కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబం కోసం | యువత

తప్పు చేయాలనే కోరికను తిప్పికొట్టండి

తప్పు చేయాలనే కోరికను తిప్పికొట్టండి

సమస్య

“కొన్నిసార్లు అమ్మాయిలు నా ఫోన్‌ నంబరు అడుగుతారు, ఒంటరిగా కలిసి గడుపుదాం రమ్మంటారు. నేను “నో” చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాను. కానీ మనసులో ఎక్కడో ఒక ఆలోచన ‘నంబరు ఇచ్చి ఉంటే బాగుండేది కదా.’ నిజంగా కొంతమంది అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ‘ఓకే చెప్తే తప్పేంటి’ అనిపిస్తుంది.”—చైతన్య, a 16 సంవత్సరాలు.

చైతన్యలా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో మీరూ చిక్కుకున్నారా? అయితే, మీరు బయటపడవచ్చు.

మీరు తెలుసుకోవాల్సినవి

చెడు కోరికలకు లొంగిపోతే తర్వాత మీరే బాధపడతారు

ఈ సమస్య పెద్దవాళ్లతో సహా అందరికీ వస్తుంది. ఇదే సమస్య రకరకాలుగా రావచ్చు. దేవున్ని ఇష్టపెట్టాలన్న కోరిక తనలో ఉంది కానీ, దానికి వ్యతిరేకమైన ఇంకో ఆలోచన తనను ఇబ్బంది పెడుతుంది అని అపొస్తలుడైన పౌలు పెద్దవయసు వచ్చాకే అన్నాడు. (రోమీయులు 7:22, 23) అయినా పౌలు ఆ చెడు ఆలోచనలను అదుపు చేసుకున్నాడు—మీరూ అదుపు చేసుకోవచ్చు! చెడు కోరికలకు బానిసలవ్వాలని మనం కోరుకోం కదా. (1 కొరింథీయులు 9:27) వయసులో ఉండగానే ఇలాంటి కోరికల్ని అదుపు చేసుకోవడం నేర్చుకుంటే సమస్యల్ని తప్పించుకుంటాం, రేపు పెద్దయ్యాక కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది.

సినిమాలు, పత్రికలు ఈ చెడు కోరికల్ని పెంచుతున్నాయి. యవ్వనంలో కోరికలు చాలా బలంగా ఉంటాయని బైబిలు చెబుతుంది. (2 తిమోతి 2:22) దీనికి తోడు, యువత కోసం తీస్తున్న సినిమాలు, టీవీ కార్యక్రమాలు, పాటలు, పుస్తకాలు వాళ్లలో చెడు కోరికల్ని ఇంకా పెంచుతూ అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి గడిపితే తప్పేమీ లేదు అన్నట్టుగా ఉన్నాయి. ఉదాహరణకు, సినిమాల్లో అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటున్నప్పుడు ఒంటరిగా కలిసి గడుపుతారు, ఏదోక సమయంలో శారీరకంగా ఒక్కటవుతారు. అయితే, నిజ జీవితంలో అమ్మాయిలు, అబ్బాయిలు శరీర కోరికలను విడిచిపెట్టాలని, అలా విడిచిపెట్టే శక్తి వాళ్లలో ఉందని బైబిలు చెబుతోంది. (1 పేతురు 2:11) అంటే మీరు చెడు కోరికల నుండి బయటపడవచ్చు. కానీ ఎలా?

ఇలా చేయండి

మీ బలహీనతలు తెలుసుకోండి. గొలుసు మొత్తం గట్టిగా ఉన్నా ఒక్కచోట సరిగ్గా లేకపోతే త్వరగా తెగిపోతుంది. అదేవిధంగా, తప్పు చేయకుండా మంచిగా ఉండాలని నిర్ణయించుకున్నా, మీరు బలహీనంగా ఉన్న విషయాల్లో తప్పు చేసే ప్రమాదం ఉంది. మీరు ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారో ఆలోచించండి!—మంచి సలహా: యాకోబు 1:14.

ముందే ఊహించుకోండి. ఏ పరిస్థితుల్లో మీరు తప్పు చేసే అవకాశం ఉందో ఊహించండి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీరేం చేస్తే మంచిదో ముందే ఆలోచించి పెట్టుకోండి.—మంచి సలహా: సామెతలు 22:3.

మీ నిర్ణయాన్ని బలపర్చుకోండి. ఒక స్త్రీ శారీరక సంబంధం పెట్టుకోమని బలవంతం చేసినప్పుడు బైబిల్లో యోసేపు అనే యువకుడు “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును” అన్నాడు. (ఆదికాండము 39:9) “నేనెట్లు” అనే మాట తప్పు ఒప్పులు నిర్ణయించుకునేటప్పుడు యోసేపుకు చాలా బలమైన అభిప్రాయాలు ఉన్నాయని చూపిస్తోంది. మీకూ అలాంటి అభిప్రాయాలే ఉన్నాయా?

మంచి స్నేహాలు చేయండి. మీలాగే మంచిగా ఉంటూ తప్పు చేయకుండా ఉండాలనుకునే వాళ్లతో స్నేహం చేస్తే తప్పు చేసే పరిస్థితులకు దూరంగా ఉంటారు. “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును” అని బైబిల్లో ఉంది.—సామెతలు 13:20.

చెడుగా ప్రవర్తించాలి అనిపించే పరిస్థితులకు దూరంగా ఉండండి.

ఉదాహరణకు:

  • అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఒంటరిగా ఉండకండి.

  • అశ్లీల చిత్రాలు చూసే ప్రమాదం ఉన్న సమయంలో, పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ వాడకండి.

  • తప్పు చేయడం గురించి గొప్పగా మాట్లాడుతూ అలా ప్రవర్తించే వాళ్లకు దూరంగా ఉండండి.

ఇలా తప్పుడు కోరికలకు దూరంగా ఉండడానికి మీకు మీరు ఏ నియమాలు పెట్టుకోవచ్చో ఆలోచించండి—మంచి సలహా: 2 తిమోతి 2:22.

దేవుని సహాయం అడగండి. “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి” అని యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్తయి 26:41) మీరు చెడు కోరికలకు లొంగిపోకూడదని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడు, అందుకు ఆయన మీకు సహాయం కూడా చేస్తాడు. “మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.” అని బైబిల్లో ఉంది.—1 కొరింథీయులు 10:13. ◼ (g14-E 10)

a అసలు పేరు కాదు.