‘ప్రతీరోజు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండండి’
‘ప్రజల్ని ప్రోత్సహించే మాట ఏదైనా మీ దగ్గరుంటే చెప్పండి.’—అపొ. 13:15, NW.
పాటలు: 53, 45
1, 2. ఇతరుల్ని ప్రోత్సహించడం ఎందుకు ప్రాముఖ్యం?
కీర్తన [1] అనే 18 ఏళ్ల అమ్మాయి ఇలా అంటోంది, “మా అమ్మానాన్నలు నన్ను అస్సలు ప్రోత్సహించరు, బదులుగా ఎప్పుడూ తప్పుపడుతూ ఉంటారు. వాళ్ల మాటలు నాకు చాలా బాధకలిగిస్తాయి. మంచిచెడ్డలు తెలుసుకునే జ్ఞానం నాకు లేదని, ఎప్పటికీ నేర్చుకోలేనని, నేను లావుగా ఉంటానని వాళ్లు అంటుంటారు. వాళ్ల మాటలకు నేను తరచూ ఏడుస్తుంటాను, వాళ్లతో మాట్లాడడం కూడా మానేస్తాను. నేను ఎందుకూ పనికిరానిదాన్ననిపిస్తుంది.”అవును, ఇతరులు మనల్ని ప్రోత్సహించనప్పుడు జీవితం చాలా కష్టంగా ఉంటుంది.
2 మరోవైపు, మనం ఇతరుల్ని ప్రోత్సహించడం ద్వారా వాళ్లకు ఎంత సహాయం చేయగలమో ఆలోచించండి. రూబెన్ ఇలా అంటున్నాడు, “నేను పనికిరానివాడననే భావాలతో ఎన్నో సంవత్సరాలు సతమతమయ్యాను. కానీ ఒకరోజు, నేను ఓ సంఘపెద్దతో కలిసి ప్రీచింగ్ చేస్తున్నప్పుడు నేను దిగులుగా ఉండడాన్ని అతను గుర్తించాడు. నేను నా మనసులోని భావాలను చెప్తున్నప్పుడు సానుభూతితో విన్నాడు. ఆ తర్వాత నేను ఎంత మంచిపని చేస్తున్నానో నాకు గుర్తుచేశాడు. అంతేకాదు ఎన్నో పిచ్చుకల కన్నా మనలో ప్రతీఒక్కరం ఎంతో విలువైనవాళ్లమనే యేసు మాటల్ని అతను నాకు గుర్తుచేశాడు. ఆ లేఖనాన్ని నేను తరచూ గుర్తుచేసుకుంటాను, ఆ లేఖనం ఇప్పటికీ నాలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ సంఘపెద్ద మాటలు నాలో చాలా మార్పు తెచ్చాయి.”—మత్త. 10:30, 31.
3. (ఎ) ఇతరుల్ని ప్రోత్సహించడం గురించి అపొస్తలుడైన పౌలు ఏమి చెప్పాడు? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?
3 మనం క్రమంగా ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ఉండాలని బైబిలు చెప్తోంది. అపొస్తలుడైన పౌలు హెబ్రీ క్రైస్తవులకు ఇలా రాశాడు, ‘సోదరులారా, జీవంగల దేవునికి దూరమవ్వడం వల్ల మీలో ఎవరి హృదయమైనా విశ్వాసంలేని దుష్ట హృదయంగా మారిపోయే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి; ప్రతీరోజు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండండి.’ ఎందుకు అలా చేయాలో వివరిస్తూ పౌలు ఇలా అన్నాడు, ‘పాపానికున్న మోసకరమైన శక్తి వల్ల మీలో ఎవరి హృదయమూ కఠినమైపోకూదు.’ (హెబ్రీ. 3:12-15, NW) కాబట్టి, ఇతరులు మిమ్మల్ని ప్రోత్సహించినప్పుడు మీకు కలిగిన సంతోషాన్ని గుర్తుతెచ్చుకుంటే, ఒకరినొకర్ని ప్రోత్సహించుకోమని పౌలు ఇచ్చిన సలహా ఎంత ప్రాముఖ్యమో అర్థమౌతుంది. ఈ ఆర్టికల్‌లో మనం ఈ ప్రశ్నల్ని పరిశీలిస్తాం: మన సహోదరుల్ని ప్రోత్సహించడానికి మనకు ఏ కారణాలు ఉన్నాయి? ఇతరుల్ని ప్రోత్సహించే విషయంలో యెహోవా, యేసు, అపొస్తలుడైన పౌలు నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ఇతరుల్ని ప్రోత్సహించడానికి ఉన్న కొన్ని మార్గాలు ఏమిటి?
