మనసును హత్తుకునే ఒక్క మాట
“అమ్మా!” యేసు కొన్నిసార్లు ఆడవాళ్లను అలానే పిలిచాడు. ఉదాహరణకు, 18 ఏళ్లుగా నడుము వంగిపోయిన ఓ స్త్రీని ఆయన బాగుచేస్తున్నప్పుడు ‘అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొందావు’ అని ఆమెతో అన్నాడు. (లూకా 13:10-13) యేసు తన తల్లితో మాట్లాడుతున్నప్పుడు కూడా ‘అమ్మా’ అనే సంబోధిస్తూ మాట్లాడేవాడు. అలా పిలవడాన్ని బైబిలు కాలాల్లో గౌరవంగా భావించేవాళ్లు. (యోహా. 19:26; 20:13) అయితే గౌరవం కన్నా ఎక్కువ భావాన్నిచ్చే మరో మాటను కూడా అప్పట్లో ఉపయోగించేవాళ్లు.
కొంతమంది స్త్రీల గురించి చెప్తున్నప్పుడు చాలా దయగా, మృదువుగా ఉండే ఓ మాటను బైబిల్లో ఉపయోగించారు. ఆ మాటను, 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీతో మాట్లాడినప్పుడు యేసు ఉపయోగించాడు. నిజానికి రక్తస్రావం గలవాళ్లు అపవిత్రులని దేవుని ధర్మశాస్త్రం చెప్తోంది. కాబట్టి ఆ పరిస్థితిలో ఆమె యేసు దగ్గరకు రావడం తప్పు. ఆమె తన పరిస్థితినిబట్టి ఇతరులకు దూరంగా ఉండాల్సిందని కొంతమంది అనవచ్చు. (లేవీ. 15:19-27) కానీ ఆమె తన జబ్బు నయమవ్వాలని ఎంతో కోరుకుంది. నిజానికి అప్పటికే ‘ఆమె ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్లి నానా బాధలు పడింది, ఉన్నదంతా ఖర్చుపెట్టింది. కానీ రోగం నయం కాలేదు, ఇంకా ముదిరింది.’—మార్కు 5:25, 26, NW.
ఆ స్త్రీ చప్పుడు చేయకుండా గుంపులోకి వెళ్లి, యేసు వేసుకున్న పైవస్త్రం చెంగును వెనుకనుండి ముట్టుకుంది. వెంటనే రక్తస్రావం ఆగిపోయింది! తనను ఎవ్వరూ గమనించరని ఆమె అనుకుంది కానీ యేసు, ‘నన్ను ముట్టినది ఎవరు?’ అని అడిగాడు. (లూకా 8:40-47) ఆయన అలా అడగగానే ఆమె భయంతో వణుకుతూ యేసు ముందు మోకరించి జరిగినదంతా చెప్పింది.—మార్కు 5:33.
ఆమె భయాన్ని తగ్గించడానికి యేసు దయగా, “కుమారీ, ధైర్యముగా ఉండు” అని అన్నాడు. (మత్త. 9:22) “కుమారీ” అనే పదాన్ని సూచించే హీబ్రూ, గ్రీకు పదాల్ని “దయను, మృదుత్వాన్ని” వ్యక్తపర్చేందుకు సూచనార్థకంగా వాడచ్చని బైబిలు విద్వాంసులు అంటారు. అయితే యేసు ఆ స్త్రీకి మరింత ధైర్యం చెప్తూ, “నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక” అని అన్నాడు.—మార్కు 5:34.
“కుమారీ.” ఇశ్రాయేలీయుడు, ధనవంతుడు అయిన బోయజు మోయాబీయురాలైన రూతును అలానే పిలిచాడు. రూతు, తనకు పరిచయంలేని ఓ వ్యక్తి పొలంలో బార్లీ ఏరుకుంటోంది కాబట్టి ఆమెకు కాస్త బెరుగ్గా అనిపించేది. అప్పుడు బోయజు “నా కుమారీ, నా మాట వినుము” అని అన్నాడు. పరిగె ఏరుకోవడానికి ఎప్పుడూ తన పొలానికే రమ్మని చెప్పాడు. ఆ మాటలు వినగానే, రూతు బోయజు ముందు సాగిలపడి పరదేశి అయిన తన మీద ఎందుకంత దయ చూపిస్తున్నారని అడిగింది. అందుకు బోయజు ఆమెకు మరింత అభయాన్నిస్తూ, “నీవు నీ అత్తకు [విధవరాలైన నయోమికి] చేసినదంతయు నాకు తెలియబడెను . . . యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును” అని జవాబిచ్చాడు.—రూతు 2:8-12.
క్రైస్తవ పెద్దలకు యేసు, బోయజు ఎంత చక్కని ఆదర్శం ఉంచారో కదా! కొన్నిసార్లు, ఇద్దరు సంఘపెద్దలు కలిసి లేఖనాల నుండి సహాయం, ప్రోత్సాహం అవసరమైన ఓ క్రైస్తవ సహోదరితో మాట్లాడడానికి వెళ్తుండవచ్చు. వాళ్లు యెహోవా నిర్దేశం కోసం ప్రార్థన చేసి, ఆ సహోదరి చెప్పినదంతా జాగ్రత్తగా విన్న తర్వాతే, ఆమెకు కావాల్సిన ధైర్యాన్ని, ఓదార్పును బైబిలు ద్వారా ఇవ్వగలుగుతారు.—రోమా. 15:4.