దేవుడిచ్చిన బైబిలుకు అనుగుణంగా క్రమపద్ధతిలో నడవడం
“జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.”—సామె. 3:19.
పాటలు: 6, 24
1, 2. (ఎ) దేవునికి సంస్థ ఉండడం గురించి కొంతమంది ఏమంటారు? (బి) ఈ ఆర్టికల్లో ఏమి తెలుసుకుంటాం?
“మనల్ని సరైన దారిలో నడిపించేందుకు ఓ సంస్థ అవసరం లేదు. దేవునితో మంచి సంబంధం ఉంటే సరిపోతుంది” అని కొంతమంది అంటారు. ఈ మాటలు నిజమేనా? వాస్తవాలు ఏం రుజువు చేస్తున్నాయి?
2 యెహోవా అన్నీ పనుల్ని క్రమపద్ధతిలో చేస్తాడని, ఆయన తన ప్రజల్ని క్రమపద్ధతిలో నడిపిస్తాడని ఈ ఆర్టికల్లో తెలుసుకుంటాం. యెహోవా సంస్థ మనకేదైనా నిర్దేశం ఇచ్చినప్పుడు మనమేమి చేయాలో కూడా చర్చిస్తాం. (1 కొరిం. 14:33, 39-40) మొదటి శతాబ్దంలోని దేవుని ప్రజలు లేఖనాల్లోని నిర్దేశాల్ని పాటించడంవల్ల చాలా ప్రాంతాల్లో సువార్త ప్రకటించగలిగారు. వాళ్లలాగే నేడు మనం కూడా బైబిలు నిర్దేశాల ప్రకారం నడుస్తాం. అంతేకాదు దేవుని సంస్థ ఇచ్చే సూచనలు పాటిస్తాం. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించగలుగుతున్నాం. సంఘాన్ని పవిత్రంగా, సమాధానంగా, ఐక్యంగా ఉంచగలుగుతున్నాం.
యెహోవా క్రమముగల దేవుడు
3. యెహోవా క్రమముగల దేవుడు అని మీరెందుకు నమ్ముతున్నారు?
3 యెహోవా చేసిన సృష్టిని గమనించినప్పుడు, ఆయన క్రమముగల దేవుడని మనకు స్పష్టంగా అర్థమౌతుంది. ‘జ్ఞానముతో యెహోవా భూమిని స్థాపించాడు వివేచనతో ఆయన ఆకాశవిశాలాన్ని స్థిరపరచాడు.’ (సామె. 3:19) యెహోవా సృష్టి గురించి మనకు తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నిజానికి, ‘ఆయన గురించి మనకు వినబడుతున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దమే.’ (యోబు 26:14) అయితే విశ్వం గురించి మనకు తెలిసిన ఆ కొన్ని విషయాల్ని బట్టి ఆయన దాన్ని చాలా క్రమపద్ధతిలో చేశాడని స్పష్టంగా అర్థమౌతోంది. (కీర్త. 8:3, 4) అంతరిక్షంలో లక్షల నక్షత్రాలు ఓ పద్ధతిలో కదులుతూ ఉంటాయి. సౌర కుటుంబంలోని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్న విధానం గురించి ఓసారి ఆలోచించండి. ఈ గ్రహాలు, నక్షత్రాలు ఇంత అద్భుతంగా క్రమపద్ధతిలో తిరుగుతున్నాయంటే దానికిగల కారణం యెహోవా వాటిని క్రమపద్ధతిలో కదిలేలా చేయడమే. యెహోవా తన ‘జ్ఞానముచేత ఆకాశాన్ని,’ భూమిని తయారుచేసిన విధానం గురించి ఆలోచిస్తే ఆయన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయనకు నమ్మకంగా ఉండాలనుకుంటాం.—కీర్త. 136:1, 5-9.
4. శాస్త్రవేత్తలు ఎన్నో ప్రాముఖ్యమైన ప్రశ్నలకు ఎందుకు జవాబులు ఇవ్వలేకపోతున్నారు?
