మనవాళ్లు చనిపోతే కలిగే బాధ ఎలా ఉంటుంది?
మనవాళ్లు చనిపోయినప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుంది?
చనిపోయిన వాళ్ల గురించి బాధపడుతున్నప్పుడు కలిగే భావాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఒక క్రమంలో వస్తూ ఉంటాయని, ప్రతీ ఒక్కరు వాళ్ల ప్రత్యేకమైన పద్ధతిలో బాధపడుతూ ఉంటారని నిపుణులు చెప్తుంటారు. బాధను అందరూ ఒకేలా చూపించరు కాబట్టి కొంతమందికి చనిపోయినవాళ్ల గురించిన బాధ తక్కువగా ఉంటుందని లేదా వాళ్ల భావాలను “లోపల అణచి” వేసుకుంటారని అనగలమా? అనలేం. నిజమే మనసులో ఉన్న బాధను అర్థం చేసుకోవడం, దాన్ని బయటకు చూపించడం వల్ల కాస్త ఉపశమనం ఉండొచ్చు, కాని దుఃఖించడానికి “సరైన పద్ధతి” ఇదే అంటూ ఏదీ లేదు. చాలామంది బాధపడే విధానం వాళ్ల సంస్కృతి, వ్యక్తిత్వం, జీవిత అనుభవాలు, తమవాళ్లు ఎలా చనిపోయారు అనే దాన్నిబట్టి ఉంటుంది.
బాధ ఎలా ఉంటుంది?
తమవాళ్లు చనిపోయిన బాధలో ఉన్నవాళ్లకు తర్వాత్తర్వాత ఎలా ఉంటుందనేది వాళ్లు తెలుసుకోలేకపోవచ్చు. కానీ కొన్ని భావోద్వేగాలు, సమస్యలు సాధారణంగా ఉంటాయి. వాటిని తెలుసుకోవచ్చు. క్రింది వాటిని పరిశీలించండి:
మానసికంగా బాగా కృంగిపోవచ్చు. మాటిమాటికి ఏడ్వడం, చనిపోయినవాళ్లను గుర్తుచేసుకుంటూ ఉండడం, ఉన్నట్టుండి మానసిక స్థితి మారిపోవడం జరుగుతుంటుంది. కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాల వల్ల, కలలు రావడం వల్ల కూడా ఆ బాధ ఇంకా ఎక్కువైపోవచ్చు. కానీ మొదట్లో మాత్రం అయోమయంగా, ఏమి అర్థం కాని స్థితిలో, నమ్మలేని స్థితిలో ఉండిపోవచ్చు. టినా అనే ఆమె భర్త ఆకస్మికంగా చనిపోయినప్పుడు తనకు ఎలా అనిపించిందో జ్ఞాపకం చేసుకుంటూ టినా ఇలా చెప్తుంది: “మొదట్లో నేను ఏమి అర్థం కానట్లుగా ఉండిపోయాను. కనీసం నేను ఏడ్వలేదు కూడా. కొన్నిసార్లు పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదంటే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోయేది. జరిగిన దాన్ని అస్సలు నమ్మలేకపోయాను.”
ఆందోళన, కోపం, మిమ్మల్ని మీరు నిందించుకోవడం సహజమే. “మా 24 సంవత్సరాల కొడుకు ఎరిక్ చనిపోయిన కొంతకాలం వరకు నేనూ, నా భార్య యోలాండా చాలా కోపంగా ఉండేవాళ్లం! అది మాకే చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే మేము అంతకుముందు అంత కోపంగా లేమనుకుంటా. మా కొడుకు కోసం ఇంకా ఏమైనా చేసి ఉండాల్సిందా అని ఆలోచించినప్పుడు మేము ఏదో తప్పు చేశామని మాకు అనిపించేది” అని ఐవన్ అనే అతను చెప్తున్నాడు. ఆలయాండ్రో అనే అతని భార్య దీర్ఘకాలిక జబ్బుతో చనిపోయింది. ఆయన కూడా అలాగే నిందించుకునేవాడు: “నేను ఇంతగా బాధపడేలా దేవుడు అనుమతించాడంటే నేను తప్పకుండా చెడ్డవాన్ని అయ్యి ఉంటాను అని మొదట అనిపించింది, తర్వాత జరిగిన దానికి దేవుని మీద అభాండం వేస్తున్నానేమో అని నన్ను నేను నిందించుకున్నాను.” ముందు ఆర్టికల్‌లో మాట్లాడుకున్న శ్రీధర్ ఇలా చెప్తున్నాడు: “కొన్నిసార్లు సోఫియా చనిపోయినందుకు నాకు ఆమెమీద కోపం వచ్చేది. తర్వాత అలా అనుకున్నందుకు నాకు బాధేసేది. ఎంతైనా అది ఆమె తప్పు కాదు కదా.”
