” వెలుపలినుండి గమనించేవారు చేసిన ఆ వ్యాఖ్య, మార్పులేని దేవుని ప్రమాణాలను అనుకరించడం జ్ఞానవంతమనడానికి నిజంగా చక్కని సాక్ష్యం!

తాము ఏర్పరచని ప్రమాణాలను అనుసరించి ఎందుకు జీవించాలని కొందరు బహుశా తిరస్కరించవచ్చు, మీరు మీ బైబిల్లో చూసి దేవుని ప్రమాణాలు ఏమిటో నేర్చుకొమ్మని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. కానీ పైపైనే పరిశీలించి సంతృప్తిపడవద్దు. అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను అనుసరించండి: “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” (రోమీయులు 12:⁠2) మీరున్న ప్రాంతంలోని రాజ్యమందిరాన్ని సందర్శించి యెహోవాసాక్షుల గురించి అక్కడ తెలుసుకోండి. వాళ్ళు బైబిలు వాగ్దానాలపై నమ్మకముంచినవారనీ, దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తూ ఆయనయందు దృఢ విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్న మామూలు మనుష్యులే అని మీరు తెలుసుకుంటారు.

మీ వ్యక్తిగత జీవితంలో, మార్పులేనివీ నమ్మదగినవీ అయిన దేవుని ప్రమాణాలను అంటిపెట్టుకొని ఉండడంవల్ల మీరు తప్పకుండా ఆశీర్వాదాలను పొందుతారు. దేవుడు స్వయంగా ఇస్తున్న ఆహ్వానాన్ని ఆలకించండి: “నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.”​—⁠యెషయా 48:​18.

[5వ పేజీలోని చిత్రాలు]

నేడు నమ్మకద్రోహం వ్యాపారంలోను, రాజకీయాల్లోను, మతంలోను, చివరికి కుటుంబ బాంధవ్యాల్లోనూ జరుగుతోంది