మనందరికీ ప్రోత్సాహం అవసరం
4. ఎవరికి ప్రోత్సాహం అవసరం? నేడు చాలామంది ఇతరుల్ని ఎందుకు ప్రోత్సహించట్లేదు?
4 మనందరికీ ప్రోత్సాహం అవసరం. ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరం. “మొక్కలకు నీళ్లు అవసరమైనట్టే, పిల్లలకు కూడా ప్రోత్సాహం అవసరం. ప్రోత్సాహంవల్ల పిల్లలు తాము విలువైనవాళ్లమని భావించి, కృతజ్ఞతతో ఉంటారు” అని తిమోతి ఎవన్జ్ అనే ఓ టీచర్ చెప్తున్నాడు. కానీ మనం “అంత్యదినములలో” జీవిస్తున్నాం కాబట్టి, చాలామంది స్వార్థపరులుగా ఉంటున్నారు, ఒకరిపట్ల ఒకరికి ‘అనురాగం’ తగ్గిపోతుంది. (2 తిమో. 3:1-5) కొంతమంది తల్లిదండ్రుల్ని వాళ్ల అమ్మానాన్నలు ఎన్నడూ ప్రోత్సహించలేదు కాబట్టి ఇప్పుడు వాళ్లు కూడా తమ పిల్లల్ని ప్రోత్సహించట్లేదు. పెద్దవాళ్లకు కూడా ప్రోత్సాహం అవసరం, కానీ ఎక్కువశాతం వాళ్లకు అది దొరకట్లేదు. ఉదాహరణకు, ఉద్యోగస్థలాల్లో తాము చేసిన పనినిబట్టి ఎవ్వరూ మెచ్చుకోరని చాలామంది చెప్తున్నారు.
5. మనం ఇతరుల్ని ఎలా ప్రోత్సహించవచ్చు?
5 ఇతరులు ఏదైనా పనిని చక్కగా చేసినప్పుడు మనం వాళ్లను మెచ్చుకోవడం ద్వారా ప్రోత్సహించవచ్చు. అంతేకాదు వాళ్లలో మంచి లక్షణాలు ఉన్నాయని చెప్పడం ద్వారా లేదా వాళ్లు దిగులుగా, నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఓదార్పుకరంగా మాట్లాడడం ద్వారా ప్రోత్సహించవచ్చు. (1 థెస్స. 5:14) మనం ఎక్కువగా సహోదరసహోదరీలతో సహవసిస్తుంటాం కాబట్టి ప్రోత్సహించేలా మాట్లాడడానికి చాలా అవకాశాలు దొరుకుతాయి. (ప్రసంగి 4:9, 10 చదవండి.) మీరిలా ప్రశ్నించుకోండి, ‘నేను ఇతరుల్ని ఎందుకు విలువైనవాళ్లుగా చూస్తానో, ప్రేమిస్తానో వాళ్లకు చెప్పానా? వీలైనప్పుడల్లా నేను అలా చెప్తున్నానా?’ బైబిలు చెప్తున్న ఈ మాటల గురించి ఆలోచించండి, “సమయోచితమైన మాట యెంత మనోహరము!”—సామె. 15:23.
6. దేవుని ప్రజల్ని నిరుత్సాహపర్చాలని సాతాను ఎందుకు కోరుకుంటున్నాడు? అందుకోసం అతను ఎలా ప్రయత్నించాడో ఓ ఉదాహరణ చెప్పండి.
