వాళ్లు అబద్ధమతంతో తెగతెంపులు చేసుకున్నారు
‘నా ప్రజలారా . . . దానిని విడిచి రండి.’—ప్రక. 18:4.
పాటలు: 3, 21
1. దేవుని ప్రజలు మహాబబులోను నుండి విడుదల పొందుతారని మనకెలా తెలుసు? మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?
నమ్మకమైన క్రైస్తవులు మహాబబులోనుకు బందీలయ్యారని ముందటి ఆర్టికల్‌లో నేర్చుకున్నాం. మంచివార్త ఏమిటంటే వాళ్లు ఎప్పటికీ బందీలుగా ఉండిపోలేదు. ఎందుకంటే, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యాన్ని “విడిచి రండి” అని దేవుడు తన ప్రజలను ఆజ్ఞాపించాడు. ఒకవేళ అబద్ధమతం నుండి ఎవ్వరూ ఎప్పటికీ బయటకు రాలేకపోతే దేవుని ఆజ్ఞకు అర్థం ఉండదు. (ప్రకటన 18:4 చదవండి.) కాబట్టి క్రైస్తవులు మహాబబులోను నుండి విడుదల పొందారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే వాళ్లు ఎప్పుడు విడుదల పొందుతారో తెలుసుకోవడానికి ముందు, ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం: 1914 కన్నా ముందు మహాబబులోను విషయంలో బైబిలు విద్యార్థులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మన సహోదరులు ఎంత ఉత్సాహంగా ప్రీచింగ్ చేశారు? ఆ సమయంలో దేవుని ప్రజలను సరిదిద్దాల్సి వచ్చింది కాబట్టి వాళ్లు బబులోనుకు బందీలుగా ఉండివుంటారా?
“మహాబబులోను కూలిపోయింది”
2. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే తొలి బైబిలు విద్యార్థులు ఏమి చేయాలని అనుకున్నారు?
2 క్రైస్తవమత సామ్రాజ్యం బైబిల్లోని సత్యాలను బోధించడం లేదని ఛార్లెస్ తేజ్ రస్సెల్, ఇంకా ఇతర బైబిలు విద్యార్థులు మొదటి ప్రపంచ యుద్ధానికి (1914-1918) చాలా సంవత్సరాల ముందే గుర్తించారు. అందుకే వాళ్లు అబద్ధమతంతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని అనుకున్నారు. క్రీస్తుకు నమ్మకమైన పెండ్లికుమార్తెగా ఉన్నామని చెప్పుకుంటూ ప్రభుత్వాలకు మద్దతిచ్చే ప్రతీ చర్చి మహాబబులోనులో భాగమని 1879 నవంబరు నెల జాయన్స్ వాచ్ టవర్ చెప్పింది. అంతేకాదు బైబిలు ఆ మహాబబులోనును వేశ్యతో పోలుస్తోందని ఆ పత్రిక చెప్పింది.—ప్రకటన 17:1, 2 చదవండి.
3. అబద్ధమతంతో తమకు ఇక సంబంధం లేదని చూపించడానికి బైబిలు విద్యార్థులు ఏమి చేశారు? (ప్రారంభ చిత్రం చూడండి.)
3 అబద్ధమతానికి మద్దతిస్తూ ఉంటే దేవుడు తమను ఆశీర్వదించడని నమ్మకమైన స్త్రీపురుషులు అర్థంచేసుకున్నారు. అందుకే, వాళ్లలో చాలామంది తాము చర్చిలో సభ్యులుగా ఇక ఉండాలనుకోవడం లేదని తెలిపే ఉత్తరాలను తమ చర్చీలకు పంపించారు. కొందరైతే, వాటిని చర్చిలో ఉన్నవాళ్లందరి ముందు చదివి వినిపించారు. అలా చదవడానికి అనుమతి లేని చోట, చర్చిలోని ప్రతీ సభ్యునికి ఓ ఉత్తరం పంపించారు. ఆ విధంగా, తాము అబద్ధమతంతో ఎలాంటి సంబంధం పెట్టుకోవాలనుకోవడం లేదని బైబిలు విద్యార్థులు స్పష్టంగా తెలియజేశారు. కొన్ని సంవత్సరాల ముందు వాళ్లు ఇలా చేసివుంటే, వాళ్లను చంపేసి ఉండేవాళ్లు. కానీ 1870 కల్లా, చాలా దేశాల్లోని ప్రభుత్వాలు అంతకుముందు మద్దతిచ్చినంతగా చర్చీలకు మద్దతివ్వడం మానేశాయి. ఇప్పుడు ప్రజలు బైబిలు గురించి స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, చర్చీలు చెప్పేవి నచ్చకపోతే వాటిని ఖండించవచ్చు.
4. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బైబిలు విద్యార్థులకు మహాబబులోనుపై ఎలాంటి అభిప్రాయం ఉండేది? వివరించండి.
4 తాము ఇక అబద్ధమతానికి మద్దతివ్వట్లేదని తమ కుటుంబసభ్యులకు, సన్నిహిత స్నేహితులకు, చర్చిలోని సభ్యులకు మాత్రమే చెప్తే సరిపోదని బైబిలు విద్యార్థులు అర్థంచేసుకున్నారు. మహాబబులోను ఒక మతసంబంధమైన వేశ్య అని ప్రపంచమంతా తెలుసుకోవాలని వాళ్లు కోరుకున్నారు. అందుకే, డిసెంబరు 1917 నుండి 1918 తొలి సంవత్సరాల మధ్యకాలంలో ఉత్సాహవంతులైన కొన్ని వేలమంది బైబిలు విద్యార్థులు “ఫాల్ ఆఫ్ బాబిలోన్” అనే ఆర్టికల్ ఉన్న కరపత్రపు కోటి కాపీలను పంచిపెట్టారు. ఆ కరపత్రం క్రైస్తవమత సామ్రాజ్యం గురించిన నిజాన్ని ధైర్యంగా బట్టబయలు చేసింది. దాంతో చర్చి నాయకులు కోపంతో ఊగిపోయారు. కానీ బైబిలు విద్యార్థులు తమ పనిని ఆపలేదు. వాళ్లు ప్రీచింగ్ చేస్తూనే ఉండాలని, ‘మనుష్యులకు కాదు దేవునికే లోబడాలని’ నిర్ణయించుకున్నారు. (అపొ. 5:29) దీన్నిబట్టి మనకు ఏమి అర్థమౌతుంది? మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో క్రైస్తవ స్త్రీపురుషులు మహాబబులోనుకు బందీలుగా లేరని అర్థమౌతుంది. బదులుగా వాళ్లు అబద్ధమతాన్ని విడిచి వస్తూ, దానినుండి బయటికి రావడానికి ఇతరులకు కూడా సహాయం చేస్తున్నారు.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో చూపించిన ఆసక్తి
5. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సహోదరులు చాలా ఉత్సాహంగా ప్రీచింగ్ చేశారని ఎలా చెప్పవచ్చు?
5 గతంలో మనం, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దేవుని ప్రజలు ఉత్సాహంగా ప్రీచింగ్ చేయలేదు కాబట్టి ఆ సమయంలో వాళ్లపై దేవుని అనుగ్రహం లేదని అనుకునేవాళ్లం. అందుకే, వాళ్లు కొంతకాలం వరకు మహాబబులోనుకు బందీలుగా ఉండడానికి యెహోవా అనుమతించాడని నమ్మాం. కానీ, నిజానికి ఆ కాలంలోని నమ్మకమైన సహోదరసహోదరీలు ఒక గుంపుగా ప్రీచింగ్ చేస్తూనే ఉండడానికి చేయగలినదంతా చేశారు. ఈ విషయాన్ని, 1914 నుండి 1918 మధ్యకాలంలో దేవుని సేవ చేసిన నమ్మకమైన సహోదరసహోదరీలు ఆ తర్వాత వివరించారు. ఆ కాలంలోని బైబిలు విద్యార్థులకు ఏమి జరిగిందో సరిగ్గా అర్థంచేసుకోవడం వల్ల బైబిల్లో నమోదైన కొన్ని సంఘటనలను అర్థంచేసుకోగలుగుతాం.
