కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇలాంటి భావాలు సహజమేనా?

ఇలాంటి భావాలు సహజమేనా?

ప్రియమైన వారిని పోగొట్టుకున్న ఒక వ్యక్తి ఇలా వ్రాస్తున్నాడు: “నా చిన్నతనంలో మేము ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు, నా భావాలను బయటికి వ్యక్తం చేయకూడదని నాకు నేర్పించబడింది. నాకేదైనా బాధ కలిగినప్పుడు, ‘ఏడవద్దు!’ అంటూ మాజీ సైనికుడైన మా నాన్న పళ్లు బిగబట్టి నాతో చెప్పడం ఇంకా గుర్తుంది. మా అమ్మ నన్ను నా తోబుట్టువులను (మేము మొత్తం నలుగురం) ఎన్నడైనా ప్రేమగా ముద్దుపెట్టుకున్నట్లు లేదా దగ్గరికి తీసుకున్నట్లు నాకు జ్ఞాపకంలేదు. మా నాన్న చనిపోయేటప్పటికి నాకు 56 సంవత్సరాలు. ఆయన మరణం నన్ను బాగా కృంగదీసింది. అయినప్పటికీ మొదట నేను ఏడవలేకపోయాను.”

కొన్ని సంస్కృతుల్లో ప్రజలు తమ భావాలను బాహాటంగా వ్యక్తంచేస్తారు. వాళ్లు సంతోషంగావున్నా దుఃఖిస్తున్నా, వాళ్ల భావాలేమిటో ఇతరులకు తెలిసిపోతాయి. మరో వైపున, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో, ముఖ్యంగా ఉత్తర ఐరోపా బ్రిటన్‌లలోని ప్రజలు, ప్రత్యేకించి మగవాళ్లు, తమ భావాలను దాచుకోవాలని, తమ భావోద్రేకాలను అణచుకోవాలని, ఏమీ బాధలేనట్లే మౌనంగా ఉండాలని, తమ దుఃఖాన్ని బహిరంగంగా వ్యక్తంచేయకూడదని వారికి నేర్పించబడుతుంది. అయితే, మీరు మీ ప్రియమైనవారిని పోగొట్టుకున్నప్పుడు మీ దుఃఖాన్ని వ్యక్తపరచడంలో తప్పేమైనా ఉందా? దీని గురించి బైబిలేమి చెబుతోంది?

బైబిల్లోని దుఃఖించినవారి ఉదాహరణలు

బైబిలును తూర్పు మధ్యధరా ప్రాంతానికి చెందిన హెబ్రీయులు వ్రాశారు, వారు తమ భావాలను వ్యక్తంచేసే ప్రజలు. దుఃఖాన్ని బహిరంగంగా వ్యక్తం చేసిన వ్యక్తుల అనేక ఉదాహరణలు దానిలో ఉన్నాయి. దావీదు రాజు హత్యచేయబడిన తన కుమారుడైన అమ్నోను గురించి ప్రలాపించాడు. వాస్తవానికి ఆయన ‘బహుగా ఏడ్చాడు.’ (2 సమూయేలు 13:28-39) రాజరికాన్ని అన్యాయంగా చేజిక్కించుకోవడానికి ప్రయత్నించిన విశ్వాసఘాతకుడైన తన కుమారుడు అబ్షాలోము చనిపోయినప్పుడు కూడా ఆయన ఏడ్చాడు. బైబిలు వృత్తాంతం మనకిలా చెబుతోంది: “అప్పుడు రాజు [దావీదు] బహు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కి పోయి యేడ్చుచు, సంచరించుచు—నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, అని కేకలువేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.” (2 సమూయేలు 18:33) సాధారణంగా అందరి తండ్రుల్లాగే దావీదు కూడా ఏడ్చాడు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బదులు తామే చనిపోయుండాల్సిందని ఎన్నిసార్లు అనుకోరు! తల్లిదండ్రులకంటే ముందు బిడ్డ చనిపోవడం చాలా అసహజంగా అనిపిస్తుంది.