6 సామెతలు 24:10లో ఇలా ఉంది, “శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.” మనల్ని నిరుత్సాహపరిస్తే, యెహోవాతో మనకున్న స్నేహం బలహీనపడేలా చేయవచ్చని సాతానుకు తెలుసు. యోబును తీవ్రంగా బాధపెట్టడం ద్వారా సాతాను అతన్ని నిరుత్సాహపర్చడానికి ప్రయత్నించాడు. కానీ అతను పన్నిన క్రూరమైన పన్నాగం విఫలమైంది. ఎందుకంటే యోబు యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. (యోబు 2:3; 22:3; 27:5) మనం కూడా సాతానుతో పోరాడి అతన్ని ఓడించవచ్చు. మన కుటుంబ సభ్యుల్ని, సంఘంలోని సహోదరసహోదరీల్ని ప్రోత్సహిస్తూ ఉండడం ద్వారా సంతోషంగా ఉంటూ, యెహోవాకు సన్నిహితంగా ఉండడానికి ఒకరికొకరం సహాయం చేసుకోగలుగుతాం.
మనం అనుసరించగల ఆదర్శాలు
7, 8. (ఎ) యెహోవా మనుషుల్ని ఎలా ప్రోత్సహించాడు? (బి) తల్లిదండ్రులు యెహోవాను ఎలా అనుకరించవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)
7 యెహోవా మనుషుల్ని ప్రోత్సహిస్తాడు. కీర్తనకర్త ఇలా రాశాడు, “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” (కీర్త. 34:18) యిర్మీయా ప్రవక్త భయపడి, నిరుత్సాహపడినప్పుడు అతనికి సహాయం చేస్తానని యెహోవా మాటిచ్చాడు. (యిర్మీ. 1:6-10) వృద్ధుడైన దానియేలు ప్రవక్తను బలపర్చడానికి యెహోవా ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూత దానియేలును “బహు ప్రియుడు” అని పిలిచాడు. (దాని. 10:8, 11, 18, 19) యెహోవాను అనుకరిస్తూ మీరు కూడా ప్రచారకుల్ని, పయినీర్లను, ఒకప్పుడు చేసినంత సేవ ఇప్పుడు చేయలేకపోతున్న వృద్ధులను ప్రోత్సహించగలరా?
8 యెహోవా, ఆయన కుమారుడైన యేసు ఎన్నో సంవత్సరాలు కలిసి పనిచేశారు కాబట్టి యేసు భూమ్మీదున్నప్పుడు ఆయన్ని మెచ్చుకోవాల్సిన అవసరం, ప్రోత్సహించాల్సిన అవసరంలేదని యెహోవా అనుకోలేదు. యేసు ప్రకటనాపనిని మొదలుపెట్టినప్పుడు అలాగే ఆయన భూమ్మీద జీవించిన చివరి సంవత్సరంలో పరలోకం నుండి తన తండ్రి మాట్లాడడాన్ని ఆయన విన్నాడు. ఆ రెండు సందర్భాల్లో యెహోవా ఇలా అన్నాడు, “ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను.” (మత్త. 3:17; 17:5) తనను ప్రేమిస్తున్నానని, తనను చూసి గర్వపడుతున్నానని యెహోవా ఈ రెండు సందర్భాల్లో చెప్పడం విన్నప్పుడు యేసుక్రీస్తు తప్పకుండా ప్రోత్సాహాన్ని పొందివుంటాడు. అయితే, యేసు తాను చనిపోవడానికి ముందురోజు రాత్రి చాలా ఆందోళనపడ్డాడు. అప్పుడు ఆయన్ని బలపర్చడానికి, ఓదార్చడానికి యెహోవా ఒక దేవదూతను పంపించడం ద్వారా ప్రోత్సహించాడు. (లూకా 22:43) తల్లిదండ్రులారా, మీరు యెహోవాను అనుకరిస్తూ మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండండి. వాళ్లు ఏదైనా పనిని చక్కగా చేసినప్పుడు మెచ్చుకోండి. అంతేకాదు స్కూల్లో వాళ్ల విశ్వాసానికి పరీక్షలు ఎదురైనప్పుడు, వాళ్లను బలపర్చడానికి, వాటిని సహించేలా సహాయపడడానికి చేయగలిగినదంతా చేయండి.