4 శాస్త్రవేత్తలు ఈ విశ్వం గురించి, భూమి గురించి తెలుసుకున్న విషయాల్ని ఉపయోగించి మన జీవితాల్ని మరింత మెరుగుపర్చడానికి ప్రయత్నించారు. కానీ చాలామంది అడుగుతున్న ఎన్నో ప్రాముఖ్యమైన ప్రశ్నలకు వాళ్లు జవాబులు ఇవ్వలేకపోతున్నారు. ఉదాహరణకు, ఈ విశ్వం ఎలా వచ్చింది, భూమ్మీద మనుషులు, జంతువులు, చెట్లు ఎందుకు ఉన్నాయి వంటి ప్రశ్నలకు ఖగోళ శాస్త్రజ్ఞులు సరైన జవాబులు ఇవ్వలేరు. అంతేకాదు మనుషులకు చిరకాలం జీవించాలనే కోరిక ఎందుకు ఉంటుందో చాలామంది వివరించలేకపోతున్నారు. (ప్రసం. 3:11) ప్రజలు ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేకపోవడానికి ఒక కారణమేమిటంటే శాస్త్రవేత్తలు, ఇంకా ఇతరులు దేవుడు లేడనీ, ఈ విశ్వం పరిణామ సిద్ధాంతం ద్వారా వచ్చిందనీ చెప్పడమే. కానీ దేవుడు తన వాక్యమైన బైబిల్లో ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇస్తున్నాడు.
5. మనుషులు ఏవిధంగా ప్రకృతి నియమాలపై ఆధారపడతారు?
5 యెహోవా ప్రకృతికి ఎన్నో నియమాల్ని ఏర్పర్చాడు. అవి ఎప్పటికీ మారవు. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఇంజనీర్లు, పైలట్లు, డాక్టర్లు, మరితరులు తమ పనికి ఆ నియమాలనే ఆధారంగా చేసుకుంటారు. ఉదాహరణకు, మనిషి శరీరంలో గుండె ఎప్పుడూ ఒకే చోట ఉంటుందని డాక్టరుకు తెలుసు కాబట్టి అతను దానికోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు. అంతేకాదు ఎత్తైన ప్రదేశం నుండి దూకితే కిందపడి చనిపోతామని ప్రతీఒక్కరికి తెలుసు. మనం ప్రాణాలతో ఉండాలని కోరుకుంటాం కాబట్టి గురుత్వాకర్షణ శక్తి వంటి ప్రకృతి నియమాలకు విరుద్ధంగా మనం ప్రవర్తించం.
దేవుడు క్రమపద్ధతిలో ఏర్పర్చినవి
6. ప్రజలు తనను ఓ క్రమపద్ధతిలో ఆరాధించాలని యెహోవా కోరుకుంటున్నాడని మనకెలా తెలుసు?
6 యెహోవా ఈ విశ్వాన్ని ఓ క్రమపద్ధతిలో ఉండేలా ఎంతో అద్భుతంగా తయారుచేశాడు. దీన్నిబట్టి, తన ప్రజలు కూడా ఓ క్రమపద్ధతిలో తనను ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడని చెప్పవచ్చు. తనను ఎలా ఆరాధించాలో నేర్పించడానికి యెహోవా బైబిల్ని ఇచ్చాడు. తన బైబిలు ద్వారా, సంస్థ ద్వారా ఆయనిచ్చే నిర్దేశాల్ని పాటిస్తేనే మనం సంతోషంగా, సంతృప్తిగా జీవించగలుగుతాం.
7. బైబిల్ని రాసిన విధానం బట్టి అది ఎలాంటి పుస్తకమని అర్థమౌతుంది?