యేసు తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు ఎలా స్పందించాడు? లాజరు సమాధిని సమీపిస్తున్నప్పుడు యేసు ఏడ్చాడు. (యోహాను 11:30-38) యేసు సమాధిని సమీపిస్తున్నప్పుడు మగ్దలేనే మరియ ఏడ్చింది. (యోహాను 20:11-16) నిజమే, బైబిల్లోని పునరుత్థాన నిరీక్షణ గురించి అవగాహనవున్న క్రైస్తవులు, మృతుల స్థితికి సంబంధించి తమ నమ్మకాలకు ఖచ్చితమైన బైబిలు ఆధారం లేనివారు దుఃఖించినట్లు ఓదార్చడానికి వీల్లేనంతగా దుఃఖించరు. అయితే పునరుత్థాన నిరీక్షణ ఉన్నప్పటికీ, నిజ క్రైస్తవులు తమ ప్రియమైన వారెవరైనా చనిపోయినప్పుడు సహజ భావాలుగల మానవుల్లాగే దుఃఖిస్తారు, ఏడుస్తారు.—1 థెస్సలొనీకయులు 4:13, 14.

ఏడ్వవచ్చా, ఏడ్వకూడదా?

నేడు మన ప్రతిస్పందనల విషయమేమిటి? మీ భావాలను వ్యక్తం చేయడం కష్టంగా, ఇబ్బందికరంగా ఉందా? సలహాదారులు ఏమి చెప్తున్నారు? వాళ్ళ ఆధునిక దృక్పథాలు ఎక్కువగా బైబిలులోని ప్రాచీన దైవప్రేరేపిత జ్ఞానాన్నే ప్రతిబింబిస్తాయి. మనం మన దుఃఖాన్ని వ్యక్తంచేయాలే తప్ప దాన్ని అణచుకోకూడదని వాళ్లు చెబుతారు. ఇది మనకు యోబు, దావీదు, యిర్మీయా వంటి పూర్వకాల విశ్వాసులను గుర్తుచేస్తుంది, వాళ్ళు తమ దుఃఖాన్ని ఎలా వెలిబుచ్చారో మనం బైబిలులో చూస్తాం. వాళ్లు తమ దుఃఖాన్ని దిగమింగుకోలేదు. కాబట్టి, మీరు ప్రజలకు దూరంగా ఉండడం మంచిది కాదు. (సామెతలు 18:1) దుఃఖం విభిన్న సంస్కృతుల్లో విభిన్న రీతుల్లో వ్యక్తం చేయబడుతుంది, అది సాధారణ మతనమ్మకాలపై కూడా ఆధారపడి ఉంటుంది. *

మీకు ఏడ్వాలనిపిస్తే అప్పుడెలా? ఏడవడం మానవ నైజం. లాజరు చనిపోయిన సందర్భాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకోండి, అప్పుడు యేసు ‘కలవరపడి ఆత్మలో మూలుగుచు కన్నీళ్లు విడిచాడు.’ (యోహాను 11:33, 35) ఆ విధంగా యేసు, ప్రియమైనవారు చనిపోయినప్పుడు ఏడవడం సహజమేనని చూపించాడు.

ప్రియమైనవారు చనిపోయినప్పుడు దుఃఖించడం, ఏడవడం సహజమే

యాన్‌ అనే ఒక తల్లి అనుభవం కూడా ఏడవడం సహజమేనని చూపిస్తోంది. ఆమె కూతురు రేచెల్‌ SIDS (సడన్‌ ఇన్‌ఫెంట్‌ డెత్‌ సిండ్రోమ్‌) అనే వ్యాధితో చనిపోయింది. ఆమె భర్త ఇలా అన్నాడు: “ఆశ్చర్యకరమైన సంగతేమిటంటే, అంత్యక్రియలప్పుడు నేను, యాన్‌ ఏడవలేదు. మిగతావారందరూ ఏడ్చారు.” యాన్‌ ఇలా అంటోంది: “అది నిజమే, అప్పుడు నేను ఏడవలేదు, కాని ఆ తర్వాత నేను బాగా ఏడ్చాను. ఆ విషాదం జరిగిన కొన్ని వారాల తర్వాత నేనొక రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నా భావోద్రేకాలను నేనిక అణచుకోలేకపోయాను. నేను ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. అయితే అలా ఏడవడం నాకు సహాయపడిందనే నేను నమ్ముతున్నాను. నాకెంతో ఉపశమనం కలిగింది. ఇలా ఏడవకపోయుంటే నా బాధ తగ్గేదే కాదు. కాబట్టి దుఃఖిస్తున్న వాళ్ళను ఏడవనివ్వడం మంచిదని నేను నిజంగా నమ్ముతున్నాను. ఇతరులు ‘ఏడవద్దు’ అని చెప్పడం సహజమే అయినా, అలా చెప్పడం వల్ల ప్రయోజనమేమీ ఉండదు.”