9. యేసు తన అపొస్తలులతో వ్యవహరించిన విధానం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
9 యేసు కూడా మనకు మంచి ఆదర్శాన్ని ఉంచాడు. తాను చనిపోవడానికి ముందు రోజు రాత్రి యేసు తన అపొస్తలుల కాళ్లు కడిగి, వినయంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో చెప్పాడు. కానీ వాళ్లు గర్వంతో, తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. పేతురు తాను యేసును ఎన్నడూ విడిచిపెట్టనని గొప్పలు చెప్పాడు. (లూకా 22:24, 33, 34) కానీ యేసు వాళ్ల పొరపాట్ల మీద మనసుపెట్టలేదు. బదులుగా, తనకు నమ్మకంగా ఉన్నందుకు వాళ్లను మెచ్చుకున్నాడు. అంతేకాదు వాళ్లు ఆయనకన్నా గొప్పపనులు చేస్తారని మాటిచ్చాడు. యెహోవా వాళ్లను ప్రేమిస్తున్నాడని అభయమిచ్చాడు. (లూకా 22:28; యోహా. 14:12; 16:27) మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను యేసును అనుకరిస్తూ, ఇతరుల పొరపాట్ల మీద మనసుపెట్టకుండా వాళ్లలోని మంచి లక్షణాలనుబట్టి మెచ్చుకుంటున్నానా?’
10, 11. పౌలు తన సహోదరులను ఎలా ప్రోత్సహించాడు? వాళ్లకోసం దేన్ని కూడా లెక్కచేయలేదు?
10 అపొస్తలుడైన పౌలు తన సహోదరుల్లోని మంచి విషయాల గురించి తరచూ మాట్లాడాడు. వాళ్లలో కొంతమందితో కలిసి పౌలు చాలా సంవత్సరాలు మిషనరీ యాత్ర చేశాడు, వాళ్ల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. కానీ వాళ్ల పొరపాట్ల గురించి మాత్రం తన పత్రికల్లో రాయలేదు, బదులుగా వాళ్లను మెచ్చుకున్నాడు. ఉదాహరణకు తిమోతి గురించి, “ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు” అని అన్నాడు. అంతేకాదు అతను ఇతరుల అవసరాలను పట్టించుకుంటాడనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. (1 కొరిం. 4:17; ఫిలి. 2:19, 20) అదేవిధంగా పౌలు తీతును మెచ్చుకుంటూ కొరింథు సంఘానికి ఇలా రాశాడు, “అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడునైయున్నాడు.” (2 కొరిం. 8:23) అవును, తమ గురించి పౌలు ఏమనుకుంటున్నాడో తెలుసుకున్నప్పుడు తీతు, తిమోతీలు ఖచ్చితంగా ప్రోత్సాహం పొందివుంటారు.
11 పౌలు, అతనితోపాటు సేవచేసిన బర్నబా తమ సహోదరుల్ని ప్రోత్సహించడానికి తమ ప్రాణాలను కూడా లెక్కచేయలేదు. ఉదాహరణకు, లుస్త్ర పట్టణంలోని చాలామంది తమను చంపాలనుకుంటున్నారని వాళ్లిద్దరికీ తెలుసు. అయినాసరే, కొత్తగా శిష్యులైనవాళ్లను ప్రోత్సహించి, వాళ్లు యెహోవాకు నమ్మకంగా ఉండేలా సహాయం చేసేందుకు మళ్లీ ఆ పట్టణానికి వెళ్లారు. (అపొ. 14:19-22) ఆ తర్వాత, ఎఫెసులో కోపంతో ఉన్న ఓ గుంపు నుండి పౌలుకు ప్రాణహాని ఎదురైనప్పటికీ సహోదరులను ప్రోత్సహించడానికి అతను ఎక్కువ రోజులు అక్కడే ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 20:1, 2లో ఇలా ఉంది, “పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించినమీదట [ప్రోత్సహించిన తర్వాత, NW] వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్లుటకు బయలుదేరెను. ఆ ప్రదేశములయందు సంచరించి, పెక్కుమాటలతో వారిని హెచ్చరించి [ప్రోత్సహించి, NW] గ్రీసునకు వచ్చెను.”