6, 7. (ఎ) మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బైబిలు విద్యార్థులకు ఏ సవాళ్లు ఎదురయ్యాయి? (బి) వాళ్లు ఉత్సాహంగా ప్రకటించారని ఎలా చెప్పవచ్చు?
6 నిజానికి, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బైబిలు విద్యార్థులు తీరికలేకుండా ప్రీచింగ్ చేస్తూ ఉన్నారు. అయితే, వాళ్లు కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొన్నారు. వాటిలో రెండింటిని పరిశీలిద్దాం. మొదటిది, కేవలం బైబిల్ని ఉపయోగిస్తూ ప్రీచింగ్ చేయడం బైబిలు విద్యార్థులు అప్పటికింకా నేర్చుకోలేదు. వాళ్లు పుస్తకాల్ని మాత్రమే పంచిపెట్టేవాళ్లు, ప్రజలు వాటిని చదివి సత్యం తెలుసుకునేవాళ్లు. కాబట్టి 1918 మొదట్లో ద ఫినిష్డ్ మిస్టరీ అనే పుస్తకాన్ని ప్రభుత్వం నిషేధించినప్పుడు, చాలామంది సహోదరులకు ప్రీచింగ్ చేయడం కష్టమైంది. అదే సంవత్సరంలో వాళ్లకు ఎదురైన రెండో సవాలు ఏమిటంటే, స్పానిష్ ఫ్లూ అనే ఓ భయంకరమైన అంటువ్యాధి మొదలవ్వడం. దానివల్ల బయటకు వెళ్లి ప్రీచింగ్ చేయడం సహోదరులకు కష్టమైంది. అయినప్పటికీ ప్రీచింగ్ను కొనసాగించడానికి బైబిలు విద్యార్థులు చేయగలిగినదంతా చేశారు.
7 బైబిలు విద్యార్థుల చిన్న గుంపు 1914లో “ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్” ప్రదర్శనను ప్రజలకు చూపించింది. స్లైడ్లను, కదిలే చిత్రాలను, సౌండ్‌తో జతచేసి ప్రదర్శించడం ఆ కాలంలో ఓ కొత్త విషయం. ఆ డ్రామాలో, ఆదాము నుండి క్రీస్తు పరిపాలన చివరివరకు ఉన్న మనుషుల చరిత్రను చూపించారు. 1914లో అంటే, ఆ డ్రామాను చూపించడం మొదలుపెట్టిన మొదటి సంవత్సరంలో 90 లక్షలకన్నా ఎక్కువమంది దాన్ని చూశారు. ఆ సంఖ్య గురించి ఒక్కసారి ఆలోచిస్తే, అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల సంఖ్య కన్నా ఎక్కువ. అంతేకాదు, 1916లో అమెరికాలో జరిగిన బహిరంగ కూటాలకు 8 లక్షల 9 వేల కన్నా ఎక్కువమంది హాజరయ్యారనీ, 1918లో ఆ సంఖ్య దాదాపు 9 లక్షల 50 వేలకు పెరిగిందనీ ఇతర నివేదికలు చెప్తున్నాయి. అప్పటి బైబిలు విద్యార్థులు ఎంత ఉత్సాహంగా ప్రకటించారో కదా!
8. నాయకత్వం వహిస్తున్న సహోదరులు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బైబిలు విద్యార్థులను ఎలా బలపర్చారు?