బాధలో ఉన్నప్పుడు సరిగ్గా ఆలోచించలేరు. అప్పుడప్పుడు ఆలోచనలు అర్థంపర్థం లేకుండా, పిచ్చిగా ఉంటాయి. ఉదాహరణకు, ప్రేమించేవాళ్లను పోగొట్టుకున్న బాధలో ఉన్నవాళ్లకు, చనిపోయిన వాళ్ల మాటలు వినిపిస్తున్నట్లు, వాళ్లు మాట్లాడుతున్నట్లు, వాళ్లకు అన్నీ తెలుస్తున్నట్లు అనిపించవచ్చు. లేదా బాధలో ఉన్నవాళ్లు దేనిమీద మనసు సరిగ్గా నిలుపలేకపోవచ్చు లేదా గుర్తుపెట్టుకోవడం కూడా కష్టంగా ఉండవచ్చు. టినా ఇలా చెప్తుంది: “కొన్నిసార్లు నేను మాట్లాడుతూనే ఉంటాను, కానీ నా మనసు అక్కడ ఉండదు. టిమో చనిపోయినప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ మనసులో చాలా కంగారుగా అనిపిస్తుంది. అలా ధ్యాస పెట్టలేకపోవడం ఇంకా బాధ కలిగిస్తుంది.”
ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. తమవాళ్లను పోగొట్టుకున్న వాళ్లకు నలుగురి మధ్యలో ఉండడానికి చిరాకుగా లేదా ఇబ్బందిగా ఉండవచ్చు. శ్రీధర్ ఇలా అంటున్నాడు: “పెళ్లైనవాళ్ల మధ్యలో ఉన్నప్పుడు అనవసరంగా ఉన్నానని నాకు అనిపించేది, అలాగని పెళ్లికాని వాళ్ల మధ్య కూడా ఉండలేకపోయేవాడిని.” ఐవన్ భార్య యోలాండా ఇలా గుర్తుచేసుకుంటుంది: “మాకున్న సమస్యలకన్నా చిన్న సమస్యల గురించి ఎవరైనా చెప్పుకుంటుంటే వాళ్లతో ఉండడం చాలా కష్టంగా ఉండేది. అంతేకాదు కొంతమంది వాళ్ల పిల్లలు ఎంత బాగా ఉంటున్నారో కూడా చెప్తూ ఉంటారు. వాళ్ల గురించి సంతోషంగా ఉండేది కానీ అదే సమయంలో వాళ్లు చెప్పేది వినడం కష్టంగా ఉండేది. జీవితం ముందుకు సాగుతుంది కానీ నాకూ, నా భర్తకు జీవించాలనే ఆశ గానీ, జీవించడానికి కావాల్సిన ఓపిక గానీ లేదు అని అనిపించేది.”
ఆరోగ్య సమస్యలు. తినడంలో, నిద్రపోవడంలో, శరీర బరువులో మార్పులు వస్తాయి. ఏరన్, వాళ్ల నాన్న చనిపోయిన తర్వాతి సంవత్సరాన్ని గుర్తుచేసుకుంటున్నాడు: “నాకు నిద్ర పట్టడం కష్టంగా ఉండేది. ప్రతిరోజూ సరిగ్గా ఒకే సమయానికి నిద్ర లేచి మా నాన్న మరణం గురించి ఆలోచించేవాడిని.”
ఆలయాండ్రో అర్థంకాని ఆరోగ్య సమస్యలతో బాధపడేవాడు. అతను ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “చాలాసార్లు డాక్టర్ దగ్గరకు వెళ్లేవాడిని కానీ, నేను ఆరోగ్యంగానే ఉన్నానని డాక్టర్లు చెప్పేవాళ్లు. బాధవల్ల నాకు ఇలా అనిపిస్తుందని నేను అనుకున్నాను.” చివరకు ఆ లక్షణాలు పోయాయి. కానీ డాక్టర్‌కు చూపించుకోవాలనే ఆలయాండ్రో ఆలోచన మంచిదే. దుఃఖం మన వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది, ఇంతకముందు ఉన్న ఆరోగ్య సమస్యలను ఇంకా పెంచుతుంది లేదా కొత్త రోగాలను తెచ్చిపెడుతుంది.
ముఖ్యమైన పనులు కూడా సరిగ్గా చేయలేము. ఐవన్ ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “ఎరిక్ చనిపోయాక బంధువులకు, స్నేహితులకే కాదు ఇంకా చాలామందికి, అంటే అతని ఇంటి యజమానికి, అతని బాస్‌కి కూడా ఆ వార్త చెప్పాల్సి వచ్చింది. చట్టపరమైన చాలా డాక్యుమెంట్లు పూర్తి చేయాల్సి వచ్చింది. తర్వాత ఎరిక్ వస్తువులు చూడాల్సి వచ్చింది. మానసికంగా, శారీరకంగా, భావోద్వేగంగా బాగా అలసిపోయిన సమయంలో చాలా ఏకాగ్రతతో ఇవన్నీ చేయాల్సి వచ్చింది.”
