కంటెంట్‌కు వెళ్లు

జీవితంలో నేనేం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు?

జీవితంలో నేనేం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు?

బైబిలు ఇచ్చే జవాబు

 మీరు తన గురించి తెలుసుకుని తనకు దగ్గరై, పూర్ణహృదయముతో ప్రేమిస్తూ సేవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. (మత్తయి 22:37, 38; యాకోబు 4:8) అయితే దేవుడు కోరుతున్నట్లుగా ఎలా జీవించాలో యేసు జీవితం, ఆయన బోధల నుండి నేర్చుకోవచ్చు. (యోహాను 7:16, 17) మనుషులు ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడో యేసు కేవలం చెప్పడమే కాదు, అలా జీవించాడు కూడా. నిజానికి అదే తన జీవిత సంకల్పమని చెప్తూ “నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే” వచ్చాను అని యేసు అన్నాడు.—యోహాను 6:38.

నా విషయంలో దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి నాకు ఒక ప్రత్యేకమైన సూచన, దర్శనం లేదా అద్భుతం అవసరమా?

 లేదు, ఎందుకంటే దేవుడు మనుషులందరికీ బైబిలు ద్వారా తన సందేశాన్ని ఇచ్చాడు. మీరు ‘ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండడానికి’ ఏమి అవసరమో అందులో ఉంది. (2 తిమోతి 3:16, 17) మీ విషయంలో దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి మీకున్న ‘పరీక్షించి తెలుసుకొనే’ సామర్థ్యంతోపాటు బైబిల్ని కూడా ఉపయోగించాలని దేవుడు కోరుకుంటున్నాడు.—రోమీయులు 12:1, 2; ఎఫెసీయులు 5:17.

నేను నిజంగా దేవుడు కోరుతున్నట్లుగా జీవించగలనా?

 ఖచ్ఛితంగా జీవించగలరు. ఎందుకంటే “ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని బైబిలు చెప్తుంది. (1 యోహాను 5:3) అంటే దాని అర్థం దేవుని ఆజ్ఞలు పాటించడం అన్నిసార్లు సులభమని కాదు. అయితే వాటిని పాటించడం కోసం మీరు చేసే కృషి కంటే ఎన్నోరెట్లు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. “దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని” యేసే స్వయంగా చెప్పాడు.—లూకా 11:28.