8 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, నాయకత్వం వహిస్తున్న సహోదరులు బైబిలు విద్యార్థులందరికీ మన ప్రచురణలు అందించడానికి, ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు. అలా ప్రేమపూర్వకంగా ఇచ్చిన ఆ మద్దతు, వాళ్లను బలపర్చి ప్రీచింగ్ చేస్తూనే ఉండడానికి సహాయం చేసింది. అప్పట్లో ఉత్సాహంగా ప్రీచింగ్ చేసిన రిచర్డ్. హెచ్. బార్బర్ ఇలా చెప్పాడు, “కొంతమంది ప్రయాణ పర్యవేక్షకులను వేర్వేరు ప్రాంతాలకు పంపించగలిగాం, కావలికోట పత్రికను పంచిపెడుతూ ఉండగలిగాం. ఆ పత్రికలను నిషేదించిన కెనడాకు కూడా పంపించగలిగాం. అప్పట్లో ఉన్న ప్రభుత్వం మా స్నేహితుల్లో కొంతమంది దగ్గర ఉన్న ద ఫినిష్డ్ మిష్టరీ పుస్తకాన్ని జప్తు చేసింది. అలాంటి వాళ్లకు పాకెట్‌సైజ్ కాపీలను పోస్టులో పంపించే గొప్ప అవకాశం నాకు దొరికింది. తర్వాత, అమెరికా ఉత్తర భాగాన ఉన్న కొన్ని రాష్ట్రాల్లో మమ్మల్ని సమావేశాల కోసం ఏర్పాట్లు చేయమనీ, వీలైనంత ఎక్కువమంది స్నేహితులను ప్రోత్సహించడానికి ప్రసంగీకులను పంపించమనీ సహోదరుడు రూథర్‌ఫర్డ్ కోరాడు.”
వాళ్లను కొంత సరిదిద్దాల్సి వచ్చింది
9. (ఎ) దేవుని ప్రజలను 1914 నుండి 1919 మధ్యకాలంలో ఎందుకు సరిదిద్దాల్సి వచ్చింది? (బి) అలా సరిదిద్దాల్సి వచ్చినప్పటికీ మనం ఏమి అనుకోవడం తప్పు?
9 బైబిలు విద్యార్థులు ఇంకా సరిద్దుకోవాల్సిన విషయాలు కొన్ని ఉండేవి. ప్రభుత్వాలకు లోబడాలని యెహోవా చెప్పినప్పుడు దానర్థం ఏమిటో వాళ్లు పూర్తిగా గ్రహించలేకపోయారు. (రోమా. 13:1) అందుకే, వాళ్లు ఒక గుంపుగా యుద్ధ సమయంలో తటస్థంగా ఉండలేకపోయారు. ఉదాహరణకు శాంతి కోసం ప్రార్థించమని 1918, మే 30న అమెరికా ప్రెసిడెంట్ ప్రజలకు చెప్పినప్పుడు, బైబిలు విద్యార్థులు కూడా ప్రార్థించాలని కావలికోట పత్రిక ప్రోత్సహించింది. కొంతమంది సహోదరులు యుద్ధానికి ఆర్థిక సహాయం చేశారు, ఇంకొంతమందైతే సైనికులుగా యుద్ధానికి వెళ్లారు. అయితే, వాళ్లను సరిదిద్దాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆ కారణాన్నిబట్టే వాళ్లను మహాబబులోనుకు బందీలుగా అవ్వడానికి దేవుడు అనుమతించాడని అనుకోవడం తప్పు. నిజానికి, మొదటి ప్రపంచ యుద్ధ సమయానికే వాళ్లు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం నుండి చాలావరకు వేరైపోయారు.—లూకా 12:47, 48 చదవండి.
10. తమకు జీవంపట్ల గౌరవం ఉందని బైబిలు విద్యార్థులు ఎలా చూపించారు?
10 తటస్థంగా ఉండడమంటే ఏమిటో బైబిలు విద్యార్థులు పూర్తిగా అర్థం చేసుకోలేదన్నది నిజం. కానీ ఎవరినైనా చంపడం మాత్రం తప్పని వాళ్లకు తెలుసు. కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆయుధాలు పట్టుకొని సైనికులుగా యుద్ధానికి వెళ్లిన కొంతమంది సహోదరులు కూడా, వాటిని ఉపయోగించి మరో వ్యక్తిని చంపలేదు. అలా చంపడానికి నిరాకరించిన కొంతమందిని యుద్ధంలో ముందు వరసలో నిలబెట్టేవాళ్లు, అలా చేస్తే వాళ్లు చనిపోతారని అనుకునేవాళ్లు.