కొందరు స్పందించే విధానం

ప్రియమైనవారిని పోగొట్టుకొని ఒంటరి వారైనప్పుడు కొందరెలా స్పందించారు? ఉదాహరణకు, వెనీట విషయమే తీసుకోండి. బిడ్డను పోగొట్టుకున్న బాధ అంటే ఏమిటో ఆమెకు తెలుసు. ఆమెకు ఐదుసార్లు గర్భస్రావమయ్యింది. అయితే ఆమె మళ్ళీ గర్భవతి అయ్యింది. కారు ప్రమాదంవల్ల ఆసుపత్రి పాలైనప్పుడు, ఆమె సహజంగానే కలవరపడింది. రెండు వారాల తర్వాత, నెలలు నిండకముందే ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఆమె ఒక కిలో బరువైనా లేని చిన్నారి వెనీస్సకు జన్మనిచ్చింది. వెనీట ఇలా గుర్తుచేసుకుంటోంది: “చివరకు నేను తల్లినయ్యానని ఎంతో ఉప్పొంగిపోయాను.”

కానీ ఆమె సంతోషం ఎన్నో రోజులు నిలువలేదు. నాలుగు రోజుల తర్వాత వెనీస్స చనిపోయింది. వెనీట ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “నాకంతా శూన్యంగా అనిపించింది. నేను మాతృత్వాన్ని కోల్పోయాను. నాకు వెలితిగా అనిపించింది. మేము వెనీస్స కోసమని సిద్ధం చేసిన గదికివచ్చి, తన కోసం కొన్న చిన్న చిన్న జుబ్బాలు చూసేసరికి నా గుండె తరుక్కుపోయింది. ఆ తర్వాత రెండు నెలల వరకు, అదే నా కళ్లలో మెదిలేది. ఇంకెవరినీ కలవడం నాకు ఇష్టమనిపించేది కాదు.”

అది విపరీతమైన ప్రతిస్పందనా? ఇతరులు దానిని అర్థంచేసుకోవడం కష్టమే, కానీ వెనీటలాగే దుఃఖం అనుభవించిన వాళ్లు, కొద్దికాలం బ్రతికినవారు చనిపోయినప్పుడు ఎంత దుఃఖం కలుగుతుందో, అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయినప్పుడు కూడా అంతే దుఃఖం కలుగుతుందని అన్నారు. బిడ్డ జన్మించక ముందునుంచే తల్లిదండ్రులు ఆ బిడ్డను ప్రేమిస్తారని వాళ్లు చెబుతున్నారు. తల్లితో ఆ బిడ్డకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. చనిపోయింది పసిబిడ్డే అయినా తల్లి మాత్రం ఒక వ్యక్తి చనిపోయినట్లే భావిస్తుంది. ఇతరులు అర్థంచేసుకోవలసింది ఆ విషయాన్నే.

కోపం, అపరాధభావం మీపై ఎలా ప్రభావం చూపించవచ్చు

పుట్టడమే గుండె జబ్బుతో పుట్టిన తన ఆరేళ్ల కొడుకు అకస్మాత్తుగా చనిపోయాడని చెప్పినప్పుడు ఒక తల్లి తన భావాలను ఇలా వ్యక్తం చేసింది: “నాలో పరిపరి విధాల స్పందనలు కలిగాయి, శరీరం మొద్దుబారినట్లయ్యేది, అపనమ్మకం, అపరాధభావం, బిడ్డ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో గ్రహించనందుకు నా భర్తమీద, డాక్టరుమీద కోపం వచ్చేది.”

కోపం దుఃఖానికి మరొక సూచన. అది చనిపోయిన వ్యక్తిని డాక్టర్లు, నర్సులు ఇంకా ఎక్కువ శ్రద్ధగా చూసుకొని ఉండాల్సిందని భావిస్తూ వారిపై కోపగించుకోవడం కావచ్చు. లేదా స్నేహితులు, బంధువులు ఏదో తప్పు మాట్లాడినట్లు లేదా ఏదో తప్పు చేసినట్లు అనిపించడం వల్ల వచ్చే కోపం కావచ్చు. మరికొందరికి, తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాడని చనిపోయిన వ్యక్తి మీదే కోపం రావచ్చు. స్టెల్లా ఇలా జ్ఞప్తికి తెచ్చుకుంటోంది: “నాకు నా భర్త మీద చాలా కోపమొచ్చింది, ఎందుకంటే ఆయన జాగ్రత్తలు తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని నాకు తెలుసు. ఆయన తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు, అయినా డాక్టరు హెచ్చరికలను పట్టించుకోలేదు.” ఒక వ్యక్తి చనిపోవడం బ్రతికివున్న తన వారిపై తీసుకొచ్చే భారాన్నిబట్టి కూడా కొన్నిసార్లు ఆ చనిపోయిన వ్యక్తిపై కోపం రావచ్చు.