ఒకరినొకరు ప్రోత్సహించుకోండి
12. మనం మీటింగ్స్‌కు వెళ్లడం ఎందుకు మంచిది?
12 యెహోవా మన మంచి కోరుకుంటాడు. అందుకే, మనం క్రమంగా కలుసుకోవాలని ఆయన చెప్తున్నాడు. మన మీటింగ్స్‌లో ఆయన గురించి నేర్చుకుంటాం, ఒకరినొకరం ప్రోత్సహించుకుంటాం. (1 కొరిం. 14:31; హెబ్రీయులు 10:24, 25 చదవండి.) ఈ ఆర్టికల్ మొదట్లో మనం చూసిన కీర్తన అనే అమ్మాయి ఇలా చెప్తోంది, “మీటింగ్స్‌లో నాకు బాగా నచ్చేది ఏమిటంటే అక్కడ దొరికే ప్రేమ, ప్రోత్సాహమే. కొన్నిసార్లు నేను రాజ్యమందిరానికి వచ్చేసరికి నిరుత్సాహంగా ఉంటాను. కానీ అప్పుడే సహోదరీలు నా దగ్గరకు వచ్చి, నన్ను కౌగిలించుకొని, నేను అందంగా ఉన్నానని అంటారు. వాళ్లు నన్ను ప్రేమిస్తున్నారని, నా ఆధ్యాత్మిక ప్రగతిని చూసి ఆనందిస్తున్నారని నాకు చెప్తారు. వాళ్లు ఇచ్చే ఆ ప్రోత్సాహంవల్ల చాలావరకు నా నిరుత్సాహం పోయినట్టు అనిపిస్తుంది.” మనలో ప్రతీఒక్కరం ఇతరుల్ని ప్రోత్సహించడం ఎంత ప్రాముఖ్యమో కదా!—రోమా. 1:11, 12.
13. యెహోవాను ఎంతోకాలంగా సేవిస్తున్న వాళ్లకు కూడా ప్రోత్సాహం ఎందుకు అవసరం?
13 యెహోవాను ఎంతోకాలంగా సేవిస్తున్నవాళ్లకు కూడా ప్రోత్సాహం అవసరం. యెహోషువ గురించి ఆలోచించండి. ఇశ్రాయేలీయులు కొంతకాలానికి వాగ్దాన దేశంలోకి వెళ్తారనగా యెహోవా, వాళ్లను నడిపించడానికి యెహోషువను ఎన్నుకున్నాడు. అయితే, యెహోషువ ఎన్నో సంవత్సరాలు తనను సేవించినప్పటికీ అతన్ని ప్రోత్సహించాలని యెహోవా మోషేకు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, “యెహోషువకు ఆజ్ఞయిచ్చి అతని ధైర్యపరచి [ప్రోత్సహించి, NW] దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నదిదాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొనచేయును.” (ద్వితీ. 3:27, 28) యెహోషువకు ప్రోత్సాహం అవసరం ఎందుకంటే, త్వరలోనే ఇశ్రాయేలు జనాంగం చాలా యుద్ధాలు చేయాలి అంతేకాదు వాళ్లు వాటిల్లో కనీసం ఒక్క యుద్ధంలోనైనా ఓడిపోతారు. (యెహో. 7:1-9) నేడు దేవుని ప్రజలను శ్రద్ధగా చూసుకోవడానికి కష్టపడుతున్న సంఘపెద్దల్ని, ప్రాంతీయ పర్యవేక్షకుల్ని మనం ప్రోత్సహించవచ్చు. (1 థెస్సలొనీకయులు 5:12, 13 చదవండి.) ఒక ప్రాంతీయ పర్యవేక్షకుడు ఇలా అన్నాడు, “కొన్నిసార్లు సహోదరులు మా సందర్శనాన్ని ఎంత ఆనందించారో చెప్తూ ఒక థ్యాంక్యూ ఉత్తరం రాస్తుంటారు. మేము వాటిని మా దగ్గర ఉంచుకొని నిరుత్సాహంగా అనిపించినప్పుడు చదువుకుంటాం. నిజంగా అవి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తాయి.”