11. బైబిలు విద్యార్థులు యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించినందుకు ప్రభుత్వాలు ఎలా స్పందించాయి?
11 సహోదరులు దేవునికి నమ్మకంగా ఉన్నందుకు సాతానుకు కోపమొచ్చింది. ఫలితంగా, అతను ‘కట్టడవల్ల కీడు కల్పించాడు.’ (కీర్త. 94:20) యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించిన వాళ్లకు మరణ శిక్ష విధించేలా ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నించిందని అమెరికా సైనిక అధికారియైన జేమ్స్ ఫ్రాంక్లిన్ బెల్, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌తో అలాగే వాన్ ఆమ్బర్గ్లతో చెప్పాడు. ముఖ్యంగా బైబిలు విద్యార్థులను మనసులో పెట్టుకొని ఆ అధికారి ఆ మాటలు అన్నాడు. అయితే, అమెరికా ప్రెసిడెంట్ అడ్డుకోవడం వల్లే ఆ చట్టాన్ని పెట్టలేదని, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌తో అతను చాలా కోపంగా చెప్పాడు. ఆ తర్వాత అతను ఇలా అన్నాడు, “కానీ మిమ్మల్ని ఏమి చేయాలో మాకు తెలుసు. త్వరలో అది చేస్తాం.”
12, 13. (ఎ) ఎనిమిదిమంది సహోదరులకు ఎక్కువకాలం జైలు శిక్షను ఎందుకు విధించారు? (బి) దానివల్ల యెహోవాకు లోబడాలని తాము తీసుకున్న నిర్ణయం విషయంలో సహోదరులు రాజీపడ్డారా? వివరించండి.
12 చివరికి బైబిలు విద్యార్థులను శిక్షించడానికి ప్రభుత్వానికి ఒక మార్గం దొరికింది. వాచ్ టవర్ సొసైటీకి ప్రతినిధులైన సహోదరుడు రూథర్‌ఫర్డ్, సహోదరుడు వాన్ఆమ్బర్గ్లతోపాటు ఇంకొక ఆరుగురు సహోదరులను అరెస్టు చేశారు. ఆ సహోదరులు జర్మన్ సైనికుల గుంపుకన్నా చాలా ప్రమాదకరమైన వాళ్లని ఆ కేసును పరిశీలిస్తున్న జడ్జి చెప్పాడు. ఆ సహోదరులు ప్రభుత్వాన్ని, మిలిటరీని, అన్నీ చర్చీలను అవమానించారని వాళ్లను తీవ్రంగా శిక్షించాలని అతను చెప్పాడు. [1] అందుకే ఆ ఎనిమిదిమంది బైబిలు విద్యార్థులకు ఎక్కువకాలం జైలు శిక్ష విధించి జార్జియాలోని అట్లాంటాకు పంపించారు. అయితే యుద్ధం ముగిశాక, వాళ్లను విడుదల చేసి, వాళ్లమీద మోపిన ఆరోపణల్ని కొట్టేశారు.
13 ఆ ఎనిమిదిమంది సహోదరులు జైల్లో ఉన్నప్పుడు కూడా, దేవుని నియమానికే లోబడాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయం మనకెలా తెలుసు? తమను జైలు నుండి విడుదల చేయమని అడుగుతూ అమెరికా ప్రెసిడెంట్‌కు వాళ్లు ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో, ఎవ్వరినీ చంపకూడదని బైబిలు చెప్తుందనీ, ఆ విషయం తెలిసి కూడా దేవునికి సమర్పించుకున్నవాళ్లు ఎవరైనా దేవుని మాటను మీరితే ఆయన అనుగ్రహాన్ని, తమ జీవాన్ని కోల్పోతారనీ వాళ్లు రాశారు. అందుకే తాము ఇతరులను చంపలేమని, చంపమని వివరించారు. అలా ప్రెసిడెంట్‌కు ఉత్తరం రాసి వాళ్లు ఎంతో ధైర్యం చూపించారు. యెహోవాకు లోబడి ఉండాలనే తమ నిర్ణయం విషయంలో సహోదరులు ఎన్నడూ రాజీపడరని అనడంలో సందేహం లేదు.