7 బైబిలు, మనకు దేవుడిచ్చిన సాటిలేని బహుమతి. అయితే బైబిలు కేవలం కొన్ని యూదుల పుస్తకాల, క్రైస్తవుల పుస్తకాల సమాహారమే అని కొంతమంది విద్వాంసులు అంటారు. కానీ నిజానికి బైబిల్లోని పుస్తకాల్ని ఎవరు రాయాలి, ఎప్పుడు రాయాలి, ఏమి రాయాలి వంటి విషయాల్ని దేవుడే నిర్ణయించాడు. అందుకే బైబిల్లోని పుస్తకాలన్నీ దేవుని సందేశాన్ని అర్థంచేసుకోవడానికి మనకు సహాయం చేస్తాయి. ఆదికాండము మొదలుకొని ప్రకటన వరకున్న పుస్తకాలన్నీ, ఈ భూమిని మళ్లీ పరదైసుగా మార్చే ఓ “సంతానం” వస్తుందని చెప్తున్నాయి. అంతేకాదు ఆ సంతానం యేసుక్రీస్తు అని, మనుషులందర్నీ పరిపాలించే హక్కు యెహోవాకు ఉందని ఆయన రాజ్యం రుజువు చేస్తుందని కూడా బైబిలు చెప్తోంది.—ఆదికాండము 3:15; మత్తయి 6:9, 10; ప్రకటన 11:15 చదవండి.
8. ఇశ్రాయేలీయులు క్రమపద్ధతిలో జీవించారని ఎలా చెప్పవచ్చు?
8 ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ చాలా క్రమపద్ధతి గల జనాంగంగా జీవించారు. ఉదాహరణకు మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ప్రత్యక్షపు గుడారం ప్రవేశ ద్వారం దగ్గర సేవ చేయడానికి కొంతమంది స్త్రీలు నియమించబడేవాళ్లు. (నిర్గ. 38:8) అంతేకాదు ఇశ్రాయేలీయులు తమ గుడారాల్ని, ప్రత్యక్ష గుడారాన్ని ఓ చోటు నుండి మరోచోటుకు ఏ విధంగా ఓ క్రమపద్ధతిలో తీసుకెళ్లాలనే విషయంలో కూడా యెహోవా నిర్దేశాలిచ్చాడు. కొంతకాలానికి రాజైన దావీదు, ఆలయంలో కొన్ని పనులు చేయడానికి యాజకులను, లేవీయులను ఏర్పాటుచేశాడు. (1 దిన. 23:1-6; 24:1-3) ఇశ్రాయేలీయులు యెహోవాకు లోబడినంత కాలం ఆయన వాళ్లను దీవించాడు. వాళ్లు క్రమపద్ధతిగా జీవిస్తూ సమాధానాన్ని, ఐక్యతను ఆనందించారు.—ద్వితీ. 11:26, 27; 28:1-14.
9. తొలి శతాబ్దంలోని సంఘాలు ఏ విధంగా క్రమపద్ధతిలో ఉండేవి?
9 తొలి శతాబ్దంలోని సంఘాలు కూడా ఓ క్రమపద్ధతిలో ఉండేవి. సంఘాలకు నిర్దేశాల్ని ఇవ్వడానికి కొంతమంది సహోదరులు ఉండేవాళ్లు అంటే పరిపాలక సభ ఉండేది. మొదట్లో కేవలం అపొస్తలులు మాత్రమే పరిపాలక సభ సభ్యులుగా ఉండేవాళ్లు, కానీ కొంతకాలం తర్వాత ఇతర పెద్దలు కూడా అందులో సభ్యులయ్యారు. (అపొ. 6:1-6; 15:6) సంఘాలకు సలహాల్ని, నిర్దేశాల్ని ఇచ్చే ఉత్తరాల్ని రాయడానికి పరిపాలక సభలోని కొంతమందిని, అలాగే వాళ్లతో కలిసి సన్నిహితంగా పనిచేసిన వాళ్లను యెహోవా ఉపయోగించుకున్నాడు. (1 తిమో. 3:1-13; తీతు 1:5-9) మరి పరిపాలక సభ ఇచ్చిన నిర్దేశాల్ని పాటించడం ద్వారా సంఘాలు ఏవిధంగా ప్రయోజనం పొందాయి?