14. క్రమశిక్షణ ఇస్తున్నప్పుడు మెచ్చుకోవడం, ప్రోత్సాహకరంగా మాట్లాడడం ముఖ్యమని ఏది చూపిస్తుంది?
14 ఒక సందర్భంలో, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు సలహా ఇవ్వాల్సివచ్చింది. ఆ సలహాను పాటించినప్పుడు, పౌలు వాళ్లను మెచ్చుకున్నాడు. (2 కొరిం. 7:8-11) సరైనది చేస్తూ ఉండేలా అతని మాటలు వాళ్లను ఖచ్చితంగా ప్రోత్సహించి ఉంటాయి. నేడు సంఘపెద్దలు, తల్లిదండ్రులు పౌలును అనుకరించవచ్చు. ఇద్దరు పిల్లలున్న ఆండ్రేయాస్ ఇలా అంటున్నాడు, “ప్రోత్సాహంవల్ల పిల్లలు ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా ఎదుగుతారు. పిల్లల్ని ప్రోత్సహించినప్పుడు ఇచ్చిన క్రమశిక్షణను వాళ్లు స్వీకరిస్తారు. మన పిల్లలకు ఏది సరైనదో తెలిసినప్పటికీ, మనం ప్రోత్సాహం ఇస్తూ ఉండడంవల్ల సరైనది చేయడం వాళ్ల జీవిత విధానంలో భాగమైపోతుంది.”
ఇతరులను ప్రోత్సహించడానికి మీకేది సహాయం చేస్తుంది?
15. ఇతరుల్ని ప్రోత్సహించే ఒక మార్గం ఏమిటి?
15 మీ సహోదరసహోదరీల కృషిని, వాళ్లలోని మంచి లక్షణాలను మీరు ఎంత విలువైనవిగా చూస్తున్నారో వాళ్లకు చెప్పండి. (2 దిన. 16:9; యోబు 1:8) అలా చేస్తే మనం యెహోవాను, యేసును అనుకరించినవాళ్లమౌతాం. మనం చేయాలనుకున్నంత చేయలేకపోయినప్పటికీ, వాళ్లకోసం మనం చేసే ప్రతీదాన్ని వాళ్లు విలువైనదిగా ఎంచుతారు. (లూకా 21:1-4; 2 కొరింథీయులు 8:12 చదవండి.) ఉదాహరణకు, వృద్ధులు మీటింగ్స్‌కు, ప్రీచింగ్‌కి క్రమంగా రావాలంటే వాళ్లు ఎంతో కష్టపడాల్సి ఉంటుందని మనకు తెలుసు. మరి వాళ్లు చేస్తున్న దానంతటికీ వాళ్లను ప్రోత్సహిస్తున్నామా? మెచ్చుకుంటున్నామా?
16. మనం ఇతరులను ఎప్పుడు ప్రోత్సహించవచ్చు?