దేవుని ప్రజలు చివరికి విడుదల పొందారు
14. బైబిలు విద్యార్థులకు 1914 నుండి 1919 వరకు ఏమి జరిగిందో లేఖనాల నుండి వివరించండి.
14 బైబిలు విద్యార్థులకు 1914 నుండి 1919 తొలి సంవత్సరాల మధ్యకాలంలో ఏమి జరిగిందో మలాకీ 3:1-3 వచనాలు వివరిస్తున్నాయి. (చదవండి.) నిజమైన ‘ప్రభువైన’ యెహోవా దేవుడు అలాగే ‘నిబంధన దూతయైన’ యేసుక్రీస్తు, అభిషిక్తులను సూచిస్తున్న “లేవీయుల” కుమారులను తనిఖీ చేయడానికి వచ్చారు. యెహోవా వాళ్లను సరిదిద్ది, శుద్ధీకరించిన తర్వాత ఓ కొత్త నియామకాన్ని తీసుకోవడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. దేవుని సేవకులను నిర్దేశిస్తూ, వాళ్లకు బోధించేందుకు 1919లో యేసు, ‘నమ్మకమైన బుద్ధిగల దాసుణ్ణి’ నియమించాడు. (మత్త. 24:45) చివరికి దేవుని ప్రజలు మహాబబులోను నుండి విడుదల పొందారు. అప్పటినుండి వాళ్లు దేవుని చిత్తం గురించి మరింత ఎక్కువ నేర్చుకుంటున్నారు. దేవుని పట్ల వాళ్లకున్న ప్రేమ కూడా మరింత ఎక్కువైంది. ఆయన ఆశీర్వాదం బట్టి వాళ్లు ఎంత సంతోషించి ఉంటారో కదా! [2]
15. మహాబబులోను నుండి మనం విడుదల పొందినందుకు కృతజ్ఞులమై ఉన్నామని ఎలా చూపించవచ్చు?
15 మనం మహాబబులోను నుండి విడుదల పొందినందుకు చాలా కృతజ్ఞులం. సత్యారాధనను సాతాను నాశనం చేయలేకపోయాడు, అతను విఫలమయ్యాడు. అయితే, యెహోవా మనల్ని ఎందుకు విడుదల చేశాడో మనం గుర్తుంచుకోవాలి. ప్రజలందరూ రక్షించబడాలనేదే ఆయన ఉద్దేశం. (2 కొరిం. 6:1) కానీ నిజమైన ఆసక్తి ఉన్న ఎంతోమంది ఇంకా అబద్ధమతం గుప్పిట్లోనే ఉన్నారు, వాళ్లకు మన సహాయం అవసరం. కాబట్టి ప్రజలను విడిపించడానికి మన నమ్మకమైన సహోదరులు చేసిన పనిని అనుకరించడానికి చేయగలిగినదంతా చేద్దాం.
^ [1] (12వ పేరా) ఎ. హెచ్. మాక్మిలన్ రాసిన ఫెయిత్ ఆన్ ద మార్చ్ అనే పుస్తకంలోని 99వ పేజీ చూడండి.
^ [2] (14వ పేరా) యూదులు బబులోనుకు చెరగా వెళ్లడానికీ, అలాగే మతభ్రష్టత్వం మొదలైన తర్వాత క్రైస్తవులకు జరిగిన దానికీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. కానీ యూదులు చెరగా వెళ్లడం, క్రైస్తవులకు జరిగినదానికి సూచనగా ఉందని మనం చెప్పలేం. అందుకే ప్రతీ వివరణకు ప్రవచనార్థక అర్థాన్ని వెదకకూడదు. వాటిమధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఒక ఉదాహరణ ఏమిటంటే, యూదులు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు, కానీ క్రైస్తవులు దానికన్నా చాలా ఎక్కువకాలమే బందీలుగా ఉన్నారు.