10. పరిపాలక సభ ఇచ్చిన నిర్దేశాల్ని పాటించడం వల్ల తొలి శతాబ్దంలోని క్రైస్తవులు ఎలాంటి ప్రయోజనం పొందారు? (ప్రారంభ చిత్రం చూడండి.)
10 అపొస్తలుల కార్యములు 16:4, 5 చదవండి. మొదటి శతాబ్దంలో, ‘యెరూషలేములోనున్న అపొస్తలులు, పెద్దలు నిర్ణయించిన విధులను’ అంటే పరిపాలక సభ తీసుకున్న నిర్ణయాల్ని చెప్పడానికి కొంతమంది సహోదరులు సంఘాలను సందర్శించారు. సంఘాలు ఆ నిర్దేశాల్ని పాటిస్తూ, ‘విశ్వాసంలో స్థిరపడి, అనుదినం లెక్కకు విస్తరిస్తూ వచ్చాయి.’ దాన్నుండి నేడు మనమేమి నేర్చుకోవచ్చు? అది మనకు సంఘంలో ఎలా సహాయం చేస్తుంది?
మీరు నిర్దేశాల్ని పాటిస్తున్నారా?
11. దేవుని సంస్థ నుండి ఏదైనా నిర్దేశం వచ్చినప్పుడు బాధ్యతగల సహోదరులు ఏమి చేయాలి?
11 దేవుని సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని బ్రాంచి కమిటీ సభ్యులు, ప్రాంతీయ పర్యవేక్షకులు, సంఘపెద్దలు పాటించాలి. నిజానికి, మనపై నాయకత్వం వహించేవాళ్లకు లోబడాలని దేవుడిచ్చిన బైబిలు మనందరికీ చెప్తోంది. (ద్వితీ. 30:16; హెబ్రీ. 13:7, 17) యెహోవాకు నమ్మకంగా ఉండేవాళ్లు తిరుగుబాటు చేయరు, సంస్థ ఇచ్చే నిర్దేశాలు సరైనవి కావని ఫిర్యాదు చేయరు. తొలి శతాబ్దంలో నాయకత్వం వహిస్తున్న సహోదరుల పట్ల గౌరవం చూపించని దియొత్రెఫేలా మనం ఉండాలనుకోం. (3 యోహాను 9, 10 చదవండి.) సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని పాటించడం ద్వారా సంఘంలో సమాధానం, ఐక్యత ఉండేందుకు సహాయం చేసినవాళ్లమౌతాం. కాబట్టి మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచించాలి, ‘యెహోవాకు నమ్మకంగా ఉండమని తోటి సహోదరసహోదరీల్ని నేను ప్రోత్సహిస్తున్నానా? దేవుని సంస్థ నుండి వచ్చే నిర్దేశాల్ని పాటించడానికి నేను సిద్ధంగా ఉన్నానా?’
12. సంఘ పెద్దల్ని, సంఘ పరిచారకుల్ని ఎవరు నియమిస్తారు?
12 ఉదాహరణకు, పరిపాలక సభ ఈ మధ్య తీసుకున్న ఓ నిర్ణయాన్ని పరిశీలించండి. సంఘ పెద్దల్ని, సంఘ పరిచారకుల్ని నియమించే విధానంలో వచ్చిన మార్పు గురించి 2014, నవంబరు 15 కావలికోట సంచికలోని “పాఠకుల ప్రశ్నలు” అనే ఆర్టికల్ వివరించింది. ఆ ఆర్టికల్ ప్రకారం, మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ, సంఘ పెద్దల్నీ, సంఘ పరిచారకుల్నీ నియమించే అధికారాన్ని ప్రయాణ పర్యవేక్షకులకు ఇచ్చింది. దానికి అనుగుణంగా, 2014 సెప్టెంబరు నుండి ప్రాంతీయ పర్యవేక్షకులే సంఘ పెద్దల్ని, సంఘ పరిచారకుల్ని నియమిస్తున్నారు. ఏదైనా సంఘంలోని పెద్దలు, ఓ సహోదరున్ని సంఘపెద్దగా లేదా సంఘ పరిచారకునిగా చేయాలని సిఫారసు చేస్తే, ప్రాంతీయ పర్యవేక్షకుడు ఆ సహోదరుని గురించి, అలాగే అతని కుటుంబం గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. బహుశా ఆ సహోదరుని గురించి తెలుసుకోవడానికి అతనితో కలిసి పరిచర్య చేయవచ్చు. (1 తిమో. 3:4, 5) ఆ తర్వాత ప్రాంతీయ పర్యవేక్షకుడు, సంఘపెద్దలు కలిసి చర్చించుకుంటారు. సంఘ పెద్దలకు లేదా సంఘ పరిచారకులకు ఉండాల్సిన లేఖనార్హతలను వాళ్లు జాగ్రత్తగా పరిశీలిస్తారు.—1 తిమో. 3:1-10, 12, 13; 1 పేతు. 5:1-3.