16 వీలైనంత ఎక్కువగా ఇతరుల్ని ప్రోత్సహించండి. ఎవరైనా ఏదైనా పనిని చక్కగా చేశారని మీరు గమనించినప్పుడు, వాళ్లను తప్పకుండా మెచ్చుకోండి. పౌలు, బర్నబా పిసిదియలోని అంతియొకయలో ఉన్నప్పుడు, అక్కడ సమాజమందిరంలో ఉన్న నాయకులు వాళ్లతో ఇలా అన్నారు, ‘సోదరులారా, ప్రజల్ని ప్రోత్సహించే మాట ఏదైనా మీ దగ్గరుంటే చెప్పండి.’ పౌలు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజల్ని ప్రోత్సహించాడు. (అపొ. 13:13-16, NW, 42-44) మనం ఇతరుల్ని ప్రోత్సహించినప్పుడు, వాళ్లు కూడా మనల్ని ప్రోత్సహిస్తారు.—లూకా 6:38.
17. ఇతరులను మెచ్చుకునే ఉత్తమమైన మార్గం ఏమిటి?
17 మీకు ఏ విషయం నచ్చిందో చెప్పండి. యేసు తుయతైరలోని క్రైస్తవుల్ని మెచ్చుకున్నప్పుడు, వాళ్లలో తనకు నచ్చిన విషయాల గురించి చెప్పాడు. (ప్రకటన 2:18, 19 చదవండి.) మనం యేసును ఎలా అనుకరించవచ్చు? బహుశా ఓ ఒంటరి తల్లి, తనకు ఎంత కష్టమైనప్పటికీ తన పిల్లలను పెంచుతున్న విధానాన్నిబట్టి ఆమెను మెచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు తల్లిదండ్రులైతే, మీ పిల్లలు యెహోవాను సేవించడానికి చేస్తున్న కృషిని మెచ్చుకోవచ్చు. వాళ్లలో మీరు గమనించిన మంచి విషయాల గురించి చెప్పండి. అలా వాళ్లలో మనకు నచ్చిన విషయాల గురించి చెప్తూ మెచ్చుకున్నప్పుడు మనం మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నామని వాళ్లు గ్రహిస్తారు.
18, 19. యెహోవాకు సన్నిహితంగా ఉండేందుకు ఒకరికొకరం ఎలా సహాయం చేసుకోగలం?
18 యెహోషువను ప్రోత్సహించి, బలపర్చాలని యెహోవా మోషేకు చెప్పాడు. నిజమే, నేడు యెహోవా మనతో మాట్లాడడు, ఫలానా వ్యక్తిని ప్రోత్సహించమని చెప్పడు. కానీ ఇతరుల్ని ప్రోత్సహించడానికి మనం చేసే కృషిని చూసి ఆయన సంతోషిస్తాడు. (సామె. 19:17; హెబ్రీ. 12:12) ఉదాహరణకు, ఓ సహోదరుడు సంఘంలో బహిరంగ ప్రసంగం ఇచ్చినప్పుడు, అతని ప్రసంగంలో ఏ విషయం నచ్చిందో మనం చెప్పవచ్చు. బహుశా ఓ సమస్యను తట్టుకోవడానికి లేదా ఓ లేఖనాన్ని అర్థంచేసుకోవడానికి ఆ ప్రసంగం మనకు సహాయం చేసివుండవచ్చు. ప్రసంగం ఇచ్చిన ఓ సహోదరునికి ఒక సహోదరి ఇలా రాసింది, “మీరు నాతో మాట్లాడింది కొన్ని నిమిషాలే అయినప్పటికీ, మీరు నా బాధను గుర్తించి, నన్ను ఓదార్చి ప్రోత్సహించారు. మీరు ప్రసంగంలో అలాగే నాతో చాలా దయగా మాట్లాడారు. అది యెహోవా ఇచ్చిన ఓ బహుమానమని నాకు అనిపించింది.”
19 “మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి [ప్రోత్సహించుకుంటూ, NW] యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగ జేయుడి” అని పౌలు ఇచ్చిన సలహాను పాటిస్తే, యెహోవాకు సన్నిహితంగా ఉండేందుకు ఒకరికొకరం సహాయం చేసుకోగలుగుతాం. (1 థెస్స. 5:11) మనం ‘ప్రతీరోజు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ’ ఉంటే యెహోవా ఎంతో సంతోషిస్తాడు.
^ [1] (1వ పేరా) అసలు పేర్లు కావు.