కొంతమందికి నిజమైన పరీక్ష తర్వాత్తర్వాత ఉంటుంది, తమ ప్రియమైనవాళ్లు చనిపోకముందు చేసిన పనుల్ని వీళ్లు చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. టినాకు కూడా అలాగే జరిగింది. ఆమె ఇలా అంటుంది: “మా బ్యాంకుకి సంబంధించిన పనులు, వ్యాపారానికి సంబంధించిన పనులు ఎప్పుడూ టిమో చూసుకునేవాడు. ఇప్పుడు ఆ పనులు నేను చేస్తున్నాను, అవి నా ఒత్తిడిని ఇంకా పెంచినట్లు నాకు అనిపిస్తుంది. ఏ పొరపాటు జరగకుండా అవన్నీ నేను సరిగ్గా చేయగలనా? అనిపించేది.”
పైన చెప్పిన సమస్యలు చూసినప్పుడు దుఃఖాన్ని తట్టుకోవడం ఎంత కష్టమో తెలుస్తుంది. నిజం చెప్పాలంటే, ప్రేమించేవాళ్లు చనిపోయాక కలిగే బాధ చాలా ఎక్కువగా ఉండొచ్చు, ఈ మధ్య కాలంలో ప్రియమైనవాళ్లను పోగొట్టుకుని బాధపడుతున్న వాళ్లకు ఈ విషయం తెలిసి ఉంటే మంచిది. దుఃఖం వల్ల వచ్చే అన్నీ పరిణామాలను అందరూ అనుభవించరని కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, ప్రేమించేవాళ్లు చనిపోయినప్పుడు కలిగే తీవ్రమైన బాధ సహజమే అని తెలుసుకోవడం వల్ల బాధపడేవాళ్లు కొంతవరకు ధైర్యంగా ఉండవచ్చు.
మళ్లీ నేను సంతోషంగా ఉండగలనా?
ఏమి జరగవచ్చు: దుఃఖం తీవ్రత ఎప్పుడూ అలాగే ఉండిపోదు; మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. అలాగని వాళ్లు పూర్తిగా “కోలుకుంటారు” లేదా మరణించిన వాళ్లను పూర్తిగా మర్చిపోతారు అని చెప్పలేం. అయితే కొద్దికొద్దిగా దుఃఖం తీవ్రత తగ్గుతుంది. కొన్ని విషయాలు గుర్తు వచ్చినప్పుడు లేదా పెళ్లి రోజు, చనిపోయిన రోజు లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మళ్లీ అలాంటి బాధ కలగవచ్చు. కానీ కొంతకాలానికి, చాలామంది భావోద్వేగంగా మామూలుగా అయ్యి, మళ్లీ వాళ్ల దైనందిన విషయాల మీద మనసు పెట్టగలుగుతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల లేదా స్నేహితుల సహాయం ఉన్నప్పుడు, ఆ బాధను తట్టుకోవడానికి సరైన చర్యలు తీసుకున్నప్పుడు అలా జరుగుతుంది.
ఎంతకాలం పడుతుంది? కొంతమందికి ఆ బాధంతా పోవడానికి కొన్ని నెలలు పడుతుంది. చాలామందికి కోలుకోవడానికి ఒకటి లేదా రెండు సంవత్సరాలు పడుతుంది. ఇంకొంతమందికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. a ఆలయాండ్రో ఇలా గుర్తు చేసుకుంటున్నాడు, “నేను దాదాపు మూడు సంవత్సరాల వరకు బాధను అనుభవిస్తూనే ఉన్నాను.”
మీకు మీరు ఓపిక చూపించుకోవాలి. బాధ నుండి కోలుకోవడానికి ఏ రోజుకు ఆ రోజు ప్రయత్నించండి, ఎంత వరకు చేయగలరో అంత వరకే చేయండి, తర్వాత మీ బాధ ఎప్పటికీ అలాగే ఉండిపోదని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు మీ బాధను తగ్గించుకోవడానికి, తర్వాత ఎక్కువకాలం అనవసరంగా బాధ పడకుండా ఉండడానికి మీరు చేయగలిగేవి కొన్ని ఉన్నాయి.
ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు కలిగే తీవ్రమైన బాధ సహజమే
a కొంతమంది చాలా ఎక్కువ దుఃఖపడతారు, ఎక్కువకాలం దుఃఖపడతారు. అలా జరిగేది తక్కువమందికే అయినా ఆ పరిస్థితి “క్లిష్టమైన లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యగా” తయారవ్వచ్చు. మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం వల్ల అలాంటివాళ్ల పరిస్థితి మెరుగవ్వవచ్చు.