బిడ్డను కోల్పోవడం తీవ్రమైన మానసిక వేదన కలిగిస్తుంది —నిజమైన సానుభూతి, తదనుభూతి తల్లిదండ్రులకు సహాయపడవచ్చు

కొందరికి కోపం కారణంగా అపరాధభావం కలుగవచ్చు అంటే వారు తమనుతాము నిందించుకోవడానికి తమ కోపమే కారణం కావచ్చు. మరికొందరు తమ ప్రియమైనవారు చనిపోవడానికి తామే కారణమని నిందించుకుంటారు. “ఆయన్ను నేను త్వరగా డాక్టరు దగ్గరికి తీసుకొనివెళ్లుంటే,” లేదా “మరొక డాక్టరు దగ్గరికి తీసుకువెళ్లుంటే,” లేదా “తన ఆరోగ్యం గురించి మంచి శ్రద్ధ తీసుకొనేలా చేసుంటే, ఆయన చనిపోయి ఉండే వారుకాదు,” అని అనుకుంటారు.

మరికొందరిలో, తమ ప్రియమైనవారు హఠాత్తుగా, అనుకోకుండా చనిపోయినప్పుడు అపరాధభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చనిపోయిన వ్యక్తిని తాము గతంలో కోపగించుకున్న లేదా అతనితో వాదించిన సందర్భాలు జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెడతారు. లేదా చనిపోయిన వ్యక్తికి తాము చేయగలిగినదంతా చేయలేకపోయామని వాళ్ళు భావించవచ్చు.

చాలామంది తల్లులు ఎక్కువకాలంపాటు దుఃఖించడం అనేకమంది నిపుణులు చెప్పే విషయాన్నే బలపరుస్తోంది, అదేమిటంటే బిడ్డను కోల్పోవడం తల్లిదండ్రుల జీవితంలో, ప్రత్యేకించి తల్లి జీవితంలో శాశ్వతమైన వెలితిని కలిగిస్తుంది.

జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు

జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు మరో రకమైన మానసిక వేదన ఉంటుంది, ముఖ్యంగా ఆ ఇద్దరూ అన్యోన్య దంపతులైతే ఆ వేదన మరింత తీవ్రంగా ఉంటుంది. ఇప్పటి వరకు కలిసి చేసిన ప్రయాణాలు, పనులు, కలిసి ఆనందించడం, ఒకరిపై మరొకరు ఆధారపడడం వంటివి ఇక ఉండవు కాబట్టి జీవితమంతా శూన్యంగా మారినట్లు అనిపించవచ్చు.

యూనిస్‌ తన భర్త గుండెపోటుతో హఠాత్తుగా మరణించినప్పుడు ఏం జరిగిందో ఈ విధంగా వివరిస్తోంది: “మొదటివారం నేను చలనమేలేనట్లు భావోద్రేకంగా మొద్దుబారిన స్థితిలో ఉన్నాను. నేను కనీసం రుచి, వాసన కూడా చూడలేకపోయాను. అయినా, నేను కొంతవరకు ఆలోచించగల స్థితిలోనే ఉన్నాను. ఎందుకంటే వారు మందులు ఇస్తూ, కృత్రిమ శ్వాసను అందిస్తూ నా భర్తను మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను ఆయనతోనే ఉన్నాను. నాకు అందరిలా అపనమ్మకపు భావాలు కలగలేదు. అయినా ఒక కారు కొండ మీది నుండి క్రిందికి జారిపోతుంటే చూస్తూ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు, తీవ్ర నిరాశాభావం నాలో చోటుచేసుకుంది.”

ఆమె ఏడ్చిందా? “అవును, నేను ఏడ్చాను, ముఖ్యంగా నాకు అందిన వందలకొద్ది ఓదార్పు కార్డులు చదివినప్పుడు నేను ఏడ్చాను. ప్రతి కార్డు చదివి ఏడ్చాను. అలా ఏడవడం ఆ రోజంతా మామూలుగా గడపడానికి నాకు సహాయం చేసింది. కానీ నీకేమనిపిస్తోందని ఇతరులు నన్ను పదేపదే అడిగినప్పుడు నేను దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను.”