13. సంఘపెద్దలు ఇచ్చే నిర్దేశాలకు సహకరిస్తున్నామని మనమెలా చూపించవచ్చు?
13 సంఘ పెద్దలు సంఘాన్ని సంరక్షించి, శ్రద్ధగా చూసుకోవాలని కోరుకుంటారు కాబట్టి బైబిలు నుండి మనకు నిర్దేశాల్ని ఇస్తారు. వాటిని మన మంచి కోసమే ఇస్తారు కాబట్టి వాటిని పాటించాలి. (1 తిమో. 6:3) మొదటి శతాబ్దంలోని కొంతమంది క్రైస్తవులు ఏ పనీ చేయకుండా, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉండేవాళ్లు. పెద్దలు అలాంటి వాళ్లను సరిదిద్దాలనుకున్నారు, కానీ వాళ్లు తమ ప్రవర్తన మార్చుకోవడానికి ఇష్టపడలేదు. అలాంటి వాళ్లతో సంఘంలోని వాళ్లు ఎలా వ్యవహరించాలి? దానిగురించి పౌలు ఏమి చెప్పాడో గుర్తుచేసుకోండి. అతనిలా చెప్పాడు, ‘అతనిని కనిపెట్టి, అతనితో సాంగత్యం చేయకండి.’ అయితే సంఘంలోనివాళ్లు అలాంటి వాళ్లతో సాంగత్యం చేయడం మానేయాలిగానీ వాళ్లను శత్రువుల్లా మాత్రం చూడకూడదు. (2 థెస్స. 3:11-15) నేడు కూడా, దేవుని ప్రమాణాల్ని పాటించని వాళ్లను సరిదిద్దడానికి సంఘపెద్దలు ప్రయత్నిస్తారు. ఉదాహరణకు యెహోవాసాక్షికాని వ్యక్తిని ప్రేమించేవాళ్లకు పెద్దలు సలహా ఇస్తారు. (1 కొరిం. 7:39) ఒకవేళ ఆ వ్యక్తి తన ప్రవర్తనను మార్చుకోవడానికి ఇష్టపడకపోతే, అలాంటి ప్రవర్తన వల్ల సంఘానికి ఎలాంటి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందో వివరించే హెచ్చరికా ప్రసంగాన్ని సంఘంలో ఇవ్వాలని పెద్దలు నిర్ణయించవచ్చు. ఒకవేళ మీ సంఘంలోని పెద్దలు అలాంటి ప్రసంగాన్ని ఇస్తే మీరేమి చేస్తారు? ఆ ప్రసంగాన్ని ఎవరిని ఉద్దేశించి ఇస్తున్నారో మీకు తెలిస్తే మీటింగ్లో, ప్రీచింగ్లో కాకుండా మిగతా సమయాల్లో అతనితో స్నేహం చేయడం మానేస్తారా? అలా చేయడంవల్ల, అతని ప్రవర్తన యెహోవాను సంతోషపెట్టదని అలాగే అతనికి కూడా అది హానిచేస్తుందని గుర్తించడానికి సహాయం చేసిన వాళ్లమౌతాం. అప్పుడు బహుశా అతని ప్రవర్తనలో మార్పు రావచ్చు. [1]
సంఘంలో పవిత్రతను, సమాధానాన్ని, ఐక్యతను కాపాడండి
14. సంఘాన్ని పవిత్రంగా ఉంచడానికి మనమెలా సహాయం చేయవచ్చు?
14 సంఘంలో పవిత్రతను కాపాడాలంటే మనలో ప్రతీఒక్కరం ఏం చేయాలో బైబిలు మనకు చెప్తోంది. కొరింథులో ఏం జరిగిందో ఓసారి పరిశీలించండి. అక్కడున్న సహోదరసహోదరీలంటే పౌలుకు చాలా ఇష్టం. వాళ్లలో ఎంతోమందికి సత్యం కూడా నేర్పించాడు. (1 కొరిం. 1:1, 2) మరి, వాళ్లలో ఒకరు లైంగిక అనైతికతకు పాల్పడ్డారని, అయినాసరే ఆ వ్యక్తిని సంఘంలో ఉండనిస్తున్నారని తెలిసినప్పుడు పౌలుకు ఎలా అనిపించి ఉంటుందో ఒకసారి ఊహించండి. పౌలు అక్కడి సంఘపెద్దలతో, ‘అలాంటి వానిని సాతానుకు అప్పగించండి’ అని చెప్పాడు. వాళ్లు ఆ వ్యక్తిని సంఘం నుండి బయటికి పంపించాలి అంటే బహిష్కరించాలి. (1 కొరిం. 5:1, 4-7, 12) నేడు కూడా సంఘంలో ఎవరైనా తప్పు చేసి పశ్చాత్తాపపడకపోతే అతనిని బహిష్కరించాలని పెద్దలు నిర్ణయించవచ్చు. ఒకవేళ అదే జరిగితే, మనం బహిష్కరించబడిన వాళ్లతో ఎలా ప్రవర్తించాలని లేఖనాలు చెప్తున్నాయో అలానే నడుచుకుంటామా? ఒకవేళ వాటి ప్రకారం నడుచుకుంటే సంఘాన్ని పవిత్రంగా ఉంచడానికి సహాయం చేసినవాళ్లమౌతాం. అంతేకాదు పశ్చాత్తాపపడి, యెహోవాను క్షమాపణ అడగాలని గుర్తించేందుకు అతనికి సహాయం చేసినవాళ్లమౌతాం.
15. సంఘంలో సమాధానాన్ని కాపాడడానికి మనమేమి చేయవచ్చు?
15 కొరింథులో మరో సమస్య తలెత్తింది. కొంతమంది, తమ తోటి సహోదరులను కోర్టుకు ఈడుస్తున్నారు. అలాంటివాళ్లను పౌలు ఇలా అడిగాడు, “అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా?” (1 కొరిం. 6:1-8) నేడు కూడా సంఘంలో కొంతమంది తమ తోటి సహోదరులతో వ్యాపార లావాదేవీలు పెట్టుకుని డబ్బు నష్టపోయి ఉండవచ్చు లేదా వాళ్లు మోసం చేశారని భావించవచ్చు. దాంతో వాళ్లపై కేసులు పెడుతున్నారు. కానీ అలాంటివి జరిగినప్పుడు ప్రజలు యెహోవా గురించి, ఆయన సేవకుల గురించి తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాదు సంఘంలో కూడా సమస్యలు తలెత్తవచ్చు. అయితే మనం డబ్బు నష్టపోయినా తోటి సహోదరులతో సమాధానంగా ఉండాలని అర్థంచేసుకోవడానికి దేవుడిచ్చిన బైబిలు మనకు సహాయం చేస్తుంది. [2] నిజానికి సమస్యల్ని, అభిప్రాయభేదాల్ని ఎలా పరిష్కరించుకోవాలో యేసు మనకు నేర్పించాడు. (మత్తయి 5: 23, 24; 18:15-17 చదవండి.) ఆయనిచ్చిన నిర్దేశాన్ని పాటించినప్పుడు సంఘంలో సమాధానాన్ని, ఐక్యతను కాపాడతాం.