ఆ దుఃఖాన్ని దిగమింగడానికి యూనిస్‌కు ఏమి సహాయం చేసింది? “నేను నాకు తెలియకుండానే, నా జీవితాన్ని కొనసాగించాలని తీర్మానించుకున్నాను. కానీ జీవితాన్ని ఎంతో ప్రేమించిన నా భర్త, దాన్ని అనుభవించడానికి ఇక్కడ లేడనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా నాకిప్పటికీ ఎంతో బాధ కలుగుతుంది” అని ఆమె చెబుతోంది.

“ఇతరులు మిమ్మల్ని నిర్దేశించేందుకు అనుమతించకండి . . . ”

లీవ్‌టేకింగ్‌—వెన్‌ అండ్‌ హౌ టు సే గుడ్‌బై అనే పుస్తక రచయితలు ఇలా సలహా ఇస్తున్నారు: “మీరెలా ప్రవర్తించాలి లేదా భావించాలి అనే విషయంలో ఇతరులు మిమ్మల్ని నిర్దేశించేందుకు అనుమతించకండి. దుఃఖ ప్రక్రియ ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. మీరు విపరీతంగా దుఃఖిస్తున్నారనో అంతగా దుఃఖించడం లేదనో ఇతరులు అనుకోవచ్చు—తాము అలా అనుకుంటున్నామని మీకు తెలియజేయవచ్చు కూడా. వాళ్ళను క్షమించి, దానిని మరచిపోండి. ఇతరులు లేదా సమాజము కల్పించిన వాటికి కట్టుబడివుండాలని ప్రయత్నిస్తే మీ మానసిక ఆరోగ్యం కుదుటపడకుండా మీరే అడ్డుతగిలిన వారవుతారు.”

నిజమే, వివిధ ప్రజలు వివిధ రీతుల్లో తమ దుఃఖాన్ని ఓర్చుకుంటారు. ఒక వ్యక్తికి ఫలాని విధానమే మంచిదని మేము సూచించడం లేదు. అయితే దుఃఖపరిస్థితిలో ఉన్న వ్యక్తిలో స్తబ్దత ఏర్పడినప్పుడు అంటే ఆయన జరిగిన వాస్తవాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రమాదం ఏర్పడుతుంది. అలాంటప్పుడు కనికరంగల స్నేహితుల నుండి సహాయం అవసరమవుతుంది. బైబిలిలా చెబుతోంది: “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.” కాబట్టి సహాయమడగడానికి, మాట్లాడడానికి, దుఃఖించడానికి భయపడవద్దు.—సామెతలు 17:17.

ప్రియమైన వారిని పోగొట్టుకున్నందుకు దుఃఖించడం సాధారణ స్పందనే, ఇతరుల ముందు దుఃఖించడంలో తప్పేమీ లేదు. అయితే ఇంకా ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి: ‘నేను దుఃఖభారంతో ఎలా జీవించగలను? అపరాధభావాలు కలగడం, కోపం రావడం సహజమేనా? ఈ ప్రతిస్పందనలతో నేనెలా వ్యవహరించాలి? ఆ లోటును, ఆ దుఃఖాన్ని అధిగమించడానికి నాకేమి సహాయపడగలదు?’ వీటితోపాటు, ఇతర ప్రశ్నలకు తర్వాతి భాగం సమాధానం చెబుతుంది.

^ ఉదాహరణకు, నైజీరియాలోని యెరుబా ప్రజల్లో, ఆత్మ తిరిగి జన్మిస్తుందనే సాంప్రదాయక విశ్వాసం ఉంది. కాబట్టి ఒక తల్లి తన బిడ్డను కోల్పోయినప్పుడు, ఎంతో దుఃఖించినప్పటికీ ఆమె అలా ఎక్కువ రోజులు దుఃఖించదు. ఎందుకంటే ఒక యెరుబా గేయంలోని పల్లవి ఇలా ఉంది: “ఒలికింది నీళ్ళు మాత్రమే. కుండ భద్రంగానే ఉంది.” యెరుబా వాళ్ళ ఉద్ధేశం ప్రకారం, కుండ భద్రంగానే ఉంది అంటే తల్లి, మరొక బిడ్డను కనవచ్చు—బహుశా చనిపోయిన బిడ్డనే తిరిగి కనవచ్చు. యెహోవాసాక్షులు బైబిలు ఆధారితం కాని అమర్త్యమైన ఆత్మ, పునర్జన్మ వంటి తప్పుడు సిద్ధాంతాల నుండి పుట్టుకువచ్చే మూఢనమ్మకాలపై ఆధారపడిన ఎలాంటి ఆచారాలను అనుసరించరు.—కీర్తన 146:3, 4; ప్రసంగి 9:5, 10.