16. దేవుని ప్రజలు ఎందుకు ఐక్యంగా ఉండగలుగుతున్నారు?
16 దేవుడిచ్చిన బైబిలు ఇలా చెప్తోంది, “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” (కీర్త. 133:1) ఇశ్రాయేలీయులు యెహోవాకు లోబడినంత కాలం క్రమబద్ధంగా, ఐక్యంగా ఉన్నారు. ఆయన తన ప్రజల గురించి ముందుగానే ఇలా చెప్పాడు, “గొఱ్ఱెలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేతస్థలములలో వారిని పోగుచేతును.” (మీకా 2:12) అంతేకాదు తన ప్రజలు లేఖనాల నుండి సత్యం నేర్చుకుని తనను ఐక్యంగా ఆరాధిస్తారని కూడా ఆయన ముందే చెప్పాడు. ఆయనిలా అన్నాడు, “అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల నిచ్చెదను.” (జెఫ. 3:9) యెహోవాను ఐక్యంగా ఆరాధించగలుగుతున్నందుకు మనమెంత కృతజ్ఞులమో కదా!
17. సంఘంలో ఎవరైనా ఘోరమైన తప్పు చేస్తే పెద్దలు ఏమి చేయాలి?
17 ఒకవేళ ఎవరైనా ఘోరమైన తప్పు చేస్తే, సంఘపెద్దలు వెంటనే వాళ్లను ప్రేమతో సరిదిద్దాలి. పెద్దలు సంఘాన్ని చెడు ప్రభావాల నుండి సంరక్షించి, సంఘంలోని వాళ్లను ఐక్యంగా, పవిత్రంగా ఉంచాలని యెహోవా కోరుకుంటున్నాడని సంఘపెద్దలకు తెలుసు. (సామె. 15:3) పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను బట్టి చూస్తే, అక్కడున్న సహోదరుల్ని అతను ఎంతో ప్రేమించాడని, అవసరమైనప్పుడు వాళ్లను సరిదిద్దాడని మనకు అర్థమౌతుంది. పౌలు ఇచ్చిన నిర్దేశం ప్రకారం కొరింథు సంఘంలోని పెద్దలు కూడా వెంటనే చర్య తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే అతను తన రెండవ పత్రికలో వాళ్లను మెచ్చుకోవడాన్ని మనం చూస్తాం. కాబట్టి ఎవరైనా సహోదరుడు ‘తెలియక తప్పుదారిలో వెళ్తుంటే’ సంఘపెద్దలు అతన్ని దయగా సరిదిద్దాలి.—గల. 6:1, NW.
18. (ఎ) మొదటి శతాబ్దంలోని సంఘాలకు దేవుని వాక్యంలోని నిర్దేశాలు ఎలా సహాయం చేశాయి? (బి) తర్వాతి ఆర్టికల్లో ఏమి చూస్తాం?
18 మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు దేవుడిచ్చిన బైబిల్లోని నిర్దేశాల్ని పాటించినప్పుడు, వాళ్లున్న సంఘాలు పవిత్రంగా, సమాధానంగా, ఐక్యంగా ఉన్నాయని మనకు స్పష్టంగా అర్థమైంది. (1 కొరిం. 1:10; ఎఫె. 4:11-13; 1 పేతు. 3:8) ఫలితంగా, అప్పటి సహోదరసహోదరీలు “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” సువార్త ప్రకటించగలిగారు. (కొలొ. 1:23) మనకాలంలోని యెహోవా ప్రజలు కూడా ఐక్యంగా, క్రమపద్ధతిగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ల ఏకైక కోరిక సర్వాధిపతియైన యెహోవాను ఘనపర్చడం, ఆయనిచ్చిన బైబిల్లోని నిర్దేశాల్ని పాటించడం అనడానికి మరిన్ని రుజువుల్ని తర్వాతి ఆర్టికల్లో చూస్తాం.—కీర్త. 71:15, 16.